కునుకు లేకుండా చేస్తుందని... చంపేశారు
కాల్చి చంపిన ఆయుధ బలగాలు
ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
చెన్నై: నీలగిరుల్లోని పలు అటవీ గ్రామాల ప్రజల్ని ఎనిమిది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చిన పులి హతమైంది. పట్టుకునే క్రమంలో తుపాకీ తూటాలకు ఆ పులి బలి అయింది. దీంతో గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నీలగిరి జిల్లా కున్నూరు, కూడలూరు పరిసరాల్లోని గ్రామాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు గుర్తించారు. పదకొండో తేదీ తేయాకు తోటలో పులి ప్రవేశించి వీరంగం సృష్టించింది. అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తిపై తన పంజా విసిరి చంపింది. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఈ పులి కోసం తీవ్ర వేట సాగింది. అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం.
గ్రామాల్లోకి రావడం ఉడాయించడం చేస్తూ వచ్చిన ఈ పులి రూపంలో ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రంగంలోకి దిగిన అధికారులు అక్కడక్కడ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి పరిశీలించే పనిలో పడ్డారు. ఆ పులిని పట్టుకునేందుకు ఆయుధ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం కూడలూరు సమీపంలోని ఓ గ్రామంలోకి చొరబడేందుకు పొదల్లో పులి నక్కి ఉన్నట్టు నిఘా నేత్రాలకు దృశ్యాలు చిక్కాయి. దీంతో ఆ పులిని చుట్టుముట్టి పట్టుకునేందుకు ఆయుధ బలగాలు సిద్ధం అయ్యాయి.
అయితే, పులి పంజా విసరడంతో ఇద్దరు ఆయుధ బలగాల సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఆ పులిని ఇక కాల్చి చంపడం తప్పని సరిగా భావించి తూటాలను ఎక్కుబెట్టడంతో అది నేల కొరిగింది. తుటాల దెబ్బకు మరణించిన ఆ పులిని అక్కడినుంచి తరలించారు. గాయపడ్డ ఇద్దరు సిబ్బంది చికిత్స నిమిత్తం కోయంబత్తూరుకు తరలించారు. ఎనిమిది రోజుల పాటుగా తమ కంట మీద కునుకు లేకుండా చేసిన పులి హతం కావడంతో ఆ పరిసరాల్లోని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.