నీలగిరుల్లో మావోల మకాం
చెన్నై: కేరళ సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టులు నీలగిరి అడవుల్లోకి మకాం మార్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూ రు, తేని, కృష్ణగిరి, ధర్మపురి తదితర ఎనిమిది జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. అడవుల్లో జల్లెడ పట్టి కూంబింగ్‌లో నిమగ్నమయ్యాయి. అటవీ గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపి, అనుమానితు ల కోసం ఆరా తీస్తున్నారు. అజ్ఞాత మావోయిస్టుల చిత్ర పటాలను ప్రకటించారు.
రాష్ట్రంలో చాప కింద నీరులా మావోయిస్టులు మళ్లీ కార్యకలాపాలకు సిద్ధమయ్యారు. కేరళ-తమిళనాడు సరి హద్దుల్లోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో తిష్ట వేసి దాడులకు పాల్పడిన మావోయిస్టులు కొందరు నీలగిరుల్లోకి చొరబడ్డట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టుల కార్యకలాపాల్ని ఆదిలోనే అణచివేయూలనే లక్ష్యంగా ఎనిమిది జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోకి చొరబడ్డ ఈ మావోయిస్టులు కొందరు విద్యార్థులను తమ వైపు తిప్పుకుని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల క్రితం కోయంబత్తూరులో చిక్కడం, వారి వద్ద మావోయిస్టుల పేరిట కరపత్రాలు లభించడంతో మరెవరైనా విద్యార్థులు వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీంతో మావోయిస్టుల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
కూంబింగ్: పట్టుబడ్డ విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పాటుగా ఇటీవల సెంగోట్టై సమీపంలో పట్టుబడ్డ మావోయిస్టు వద్ద జరిపిన విచారణ మేరకు అడవుల్లో 15 మందికి పైగా సంచరిస్తున్నట్టు తేలింది. వీరి వద్ద సేకరించిన సమాచారంతో ఆ మావోయిస్టు గ్రూపుల్లో నలుగురు తమిళనాడువాసులు ఉన్నట్టు, మిగిలిన వారందరూ ఉత్తరాది వాసులుగా తేల్చారు. తమిళనాడులో తమ కార్యకలాపాల్ని మళ్లీ చాప కింద నీరులా సాగించి ఏదేని దాడులకు వ్యూహ రచనలు జరిగాయూ? అన్న ఆందోళన బయల్దేరింది. దీంతో నీలగిరుల్లో కూంబింగ్ తీవ్ర తరం చేశారు. అటవీ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా అటవీ గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనుమానితులెవరైనా సంచరించిన పక్షంలో తమకు తక్షణం సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇవ్వాల్సిన వారి ఫోన్ నంబర్లను ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 15 మంది మావోయిస్టుల చిత్ర పటాల్ని చేతబట్టి ఆయా గ్రామాల్లోని ప్రజలకు అందజేస్తున్నారు. వీరిలో నలుగురు తమిళులు ఉండడంతో, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి కుటుంబీకులు ఎక్కడ ఉన్నారో ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ నలుగురి రూపంలో యువకులు ఎవరైనా మావోయిస్టులకు మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారా..? అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు.