vamshadhara
-
అదుపుతప్పి బ్యారేజీలో పడిపోయిన కారు
-
అదుపు తప్పిన కారు; ఇద్దరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.వివరాలు.. విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్ ఎస్ వి పవన్ (32), బి. చంద్ర (45) పాటు మరో ముగ్గురు కలిసి ఒడిశాలోని గజపతి జిల్లా సెంచూరియన్ యునివర్సిటీలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ నిమ్మిత్తం వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత కారులో తిరిగి వస్తున్న క్రమంలో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కాగా మృతి చెందిన పవన్ స్వస్థలం కాకినాడ, చంద్రది ఖమ్మం జిల్లా అని తెలిసింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు
సాక్షి, ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను వంశధార ట్రిబ్యునల్ సోమవారం తోసిపుచ్చింది. గతంలో నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆర్డర్లో మార్పలు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను సిద్ధం చేయాలని, సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకత్వంపై నివేధిక చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించి తదుపరి విచారణను జనవరి 10వ తేదికి వాయిదా వేసింది. -
తలపుల్లో ఊరు.. బతుకుల్లో కన్నీరు..
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): లక్షలాది మంది ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉగాది పండగ రాకతో కన్న ఊరును తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదివరకు ఉగాది రోజు సాంప్రదాయబద్ధంగా పొలాల్లో మొదటి ఏరుపూసి, పంటలు బాగా పండాలని భూదేవికి పూజలు చేసేవారు. కానీ ప్రస్తుతం కన్న ఊరు, పంట పొలాలను విడిచి పునరావాస కాలనీకి రావడంతో గుండెల్లో బాధతో ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు. మన అనే వాళ్లందరితో మమేకవుతూ జరుపుకునే పండగను ఒంటరిగా జరుపుకుంటున్నామని కుంగిపోతున్నారు. మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం 19 నిర్వాసిత గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు సొంత ఊరును, పంట పొలాలను వదులుకొని కొత్తూరు, హిరమండలం, ఎఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలి వచ్చారు. అయితే పునరావాస కాలనీకి వారు వచ్చిన తర్వాత మొదటిసారి ఉగాది పండగ వస్తోంది. దీంతో ఏరు పూసేందుకు సొంత భూములను లేకపోవడంతో గతం గుర్తు చేసుకుంటూ గుండెను రాయి చేసుకుంటున్నారు నిర్వాసితులు. నిజానికి వీరిలో చాలామందికి భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీచేసి పునరావాస కాలనీలకు వచ్చారు. దీంతో సాంప్రదాయాన్ని వీడలేక ఇంటి ముందరనే బంగారు ఉంగరాలతో భూమిపై గీటువేసి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బంధం తెగిపోయింది భూములతో తరాలు నుంచి బంధం తెగిపోయింది. ఉగాది పండగకు మొదటి ఏరు పూసి ఉగాది పండగను చేసుకోవడం అనవాయితీ. కానీ గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో తరాలు నుంచి వస్తున్న భూములు లేక ఎంతో బాధగా ఉంది. - బి.రామకృష్ణ, పాడలి గ్రామం, నిర్వాసితుడు కన్నీరు వస్తోంది ఇదివరకు తాతలు నుంచి వస్తున్న భూముల్లో ఉగాది రోజు మొదటి ఏరు పూసి భూదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నిర్వాసిత గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో సెంటు భూమి లేక ఉగాది పండగ అనగానే కన్నీరు వస్తోంది. - పి. శేషగిరి, నిర్వాసితుడు, ఇరపాడు, పునరావాస కాలనీ -
ఆగ్రహం!
హిరమండలం: వంశధార నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిపై దాడికి కారణమైంది. దుగ్గుపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు బుధవారం మండల తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. ప్యాకేజీ పరిహారం, యూత్‌ప్యాకేజీ చెల్లింపుల్లో అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు పెద్దపీట వేశారని ఆరోపిస్తూ మడపాన భాస్కరరావుతో పాటు సుమారు 40 మంది తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పరిహారం ఎలా చెల్లిస్తారంటూ తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్‌ను నిలదీశారు. గ్రామానికి సంబంధించి సుమారు 35 ఎకరాల డీ పట్టా భూములకు నష్టపరిహారం ఇవ్వవలసి ఉన్నా ఇంతవరకు ఎందుకూ ఇవ్వలేదని, యూత్‌ప్యాకేజీలో అర్హులకు అన్యాయం ఎలా జరిగిందని ప్రశ్నించారు. తాజాగా కూడా కొంతమంది అనర్హులకు ప్యాకేజీ చెక్కులు పంపిణీ చేశారని, కొంత మంది వృద్ధులకు ఆప్ ప్యాకేజీ పేరుతో పెంపింగ్ ఉంచారని.. ఆ విషయాన్ని ఆరు నెలలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని, వృద్ధులు చనిపోయే స్థితిలో ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్, నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. సహనం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులు తహసీల్దర్ కాళీప్రసాద్‌పై దాడికి పాల్పడి పిడిగుద్దులు గుదా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయలంలో ఉన్న రికార్డులు, బళ్లలు చెల్లా చెదురయ్యాయి. ఒక్కసారిగా కేకలు వినబడటంతో రెవెన్యూ సిబ్బంది ఉలిక్కపడి అక్కడకు చేరుకొని ఆందోళనకారుల నుంచి తహసీల్దార్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించి.. గాయపడిన తహసీల్దార్‌ను హిరమండలం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యాధికారి నీలిమ చికిత్సను అందించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ పనసారెడ్డి తన వాహనంలో తీసుకొని శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పాతపట్నం సీఐ ప్రకాష్, సారవకోట ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల కేంద్రంలో బందోబస్తు నిర్వహించారు. కాగా గాయపడిన తహసీల్దార్ కాళీప్రసాద్‌ను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ హిరమండలం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న సమయంలో పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సీఐ ప్రకాశరావును క ఆదేశించారు. నిర్వాసితులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు వచ్చినట్లైతే పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. తహసీల్దార్‌పై దాడులు అమానుషం జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు పి.వేణుగోపాలరావు గాయపడిన తహసీల్దార్ కాళీప్రసాద్‌ను పరామర్శించారు. విధుల్లో ఉన్న అధికారులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను అభ్యర్ధించారు. ఆయన వెంట సరుబుజ్జిలి, భామిని, ఎల్‌ఎన్‌పేట, మండలాల తహసీల్దార్లు ఉన్నారు. ప్రణాళిక ప్రకారమే... దుగ్గుపురం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు తహసీల్దార్ కాళీప్రసాద్ పై దాడికి వ్యూహత్మకంగానే వచ్చారని కార్యాలయానికి వచ్చారని పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి అన్నారు. తనను హత్య చేసేందుకు వచ్చారని తహసీల్దార్ ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరితో పాటు మరో 30 మంది దాడికి పాల్పడిన వారున్నారని.. వారిని గుర్తిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికా రి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి 307, 332, 452 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఏడుగురి అరెస్టు తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన సంఘటనలో దుగ్గుపురం గ్రామానికి చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బీఎస్ ప్రకాష్ తెలిపారు. మడపాన భాస్కరరావు, జావాన మోహన్‌రావు, కాత బుడ్డు, చింతాడ దండాసి, చింతాడ కాంతారావు, చింతాడ రామారావు, లోతుగడ్డ లక్ష్మణరావు లను అరెస్టు చేశామని, గురువారం పాతపట్నం కోర్టులో హజరు పరుస్తామన్నారు. ‘నిర్వాసితులకు న్యాయం చేయాలి’ వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించలేదని, వారికి న్యాయంచేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ కాళీప్రసాద్‌పై దాడిని ఖండించారు. నిర్వాసిత గ్రామాల్లో పూర్తిస్థాయిలో.. సక్రమంగా పరిహార ప్యాకేజీలు చెల్లిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవికాదన్నారు. రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లకు, లంచాలకు తలొగ్గి అధికారులు అనర్హులకు ప్యాకేజీలు చెల్లించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్యాకేజీ, పరిహార పంపిణీలపై జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు. -
కరకట్టలపై కట్టుకథలా?
ఇంజినీర్ల తీరుపై మంత్రి, ఎమ్మెల్యేలు అసంతృప్తి కాంట్రాక్టర్‌కు ఇంజినీర్లు వత్తాసు పలుకుతున్నారని మండిపాటు వాడీవేడిగా నీటి అభివృద్ధి మండలి సమావేశం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా వరద ముంపు లేకుండా చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా కరకట్టలు నిర్మాణం చేపట్టలేకపోయారు. దీనికితోడు ఇంజినీర్లు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ పనుల్లో జాప్యం చేస్తున్నారు. ధరల పెంపు ఆశతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం సాగుతోంది. సిగ్గులేకుండా తప్పుడు వివరాలు చెబుతూ నాలుగుసార్లు పొడిగింపు ఇచ్చామని ఇంజినీర్లు చెప్పడం దురదృష్టకరమని మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు శాసనసభ్యులు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటి అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం జరిగింది. వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు. \శ్రీకాకుళం : నీటి అభివృద్ధి మండలి సమావేశంలో సభ్యులంతా ఇంజినీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2007లో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో.. మూడు పెద్ద కంపెనీలకు పనులను కేటాయించింది. పనుల జాప్యానికి ఏదోఒక కథను ఇంజినీరింగ్ అధికారులు సృష్టిస్తూ ముందుకు సాగనీయడం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సమావేశంలో చర్చ ఆరంభం కాగానే పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ మంత్రిగారూ మీ ప్రభుత్వం వచ్చిన తరువాత వరదలు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం, వచ్చి ఉంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో తెలిసేవన్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కలుగజేసుకొని 2007లో శంకుస్థాపన జరిగితే ఇంతవరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరకట్టలు ఎక్కడ కడుతున్నారో, ఎంతవరకు వాటినిన పూర్తి చేశారో వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 263 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండంగా కేవలం 70 ఎకరాల భూసేకరణ మాత్రమే పూర్తయిందని చెప్పడంతో అక్కడే ఉన్న భూసేకరణ అధికారిని మంత్రి వివరాలు అడిగారు. ఎక్కడ భూములు కావాలో చెప్పకుండా భూ యజమానులు సహకరించడం లేదని చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్.శర్మ అధికారులను నిలదీశారు. కరకట్ట నిర్మించే స్థలం, నదీ ప్రవాహం ఉన్న స్థలం మధ్య జిరాయితీ భూములు ఉన్నాయని, వాటికి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకునే ప్రయత్నం మంచిది కాదని విప్ కూన రవికుమార్ అభిప్రాయపడ్డారు. వంశధార పరిధిలో రామ్కీ గ్రూప్ కేవలం 5 శాతం పనులు చేస్తే కాంట్రాక్టర్‌ను ఎందుకు రదు ్దచేయలేదని ఎమ్మెల్యే కలమట ప్రశ్నించారు. ఈ సీజన్లోనైనా గండ్లు పడిన ప్రాంతాల్లో తక్షణమే పనులు చేపట్టాలని అభ్యర్థించారు. భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు: కలమట మీరు పట్టించుకోకపోతే నిర్వాసిత గ్రామాలైన పాడలి, దుగ్గుపురం ప్రాంతాలకు భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కలమట మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. తాత్కాలికంగా రోడ్లపై మరమ్మతులైనా చేపట్టాలని కోరారు. వేసవిలో కుడి,ఎడమ కాల్వలకు మరమ్మతులు వంశధార ప్రాజెక్టు పరిధిలో రానున్న ఖరీఫ్‌కు సాగునీరు అందాలంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు వేసవిలోనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిధులు విడుదల చేస్తున్నామని, పనులు చేయడంలో జాప్యం వల్ల గత ఏడాది శివారు భూములకు నీరందించలేకపోయామని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎడమ కాలువ ఆదునీకరణకు రూ. 460 కోట్లు ప్రతిపాదనలు పంపించామని ఎస్ఈ అప్పలనాయుడు వివరించారు. నీరు-చెట్టు కింద 1600 పనులు కాల్వ మరమ్మతులకు ప్రతిపాదించామన్నారు. పురుషోత్తపురం-యరగాం భైరిదేశిగెడ్డ ఓపెన్ హెడ్ చానల్స్ మరమ్మతులకు రూ. 6.6 కోట్లు మంజూరైందని, నెలరోజుల్లో పనులు మొదలవుతాయని చెప్పుకొచ్చారు. వంశధార ఫేజ్-1, స్టేజ్-2 పరిధిలో రూ. 209 కోట్లు మంజూరైతే రూ. 146 కోట్లు ఖర్చుచేసి మిగిలిన నిధులతో పనులు చేపట్టకుండా వదిలేశారని విప్ రవికుమార్ ప్రస్తావించారు. ఇసుక దుమారం: మంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టిన విప్ జిల్లాలో కొంతకాలంగా ఇసుక నిర్వహణ లోపాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని, ఈ-వేలంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని విప్ రవికుమార్ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిల్లా అధికారులు ఇంజినీరింగ్ పనులకు ఇసుకను కేటాయించడాన్ని తప్పుపట్టారు. దీంతో ఆ నిర్ణయం తనదేనని మంత్రి అచ్చెన్నాయుడు సభలో చెప్పలేక విప్ రవికుమార్ విమర్శలపై మౌనం వహించారు. ఇటీవల ఇసుక ర్యాంపులను నేరుగా ఇంజినీర్లు పర్యవేక్షించి ఇసుకను తరలించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మౌకిక ఆదేశాలిచ్చారు. పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివి అన్న మీమాంస టీడీపీ వర్గాల్లో నెలకొంది. అయితే కేవలం ఇది అధికారులు తీసుకున్న నిర్ణయంగా ఖలవించిన విప్ ఇదేమి ఇసుక విధానం అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న కలెక్టర్ పి.ల క్ష్మీనృసింహం సమాధానం చెప్పలేక కాగితంపై ఈ నిర్ణయం ఎలా జరిగింది అన్న అంశాన్ని విప్‌కు అందించారు. మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితుల్లో కేవలం 12 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారని, మిగిలిన వారికి ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి కోరారు. ఆ రహస్యమేమిటి? నీటి పారుదల శాఖ పరిధిలో అసలేం జరుగుతోంది. వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి విచ్చలవిడిగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ శాఖ పరిధిలో వచ్చిన నిధులు కేవలం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అసలు పాలకొండ డివిజన్ ఈ జిల్లాలో ఉందా అని ప్రశ్నించారు. కడగండి రిజర్వాయర్‌కు, పనసనందివాడ, అన్నవరం, గోపాలపురం ముంపు గ్రామాలకు రక్షణ గోడల నిర్మాణం, ఓనిగెడ్డ, కొండలోయగెడ్డ, కడగండి రిజర్వాయర్, జంఝావతి, దామోదరసాగర్, జంపరకోట, కుంబిడివాగు మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. సుంగిడి సాగరాన్ని మినీ రిజర్వాయర్‌గా మార్చాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ విజ్ఞప్తి చేశారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ వీరఘట్టం పరిధిలో ఓటరు కాని రైతులకు టీసీలుగా ఎలా అవకాశం కల్పించారని ఈఈ రవీంద్రను ప్రశ్నించారు. ఎస్ఎంఐ డివిజన్లో అవినీతి పరాకాష్ట చిన్న తరహా నీటి పారుదల శాఖ పరిధిలో 2006 నుంచి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, గిరిజనుల సొమ్ము పనులు చేయకుండా ఇంజినీరింగ్ అధికారులు కొందరు గిరిజనేతరులు దోచుకున్నారని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. 2011 నుంచి 313 పనుల్లో అక్రమాలను గుర్తించడానికి విచారణ బృందాలు ఏర్పాటు చేశారని, విచారణ నివేదిక వచ్చిన తరువాత అవినీతి రుజువైతే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనల క్ష్మి, వంశధార ఎస్ఈ అప్పలనాయుడు, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్వీ రమణ, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు జి.లక్ష్మీదేవి, బి.రమణమూర్తి పాల్గొన్నారు. మీరు తప్పు చేసి నిర్వాసితులపై ఆరోపణలా? వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు. పదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా పనులు మధ్యలోనే నిలిపివేయడమే కాకుండా నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి అచ్చెన్న జోక్యం చేసుకొని గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని, అవసరం లేకపోయినా వారి అనుచరులకు రూ. కోట్లు ఇచ్చి ఇప్పుడు రికార్డులు లేకుండా చేశారని ఆరోపించారు. అందుకే వారం రోజుల్లో నిర్వాసితులందరినీ ఒకచోటుకు పిలిచి వారితో నేరుగా సంప్రదింపులు జరపడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కలమట, ఎమ్మెల్సీ శర్మలు హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ పోలవరం, గుంటూరు తరహాలో నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో ఉంటున్న నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎమ్మెల్యే కలమట అన్నారు. గ్రోయిన్లకు భూసేకరణ అవసరమా: విప్ నది బయట కట్టే కరకట్టలకు కథలు చెబుతున్నారు. మరి నదిలో నిర్మించాల్సిన గ్రోయిన్ల సంగతేంటని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. 43 గ్రోయిన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం రెండు మాత్రమే పూర్తి చేశారని, అటువంటి కాంట్రాక్టర్లను ఎందుకు క్షమిస్తున్నారన్నారు. ధరల పెరుగుదలను ఎస్ఈ ప్రస్తావించడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. తోటపల్లి పనులు వేగవంతం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 115 కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తయిందని, నాలుగు బ్రాంచి కెనాల్, 125 డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం సాగుతోందని ఎస్ఈ డోల తిరుమలరావు చెప్పారు. నిధులు పుష్కలంగా ఉన్నాయని, భూసేకరణకు అడ్డంకులు ఉండడంతో కొన్నిచోట్ల పనులకు ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. రాజాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ 2008లో భూసేకరణ జరిగితే రెండు మండలాల్లోని రైతులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని, తక్షణవే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
వంశధారకు తగ్గిన వరద
హీరాం(శ్రీకాకుళం): ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టటంతో వంశధారకు వరద తగ్గిందని గొట్టా బ్యారేజీ డీఈ ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి 18,514 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీలో పూర్తి సామర్ధ్యం 38.10 మీటర్లకు మించి ఉన్న నీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.