కరకట్టలపై కట్టుకథలా?
Published Mon, Feb 22 2016 8:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM
ఇంజినీర్ల తీరుపై మంత్రి, ఎమ్మెల్యేలు అసంతృప్తి
కాంట్రాక్టర్‌కు ఇంజినీర్లు వత్తాసు పలుకుతున్నారని మండిపాటు
వాడీవేడిగా నీటి అభివృద్ధి మండలి సమావేశం
జిల్లాలో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా వరద ముంపు లేకుండా చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా కరకట్టలు నిర్మాణం చేపట్టలేకపోయారు. దీనికితోడు ఇంజినీర్లు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ పనుల్లో జాప్యం చేస్తున్నారు. ధరల పెంపు ఆశతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం సాగుతోంది. సిగ్గులేకుండా తప్పుడు వివరాలు చెబుతూ నాలుగుసార్లు పొడిగింపు ఇచ్చామని ఇంజినీర్లు చెప్పడం దురదృష్టకరమని మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు శాసనసభ్యులు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటి అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం జరిగింది. వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు.
\శ్రీకాకుళం : నీటి అభివృద్ధి మండలి సమావేశంలో సభ్యులంతా ఇంజినీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2007లో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో.. మూడు పెద్ద కంపెనీలకు పనులను కేటాయించింది. పనుల జాప్యానికి ఏదోఒక కథను ఇంజినీరింగ్ అధికారులు సృష్టిస్తూ ముందుకు సాగనీయడం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సమావేశంలో చర్చ ఆరంభం కాగానే పాతపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ మంత్రిగారూ మీ ప్రభుత్వం వచ్చిన తరువాత వరదలు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం, వచ్చి ఉంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో తెలిసేవన్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కలుగజేసుకొని 2007లో శంకుస్థాపన జరిగితే ఇంతవరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరకట్టలు ఎక్కడ కడుతున్నారో, ఎంతవరకు వాటినిన పూర్తి చేశారో వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 263 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండంగా కేవలం 70 ఎకరాల భూసేకరణ మాత్రమే పూర్తయిందని చెప్పడంతో అక్కడే ఉన్న భూసేకరణ అధికారిని మంత్రి వివరాలు అడిగారు. ఎక్కడ భూములు కావాలో చెప్పకుండా భూ యజమానులు సహకరించడం లేదని చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్.శర్మ అధికారులను నిలదీశారు. కరకట్ట నిర్మించే స్థలం, నదీ ప్రవాహం ఉన్న స్థలం మధ్య జిరాయితీ భూములు ఉన్నాయని, వాటికి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకునే ప్రయత్నం మంచిది కాదని విప్ కూన రవికుమార్ అభిప్రాయపడ్డారు. వంశధార పరిధిలో రామ్‌కీ గ్రూప్ కేవలం 5 శాతం పనులు చేస్తే కాంట్రాక్టర్‌ను ఎందుకు రదు ్దచేయలేదని ఎమ్మెల్యే కలమట ప్రశ్నించారు. ఈ సీజన్‌లోనైనా గండ్లు పడిన ప్రాంతాల్లో తక్షణమే పనులు చేపట్టాలని అభ్యర్థించారు.
భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు: కలమట
మీరు పట్టించుకోకపోతే నిర్వాసిత గ్రామాలైన పాడలి, దుగ్గుపురం ప్రాంతాలకు భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కలమట మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. తాత్కాలికంగా రోడ్లపై మరమ్మతులైనా చేపట్టాలని కోరారు.
వేసవిలో కుడి,ఎడమ కాల్వలకు మరమ్మతులు
వంశధార ప్రాజెక్టు పరిధిలో రానున్న ఖరీఫ్‌కు సాగునీరు అందాలంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు వేసవిలోనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిధులు విడుదల చేస్తున్నామని, పనులు చేయడంలో జాప్యం వల్ల గత ఏడాది శివారు భూములకు నీరందించలేకపోయామని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎడమ కాలువ ఆదునీకరణకు రూ. 460 కోట్లు ప్రతిపాదనలు పంపించామని ఎస్‌ఈ అప్పలనాయుడు వివరించారు. నీరు-చెట్టు కింద 1600 పనులు కాల్వ మరమ్మతులకు ప్రతిపాదించామన్నారు. పురుషోత్తపురం-యరగాం భైరిదేశిగెడ్డ ఓపెన్ హెడ్ చానల్స్ మరమ్మతులకు రూ. 6.6 కోట్లు మంజూరైందని, నెలరోజుల్లో పనులు మొదలవుతాయని చెప్పుకొచ్చారు. వంశధార ఫేజ్-1, స్టేజ్-2 పరిధిలో రూ. 209 కోట్లు మంజూరైతే రూ. 146 కోట్లు ఖర్చుచేసి మిగిలిన నిధులతో పనులు చేపట్టకుండా వదిలేశారని విప్ రవికుమార్ ప్రస్తావించారు.
ఇసుక దుమారం: మంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టిన విప్
జిల్లాలో కొంతకాలంగా ఇసుక నిర్వహణ లోపాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని, ఈ-వేలంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని విప్ రవికుమార్ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిల్లా అధికారులు ఇంజినీరింగ్ పనులకు ఇసుకను కేటాయించడాన్ని తప్పుపట్టారు. దీంతో ఆ నిర్ణయం తనదేనని మంత్రి అచ్చెన్నాయుడు సభలో చెప్పలేక విప్ రవికుమార్ విమర్శలపై మౌనం వహించారు. ఇటీవల ఇసుక ర్యాంపులను నేరుగా ఇంజినీర్లు పర్యవేక్షించి ఇసుకను తరలించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మౌకిక ఆదేశాలిచ్చారు. పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివి అన్న మీమాంస టీడీపీ వర్గాల్లో నెలకొంది. అయితే కేవలం ఇది అధికారులు తీసుకున్న నిర్ణయంగా ఖలవించిన విప్ ఇదేమి ఇసుక విధానం అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న కలెక్టర్ పి.ల క్ష్మీనృసింహం సమాధానం చెప్పలేక కాగితంపై ఈ నిర్ణయం ఎలా జరిగింది అన్న అంశాన్ని విప్‌కు అందించారు. మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితుల్లో కేవలం 12 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారని, మిగిలిన వారికి ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి కోరారు.
ఆ రహస్యమేమిటి?
నీటి పారుదల శాఖ పరిధిలో అసలేం జరుగుతోంది. వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి విచ్చలవిడిగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ శాఖ పరిధిలో వచ్చిన నిధులు కేవలం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అసలు పాలకొండ డివిజన్ ఈ జిల్లాలో ఉందా అని ప్రశ్నించారు. కడగండి రిజర్వాయర్‌కు, పనసనందివాడ, అన్నవరం, గోపాలపురం ముంపు గ్రామాలకు రక్షణ గోడల నిర్మాణం, ఓనిగెడ్డ, కొండలోయగెడ్డ, కడగండి రిజర్వాయర్, జంఝావతి, దామోదరసాగర్, జంపరకోట, కుంబిడివాగు మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. సుంగిడి సాగరాన్ని మినీ రిజర్వాయర్‌గా మార్చాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ విజ్ఞప్తి చేశారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ వీరఘట్టం పరిధిలో ఓటరు కాని రైతులకు టీసీలుగా ఎలా అవకాశం కల్పించారని ఈఈ రవీంద్రను ప్రశ్నించారు.
ఎస్‌ఎంఐ డివిజన్‌లో అవినీతి పరాకాష్ట
చిన్న తరహా నీటి పారుదల శాఖ పరిధిలో 2006 నుంచి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, గిరిజనుల సొమ్ము పనులు చేయకుండా ఇంజినీరింగ్ అధికారులు కొందరు గిరిజనేతరులు దోచుకున్నారని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. 2011 నుంచి 313 పనుల్లో అక్రమాలను గుర్తించడానికి విచారణ బృందాలు ఏర్పాటు చేశారని, విచారణ నివేదిక వచ్చిన తరువాత అవినీతి రుజువైతే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనల క్ష్మి, వంశధార ఎస్‌ఈ అప్పలనాయుడు, జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎస్‌వీ రమణ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు జి.లక్ష్మీదేవి, బి.రమణమూర్తి పాల్గొన్నారు.
మీరు తప్పు చేసి నిర్వాసితులపై ఆరోపణలా?
వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు. పదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా పనులు మధ్యలోనే నిలిపివేయడమే కాకుండా నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి అచ్చెన్న జోక్యం చేసుకొని గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని, అవసరం లేకపోయినా వారి అనుచరులకు రూ. కోట్లు ఇచ్చి ఇప్పుడు రికార్డులు లేకుండా చేశారని ఆరోపించారు. అందుకే వారం రోజుల్లో నిర్వాసితులందరినీ ఒకచోటుకు పిలిచి వారితో నేరుగా సంప్రదింపులు జరపడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కలమట, ఎమ్మెల్సీ శర్మలు హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ పోలవరం, గుంటూరు తరహాలో నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో ఉంటున్న నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎమ్మెల్యే కలమట అన్నారు.
గ్రోయిన్లకు భూసేకరణ అవసరమా: విప్
నది బయట కట్టే కరకట్టలకు కథలు చెబుతున్నారు. మరి నదిలో నిర్మించాల్సిన గ్రోయిన్ల సంగతేంటని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. 43 గ్రోయిన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం రెండు మాత్రమే పూర్తి చేశారని, అటువంటి కాంట్రాక్టర్లను ఎందుకు క్షమిస్తున్నారన్నారు. ధరల పెరుగుదలను ఎస్‌ఈ ప్రస్తావించడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.
తోటపల్లి పనులు వేగవంతం
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 115 కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తయిందని, నాలుగు బ్రాంచి కెనాల్, 125 డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం సాగుతోందని ఎస్‌ఈ డోల తిరుమలరావు చెప్పారు. నిధులు పుష్కలంగా ఉన్నాయని, భూసేకరణకు అడ్డంకులు ఉండడంతో కొన్నిచోట్ల పనులకు ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. రాజాం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ 2008లో భూసేకరణ జరిగితే రెండు మండలాల్లోని రైతులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని, తక్షణవే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement