తమిళనాడులో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నగర వాసుల దుర్మరణం
మైలార్‌దేవ్‌పల్లి: దైవ దర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నగర వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన పోతన్న (50), శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సీతారాం నాయక్ (49), ఆయన కుమారుడు చరణ్, శివకుమార్ గౌడ్‌లు ఈ నెల 16న శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరిగి బయలుదేరారు.
తమిళనాడు దేవదాయపట్టి సమీపంలో వీరు వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో పోతన్న, సీతారాం నాయక్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. చరణ్, శివకుమార్‌లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మధురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment