ఇద్దరు మహిళల దుర్మరణం
యువకుడికి గాయాలు
సేలం: ఈరోడ్‌లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఈరోడ్‌లోని మాణికంపాళయం కావేరీనగర్‌కు చెందిన కృష్ణన్ కుమారుడు కళైచెల్వన్ (26) ఓ ఆర్థిక సంస్థ యజమాని. కృష్ణన్ అనారోగ్యం కారణంగా కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ని చూసేందుకు కళైచెల్వన్ ఈరోడ్ నుంచి కారులో సోమవారం కోవైకి బయలుదేరాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు ఒకరు తనకు తెలిసిన ఇద్దరు మహిళలను కూడా కోవైకు తీసుకువెళ్లమని కళైచెల్వన్‌ను కోరాడు.
దీంతో అందియూర్ మైఖేల్ పాళయానికి చెందిన గణపతి భార్య సౌందర్య (25), కోయంబత్తూరులోని చంద్రపురంలోని కురిచ్చి ప్రాంతానికి చెందిన పట్టురాజ్ కుమార్తె రిజ్వానా (20)ను సోమవారం వేకువజామున కళైచెల్వన్ తన కారులో తీసుకువెళ్లినట్లు సమాచారం. కారు ఈరోడ్‌లోని నసియానూర్ రోడ్డులో విల్లారసంబట్టి వద్దకు రాగానే అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, ఆగకుండా చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సౌందర్య, రిజ్వానాలు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
దీనిపై సమాచారం అందుకున్న ఈరోడ్ నార్త్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాల మధ్య చిక్కుకున్న కళైచెల్వన్‌ను రక్షించి ఈరోడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సౌందర్య, రిజ్వానా మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. ఈరోడ్ నార్త్ పోలీసులు జరిపిన విచారణలో కళైచెల్వన్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఇద్దరి మృతికి కారణమని తేలింది. దీంతో పోలీసులు కళైచెల్వన్‌పై కేసు నమోదు చేశారు. కాగా మృతి చెందిన ఇద్దరు మహిళలు డ్యాన్సర్లను తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment