
పులి జాడకోసం అన్వేషిస్తున్న అటవీ సిబ్బంది
నస్తూర్‌పల్లిలో పాదముద్రల గుర్తింపు
మహదేవపూర్ అడవుల్లో ఆవాసంకోసం యత్నం
ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్న అటవీశాఖ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లోకి మళ్లీ పులి వచ్చిందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అడవుల్లో తన ఆవాసం ఏ ర్పాటు చేసుకోవడానికి ఆరు రోజులుగా పులి కాటారం, మహదేవపూర్ ప్రాంతాల్లో తిరు గుతున్నట్లు తెలియడంతో ఆ రెండు రేంజ్‌ల పరిధిలో ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు. నస్తూర్‌పల్లి వద్ద పులి అడుగులు కనిపించడంతో అక్కడి నుంచి గూడూరు, వీరాపూర్ వరకు పరిశీలిస్తూ వెళ్లగా ఆచూకీ లభించలేదు. అడవి లో అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఎక్కడా చిక్కలేదు.
అయితే, శనివారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి సమీపంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పులి కనిపించినట్లు రోడ్డుమీద వెళ్తున్న వాహనదారులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. దట్టమైన అడవి కావడంతో పాటు తాగునీటి వసతి ఉండటంతో పులి ఇక్కడ ఆవాసం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల కాపరులు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని, రైతులు వంటచెరుకు కోసం రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహదేవపూర్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చితే పులి జాడ తెలుస్తుందని భావిస్తున్నారు.
కుదురుపల్లి నుంచి కాటారం, అన్నారం ప్రాంతాల్లో అడవులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. చిన్నచిన్న వాగులతో నీటి వసతి కూడా ఉంది. దీంతో పులి రోజుకు 20–25 కిలోమీటర్ల మేర ప్రయా ణం చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై అటవీశాఖ రేంజ్ అధికారి రవిని సంప్రదించగా కుదురుపల్లి వద్ద పులి కనిపించినట్లు వాహనదారులు తెలిపారని, దీంతో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్ ట్రాకింగ్ టీం పగ్‌మార్క్‌లను పరిశోధిస్తోందని వివరించారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన కే–8 పులి మళ్లీ వచ్చిందా? లేక మరేదైనా కొత్త పులా అనేది తెలియాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment