కుమారుడితోపాటు తల్లిదండ్రుల ఆత్మహత్య
నామక్కల్‌లో దారుణం
సేలం: అతుల్ సుభాష్ ఘటన తర్వాత.. ఆ తరహా భార్యాబాధితుల ఉదంతాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా.. భార్య వేధింపులతో ఓ భర్త, తన తల్లిదండ్రులతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడు నామక్కల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివాహం జరిగిన ఐదు నెలలకే వేరు కాపురం పెట్టాలని భార్య గొడవ చేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం తట్టుకోలేక తల్లిదండ్రులూ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎరుమపట్టి సమీపంలో ఉన్న ఎ.వాళవంది గ్రామానికి చెందిన సెల్వరాజ్ (55) పెయింటర్, ఇతని భార్య పూంగొడి (50) కూలీ కార్మికురాలు. వీరి కుమారుడు సురేంద్రన్(28) వంట కార్మికుడు. ఇతనికి వేట్టంపాడికి చెందిన స్నేహ అనే యువతితో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.
వేరు కాపురం చిచ్చు
ఈ స్థితిలో స్నేహ పెళ్లయినప్పటి నుంచే వేరు కాపురం పెట్టాలని భర్తను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడ వలు జరిగేవి. అదే విధంగా శనివారం కూడా సురేంద్రన్, స్నేహల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో స్నేహ అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీ వ్ర ఆవేదన చెందిన సురేంద్రన్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కుమారుడి మృతి తట్టుకోలేక వారు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ముగ్గురి ఆత్మహత్య
ఈ స్థితిలో ఆదివారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సందేహించిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న ఎరుమపట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా నామక్కల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ జోసి, నల్లిపాళయం ఇన్‌స్పెక్టర్ యువరాజ్, పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన సురేంద్రన్ సెల్‌ఫోన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో ఆత్మహత్యకు ముందు సురేంద్రన్ వీడియో తీసి ఉండడం తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్నేహ, వారి కుటుంబసభ్యుల వద్ద విచారణ జరుపుతున్నారు. పెళ్లయిన ఐదు నెలలకే కుమారుడు, తల్లి, తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment