తిరువళ్లూరు: భార్యను వదిలేసి మరో మహిళతో షికార్లు కొట్టడమే కాకుండా కోర్టుకు సైతం సంబంధిత మహిళ రావడంతో ఆగ్రహించిన భార్య తన భర్తతో పాటూ ఆ మహిళపై కూడా దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నడిరోడ్డుపై ఆంధ్ర దంపతుల సిగపట్టును చూడడానికి భారీగా జనం గుమికూడడంతో ట్రాఫిక్‌కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ వరదాపురం గ్రామానికి చెందిన సత్యకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన మునీంద్రతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పిల్లలు సైతం ఉన్నారు.
ఈక్రమంలో మునీంద్ర వ్యాపారం పెట్టడానికి సత్య తన 40 సవర్ల బంగారు నగలు, బ్యాంకులో తన పేరుపై పది లక్షల రుణాన్ని సైతం తీసి భర్త వ్యాపారం కోసం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నగదుతో శ్రీకాళహస్తి ప్రాంతంలో మునీంద్ర సత్య కోళ్లపామ్‌ను ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ల తరువాత బ్యాంకులో చెల్లించాల్సి వాయిదాను మునీంద్ర సరిగ్గా చెల్లించకపోవడంతో పాటు వ్యాపారం బాగా పుంజుకున్న క్రమంలో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఇదే విషయంపై భార్యభర్త మధ్య వివాదం చెలరేగింది. మునీంద్ర విడాకులు కావాలని స్థానిక కోర్టుకు వెళ్లగా, తనకు విడాకులతో పాటూ నష్టపరిహారం, నగలు తిరిగి ఇప్పించాలని, బ్యాంకులో పొందిన రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ సత్య తిరువళ్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తిరువళ్లూరు కోర్టులో విచారణ సాగుతున్న నేపద్యంలో శనివారం మునీంద్ర, సత్య తదితర ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. వాయిదా ముగిసిన తరువాత ఇంటికి వెళ్లేక్రమంలో మునీంద్ర తనతో పాటు వచ్చిన మహిళతో ఆటోలో వెళ్లడాన్ని సత్య గుర్తించి ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆటోలో భర్తను వెంబడించి ఇద్దరిపై దాడికి దిగింది.
తన కుటుంబం నడిరోడ్డున పడడానికి కారణం నీవేనంటూ భర్తతో పాటు వచ్చిన మహిళపై సైతం దాడి చేసింది. దీంతో ఆటోలో వున్న మహిళ కిందికి దూకి పరుగులు పెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా ఈ వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారిన క్రమంలో శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment