Rehabilitation Center
-
డ్రగ్స్ వాడకం? రిహాబిటేషన్ సెంటర్లో ప్రముఖ డైరెక్టర్!
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిర్మాత కేపీ చౌదరితో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటి సురేఖావాణి, అషూరెడ్డి స్వయంగా వీడియోలు రిలీజ్ చేసి మరీ తమకు ఈ కేసుతో ఎలాంటి లింక్ లేదని చెప్పుకొచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం నడుస్తుండగా.. బాలీవుడ్ లో ఓ డైరెక్టర్ రిహాబిటేషన్ సెంటర్లో ఉన్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) కంగనా రనౌత్ నిర్మించిన 'టీకూ వెడ్స్ షేరు' సినిమా 3-4 రోజుల ముందే ఓటీటీలో నేరుగా విడుదలైంది. దీనికి సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. అంతకు కొన్నిరోజుల ముందు జరిగిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఇతడు కనిపించలేదు. మూవీని ప్రమోట్ చేస్తూ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏమైందని ఆరా తీయగా.. గతంలో డ్రగ్స్ వాడకం వల్ల ఇతడి దానికి బాగా అడిక్ట్ అయిపోయాడని, దాన్నుంచి బయటపడేందుకు ప్రస్తుతం రిహాబిటేషన్ సెంటర్లో చేరినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సాయి కబీర్.. తొలుత రచయితగా పలు సినిమాలకు పనిచేశాడు. 2014లో కంగనా రనౌత్ ని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన 'రివాల్వర్ రాణి' చిత్రంతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కంగన నిర్మించిన 'టీకూ వెడ్స్ షేరు' చిత్రానికి కూడా ఇతడే దర్శకత్వం వహించాడు. 2018లో ఇలానే రిహాబిటేషన్ సెంటర్ లో చేరిన కబీర్.. ఇప్పుడు మరోసారి ఆ చోటుకి వెళ్లడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన ఆషూ రెడ్డి) -
'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'
పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరోసారి సంచలన విషయాలు బయపెట్టాడు. గ్రేడ్ క్రికెటర్స్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అక్రమ్ కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు నాకు ఇష్టం లేకున్నా దాదాపు రెండున్నర నెలల పాటు రీహాబిలిటేషన్‌లో ఉండడం నరకంలా అనిపించదని పేర్కొన్నాడు. అంతేకాదు ఒకరికి ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచానికి చట్టవిరుద్ధం అనిపించొచ్చు.. కానీ పాకిస్తాన్లో మాత్రం అలా ఉండదన్నాడు. అక్రమ్ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్‌లో ఒక పార్టీకి వెళ్లినప్పుడు తెలియకుండానే కొకైన్కు బానిసగా మారిపోయా. ఎంతలా అంటే కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగేలాగా. తొలిసారి కొకైన్ రుచి చూడడం ఇప్పటికి నాకు గుర్తు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రయత్నిస్తారా అని అడిగాడు. అప్పటికే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడంతో పెద్దగా ఇబ్బంది ఉండదనుకొని తొలిసారి కొకైన్ రుచి చూశాను.. అందునా ఒక గ్రామ్ కొకైన్ మాత్రమే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేశా. అయితే కొకైన్‌లో ఏదో తెలియని పదార్థం నా మనసును జివ్వుమని లాగడం మొదలుపెట్టింది. ఒక్కసారి రుచి చూసిన పాపానికి ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌గా మారిపోయాడు. ఇక కొకైన్ లేనిదే నా జీవితం లేదు అనే స్టేజ్‌కు వచ్చేశాను. అలా నా పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటికే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని చాలా బాధపెట్టాను.. కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో వెంటనే నా భార్య నీకు చికిత్స అత్యవసరమని చెప్పింది. మా ఇంటికి కొద్ది దూరంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ ఉండడంతో అక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది. నేను నెలరోజులు మాత్రమే ఉండడానికి అంగీకరించాను. కానీ నాకు తెలియకుండానే అక్కడ దాదాపు రెండున్నర నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. మనకు ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచంలో చట్టవిరుద్ధం కావొచ్చు.. కానీ పాకిస్తాన్లో అలా కాదు. చివరికి అక్కడి నుంచి బయటపడిన తర్వాత కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఒక రకంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక భయంకరమైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాను. ఇక ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో రీహాబిలిటేషన్ సెంటర్లు చాలా విశాలంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్లో అలా కాదు. కేవలం కారిడార్‌తో కలిపి ఎనిమిది గదులు మాత్రమే ఉంటాయి. దీంతో ఆ ప్రదేశం నిత్య నరకంలా అనిపించి భయంగా గడపాల్సి వచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే నా జీవితంలో అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది. నా భర్యా చనిపోవడం నా జీవితాన్ని సరిదిద్దింది. విదేశాల్లో ప్రతీ తండ్రి పిల్లల పట్ల ఎంతో కేరింగ్‌గా ఉంటారు. కానీ మా దేశంలో ఇవన్నీ ఇంట్లోని ఆడవాళ్లు మాత్రమే చూసుకుంటారు. నా భర్య చనిపోవడంతో నాలో మార్పు మొదలైంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. అవసరమైన సందర్భాల్లో వారికి అండగా నిలబడడం.. కొన్నిసార్లు వారు చదివే పాఠశాలకు వెళ్లడం.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇతర పిల్లల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు.'' అంటూ ముగించాడు. చదవండి: ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం.. కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో -
మత్తుకు మందేసే ‘డాక్టర్ పోలీస్’
సాక్షి, హైదరాబాద్: ఏదో సరదాగానో, స్నేహితులతో కలిసో డ్రగ్స్‌కు అలవాటవుతున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. బయటికొచ్చాక అలవాటు మానుకోలేక మళ్లీ డ్రగ్స్ వైపు చూస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌పెట్టే దిశగా పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తామే బాధితులకు తగిన చికిత్స ఇప్పించడం, కౌన్సెలింగ్ చేయడం ద్వారా డ్రగ్స్ నుంచి దూరం చేసేలా ‘రీ–హ్యాబ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలతో పాటు నాలుగు ప్రైవేట్ సంస్థలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రీ–హ్యాబ్ విధివిధానాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. ఆ వివరాలివీ.. – ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగర పోలీసులు డ్రగ్స్ కేసుల్లో మొత్తం 372 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 40 మంది బయటి ప్రాంతాల వారితో సహా 193 మంది పెడ్లర్స్ ఉన్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ విక్రయిస్తున్న 85 మంది, వినియోగదారులు 94 మందినీ కటకటాల్లోకి పంపారు. – వీళ్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఐదు సంస్థల సహకారంతో వారిపై నిఘా ఉంచనున్నారు. తల్లిదండ్రుల సమ్మతితో వారిని స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైన వారికి ఇన్‌షేషెంట్స్‌గా.. మిగిలిన వారికి ఔట్ పేషెంట్స్‌గా చికిత్స అందించనున్నారు. రెండు నెలల పాటు ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. – మొదటి నెల వారానికి రెండు సార్లు, రెండో నెల వారానికి ఒకసారి చొప్పున కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ కాలంలో వారి సమ్మతితోనే ప్రతి వారం మూత్రం, రక్త పరీక్షలు చేసి ఇంకా డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అనేది గుర్తిస్తారు. ఇన్‌పేషెంట్స్‌కు కనిష్టంగా 28 రోజుల చికిత్స ఉంటుంది. – ప్రైవేట్ సంస్థల్లో ఒక్కో సెషన్‌కు రూ.2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్తోమత లేని వారికి ఎర్రగడ్డ వైద్యశాలలో రీ–హ్యాబ్ ప్రక్రియ పూర్తి చేయిస్తారు. ఆయా సంస్థల్లోని నిపుణులు వివిధ దశల్లో కౌన్సెలింగ్, వైద్యం చేసి వారు డ్రగ్స్‌కు దూరమయ్యేలా చేస్తారు. ఇది శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. – మాజీ డ్రగ్స్ వినియోగదారులపై ఆయా సంస్థల సహకారంతో పోలీసులు నిఘా కొనసాగిస్తారు. మద్యం అలవాటు నుంచి బయటపడిన వారి (ఆల్కహాల్ అనానిమస్) గ్రూపుల మాదిరిగానే భవిష్యత్తులో నార్కోటిక్ అనానిమస్ గ్రూపులు ఏర్పాటు చేసి, వారంతట వారే తమపై నిఘా ఉంచుకునేలా, ఒకరికొకరు సహకరించుకునేలా నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
గజరాజుల పిక్నిక్: ఎక్కడికంటే?
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలకు చెందిన గజరాజులన్నీ పిక్నిక్కు వెళ్లాయి. వీటి కోసం భవానీనది తీరంలో పునరావాస కేంద్రం ఏర్పాటైంది. 26 ఏనుగులు ఆ నదీ తీరంలో 48 రోజుల పాటు సేద తీరనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు అంటే మక్కువ. ముఖ్య ఆలయాలకు వెళ్లినప్పుడు ఓ ఏనుగును విరాళంగా సమర్పించేవారు. వన్య ప్రాణులకూ మానసికోల్లాసం అవసరమని చెబుతుండేవారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా గజరాజుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించి, అక్కడ అవి సేద తీరే దిశగా చర్యలు తీసుకునేవారు. పునరావాసం.. జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం పునరావస శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈసారి ఏనుగులకు కరోనా పరీక్షలు చేయించి మరీ పిక్నిక్కు తీసుకెళ్లారు. తేక్కంపట్టి భవానీ నది తీరంలో ఏనుగులు ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునరావాస కేంద్రంలో ప్రత్యేక యాగాది పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడి ఆలయంలో జరిగిన పూజలతో గజరాజులు శిబిరంలోకి ప్రవేశించాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు అటవీశాఖమంత్రి దిండుగల్ శ్రీనివాసన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శిబిరం ప్రారంభమైంది. నెలన్నర పాటు ఏనుగులు ఇక్కడ సేదతీరనున్నాయి. చదవండి: భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు -
పునరావాసంపై కదలిక
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): వెలిగొండ ప్రాజెక్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నష్టపరిహారం తప్ప... గత పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పునరావాస పనులు... ప్యాకేజి ... పరిహారం... వెలిగొండ ముంపు గ్రామాల రైతులకు అందలేదు. ముఖ్యమంత్రిగా నెల రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్ 30 నాటికి మొదటి దశ నీరు అందించటంతో పాటు, పునరావాస కాలనీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించటంతో 10 రోజుల నుంచి పనుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ పోలా భాస్కర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించటంతో పాటు పునరావాస కాలనీల నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు, రైతుల్లో పునరావాస కాలనీలపై ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గోగులదిన్నె, తోకపల్లె, ఇడుపూరు, వేములకోట, ఒందుట్ల వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనులపై జాయింట్ కలెక్టర్ షన్మోహన్, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళితో ప్రాజెక్టు ఎస్ఈ వీర్రాజు కలిసి శనివారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, సిమెంట్ కాలువలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, దేవాలయాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గతంలో ఇలా.. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు ప్రభుత్వం పునరావాస కాలనీలు ప్రారంభించక, అటు ఉన్న గ్రామాల్లో శిథిలమైన గృహాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం, రైతుల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడ వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంతకాలం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహించింది. పదేళ్లుగా నష్టపరిహారం కోసం వెలిగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా, కాకర్ల, మాగుటూరు తండా, సాయినగర్, కృష్ణనగర్, తదితర గ్రామాల ప్రజలు ఎదురు చూశారు. ప్రభుత్వం పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేసింది. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్‌లను నిర్మించారు. ఈ ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. సుమారు పదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ గ్రామ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 18 ఏళ్లు నిండిన వారి కుటుంబాలు సుమారు 1800 వరకు ఉన్నాయి. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 80 కుటుంబాలు, సుంకేసులలో 2,760 కుటుంబాలు, కలనూతలలో 1,040 కుటుంబాలు, గుండంచర్లలో 1,150 కుటుంబాలు, కాటంరాజుతండాలో 40 కుటుంబాలు ఉన్నాయి. గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల్లోని కొంత మందికి మార్కాపురం మండలం వేములకోట వద్ద, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుంకేసుల గ్రామస్తులకు మార్కాపురం మండలం గోగులదిన్నె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద, గుండంచర్ల గ్రామస్తులకు దరిమడుగు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. స్థల సేకరణ మాత్రమే ఇప్పటికీ జరిగింది. ఇప్పటి వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో వర్షాకాలంలో ముంపు గ్రామాల ప్రజలు కొద్దిగా నీరు వచ్చినా క్షణ క్షణం భయంగా కాలం గడపాల్సి వస్తోంది. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి తొమ్మిదేళ్లు కావొస్తుంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రత్యేక దృష్టి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆర్ఆర్ ప్యాకేజి అమలుపై దృష్టి సారించారు. చాలా ఆనందంగా ఉంది జగనన్న సీఎం కాగానే వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు పునరావాస పనులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవటంతో నత్తనడకన సాగాయి. 10 రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉండటంతో పాటు పునరావాస పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. – పుప్పాల మార్తమ్మ, ఎంపీటీసీ, గొట్టిపడియ జగనన్న సీఎం కాగానే మాకు నమ్మకం పెరిగింది పదేళ్లుగా మేమందరం నిర్లక్ష్యానికి గురయ్యాం. ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నిక కావటంతో వెలిగొండ ప్రాజెక్టుపై మాలో ఆశలు చిగురించాయి. కలెక్టర్ 10 రోజుల్లో 2 సార్లు మార్కాపురం వచ్చి వెలిగొండ ప్రాజెక్టుపై రివ్యూ చేయటం సంతోషాన్నిచ్చింది. పునరావాస కాలనీలు త్వరగా పూర్తి చేయాలి. మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీరు ఇవ్వాలి. – తుమ్మా వెంకటరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత, గొట్టిపడియ గ్రామం -
తలపుల్లో ఊరు.. బతుకుల్లో కన్నీరు..
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): లక్షలాది మంది ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉగాది పండగ రాకతో కన్న ఊరును తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదివరకు ఉగాది రోజు సాంప్రదాయబద్ధంగా పొలాల్లో మొదటి ఏరుపూసి, పంటలు బాగా పండాలని భూదేవికి పూజలు చేసేవారు. కానీ ప్రస్తుతం కన్న ఊరు, పంట పొలాలను విడిచి పునరావాస కాలనీకి రావడంతో గుండెల్లో బాధతో ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు. మన అనే వాళ్లందరితో మమేకవుతూ జరుపుకునే పండగను ఒంటరిగా జరుపుకుంటున్నామని కుంగిపోతున్నారు. మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం 19 నిర్వాసిత గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు సొంత ఊరును, పంట పొలాలను వదులుకొని కొత్తూరు, హిరమండలం, ఎఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలి వచ్చారు. అయితే పునరావాస కాలనీకి వారు వచ్చిన తర్వాత మొదటిసారి ఉగాది పండగ వస్తోంది. దీంతో ఏరు పూసేందుకు సొంత భూములను లేకపోవడంతో గతం గుర్తు చేసుకుంటూ గుండెను రాయి చేసుకుంటున్నారు నిర్వాసితులు. నిజానికి వీరిలో చాలామందికి భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీచేసి పునరావాస కాలనీలకు వచ్చారు. దీంతో సాంప్రదాయాన్ని వీడలేక ఇంటి ముందరనే బంగారు ఉంగరాలతో భూమిపై గీటువేసి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బంధం తెగిపోయింది భూములతో తరాలు నుంచి బంధం తెగిపోయింది. ఉగాది పండగకు మొదటి ఏరు పూసి ఉగాది పండగను చేసుకోవడం అనవాయితీ. కానీ గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో తరాలు నుంచి వస్తున్న భూములు లేక ఎంతో బాధగా ఉంది. - బి.రామకృష్ణ, పాడలి గ్రామం, నిర్వాసితుడు కన్నీరు వస్తోంది ఇదివరకు తాతలు నుంచి వస్తున్న భూముల్లో ఉగాది రోజు మొదటి ఏరు పూసి భూదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నిర్వాసిత గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో సెంటు భూమి లేక ఉగాది పండగ అనగానే కన్నీరు వస్తోంది. - పి. శేషగిరి, నిర్వాసితుడు, ఇరపాడు, పునరావాస కాలనీ -
ఓటు కోసం 70 కి.మీ ప్రయాణం..!
సాక్షి, అద్దంకి (ప్రకాశం): గుండ్లకమ్మ పునరావాస కాలనీల ప్రజల కష్టాలను తీర్చే విషయంలో ప్రభుత్వానికి తీరిక దొరకలేదు. పునరావాస కాలనీల్లో నివసించే ప్రజలు అసౌకర్యాల నడుమ అల్లాడుతున్నారు. అది అలా ఉంచితే.. ముంపు గ్రామాల ప్రజలు ఓటు వేసి ఇంటికి చేరుకోవడానికి 70 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అద్దంకి మండలంలోని ఉత్తర ధేనువకొండ గ్రామాన్ని గుండ్లకమ్మ ముంపు గ్రామంగా ప్రకటించారు. పునరావాసం కోసం అద్దంకి పట్టణ సమీపంలోని కొంగపాడు వద్ద బలరామకృష్ణపురం, వేలమూరిపాడు గ్రామ సమీపంలో వైఎస్సార్ పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కాలనీల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో చాలా మంది పాత ధేనువకొండలో నివాసం ఉంటున్నారు. రెండు కాలనీల్లో 120 కుటుంబాలకు చెందిన 250 మంది ఓటర్లు పునరావాస కాలనీల్లో అరకొర వసతుల మధ్య జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ లేదు.. బూత్ లేదు పునరావాస కాలనీల్లో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక పంచాయతీగా గుర్తించకపోవడంతో వారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు రానూపోనూ 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కాలనీలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
యాచకుల పునరావాస కల్పనపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని యాచకుల పునరావాస కల్పనపై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో యాచకుల పునరావాసంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో ఎన్జీవో, ప్రభుత్వేతర సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి యాచకుల పునరావాసానికి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. యాచకులకు ఉచిత వైద్య సేవలతో పాటు, స్వయం ఉపాధిని కల్పిస్తామనిమున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. -
అజర్బైజాన్లో ఘోర అగ్ని ప్రమాదం
బాకు: అజర్బైజాన్ రాజధాని బాకులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కలపతో నిర్మించిన పునరావాస కేంద్రంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో కదల్లేని స్థితిలో ఉన్న రోగులు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 200 మంది రోగులను, అక్కడి సిబ్బందిని రక్షించారు. దాదాపు 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద కారణాలపై మరింత లోతుగా విచారణ సాగుతోందని అధికారులు చెప్పారు. అజర్బైజాన్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. -
నా తండ్రిని అడ్డుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు
సాక్షి, న్యూఢిల్లీ : తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పైగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయాక వారిని ఆదుకుంటానని నమ్మబలికి ఆర్థికంగా దోచుకున్నాడు. చివరకు యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలో 12వ తరగతి చదవుతున్న సదరు యువతి తండ్రి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. దీంతో ఆయన్ని గతేడాది జూలైలో ఘజియాబాద్‌లోని హ్యాపీ హోమ్స్ రిహాబ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దాని నిర్వాహకుడి కన్ను యువతిపై పడింది. ఆ వ్యక్తిని చేర్చిన రెండు రోజుల తర్వాత వారి ఇంటికి ఫోన్ చేసి ‘‘నీ తండ్రి మానసిక స్థితి బాగోలేదు. మాట్లాడాలి వెంటనే రావాలి’’ అంటూ యువతిని కోరాడు. తన తల్లి ఇంట్లో లేదని.. ఒక్కదాన్ని అంత దూరం రాలేనని యువతి చెప్పటంతో, దగ్గర్లోని మహిపాల్‌పూర్‌లోని హోటల్‌కు వెళ్లి అక్కడ మానసిక వైద్యుడ్ని కలవాలంటూ సూచించాడు. అత్యవసర పరిస్థితి కావటంతో యువతి అతను చెప్పినట్లే వెళ్లి ఆ వైద్యుడ్ని కలిసింది. మాటల మధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వటంతో స్పృహ కోల్పోగా.. రిహాబ్ సెంటర్ నిర్వాహకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే ఆమె తండ్రిని చంపేస్తానని.. నగ్న ఫోటోలు బయటపెడతానని యువతిని బెదిరించాడు. ఆపై వాటి సాకుతో మరికొంత కాలం ఆమెపై అత్యాచార పర్వం కొనసాగించాడు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పొందుతూ ఆమె తండ్రి చనిపోవటంతో.. ఈసారి ఆ నిర్వాహకుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని నమ్మబలికి వారి రవాణా వ్యాపారాన్ని చూసుకోవటం ప్రారంభించాడు. అయితే వచ్చే ఆదాయంలో పైసా కూడా వారికి ఇవ్వకుండా సతాయించటంతో మోసపోయామన్న విషయం ఆ కుటుంబానికి ఆలస్యంగా అర్థమైంది. చివరకు ధైర్యం చేసిన యువతి తనపై జరిగిన దాష్టీకాన్ని తల్లికి వివరించటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకపోవటం గమనార్హం. -
భారీ వర్షానికి పాణ్యంలో మూడు ఇళ్లు నేలమట్టం
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూడు మిద్దె ఇళ్లు కూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాటి కింద ఎవరు లేకపోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత భవనాలన్ని పునాధులతో సహా నానిపోయాయి. దీంతో.. స్థానికులు తమకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వానరానికి తీరని కష్టం
రాష్ట్రంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక చించోలి(బి) వద్ద ఏర్పాటుకు ఆదేశాలు రూ.2 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు నిర్మల్‌రూరల్ : కనిపించిన చెట్టునల్లా నరుడు నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టం వచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనావాసాల బాట పట్టాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు ఫలాలు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇన్ని మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ ఒక్క మెతుకు దొరికినా ఏరుకు తింటున్నాయి. సరిపడా ఆహారం దొరకక తమలో ఘర్షణ పడుతున్నాయి. ఆకలికి తాళలేకనే ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఈ వానర కష్టం.. వాటితో మనిషికి కలుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వానరజాతిని మళ్లీ వనాలబాట పట్టించాలని నిర్ణయించింది. ఇందుకు పెద్దఎత్తున హరితహారం చేపడుతోంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వానర జాతిని అరికట్టేందుకు, వాటి సమస్యలను తీర్చేందుకు మన జిల్లాకు పునరావాస కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే.. ఉత్తర్వులు జారీ అయి దాదాపు మూడునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేంద్రం ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చించోలి(బి) వద్ద ఏర్పాటుకు.. అడవుల జిల్లాగా.. కోతుల ఖిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాను పునరావాస కేంద్రానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సారంగాపూర్ మండలం చించోలి(బి) సమీపంలో కోతులకు పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 కోట్ల వరకు కేటాయించింది. ప్రభుత్వం చించోలి(బి)ని ఎంచుకోవడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల ఈ గ్రామానికి సమీపం నుంచే మహబూబ్ ఘాట్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంతో పాటు నీటి లభ్యత కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కోతులు అధికంగా ఉన్నాయి. వానరాల సంఖ్య అధికంగా ఉన్న నిర్మల్ నుంచి ఇక్కడికి వాటిని సులువుగా తరలించవచ్చు. నిర్మల్‌లోనే ఎక్కువ.. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక వనవాసం వదిలిన కోతులు కొన్నేళ్ల కిందటే జనావాసాల్లోకి వచ్చి చేరాయి. జిల్లాలో వీటి సంఖ్య నిర్మల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ కోతులు జీవనం సాగించడానికి అనువైన గుట్టలు, సమీపంలోనే అడవులు ఉండటంతో పట్టణంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. మొదట్లో ఇళ్లలో తినగా మిగిలిన పదార్థాలను చెత్తకుండీల్లో పడేస్తే ఏరుకుని తింటూ జీవనం సాగించాయి. కాలక్రమంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. రానురాను ఆహారం దొరకడం కష్టంగా మారడంతో వాటి తీరు కూడా మారింది. ఆహార పదార్థాల కోసం ఇళ్లల్లో దూరడం, మనుషులపై దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఇక గ్రామాల్లో పంటపొలాలను నాశనం చేయడం, ఇళ్లపై పెంకులు తొలగించడం చేస్తున్నాయి. దీంతో నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ కోతులు సమస్యగా మారాయి. కొంతకాలంగా వాటిని అడవుల్లోకి తరలించాలంటూ అధికారులకు వినతిపత్రాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం దాదాపు 2500 కోతులను పట్టుకుని జన్నారం అటవీ ప్రాంతానికి తరలించింది. అప్పట్లో అటవీశాఖ మంత్రి జోగురామన్న దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. కేంద్రం ఏర్పాటయితే.. రక్షణతోపాటు పునరావాస కేంద్రం ఏర్పాటయితే వానరాలతో మనుషులకు సమస్య తీరడంతో పాటు.. వాటి సమస్యలూ తీరనున్నాయి. ఈ కేంద్రంలో వెటర్నరి వైద్యశాలను ఏర్పాటు చేస్తారు. కోతులకు వచ్చే వ్యాధులను నయం చేసే వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందుకో సిబ్బందికి అక్కడే క్వార్టర్స్‌ను నిర్మిస్తారు. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు ఇక్కడ ప్రత్యుత్పత్తి చికిత్సలూ చేస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచుతారు. పునరావాసం ఇంకెప్పుడు.. వానరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనడంతో జంతుప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు బాధ తప్పడంతోపాటు వాటిని సరైన ఆవాసం దొరకనుందని భావించారు. అయితే.. ఇది గడిచి ఇప్పటికే దాదాపు మూడునెలలు కావస్తోంది. కానీ.. ఇంకా పునరావాస కేంద్రానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులు వచ్చి చించోలి(బి)లో స్థలాన్ని మాత్రం పరిశీలించి వెళ్లారు. మరోవైపు నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల వానరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని వేలాది కోతులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతులను ఇంకెప్పుడు వనాలకు తరలిస్తారని, పునరావాస కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హరితహారం సీజన్ పూర్తికాగానే పునరావాస కేంద్రంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. -
బక్కచిక్కిన పశువులకు మంచి రోజులు
♦ నల్లవాగులో పునరావాస కేంద్రం ఏర్పాటు ♦ దక్షిణ భారత దేశంలోనే తొలికేంద్రం ♦ మొదటిరోజు తరలివచ్చిన మూడువేల పశువులు ♦ తొలకరి మొదలయ్యే వరకు కొనసాగింపు ఎన్నాళ్లకెన్నాళ్లకు... మూగజీవాలకూ మంచి రోజులొచ్చాయి. ఓవైపు కరువు మరోవైపు మండుటెండలతో పశువులు అల్లాడుతున్నాయి. గ్రాసం, నీరు దొరక్క బక్కచిక్కిపోతున్నాయి. ఇప్పటికే వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కబేళా బాటపడుతున్నాయి. పశువుల దీనస్థితిని గుర్తించి న ప్రభుత్వం పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా కల్హేర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పదివేల పశువులు పునరావాసం పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేయగా మొదటిరోజు మూడు వేలవరకు వచ్చాయి. ప్రాజెక్టు ఒడ్డున టెంట్లు వేసి నీడ, దాణాతోపాటు సకల వసతులు కల్పించారు. - కల్హేర్ కల్హేర్: నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉండటం కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఫలితంగా నియోజకవర్గంలోని నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, మనూర్, కంగ్టీ, కల్హేర్ మండలాల్లోని పశువులకు ప్రయోజనం చేకూరింది. పశుసంవర్దక శాఖ అధికారులు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తొలకరి వర్షాలు వచ్చాక అంటే దాదాపు జూన్ మొదటి వారం వరకు కేంద్రం కొనసాగనుంది. ఎండ తగలకుండా టెంట్లు, నీటితొట్లు, ఒక్కో పశువుకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి ఉచితంగా అందించనున్నారు. అంతేకాదు 50 శాతం సబ్సిడీపై దాణా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 22 మె ట్రిక్ టన్నుల ఎండుగడ్డి, కావాల్సినంత దాణా సిద్ధంగా ఉంచారు. పాలిచ్చే గేదెలు, ఆవుల కోసం ప్రత్యేకంగా విజయ డెయిరీ తరపున పాలకేంద్రం నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం కాపాడేందుకు డాక్టర్లను నియమించారు. పాడి యజమానుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. రాత్రిళ్లు ఇక్కడ ఉండేవా రు ఇబ్బంది పడకుండా కరెంటు అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే విద్యుత్తు స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. అంచనాలకు మించి పశువులు కేంద్రానికి తరలివచ్చే పశువుల వివరాలను అధికారులు నమోదు చే స్తున్నారు. మొదటి రోజే అంచనాలకు మించి మూడు వేలకు పైగా పశువులు తరలివచ్చాయి. మొత్తం పదివేల మూగజీవాలు పునరావాసం పొందేందుకు సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేంద్రం ఏర్పాటుపై ఖేడ్ నియోజకవర్గ రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మంచి జరుగుతుంది నల్లవాగులో పశువుల కోసం కేంద్రం పెట్టడంతో వాటికి మంచి జరుగతది. చెరువులు, కుంటల్ల నీళ్లు లేవు. రోజు గట్ల వైపు తిరిగి మేపినా గ్రాసం దొరుకతలేదు. అందుకే ఇక్కడికి బర్రెలు, ఆవుల్ని తోలుకొచ్చిన. - మల్లయ్య, సిర్గాపూర్ బతికించుకుంటాం కరువులో నాలా చాలా మంది రైతులు పశువులను కాపాడుకునేందు కు చాలా ఇబ్బందులు ప డుతున్నరు. నల్లవాగులోని కేంద్రంలో పశువులు తీసుకొచ్చిన. పశువులను బతికించకుంటాం. - రాజు, ముబారక్పూర్ సరిపడా స్టాక్ పునరావాస కేంద్రంలో పశువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సకల వసతులు కల్పించాం. ఎండుగడ్డి, దాణా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే సరిపడా స్టాక్ ఉంది. - లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ -
మానవత్వం చెంతన.. మనోచేతన
110 మంది మానసిక వికలాంగులకు బాసట యోగా, కుట్లు, అల్లికల్లో శిక్షణ చుక్కా వెంకటేశ్వర్లు సేవానిరతి నేడు ప్రపంచ బుద్ధిమాంద్యం దినం జనగామ : అందరిలా నడవలేరు.. ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడలేరు.. తమ అవసరాలను తా ము తీర్చుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు మానసిక వికలాంగులు. ఇటువంటి వా రికి సాయం చేయూలనే దయూర్ద హృదయం చుక్కా వెంకటేశ్వర్లుది. ‘ప్రార్థించేపెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అంటారు పెద్దలు. దీన్ని అక్షరా లా నిజంచేసి చూపారాయన. చేర్యాలలో ‘మనో చేతన’ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రా న్ని నెలకొల్పి బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు చేదోడుగా నిలుస్తున్న యువ కెరటంపై ‘నేటి ప్రపం చ బుద్ధి మాంద్యం దినం’ సందర్భంగా కథనమిది. 1998 సంవత్సరానికి ముందువరకు చుక్కా వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వికలాంగుల సంక్షేమ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేటర్ పర్సన్ పనిచేసేవారు. పరిమిత పరిధి కలిగిన ఉద్యోగ జీవితం కంటే.. పది మందికి సాయం చేసి, దీవెనలు పొందే అవకాశాన్ని కల్పించే సమాజ సేవ మేలని భావించేవారు వెంకటేశ్వర్లు. అనుకున్నదే తడవుగా కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తన స్వస్థలమైన చేర్యాలకు చేరుకొని 1998లో ‘మనో చేతన’ పేరుతో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక అనారోగ్యంతో దీనస్థితిలో ఉన్న బాల,బాలికలను చేరదీసి, లాభాపేక్ష లేకుండా ఎంతో ఓపికతో సేవలు అందించారు. అమ్మలా లాలన.. నాన్నలా ప్రేమను పంచారు. ఈ ఏడాది(2016)తో ‘మనో చేతన’ సంస్థ 18వ పడిలోకి విజయవంతంగా అడుగుపెడుతోంది. ప్రస్తుతం 110 మంది మానసిక వికలాంగులు ఇందులో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. యోగాలోనూ బాలలకు శిక్షణ అందిస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవారికి కుట్లు, అల్లికల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు వెంకటేశ్వర్లు. ఈ సేవలకుగానూ రాష్ట్ర, జాతీయ స్థారుు అవార్డులు ఆయనను వరించారుు. డౌన్ సిండ్రోమ్ లక్షణాలివీ.. బుద్ధిమాంద్యాన్ని ఆంగ్లంలో డౌన్ సిండ్రోమ్ అంటారు. ఈ అనారోగ్య సమస్యను కలిగిన పిల్లలు భౌతికంగా మంగోలియన్ జాతి లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం జన్మించే వందలాది మంది శిశువుల్లో ఒక్కరిద్దరే ఇటువంటి సమస్యను కలిగి ఉండే అవకాశాలు ఉన్నారుు. ఇది జన్యు సంబంధమైన అసాధారణ అనారోగ్య పరిస్థితే కానీ వంశపారంపర్యంగా వచ్చేది మాత్రం కాదు. మనోచేతన పునరావాస కేంద్రంలో వారికి యోగా నేర్పిస్తున్నారు. కుట్లు, అల్లికల్లోనూ బాలలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇతరులకు సాయం చేయడంలోనే సంతోషం మానసిక వికలాంగులకు అండగా ఉండాలనే నా లక్ష్యాన్ని ‘మనోచేతన’ స్థాపించడం ద్వారా నెరవేర్చుకున్నా. తాము ఏం చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో ఉన్న బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు సాయం చేయడంలో ఉన్న సంతోషం నాకు ఎక్కడా కనిపించలేదు. వారికి మానసిక స్థితిని వృద్ధిపర్చే బాధ్యత మా కేంద్రానిదే. పాటల పోటీలు నిర్వహించడం, యోగా శిక్షణ అందించడం, కుట్లు, అల్లికలు నేర్పడం ద్వారా వారిని చైతన్యపరుస్తున్నాం. భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేందుకు ఇవి వారికి ఎంతో ఉపయోగపడతారుు. - చుక్కా వెంకటేశ్వర్లు, మనోచేతన నిర్వాహకుడు