కొత్తూరు మండలంలోని పాడలి పునరావాస కాలనీ
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): లక్షలాది మంది ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉగాది పండగ రాకతో కన్న ఊరును తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదివరకు ఉగాది రోజు సాంప్రదాయబద్ధంగా పొలాల్లో మొదటి ఏరుపూసి, పంటలు బాగా పండాలని భూదేవికి పూజలు చేసేవారు. కానీ ప్రస్తుతం కన్న ఊరు, పంట పొలాలను విడిచి పునరావాస కాలనీకి రావడంతో గుండెల్లో బాధతో ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు. మన అనే వాళ్లందరితో మమేకవుతూ జరుపుకునే పండగను ఒంటరిగా జరుపుకుంటున్నామని కుంగిపోతున్నారు. మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం 19 నిర్వాసిత గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది.
దీంతో ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు సొంత ఊరును, పంట పొలాలను వదులుకొని కొత్తూరు, హిరమండలం, ఎఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలి వచ్చారు. అయితే పునరావాస కాలనీకి వారు వచ్చిన తర్వాత మొదటిసారి ఉగాది పండగ వస్తోంది. దీంతో ఏరు పూసేందుకు సొంత భూములను లేకపోవడంతో గతం గుర్తు చేసుకుంటూ గుండెను రాయి చేసుకుంటున్నారు నిర్వాసితులు. నిజానికి వీరిలో చాలామందికి భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీచేసి పునరావాస కాలనీలకు వచ్చారు. దీంతో సాంప్రదాయాన్ని వీడలేక ఇంటి ముందరనే బంగారు ఉంగరాలతో భూమిపై గీటువేసి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
బంధం తెగిపోయింది
భూములతో తరాలు నుంచి బంధం తెగిపోయింది. ఉగాది పండగకు మొదటి ఏరు పూసి ఉగాది పండగను చేసుకోవడం అనవాయితీ. కానీ గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో తరాలు నుంచి వస్తున్న భూములు లేక ఎంతో బాధగా ఉంది.
- బి.రామకృష్ణ, పాడలి గ్రామం, నిర్వాసితుడు
కన్నీరు వస్తోంది
ఇదివరకు తాతలు నుంచి వస్తున్న భూముల్లో ఉగాది రోజు మొదటి ఏరు పూసి భూదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నిర్వాసిత గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో సెంటు భూమి లేక ఉగాది పండగ అనగానే కన్నీరు వస్తోంది.
- పి. శేషగిరి, నిర్వాసితుడు, ఇరపాడు, పునరావాస కాలనీ
Comments
Please login to add a commentAdd a comment