
సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల : దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ సాగిస్తున్నాయి.
సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆరంభమైన మావోయిస్టుల కార్యాకలాపాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో కాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో, ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాదికారులు పలుమార్లు సమావేశమయ్యారు. మావోయిస్టులపై పట్టు సాధించే దిశగా సమాలోచనలు సాగించారు. ఆ తరువాత నుంచి జాయింట్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.
అటు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భష్త్రపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ సాగుతోంది. సరిహద్దులోని ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దులో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌కు తోడు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున తనిఖీలు సాగుతున్నాయి.
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే వచ్చే ప్రధాన రహదారులలో మోహరిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు అణువణువునా తనిఖీలు సాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను ఉంచారు. మరో రెండు నెలల పాటు సరిహద్దులో ఇదే పరిస్థితి ఉండవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment