సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలకు చెందిన గజరాజులన్నీ పిక్నిక్‌కు వెళ్లాయి. వీటి కోసం భవానీనది తీరంలో పునరావాస కేంద్రం ఏర్పాటైంది. 26 ఏనుగులు ఆ నదీ తీరంలో 48 రోజుల పాటు సేద తీరనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు అంటే మక్కువ. ముఖ్య ఆలయాలకు వెళ్లినప్పుడు ఓ ఏనుగును విరాళంగా సమర్పించేవారు. వన్య ప్రాణులకూ మానసికోల్లాసం అవసరమని చెబుతుండేవారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా గజరాజుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించి, అక్కడ అవి సేద తీరే దిశగా చర్యలు తీసుకునేవారు.
పునరావాసం..
జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం పునరావస శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈసారి ఏనుగులకు కరోనా పరీక్షలు చేయించి మరీ పిక్నిక్‌కు తీసుకెళ్లారు. తేక్కంపట్టి భవానీ నది తీరంలో ఏనుగులు ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునరావాస కేంద్రంలో ప్రత్యేక యాగాది పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడి ఆలయంలో జరిగిన పూజలతో గజరాజులు శిబిరంలోకి ప్రవేశించాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు అటవీశాఖమంత్రి దిండుగల్ శ్రీనివాసన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శిబిరం ప్రారంభమైంది. నెలన్నర పాటు ఏనుగులు ఇక్కడ సేదతీరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment