
హత్య కేసులో నిందితులతో సీఐ, ఎస్‌ఐ, పోలీసులు ,మృతుడు ఇమ్రాన్(ఫైల్)
భాకరాపేట : తలకోనలో యువకుడిని పథకం ప్రకారమే హత్య చేశారని, ఇందులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పీలేరు రూరల్ సీఐ కె.నరసింహమూర్తి తెలిపారు. ఆయన గురువారం భాకరాపేటలోని సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న ఎర్రావారిపాళెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో యువకుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. మొదట గుర్తు తెలియని యువకుడిగా కేసు నమోదు చేశామన్నారు. ఎర్రావారిపాళెం, భాకరాపేట ఎస్‌ఐలు గోపి, రవినాయక్ కేసు దర్యాప్తు చేపట్టి మృతుడు రొంపిచెర్ల మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన హసన్‌షా కుమారుడు ఇమ్రాన్ (20)గా గుర్తించినట్టు చెప్పారు. అతని సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులు అయేషా, అస్మా, టిప్పుసుల్తాన్, బావాజాన్(పఠాన్‌బావాజీ)ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
కుమార్తెను వేధిస్తున్నాడని..
రొంపిచెర్ల మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన అయేషా కుమార్తెను ఇమ్రాన్ వేధించేవాడు. దీంతో వారు రొంపిచెర్ల నుంచి కదిరికి వెళ్లిపోయారు. అక్కడ కూలి పనులు చేసుకునే వారు. ఇమ్రాన్ వారి ఫోన్ నంబరు తెలుసుకుని వేధింపులకు పాల్పడేవాడు. అతన్ని అయేషా, ఆమె అన్న టిప్పుసుల్తాన్ వారించారు. అయినా ఫలితం లేదు. దీనికితోడు అయేషా మరిది బావాజాన్‌కు, ఇమ్రాన్ కుటుంబానికి పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్‌ను అడ్డు తొలగించుకోవాలని కదిరిలో ఉన్న అయేషా చెల్లెలు అస్మా, రొంపిచెర్లలో ఉన్న టిప్పుసుల్తాన్, అయేషా మరిది బావాజాన్‌తో కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా అస్మాను మదనపల్లెకు చెందిన అమ్మాయిగా పరిచయం చేశారు. కదిరికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఆధారాలతో సిమ్ కార్డు తీసుకుని అస్మా ఇమ్రాన్‌తో మాట్లాడేలా చేశారు.
కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి..
ఆటోలో వెళుతుండగానే కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇమ్రాన్‌తో తాగించారు. అనంతరం తలకోనలోని అటవీ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అయేషా, టిప్పుసుల్తాన్ ఉండిపోయారు. అస్మా, ఇమ్రాన్ ఏకాంతం కోసం అడవిలోకి వెళతామని చెప్పి అటువైపు ఎవరు రాకుండా బావాజాన్‌ను కాపలా ఉంచారు. ఆ వెనుకనే టిప్పు సుల్తాన్, ఆయేషా చేరుకున్నారు. నిద్రమత్తులోకి జారుకున్న ఇమ్రాన్ కళ్లలో కారం పొడి చల్లారు. అతన్ని అస్మా, టిప్పుసుల్తాన్ పట్టుకోగా అయేషా గొంతు కోసి చంపేశారు. ఇమ్రాన్ సెల్‌ఫోన్‌ను, హత్యకు వాడిన వస్తువులను కొండారెడ్డిగారిపల్లె సమీపంలో చెక్‌డ్యామ్ వద్ద కాల్చివేసి ఆధారాలు లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు.
హార్సిలీహిల్స్‌లో హత్యకు పథకం..
పథకంలో భాగంగా ఇమ్రాన్‌ను హార్సిల్‌హిల్స్‌కు రావాలని కోరారు. అంతదూరం తాను రాలేనని, తలకోనకైతే వస్తానని ఇమ్రాన్ చెప్పడంతో పథకం మార్చుకున్నారు. ఈ నెల 15న తలకోనకు వస్తానని ఇమ్రాన్ చెప్పడంతో అక్కడే చంపేయాలనుకున్నారు. ఈ నెల 14న కదిరి నుంచి అస్మా, అయేషా రొంపిచెర్లకు చేరుకున్నారు. టిప్పు సుల్తాన్, బావాజాన్‌తో కలిసి హత్యకు అవసరమైన కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు, కారంపొడి, చేతికి, కాళ్లకు గ్లౌజులు, హెల్మెట్, బురకాలు సేకరించుకున్నారు. అందరూ కలిసి ఎర్రావారిపాళెం చేరుకున్నారు. బావాజాన్ ముందుగా తలకోనకు వెళ్లిపోయాడు. మిగిలిన వారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఎర్రావారిపాళెంలో ఉంచి ఆటోను బాడుగకు మాట్లాడుకున్నారు. టిప్పు సుల్తాన్ ఆడవారిలాగా బురకా, చేతికి, కాళ్లకు గ్లౌజులు వేసుకుని అయెషా, అస్మా, ఇమ్రాన్‌తో కలిసి తలకోనకు బయలుదేరారు.
మృతుడి బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన భాకరాపేట
ఇమ్రాన్‌ను చంపిన నిందితులను భాకరాపేటకు తీసుకొచ్చారని తెలుసుకున్న మృతుడి బంధువులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. అన్యాయంగా ఇమ్రాన్‌ను చంపేశారని, వారిని మీరే ఇక్కడే చంపేయండి సార్ అంటూ నినాదాలు చేశారు. లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద గందరగోళం నెలకొనడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీఐ నరసింహమూర్తి రొంపిచెర్ల వాసులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నిందితులను పీలేరు కోర్టుకు తరలించారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment