nilgiri forest
-
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
అడవుల్లో క్వారంటైన్
హీరోయిన్లు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు వెళ్తూ సినిమాలు త్వరగా పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒక సెట్ నుంచి ఇంకో సెట్‌కి వెళ్లడం అంటే కొంచెం రిస్కే. అందుకే ఒక సినిమా యూనిట్ నుంచి మరో యూనిట్లో జాయిన్ అయ్యే మధ్యలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు అదా శర్మ. తన స్టాఫ్ మొత్తాన్ని కూడా క్వారంటైన్లో ఉంచుతున్నారామె. ఇటీవలే రెండు తెలుగు సినిమాలు అంగీకరించారు అదా. ఆల్రెడీ ఈ సినిమాల చిత్రీకరణ ప్రారంభం అయింది. ఒక సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. మరో సినిమా చిత్రీకరణ నీలగిరి అడవుల్లో జరగనుంది. ఈ అడవుల్లోనే ఓ మేన్షన్‌లో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు అదా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నీలగిరి అడవులు భలే అందంగా ఉన్నాయి. మేం ఉండే బంగ్లా అడవి మధ్యలో ఉంది. ఇది భయంకరమైన ప్రదేశమని చాలా మంది చెప్పారు. కానీ చాలా అందంగా ఉంది. ఒక యూనిట్ నుంచి మరో యూనిట్‌తో కలసి పని చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సెట్లో భౌతిక దూరం పాటించడం కొంచెం కష్టం. కానీ ముందే ఇలా క్వారంటైన్లో ఉండి చిత్రీకరణ ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం’’ అన్నారు అదా. ఈ రెండు సినిమాలే కాకుండా ‘కమాండో 4, మ్యాన్ టూ మ్యాన్’ అనే హిందీ సినిమాల్లో అదా కనిపించనున్నారు. -
గజరాజులకి దారేది ?
తమిళనాడులోని నీలగిరి అటవీప్రాంతంలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో (ఎలిఫెంట్ కారిడార్) నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన 11 రిసార్టులు, హోటల్స్ నిర్మాణాల్ని 48 గంటల్లో నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి గజరాజుల రక్షణ అంశం చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఎలిఫెంట్ కారిడార్లలో మూడింట రెండు వంతులు రక్షణ లేని రహదారులు, రైల్వే ట్రాక్‌ల మీదుగానే సాగుతున్నాయని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 101 ఏనుగులు సంచరించే ప్రాంతాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించడానికి వాటికి హక్కు ఉందని దానిని ఎవరూ కాలరాయకూడదంటూ గత ఏడాది కొందరు వన్యప్రాణ నిపుణులు రైట్ ఆఫ్ పాసేజ్ పేరుతో ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదికను వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) ప్రచురించింది. ఒకవైపు రైల్వే ట్రాక్‌లు, వాహనాల కింద పడి ఎన్నో ఏనుగులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, మరోవైపు గజరాజులు పంట పొలాల్లోకి ప్రవేశించి నాశనం చేయడం, మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీయడం కూడా జరుగుతోంది. ఒక్క ఉత్తర బెంగాల్లోనే ఏనుగుల దాడిలో ప్రతీ ఏటా 40 నుంచి 50 మంది చనిపోతున్నారు. అభివృద్ధి పేరుతో అడవుల్ని ఇష్టారాజ్యంగా నరికేస్తూ ఉండడం, ఏనుగుల కారిడార్లలోనూ నిర్మాణాలు చేపట్టడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ కారిడార్లను కాపాడుకునే చర్యలు తీసుకోకపోతే అటు ఏనుగులు, ఇటు మనుషుల ప్రాణాలకు ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం ఏనుగులు సంచరించే కారిడార్ల విస్తీర్ణాన్ని, ఇప్పుడు ఉన్న విస్తీర్ణాన్ని పోల్చి చూస్తే ఏడాదికేడాది అది కుంచించుకుపోవడం ఆందోళన పెంచుతోంది. 2005లో 45 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువ ఉంటే, 2017 నాటికి 74 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువకి పరిమితమైపోయాయి. అంటే ఈ పన్నెండేళ్ల కాలంలో ఏ స్థాయిలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్ని మనం ఆక్రమించామో అర్థంచేసుకోవచ్చు. ఏనుగులు ప్రతీ ఏడాది సంచరించే ప్రాంతం – 350–500 చదరపు కిలోమీటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎలిఫెంట్ కారిడార్లు 101 దక్షిణ భారత్‌లో 28 మధ్య భారతంలో 25 ఈశాన్య భారతంలో 23 వాయవ్య భారతంలో 11 పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో 14 ఏనుగుల మందలు తరచు కనిపించేవి 70శాతం కారిడార్లలో ఏనుగులకు ముప్పు ఎలా ? 20 శాతం కారిడార్లు రైల్వే ట్రాకుల మీదుగా ఉన్నాయి ప్రతీ మూడు కారిడర్లలో రెండింటిలో పంటలు తగుల బెట్టడం వంటి కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉండడంతో గజరాజులు గజగజలాడుతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో 277 ప్రమాదాల్లో రైళ్ల కింద పడిపోవడం వల్ల ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. 12 శాతం కారిడార్లలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో గజరాజులకు రక్షణ లేకుండా పోయింది. ఏనుగుల రక్షణ ఎలా ? ఏనుగుల కారిడార్లలో ఆక్రమణల్ని తొలగించడం జరిగే పని కాదు కానీ వాటి సంరక్షణలో అందరినీ భాగస్వామ్యుల్ని చేయాలి. ఏనుగులు హాయిగా సంచరించాలంటే వాహనాల కోసం కనీసం 20 కారిడార్లలో ఓవర్ పాస్‌ల నిర్మాణమైనా జరగాల్సిన అవసరం ఉంది. ఏనుగులు సంచారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానికులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని బెంగుళూరుకు చెందిన పర్యావరణవేత్త పరమేశ మల్లెగౌడ అభిప్రాయపడ్డారు. కుప్పంలో పరిస్థితేంటి ? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో విస్తరించిన కారిడార్లలో మూడు దశాబ్దాల క్రితం ఏనుగులు విపరీతంగా సంచరించి పంటలకు తీవ్ర నష్టం కలిగించేవి. కోలార్ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం, క్రిష్ణగిరి, హోసూర్, బెన్నర్ఘట్ట, ముదుమలై మీదుగా ఏనుగులు మందలు మందలుగా సంచరిస్తూ ఉండేవి. చిత్తూరు జిల్లాలోని పీలేరు డివిజన్లో అడవులు వేగంగా తరిగిపోతూ ఉండడంతో చాలా ఏనుగులు శేషాచలం అడువుల్లోకి వెళ్లిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఏనుగులు తమకూ ముప్పు ఉందని గ్రహించాయో ఏమో, తామే సొంతంగా ఒక కారిడార్ ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా తలకోన నుంచి కడప జిల్లా రాజంపేట వైపు ఈ ఏనుగుల మంద వెళ్లిపోయాయి. మళ్లీ అవి కుప్పం ప్రాంతంవైపు తొంగి కూడా చూడలేదు. అదే విధంగా 2014లో కుప్పం ప్రాంతంలో 28 ఏనుగుల మంద మల్లనూర్ స్టేషన్ వైపు వస్తూ ఉండడం గమనించిన రైల్వే అధికారులు అవి సురక్షితంగా ట్రాక్‌లు దాటేలా చర్యలు తీసుకోవడంతో ఆ గజరాజులు హాయిగా ఆగ్నేయ దిశగా ఉన్న కౌండిన్య వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అవెప్పుడూ రైల్వే ట్రాక్ల్ని దాటడానికి ప్రయత్నించలేదు. స్థానికులు, అటవీ శాఖ అధికారులు కాస్త శ్రద్ధ వహిస్తే ఏనుగులకి రక్షణ కల్పించడం పెద్ద విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కునుకు లేకుండా చేస్తుందని... చంపేశారు
కాల్చి చంపిన ఆయుధ బలగాలు ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు చెన్నై: నీలగిరుల్లోని పలు అటవీ గ్రామాల ప్రజల్ని ఎనిమిది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చిన పులి హతమైంది. పట్టుకునే క్రమంలో తుపాకీ తూటాలకు ఆ పులి బలి అయింది. దీంతో గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నీలగిరి జిల్లా కున్నూరు, కూడలూరు పరిసరాల్లోని గ్రామాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు గుర్తించారు. పదకొండో తేదీ తేయాకు తోటలో పులి ప్రవేశించి వీరంగం సృష్టించింది. అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తిపై తన పంజా విసిరి చంపింది. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఈ పులి కోసం తీవ్ర వేట సాగింది. అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. గ్రామాల్లోకి రావడం ఉడాయించడం చేస్తూ వచ్చిన ఈ పులి రూపంలో ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రంగంలోకి దిగిన అధికారులు అక్కడక్కడ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి పరిశీలించే పనిలో పడ్డారు. ఆ పులిని పట్టుకునేందుకు ఆయుధ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం కూడలూరు సమీపంలోని ఓ గ్రామంలోకి చొరబడేందుకు పొదల్లో పులి నక్కి ఉన్నట్టు నిఘా నేత్రాలకు దృశ్యాలు చిక్కాయి. దీంతో ఆ పులిని చుట్టుముట్టి పట్టుకునేందుకు ఆయుధ బలగాలు సిద్ధం అయ్యాయి. అయితే, పులి పంజా విసరడంతో ఇద్దరు ఆయుధ బలగాల సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఆ పులిని ఇక కాల్చి చంపడం తప్పని సరిగా భావించి తూటాలను ఎక్కుబెట్టడంతో అది నేల కొరిగింది. తుటాల దెబ్బకు మరణించిన ఆ పులిని అక్కడినుంచి తరలించారు. గాయపడ్డ ఇద్దరు సిబ్బంది చికిత్స నిమిత్తం కోయంబత్తూరుకు తరలించారు. ఎనిమిది రోజుల పాటుగా తమ కంట మీద కునుకు లేకుండా చేసిన పులి హతం కావడంతో ఆ పరిసరాల్లోని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నీలగిరుల్లో మావోల మకాం
చెన్నై: కేరళ సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టులు నీలగిరి అడవుల్లోకి మకాం మార్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూ రు, తేని, కృష్ణగిరి, ధర్మపురి తదితర ఎనిమిది జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. అడవుల్లో జల్లెడ పట్టి కూంబింగ్‌లో నిమగ్నమయ్యాయి. అటవీ గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపి, అనుమానితు ల కోసం ఆరా తీస్తున్నారు. అజ్ఞాత మావోయిస్టుల చిత్ర పటాలను ప్రకటించారు. రాష్ట్రంలో చాప కింద నీరులా మావోయిస్టులు మళ్లీ కార్యకలాపాలకు సిద్ధమయ్యారు. కేరళ-తమిళనాడు సరి హద్దుల్లోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో తిష్ట వేసి దాడులకు పాల్పడిన మావోయిస్టులు కొందరు నీలగిరుల్లోకి చొరబడ్డట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టుల కార్యకలాపాల్ని ఆదిలోనే అణచివేయూలనే లక్ష్యంగా ఎనిమిది జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోకి చొరబడ్డ ఈ మావోయిస్టులు కొందరు విద్యార్థులను తమ వైపు తిప్పుకుని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల క్రితం కోయంబత్తూరులో చిక్కడం, వారి వద్ద మావోయిస్టుల పేరిట కరపత్రాలు లభించడంతో మరెవరైనా విద్యార్థులు వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీంతో మావోయిస్టుల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కూంబింగ్: పట్టుబడ్డ విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పాటుగా ఇటీవల సెంగోట్టై సమీపంలో పట్టుబడ్డ మావోయిస్టు వద్ద జరిపిన విచారణ మేరకు అడవుల్లో 15 మందికి పైగా సంచరిస్తున్నట్టు తేలింది. వీరి వద్ద సేకరించిన సమాచారంతో ఆ మావోయిస్టు గ్రూపుల్లో నలుగురు తమిళనాడువాసులు ఉన్నట్టు, మిగిలిన వారందరూ ఉత్తరాది వాసులుగా తేల్చారు. తమిళనాడులో తమ కార్యకలాపాల్ని మళ్లీ చాప కింద నీరులా సాగించి ఏదేని దాడులకు వ్యూహ రచనలు జరిగాయూ? అన్న ఆందోళన బయల్దేరింది. దీంతో నీలగిరుల్లో కూంబింగ్ తీవ్ర తరం చేశారు. అటవీ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా అటవీ గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనుమానితులెవరైనా సంచరించిన పక్షంలో తమకు తక్షణం సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇవ్వాల్సిన వారి ఫోన్ నంబర్లను ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 15 మంది మావోయిస్టుల చిత్ర పటాల్ని చేతబట్టి ఆయా గ్రామాల్లోని ప్రజలకు అందజేస్తున్నారు. వీరిలో నలుగురు తమిళులు ఉండడంతో, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి కుటుంబీకులు ఎక్కడ ఉన్నారో ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ నలుగురి రూపంలో యువకులు ఎవరైనా మావోయిస్టులకు మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారా..? అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు.