Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Contract company not supplying medicines to government hospitals1
వైద్యానికి నిర్లక్ష్య 'రోగం'

మే 13న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి దాక రాష్ట్రంలో 108 సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం డయల్‌ చేసినా కలవలేదు. 5 గంటలకు పైగానే అంతరాయం ఏర్పడింది. గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైనవారు వైద్యసేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. సకాలంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు విడిచారు. మే 29న విజయవాడ కనకదుర్గ వారధిపై గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన వృద్ధురాలు గుడిపూడి భవానీని బస్సు ఢీకొట్టగా రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌... బాధితురాలికి వైద్యం అందించాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. భవానీకి తీవ్ర రక్తస్రావం అవుతుండగా... అరుణ్‌ పలుసార్లు 108కు కాల్‌ చేసినా సమాధానం లేదు. సమయానికి ప్రైవేట్‌ అంబులెన్స్‌ అటుగా రావడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు కలెక్టరేట్‌ సమీపంలో ఓ గృహిణి స్పృహ తప్పి పడిపోగా కుటుంబ సభ్యులు 108కు కాల్‌ చేశారు. కాల్‌ సెంటర్‌ సిబ్బంది వివరాలు తీసుకున్నాక అంబులెన్స్‌ సిబ్బంది లైన్‌లోకి వచ్చి ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కాల్‌ కట్‌ చేశారు. దీంతో ప్రైవేట్‌ వాహనంలో బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అంబులెన్స్‌ సకాలంలో వచ్చి, లైఫ్‌ సపోర్ట్‌ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల విజయవాడ కరెన్సీ నగర్‌లో రోడ్డుపై ఇసుక మేటను తప్పించబోయి స్కూటీ మీద నుంచి వృద్ధుడు పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. అక్కడివారు 108కు ఫోన్‌ చేస్తే అరగంటైనా రాలేదు. బాధితుడి కుటుంబ సభ్యులే వృద్ధుడిని తీసుకెళ్లారు. అనారోగ్యంగా ఉండి 108ని పిలిస్తే రాదు... ఒంట్లో శక్తి లేకున్నా ఓపిక చేసుకుని సొంతంగానే ఆస్పత్రికి వెళ్తే కనీసం మందులుండవు... గాయాలైతే దూది కూడా బాధితులే కొనుక్కోవాలి... ఒకవేళ ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అవసరమైతే ఇక ప్రాణాలు గాల్లో దీపమే...! మధుమేహ బాధితులైనా... తీవ్ర వ్యాధుల పీడితులైనా అంతే...! వైద్యం దైవాధీనమే..! చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఏలుబడిలో ఇదీ పరిస్థితి..! నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయి..!సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్‌ సరఫరా చేసేశాం. ఎక్కడా కొరత లేదు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ కొరత వేధిస్తోంది. అన్ని బోధనాస్ప­త్రులను బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్‌ యాంటీబయోటిక్స్‌ కొరత వేధిస్తోంది. విలేజ్‌ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ, ఏ ఆస్పత్రిని పరిశీలించినా ఈ మందులేవీ లేవు. జ్వరం, గ్యాస్, బీపీ, నొప్పుల వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చేవారినీ బయట కొనుక్కోమంటూ సిబ్బంది చిట్టీలు రాస్తున్నారు. సర్జికల్స్‌లో.. క్షతగాత్రులే గాయాల శుభ్రం, కట్టు కోసం దూది, డ్రెస్సింగ్‌ మెటీరియల్‌ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మధుమేహ బాధితుల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్‌ అన్ని ఆస్పత్రుల్లో కొరత ఉందని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు. ఔట్‌ పేషంట్లకు (ఓపీ) నెలకు 3, 4 అవసరం ఉంటే.. ఒకటి, రెండే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, వైఎస్సార్, సీఎం సొంత జిల్లా చిత్తూరుతో పాటు మిగిలిన చోట్ల ఇదే పద్ధతి కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో సర్జరీకి వచ్చిన రోగులనే సూదులు, సూచర్, ఇతర మెటీరియల్స్‌ కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పారాసిటమాల్, బీపీ మందులు, బీ కాంప్లెక్స్, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇన్సులిన్‌ కొరత నెలకొంది.మంత్రి చేతిలో మాత్ర..వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా సరఫరా కాని మందులను స్థానికంగా పీఎంబీజేకే కార్యక్రమం కింద కొనాలని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఓ మంత్రితో డీల్‌ కుదుర్చుకున్న సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు ఎంవోయూ చేసుకు­న్నాయి. ఆస్పత్రుల నుంచి ఇండెంట్‌ పెట్టినా ఆ సంస్థ మందులను సరఫరా చేయడం లేదని సూపరింటెండెంట్లు వాపోతున్నారు. ఏ మందులు సరఫరా చేయలేరో చెబితే... ప్రత్యామ్నాయం చూసుకుంటామని కోరుతున్నా అది కూడా చేయడం లేదు. సమయానికి మందులు సరఫరా చేయకపోతే జరిమానాలు విధించడం, ఇదే తంతు కొనసాగితే సంస్థను బ్లాక్‌ లిస్టింగ్‌ చేస్తారు. కానీ, తమకు వచ్చిన బిజినెస్‌పై కమీషన్‌ ముట్టజెప్పేలా మంత్రితో సరఫరాదారులు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారిపై జరిమానాలు విధించడానికి వీల్లేకుండా పోతోందని అధికారులు చెబుతున్నారు.చంద్రబాబు ‘బీమా’లో ఆరోగ్యశ్రీ చిక్కి శల్యంపేదల సంజీవని ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అంపశయ్య పైకి ఎక్కించింది. బీమా రూపంలో... ప్రజారోగ్యాన్ని దళారుల చేతిలో పెడుతూ గద్దెనె­క్కిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రణాళికబద్ధంగా పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్‌ భారత్‌తో సరిపెట్టుకోవాలని స్వయంగా టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లు చెల్లింపులు సక్రమంగా చేయడం లేదు. ప్రస్తుతం రూ.3,500 కోట్లు బకాయి పడింది. దీంతో చికిత్సలు అందించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చిట్టచివరి నిరుపేద, మధ్య తరగతి పౌరుడికి సేవలందేలా గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. 2019కి ముందు చంద్రబాబు పాలనలో 919 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో మొక్కుబడిగా అమల వుతున్న ఆరోగ్యశ్రీని వైఎస్‌ జగన్‌ ఏకంగా 2,371కు తీసుకుని వెళ్లారు. వీటిలో 200పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి.వీలైనన్ని ఎక్కువ ఆస్పత్రులకు అనుమతులివ్వడం ద్వారా మార్కెట్‌లో పోటీ పెంచి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చేశారు. సేవలకు ముందుకు వచ్చిన ఆస్పత్రుల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులిచ్చారు. ప్రతి వారం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎంపానెల్‌ కమిటీ భేటీ అయి దరఖాస్తుల పరిశీలన, ఆమోదం వంటి కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. 140కు పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుమతి కోసం చేసిన అభ్యర్థనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. కొత్తగా ఏర్పాటైన ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ అనుమతులు కావాలంటూ ట్రస్ట్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం లేకపోతోంది.2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. వీటిని చెల్లిండమే కాక ఏడాది తిరగకుండానే అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదారు. తెల్ల కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేశారు. దీంతో 1.40 కోట్లపైగా కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. 1,059 ప్రొసీజర్‌లను ఏడాదిలోనే 2059కు, ఐదేళ్లలో 3,257కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్‌ను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చిన పాపాన పోలేదు. పైగా గత ప్రభుత్వంలో చికిత్స తర్వాత రోగులకు నెలకు రూ.5 వేల మేర అందించిన ఆరోగ్య ఆసరాను.. నిరుడే నిలివేశారు. ఏడాదికి రూ.400 కోట్ల మేర ఈ సాయం అందించాల్సి ఉంది. 5 వేల కాల్స్‌కు నో రెస్పాన్స్‌గతంలో కాల్‌ సెంటర్‌కు వివిధ ప్రమాద, అనారోగ్య బాధితులకు సాయం కోసం రోజుకు 12 వేల నుంచి 13 వేల కాల్స్‌ వచ్చేవి. ప్రస్తుతం 8 వేల కాల్స్‌ మాత్రమే వస్తున్నాయి. అన్ని సందర్భాల్లో 108 వాహనాలు బాధితులకు అండగా నిలవడం లేదు. జూన్‌లో ఏకంగా 4500–5,000 ఉదంతాల్లో బాధితులకు సాయం అందలేదు. మరోవైపు కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి మెరుగైన వైద్యానికి పెద్ద ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన రోగులను పట్టించుకోవడమే లేదు.ప్రతిసారీ మందులు బయటే కొంటున్నా... నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. అయినా కాళ్ల నొప్పులు తగ్గడం లేదు. ప్రతి నెల విజయవాడ జీజీహెచ్‌కు చికిత్స కోసం వస్తుంటా. స్టాక్‌ లేదు.. మందులు బయట కొనమని సిబ్బంది చీటీ రాస్తున్నారు. రూ.500 ఖర్చవుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించుకుని మందులు కొనే స్తోమత లేకనే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటికి రాస్తున్నారు. – శ్రీనివాసరావు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు విజయవాడ ప్రాణం పోతున్నా రాని 108ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ చేసిన నిమిషాల్లోనే కుయ్‌ కుయ్‌మంటూ వచ్చిన అంబులెన్సులు నేడు ప్రాణాలు పోతున్నా రావడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి నిర్వహణ సంస్థను వెళ్లగొట్టి అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటివరకు ఉన్న నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించింది. దీంతో అత్యవసర వైద్యసేవల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎలాగూ వెళ్లగొట్టేస్తున్నారని నిశ్చయించుకుని పాత సంస్థ వాహనాల నిర్వహణను వదిలేసింది. 100 నుంచి 200 మేర వాహనాలు అధ్వాన స్థితికి చేరాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉండగా 731 ఆన్‌రోడ్‌ సేవలు అందించాలి. మిగతావి బ్యాకప్‌. కానీ, ఏ రోజూ 731 వాహనాలు ఆన్‌రోడ్‌ సేవల్లో ఉండడం లేదు. మరమ్మతుల పేరుతో నిత్యం 100 వాహనాలు షెడ్‌లకు చేరుతున్నాయి. ఉన్న అరకొర వాహనాలు సమయానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదు. మే నెల సగటు రెస్పాన్స్‌ సమయాన్ని గమనిస్తే.. పట్టణాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో వెళ్లాల్సి ఉండగా 10 నిమిషాల మేర ఆలస్యంగా వెళ్లాయి. గ్రామాల్లో 20 నిమిషాలకు గాను 28 నుంచి 30 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 5 నుంచి 10 నిమిషాలకు పైగా ఆలస్యంగా చేరుకున్నాయి. గత నెల నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ భవ్య నిర్వహణ చేపట్టింది. కొత్త కాంట్రాక్ట్‌ ప్రమాణాల్లో గోల్డెన్‌ అవర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వచ్చిన గంటలో అంబులెన్స్‌ ప్రమాద స్థలి నుంచి రోగిని ఆస్పత్రికి చేర్చాలి. అయినా నిర్దేశిత సమయంలోపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందడం లేదు.108... వైఎస్‌ జగన్‌ తొలి ఏడాది పాలనకు నేటికీ ఎంత తేడా?చంద్రబాబు ‘108’లను ఏడాదిలోనే అస్తవ్యస్తంగా మార్చగా, గతంలో ఏడాది లోనే వైఎస్‌ జగన్‌ వాటిని బలోపేతం చేశారు. 2019కి ముందు ఈ అంబులెన్స్‌ సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్‌ కూడా లేదు. ఈ క్రమంలో ఏడాది కూడా తిరగకుండానే వైఎస్‌ జగన్‌ సర్కారు 412 అంబులెన్స్‌ల కొనుగోలు చేసింది. వీటిని 2020 జూలై 1న ప్రారంభించారు. 26 నవజాత శిశు అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. రూ.4.76 కోట్లతో 2022 అక్టోబరులో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీంతో 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్సులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అండగా నిలిచారు.

 Telangana CM Revanth Reddy Appeals to AP CM Chandrababu Naidu: Stop Rayalaseema Lift Project Immediately2
రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు సహకరించండి. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం న్యాయమా? ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు. మీరు బాధ్యతగా ఉండి, మమ్మల్ని బతకనివ్వండి. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి 4 టీఎంసీల నీరు తీసుకునేది..ఇప్పుడు 9.5 టీఎంసీల నీరు తీసుకెళ్లేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నరు. రోజుకు 3 టీఎంసీలు తీసుకునే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి.రెండు తెలుగు రాష్ట్రాలను, తెలుగువారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న మీ ఆలోచన నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించండి. పాలమూరు బిడ్డలం మీ మేలు మర్చిపోం. మేం విజ్ఞప్తులు చేస్తాం. వినకపోతే ఎలా పోరాటం చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. పాలమూరు ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తిచేసేలా నేను బాధ్యత తీసుకుంటా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మేం అన్నం పెడితే.. నువ్‌ సున్నం పెట్టావు.. ‘పాలమూరు నుంచి 2009లో ఎంపీగా గెలిచిన కేసీఆర్‌ ఈ ప్రాంతానికి చేసింది, ఇచ్చింది ఏంటో చెప్పాలి. కరీంనగర్‌ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే ఇక్కడి బిడ్డలు భుజాలపై పెట్టుకున్నారు. పదేళ్ల కాలం పాటు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్‌ పాలనలోనే పాలమూరుకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డలు అన్నం పెడితే, కేసీఆర్‌ వారికి సున్నం పెట్టారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే కేసీఆర్‌కు దు:ఖం వస్తోంది.2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్‌ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని మేము చేస్తున్న పనులు చూడాలి..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాడు. ఒకే ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరైనా గుడిసె కట్టుకున్నా పదేళ్లు ఉంటది. కానీ కాళేశ్వరం 2019లో కడితే 2023లో కూలింది. మూడేళ్లకే ప్రాజెక్టు కూలుతుందా? బీఆర్‌ఎస్‌ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. తన ఇంటినిండా మాత్రం కొలువులు నింపుకున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రెండున్నరేళ్ల కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసే క్రమంలో నోటిఫికేషన్ల జారీ ఆలస్యం అవుతోంది. ఆరు నెలలు ఆలస్యమైనా వారికి న్యాయం జరుగుతుంది. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు దేశానికే తలమానికంగా నిలువబోతున్నాయి..’ అని సీఎం చెప్పారు. మా పాలనలో మహిళలకు అందలం ‘కేసీఆర్‌ పాలనలో 2018 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలన్న దుర్మార్గమైన ఆలోచన బీఆర్‌ఎస్‌ది. మా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా పనిచేస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో బడిపంతుళ్ల హాజరు లెక్కలు చూసే అధికారం అక్కలకే ఇచ్చాం. పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్రంలోని పేదల విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2011లో వైఎస్సార్‌ మహిళలకు వడ్డీలేని రుణాలను అందించారని, బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ రుణాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క మోటారు ఆన్‌చేసి కేసీఆర్‌ ఎన్నికల డ్రామా ఆడారని మండిపడ్డారు. కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.344 కోట్లను సీఎం ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 19-07-2025 In Telugu3
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.28 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి రా.12.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.10.53 నుండి 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.7.45 నుండి 9.14 వరకు సూర్యోదయం : 5.38, సూర్యాస్తమయం : 6.34, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కళాకారులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.వృషభం: కొన్ని పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.సింహం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.తుల: శుభవార్తా శ్రవణం. ఇంటాబయటా అనుకూలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.ధనుస్సు: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు సామాన్యస్థితి.మకరం: చేపట్టిన పనులు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్వల్ప అనారోగ్యం.కుంభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి.మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

India womens team to play second ODI against England today4
ఈ ఒక్కటి గెలిస‍్తే చాలు!

లండన్‌: భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. నేడు ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం గెలిస్తే వరుస సిరీస్‌లతో పండగ చేసుకోవడం ఖాయం. టాపార్డర్‌ సూపర్‌ ఫామ్, బౌలింగ్‌లో నిలకడ కనబరుస్తున్న టీమిండియాకు విజయం, సిరీస్‌ కైవసం ఏమంత కష్టం కానేకాదు. ఇంగ్లండ్‌ మాత్రం వన్డే సిరీస్‌ రేసులో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌ వైఫల్యం ఆతిథ్య జట్టుకు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. గత ఓటమి నుంచి బయటపడి, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. జోరుమీదున్న భారత్‌ బ్యాటర్లు, బౌలర్లు అందరు ఫామ్‌లో ఉండటం భారత జట్టులో సమరోత్సాహాన్ని అమాంతం పెంచుతోంది. వన్డే జట్టులోకి రాగానే ప్రతీక రావల్‌ సత్తా చాటుకుంది. స్మృతి, హర్లీన్‌ డియోల్‌లు కూడా మెరుగ్గానే ఆడారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌... ఈ ఇద్దరు మాత్రమే రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. కానీ మిడిలార్డర్లో జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడటంతో బ్యాటింగ్‌ మరింత పటిష్టమైంది. బౌలింగ్‌లో క్రాంతి, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌లు సమష్టిగా ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం పట్టారు. లార్డ్స్‌ లోనూ మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే ఎంచక్కా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవచ్చు. ఓడితే ఇక నెగ్గలేరు మరోవైపు భారత్‌తో పోలిస్తే... ఆతిథ్య ఇంగ్లండ్‌ది భిన్నమైన పరిస్థితి. సొంతగడ్డపై ఇదివరకే టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయే స్థితిలో ఉంది. ‘లార్డ్స్‌’ పోరులో ఓడితే ఇక సిరీస్‌ నెగ్గే అవకాశమే ఉండదు. ప్రధాన ప్లేయర్లంతా కీలకమైన తరుణంలో చేతులెత్తేయడం... పరుగులో వెనుకబడటం, వికెట్లు తీయడంలో అలసత్వం... ఇవన్నీ ఆతిథ్య జట్టుకు కొండంత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి ఒత్తిడి ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో నిలవడం కాస్త కష్టమైన పనే! గత మ్యాచ్‌లో ఓపెనర్లు టామీ బ్యూమోంట్, అమీ జోన్స్‌ల ఘోరమైన వైఫల్యం జట్టుకు ప్రతికూలమైంది. మిడిలార్డర్‌లో సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్‌ల అర్ధసెంచరీలతో జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. అయితే బౌలర్లు నిరుత్సాహపరిచే ప్రదర్శనతో లక్ష్యాన్ని భారత్‌ సులువుగా ఛేదించింది. కేట్‌ క్రాస్, లారెన్‌ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిరీస్‌లో నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు బాధ్యత కనబరిస్తేనే ఆశించిన ఫలితాన్ని రాబట్టొచ్చు. తుదిజట్లు (అంచనా) భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్), ప్రతీక, స్మృతి మంధాన, హర్లీన్, జెమీమా, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌.ఇంగ్లండ్‌: నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (కెప్టెన్), బ్యూమోంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్, కేట్‌ క్రాస్, లారెన్‌ ఫైలెర్, లారెన్‌ బెల్‌. ఇంగ్లండ్‌ జట్టు, ప్రతీకలపై జరిమానా భారత టాపార్డర్‌ బ్యాటర్‌ ప్రతీక రావల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. సౌతాంప్టన్‌లో తొలి వన్డే సందర్భంగా 18వ ఓవర్‌ వేసిన లారెన్‌ ఫైలెర్, ఆ మరుసటి ఓవర్‌ వేసిన సోఫీ ఎకిల్‌స్టోన్‌తో ప్రతీక అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమే అని తేల్చిన రిఫరీ ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించారు. మరోవైపు మందకొడి బౌలింగ్‌ నమోదు చేసినందుకు ఇంగ్లండ్‌ జట్టు మొత్తానికి జరిమానా పడింది. నిర్ణీత సమయంలో కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో 5 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.4 లార్డ్స్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్, మరో రెండింటిలో ఇంగ్లండ్‌ గెలిచాయి. ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై భారత్‌ అత్యధిక స్కోరు 230 కాగా, అత్యల్ప స్కోరు 169.

India needs very careful and clever in US trade deal talks, says Raghuram Rajan5
అమెరికాతో వాణిజ్య చర్చలు..  వ్యూహాత్మకంగా వ్యవహరించాలి 

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్‌ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్‌లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్‌కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్‌ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్‌ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్‌ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భారత్‌ ముందు అవకాశాలు.. తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్‌ను డిమాండ్‌ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్‌ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్‌ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్‌ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్‌ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్‌లు భారత్‌ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్‌కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్‌ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్‌పై విధించే టారిఫ్‌లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్‌పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్‌లను (10 శాతం బేసిక్‌ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్‌ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే.

Military operations are still ongoing in Ukraine and Gaza6
రెండు ధ్రువాలతో సమతూకం ఎలా?

అమెరికాలో కొత్త ప్రభుత్వ సమర్థతను మదింపు చేసేందుకు సాధారణంగా, అధ్య క్షుడి మొదటి 100 రోజుల పాలనను లెక్క లోకి తీసుకుంటారు. కానీ, ట్రంప్‌ రెండవ విడత పాలన మొదలై 180 రోజులు గడు స్తున్నా వాణిజ్య వివాదాలకు పరిష్కారం ఒక కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్, గాజాలలో సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక భాగస్వామి అమెరికా, ముఖ్య మైన ఆర్థిక పోషక దేశం చైనాలతో సంబంధాలలో సమతూకం పాటించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొని ఆల్బనీస్‌ జూలై నెల మధ్యలో 6 రోజుల పర్యటనపై చైనా వెళ్ళారు. దౌత్యం, వాణిజ్యంతో వ్యవహరిస్తున్న భారత దౌత్యవేత్తలు కూడా అలాంటి సందేహ డోలనే ఎదుర్కొంటున్నారు. ‘బ్రిక్స్‌’ శిఖ రాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య బ్రెజిల్‌ వెళ్ళారు. ఆయన భారత్‌కు తిరిగి వచ్చే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే బ్రెజిల్‌ అధ్యక్షుడు లూల డ సిల్వా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. వారి మధ్య మాట మాట పెరగడానికి విదేశాంగ విధానంపై అభిప్రాయ భేదాలు కారణం కాదు.బ్రెజిల్‌ ఆంతరంగిక వ్యవహారాలలో ట్రంప్‌ బాహాటంగా జోక్యం చేసుకోవ డమే తగాదాకు దారితీసింది. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జాయిర్‌ బొసొనారొపై విచారణకు స్వస్తి పలకాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై అమెరికా జోక్యాన్ని లూల తిరస్కరించారు. అమెరికా దండి స్తున్నట్లుగా సుంకాలు విధిస్తే తామూ ప్రతీకార చర్యలకు దిగాల్సిఉంటుందని హెచ్చరించారు. చైనాతో సవ్యంగా లేకపోయినా...ఆ విధంగా, ప్రజానీకం నేడు రెండు ధ్రువాల ప్రపంచాన్ని ఎదు ర్కొంటోంది. ‘నాటో’ దేశాల మద్దతు ఎంతవరకు లభిస్తుందో తెలియకపోయినా, వాటిని తోడు చేసుకుని అమెరికా ఒక ధ్రువంగా ఉంది. చైనా–రష్యా ఇరుసు రెండవదిగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి స్థితితో పోలిస్తే, ఒక్కటే తేడా కనిపిస్తోంది. చైనా–అమెరికా ప్రత్యర్థులే కావచ్చు కానీ, వాణిజ్యం, సాంకేతికతల విషయంలో అవి ప్రస్తుతం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్‌ యూనియన్, అమెరికా మధ్య అప్పట్లో అలాంటి సంబంధాలు ఉండేవి కావు. దాంతో, బ్రెజిల్, భారత్‌ లాంటి ప్రవర్ధమాన దేశాలకు ఈ రెండు ధ్రువాల మధ్య సమతౌల్యం పాటించడం కష్టంగా మారుతోంది. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండటం, మనల్ని చైనా ఒక బలమైన ప్రత్యర్థిగా చూస్తూండటం వల్ల, మన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఆగస్టు 1లోగా, ఏదో ఒక అంగీకారానికి రాకపోతే, ‘ప్రతిగా ఎదురు కాగల సుంకాలను’ తప్పించుకునేందుకు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం భారత్‌కు తక్షణ సమస్యగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలపై తడవకో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా అనిశ్చితిని పెంచుతోంది. ‘విముక్తి దినం’గా ప్రకటించిన ఏప్రిల్‌ 2 నుంచి రెండు డజన్లకు పైగా పర్యాయాలు సుంకాలపై తలకిందుల ధోరణిని చూశాం. సుంకాల పేరిట అమెరికా బెదిరింపులు పరిపాటిగా మారడంతో కాబోలు,అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాటిని పెద్దగా లెక్కలోకి తీసు కోవడం మానేశాయి. ‘90 రోజులలో 90 ఒప్పందాలు’ అంటూట్రంప్‌ చేసిన వాగ్దానం నీటిమీద రాతగా మారింది. ఒక్క వియత్నాం, బ్రిటన్‌లతోనే వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో పాక్షికంగా మాత్రమే అవగాహన కుదిరింది. వాణిజ్య ఒప్పందం కొరవడిన నేపథ్యంలో, ఆగస్టు 1 తర్వాత, అమెరికా 30% సుంకాల బెదిరింపును అమలు జరిపితే తామువిధించగల ప్రతీకార సుంకాల జాబితా సిద్ధంగా ఉందని యూరోపి యన్‌ యూనియన్‌ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్‌ బాటనే భారత్‌ కూడా అనుసరించింది. షాంఘై సహకార సంస్థ సమావేశాలలో పాల్గొనేందుకు బీజింగ్‌ వెళ్ళిన భారతవిదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, భారత్‌–చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వాస్తవాధీన రేఖ వద్ద సేనల ఉపసంహరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా, పాకిస్తాన్‌కు చైనా క్రియాశీల సహాయం అందించిన సంగతి తెలిసిందే. వీటికితోడు, దలైలామా 90వ పుట్టిన రోజు ఈ సమయంలోనే వచ్చింది. దలైలామాకు క్రియాశీల మద్దతు ఇవ్వడం ద్వారా, టిబెట్‌పై తమ పట్టును తగ్గించడంలో భారత్‌ తోడుదొంగగా వ్యవహరిస్తోందని చైనా భావిస్తోంది. అదే సమయంలో, ట్రంప్‌ కల్లోలిత ప్రపంచంలో, భారతీయ మార్కెట్‌ ప్రాధాన్యాన్ని చైనా గ్రహించింది. పాకిస్తాన్‌కు అమెరికా స్నేహహస్తంఅమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కునేందుకు భారత్‌ కడపటి ప్రయత్నాలలో ఉంది. భారతీయదృక్కోణం నుంచి చూసినప్పుడు వ్యావసాయిక, పాడిపరిశ్రమ మార్కెట్లను సంరక్షించుకోవడం ప్రాధాన్యంగా ఉంది. ఎలాన్‌ మస్క్‌ సంస్థ ‘టెస్లా’ ముంబయిలో తన మొదటి షోరూమ్‌ తెరవడం, సాధారణ పరిస్థితులలోనైతే, సానుకూల సంకేతంగానేఉండేది. కానీ, ఆయనకు, అధ్యక్షుడు ట్రంప్‌కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్‌–అమెరికా వాణిజ్య వివాదాన్ని పరిష్క రించడంలో మాట సాయం చేయగల స్థితిలో లేనని మస్క్‌ చేతులు ఎత్తేయవచ్చు. భారత్‌ దౌత్యపరంగా పెద్ద సవాల్‌నే ఎదుర్కొంటోంది. అమె రికాతో పెంచిపోషించుకుంటూ వచ్చిన సన్నిహిత సంబంధాలు ఏ మేరకు ప్రతిఫలాలు చూపగలవో తెలియడం లేదు. పాకిస్తాన్‌కు అమెరికా చాస్తున్న స్నేహ హస్తమే ఇందుకు నిదర్శనం. జైలులో ఉన్న పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఏ–ఇన్సాఫ్‌ నాయకుడు ఇమ్రాన్‌ ఖాన్‌తో సయోధ్య కుదుర్చుకోవలసిందిగా పాక్‌ సైన్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుకు తోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా నిర్దేశించిన 50 రోజుల గడువు లోగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోతే, రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలను అమెరికా లక్ష్యం చేసుకోగల కత్తి కూడా భారత్‌ మెడపై వేలాడుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ప్రయత్నం చూసిన అమెరికా, ఆస్ట్రేలియాతో (బ్రిటన్‌తో కలుపుకొని) ఉన్న వ్యూహాత్మక త్రైపాక్షిక పొత్తును సమీక్షిస్తామని సంకేతాలుపంపుతోంది. ఆ పొత్తు ప్రకారం ఆస్ట్రేలియాకు అణు జలాంత ర్గాములు అందవలసి ఉంది. తైవాన్‌ విషయంలో చైనాతో సైనిక ఘర్షణ తలెత్తితే, తమకు అండగా ఉంటామంటూ హామీ ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను పెంటగాన్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క వివిధ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించు కుంటూపోతున్న అమెరికా, ఒకవేళ చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే, వ్యూహాత్మక మిత్ర దేశాల నుంచి క్రియాశీల సైనిక మద్దతు ఆశించడం కష్టమన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తోంది. అయితే, ట్రంప్‌ తాను మొదలెట్టిన వాణిజ్య యుద్ధానికి తానే త్వరలో ఒక పరిష్కారం కనుగొనక తప్పని స్థితిలో పడవచ్చు.ఎందుకంటే, లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ వద్ద ఉన్నాయి. ఆ నేరాలతో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిలో ట్రంప్‌ పేరు కూడా ఉందని మస్క్‌ వెల్లడించారు. ట్రంప్‌ ఆ రొంపి నుంచి బయటపడే హడావిడిలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్‌ ఇప్పటికే పెంచింది. భారత్‌ తమ నుంచి రక్షణ సామగ్రిని ఎక్కువ కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం మరో సమస్యగా ఉంది. కానీ, సైనిక పరంగా అమెరికాపై మితిమీరి ఆధారపడటం వ్యూహాత్మకంగా పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ–ఆర్థిక స్థితిగతులు ‘ప్రతి ఒక్కరినీ ఊహాగానాలకు లోను చేస్తు న్నాయి’ అని ఎకనామిస్ట్‌ మ్యాగజైన్‌ ఇటీవల వ్యాఖ్యానించడంలో వింతేముంది?-వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)-కె.సి. సింగ్‌

NATO alliance reconciliation with US President Donald Trump7
నాటో మొరటు భాష!

ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ ఆర్నెల్ల నిరీక్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కొద్దో గొప్పో సయోధ్య కుదిరేసరికి నాటో కూటమి ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనబడుతోంది. రష్యాతో వాణిజ్యం సాగిస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రూట్‌ భారత్, చైనా, బ్రెజిల్‌ దేశాలకు చేసిన హెచ్చరిక దీన్నే చాటు తోంది. ట్రంప్‌తో నాలుగు రోజులక్రితం భేటీ అయ్యేవరకూ తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో నాటో దిగాలుగా, అయోమయంగా వుంది. ఎందుకంటే నాటో ఖర్చులో సింహభాగం అమెరికాదే. అది తప్పుకున్న మరుక్షణం సంస్థ కుప్పకూలుతుంది. ట్రంప్‌ ప్రసన్న వదనంతో పలక రించేసరికి పులకరించి తన స్థాయి ఏమిటన్నది నాటో మరిచిందని రూట్‌ మాటలు చెబుతున్నాయి. ఈ మూడు దేశాలూ యుద్ధం వద్దని రష్యాకు నచ్చజెప్పాలట. లేనట్టయితే ఆ పర్యవసానాలు ఈ దేశాలూ ఎదుర్కొనాల్సి వస్తుందట. ఇంకా వలస పాలన మాటున దోపిడీ సాగించిన నాటి రోజులే వున్నాయని రూట్‌ భ్రమపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. అలాగే గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమం, ఇటీవల ఆ దేశమే ఇరాన్‌పై చేసిన దాడి, దానికి వత్తాసుగా అమెరికా సాగించిన దాడులు అంగీకరించరు. నాటో దన్నుతో ఉక్రె యిన్‌ కావాలని రష్యాతో గిల్లికజ్జాలకు దిగిన వైనం అందరికీ తెలుసు. తమ చేతికి మట్టి అంటకుండా రష్యాను దెబ్బతీసి, దాన్ని సర్వనాశనం చేయగలమన్న భ్రమలో యూరప్‌ దేశాలు ఉక్రె యిన్‌ను ఉసిగొల్పాయి. కానీ మూడేళ్లయినా ఆ యుద్ధం ఆగకపోవటంతో యూరప్‌ దేశాలకు దిక్కు తోచటం లేదు. ఆ నిరాశా నిస్పృహల పర్యవసానంగానే నాటో కూటమి అతిగా మాట్లాడుతోంది. అటువంటి బెదిరింపులకు దిగేందుకు తనకున్న అర్హతేమిటో నాటో గమనించుకోలేదు. 1949లో ఆవిర్భావం మొదలుకొని దాని చరిత్రంతా దురాక్రమణలు, యుద్ధాలే. నిక్షేపంగా వున్న లిబియాపై చమురు, సహజవాయు నిక్షేపాల్ని కొల్లగొట్టడానికి దండెత్తి, రసాయన ఆయుధాలున్నా యంటూ ఆరోపించి, పాలకుడు గడాఫీని దారికి తెచ్చుకుని, ఆయన నిరాయుధుడు కాగానే సాయుధ ముఠాలను ఎగతోసింది నాటోయే. ఆ ముఠాలతో ఆయన్ను అత్యంత అమానుషంగా హత్య చేయించింది కూడా నాటోయే. 2011 మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. బోస్నియా, హెర్జ్‌గోవినా, కొసావో, అఫ్గాన్, ఇరాక్, సోమాలియా తదితర చోట్ల అమెరికాతో కలిసి, విడిగా నాటో సృష్టించిన కల్లోలం సామాన్యమైంది కాదు. ఈ యుద్ధాల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు. రష్యా–ఉక్రెయిన్‌ లడాయిలోఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సాయాన్నందిస్తూ ఈ యుద్ధం ఆరకుండా కాపాడుతున్నది కూడా నాటోయే. అలాంటి సంస్థ ఏ అర్హతతో మననూ, వేరే దేశాలనూ బెదిరిస్తుంది? నాటో అనేది పుట్టుకనుంచీ అమెరికా కోసం, దాని ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పెద్ద పోలీస్‌. ఒక సైనిక కూటమిగా వుంటూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించటం సాధ్యమనే నాటో అనుకుంటున్నదా? ఆ పని యూరప్‌ దేశాలది. కానీ వాటికి హెచ్చరించటం సంగతలా వుంచి అడిగే ధైర్యం కూడా లేదు. ఒకనాడు సంపన్న రాజ్యాలుగా చలామణి అయిన యూరప్‌ దేశాలు ఇప్పుడు ఉత్పాదకతను పెంచటం ఎలాగో... అరకొర ఆర్థిక వ్యవస్థలతో ప్రజానీకంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం ఎలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి. ఈ దేశాలతో కూడిన నాటో మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతోంది. ఇన్నేళ్ల అమెరికా సాహచర్యంతో ఇష్టాను సారం బడుగు దేశాలపై బలప్రయోగం చేయటం అలవాటైన నాటోకు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ వేదికలున్నాయని కూడా గుర్తున్నట్టు లేదు. ఆంక్ష లైనా, విధినిషేధాలైనా వాటిద్వారా అమలు కావాలి. అదనంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటివి వున్నాయి. రష్యాతో వ్యాపారం చేయాలో లేదో అమెరికా, యూరప్‌సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కానీ మేమే కాదు... ఎవరూ వ్యాపారం చేయకూడదంటే చెల్లదు. తన ఇంధన అవసరాలేమిటో, దాన్ని నెరవేర్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో భారత్‌ ఆలోచించుకుంటుంది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా మన దేశం బేఖాతరుచేసింది. రష్యా చవగ్గా అమ్మజూపిన ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసింది.క్రితంతో పోలిస్తే 2023లో రష్యా నుంచి చమురు, సహజవాయు దిగుమతులు 1,500 శాతం పెరగటానికి ఇదే కారణం. చైనా, బ్రెజిల్‌ కూడా ఈ దోవనే వెళ్లాయి. రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య ప్రపంచం కలల్ని బద్దలుకొట్టాయి. మన విదేశాంగ శాఖ నాటో ద్వంద్వ ప్రమాణాలను సరిగానే ఎత్తిచూపింది. ప్రజల ఇంధనావసరాలు మినహా తమకేదీ ప్రాముఖ్యంగల అంశం కాదని జవాబిచ్చింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన మన దేశం, ఇప్పుడు 40 దేశాలనుంచి కొంటున్నది. రష్యాపై తీసుకొచ్చిన అభిశంసనపై ఓటింగ్‌ జరిగినప్పుడల్లా ఐక్యరాజ్యసమితిలో మన దేశం గైర్హాజరైంది. అదే సమయంలో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధినేత పుతిన్‌కు నచ్చజెప్పింది. అదే సలహా ఉక్రెయిన్‌కు కూడా ఇచ్చింది. ఇవి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం, హెచ్చరికలు జారీ చేయటం తగదని నాటో గుర్తించాలి. తెలిసీ తెలియ కుండా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటే వున్న పరువు కాస్తా పోతుందని గుర్తెరగాలి.

Heavy Rain in Hyderabad: Two Hours Of Rain Triggers Severe Waterlogging and Traffic Chaos8
చినుకు సిటీ అంతా వణుకు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.ప్యాట్నీ నగర్‌లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బందికంటోన్మెంట్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్‌ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. ఎటు చూసినా వరదే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్‌ వద్ద, ఎల్‌బీనగర్, మలక్‌పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్‌పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్‌ పేట్, మాదాపూర్, హైటెక్‌ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్‌ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్‌పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్‌ నగర్, అంబికా నగర్, పటేల్‌ నగర్‌ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్‌ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్‌పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్‌లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్‌పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో నగరం రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్‌ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌ రాయదుర్గం, షేక్‌పేట్‌ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్‌ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. హఫీజ్‌పేట్, ఆల్విన్‌ కాలనీ, చందానగర్‌ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్‌పేట పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, అలీకేఫ్‌ చౌరస్తాల్లో, బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తా మాదాపూర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. అమీర్‌పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్‌గూడ శ్రీకష్ణానగర్‌ రోడ్లలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మూసారంబాగ్‌ బ్రిడ్జిని వరద ముంచెత్తింది. సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్‌వరద ఉధృతికి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ప్యాట్నీనగర్‌ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్‌ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యవేక్షించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం... ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్‌ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్‌ మండలం నదీమ్‌నగర్‌ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది.

US Faces 70-80percent Drop In Indian Students As Visa Crisis9
అమెరికా కల చెదురుతోంది..!

ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్‌మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్‌ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్‌ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్‌ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్‌ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్‌ రావడం లేదు. కొత్తగా అప్‌డేట్‌ చేసిన స్లాట్‌ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్‌మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్‌సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్‌ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్‌ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్‌ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్‌ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్‌ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్‌ కన్సల్టింగ్‌ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

PM Narendra Modi slams TMC over womens safety in West Bengal10
మృగాళ్లకు అండగా తృణమూల్‌ 

దుర్గాపూర్‌: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్‌లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్‌లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్‌ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్‌ ‘‘బెంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్‌ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్‌ బిహార్‌’ మోతిహరీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్‌ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్‌ బిహార్‌’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్‌ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్‌ ఏక్‌బార్‌ ఎన్డీయే సర్కార్‌’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్‌లో విపక్ష కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్‌–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్‌ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్‌ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్‌ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement