nagavali
-
గొర్రెలకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏ జీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొందలకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయలసీమ ప్రాంతవాసులు తాము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొనాల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి. కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్ నగర్ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి. నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. యుద్ధాలు చేసిన గొర్రెలివి నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి. ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కీలక ముందడుగు నాగావళి, మాచర్ల గొర్రె జాతులకు గుర్తింపు లభించడం ఏపీ పశు గణాభివృద్ధిలో కీలకమైన ముందడుగు. 15 ఏళ్లుగా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు, అధ్యయనం ఎట్టకేలకు ఫలించాయి. గుర్తింపుతో ఈ జాతుల పరిరక్షణకు పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయి. – డాక్టర్ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్, ఎస్వీవీ విశ్వవిద్యాలయం -
జసిత్ కిడ్నాప్ కేసును ఛేదిస్తాం: ఎస్పీ
సాక్షి, కాకినాడ: కిడ్నాప్‌కు గురైన జసిత్ ఆచూకీ కోసం ఏడు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం హస్మీ మంగళవారం బాలుడు కిడ్నాప్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జసిత్ తండ్రి వెంకటరమణను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేశామని, ఆర్థిక లావాదేవీలు కూడా కిడ్నాప్‌కు కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కచ్చితంగా చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదిస్తామన్న నమ్మకం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్స్ రాలేదని, కిడ్నాప్‌కు ముందే రెక్కి నిర్వహించి ఉంటారని అమామానిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చదవండి: కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్ -
పొన్నాడ ప్రాంతంలో శవమై తేలిన లక్కీ
మూడు రోజుల తరువాత వీడిన ఉత్కంఠ నిరుపేద కుటుంబంలో తీరని ఆవేదన శోక సంద్రంలో తల్లిదండ్రులుచ బంధువులు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : స్నేహితులతో కలిసి ఆటలు ఆడిన తరువాత ఉత్సహంగా గెంతులేసేందుకు నాగావళి నదికి స్నానానికి వెళ్లిన లక్ష్మణ్‌కుమార్ అలియాస్ లక్కీ చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో లక్కీ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలోకి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే....పట్టణంలోని తురాయి చెట్టువీధికి చెందిన లక్కీ ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం నాగావళి నది పరివాహాక ప్రాంతంలో వెతగ్గా మంగళవారం ఉదయం 10గంటలకు మండలంలోని పొన్నాడ ప్రాంతంలో గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులు, స్థానికులు, గజఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది క్షణం తీరిక లేకుండా వెతికారు. చివరికి మంగళవారం ఉదయం 10 గంటలకు పొన్నాడ రేవులో శవమై తేలాడు. 48గంటల తరువాత శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బంధువులంతా గుండెలవిసేలా విలపించారు. లక్కీ మృతదేహం చూసిన ప్రతి ఒక్కరూ దుఃఖాన్ని దిగమింగుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం అక్కడకు వచ్చిన వారికెవ్వరికీ సాధ్యపడలేదు. కోటి దేవుళ్లకు మొక్కినా తమ కొడుకు తిరిగివస్తాడనుకున్న ఆశలు అడియాశగానే మిగిలిపోయాయంటూ బంధువులంతా ఆవేదన చెందారు. లక్కీ చిట్టి చెల్లెలు నిఖిత తన అన్నయ్యతో కల్సి ఆడుకునే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భోరున విలపించింది. లక్కీ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే లక్కీ మృతదేహం ఆచూకీ తెల్సిన వెంటనే ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి హుటాహుటినా పొన్నాడ ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక చర్యలకు ఆదేశిస్తూ లక్కీ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సంఘటన తెలిసిన ఎన్టిఆర్ ఎంహెచ్‌స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్కీ నివాసానికి చేరుకున్నారు. -
చీకట్లో నాగావళి వంతెన
నగరం నడిబొడ్డున నిర్మించిన రెండు భారీ వంతెనలను ఇటీవల ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే, వంతెనలపై పగటి పూట ప్రయాణం సౌకర్యంగా ఉన్నా రాత్రి ప్రయాణించాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషి ఫలితంగా వంతెనలు మంజూరు చేసిన విషయం విధితమే. వంతెనలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. వంతెనల నిర్మాణం ఎప్పుడో పూర్తయినా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని సాకుతో ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేసిన పాలకులు, ఇప్పుడు ఆ పనులు చేయకుండానే ప్రారంభించారు. ఇదే పని రెండు నెలల క్రితమే చేసి ఉంటే ప్రజలకు కొంత కష్టాలు తప్పేవని పలువురు చెబుతున్నారు. గుజరాతిపేటలో ఇటీవల నిర్వహించిన జగన్నాథ ఉత్సవాలకు సైతం నదిలో నుంచి నడుచుకొని వెళ్లవలసి వచ్చిందని, కొంత కాలం వంతెనపై అడ్డుగా ఇనుప రాడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారని, ఇవన్నీ ఎందుకు చేసినట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వంతెనలపై విద్యుత్ దీపాలు వేయించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మృత్యుంజయులు
• నాగావళిలో తప్పిన పడవ ప్రమాదం • గుర్రపు డెక్క చుట్టుకుని కొట్టుకుపోయిన నాటు పడవ • విద్యార్థుల హహాకారాలు • వంతెన ఫిల్లరు అడ్డడంతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు రంగారాయపురం(సంతకవిట ): నారాయణపురం ఆనకట్ట సమీపంలో రంగారాయపురం గ్రామం వద్ద శనివారం పడవ ప్రమాదం తృటిలో తప్పింది. వంతెన ఫిల్లరును తగిలి పడవ నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సంతకవిటì మండలం రంగారాయపురం గ్రామం నుంచి బూర్జ మండలం లాబాం వైపు వెళ్లేందుకు రోజూ ఇక్కడ నాగావళి నదిలో నాటుపడవను వేస్తుంటారు. ఇందులో భాగంగానే శనివారం కూడా పడవను నది దాటేందుకు వేశారు. రంగారాయపురం గ్రామం నుంచి పలువురు విద్యార్థులతో పాటు నదీతీర గ్రామాల ప్రజలు మొత్తం 14 మంది పడవ ఎక్కి నదిని దాటుతున్నారు. ఈ సమయంలో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో పాటు గుర్రపుడెక్కలు గుంపుగా వచ్చి పడవకు చుట్టేశాయి. వెంటనే పడవ అదుపుతప్పి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. పడవను నడిపే గన్నియ్య అప్పటికీ పడవను అదుపుచేసే ప్రయత్నం చేశాడు. మరో ఇద్దరు కర్రలతో ఆయనకు సాయమందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. కొద్దిదూరంలో కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన ఫిల్లరు అడ్డుగా ఉండడంతో అక్కడ వరకూ వెళ్లిన పడవ అక్కడ నిలిచిపోయింది. దీంతో పెద్దప్రమాదమే తప్పింది. ఫిల్లరు వద్ద నుంచి మెల్లగా పడవను నావికుడు గన్నియ్య ఒడ్డుకు చేర్చాడు. మిన్నంటిన హహాకారాలు ఈ పడవలో రంగారాయపురం, పోతులజగ్గుపేట, సంతకవిటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరంతా బూర్జ మండలం ఓవీ పేటలో మోడల్‌స్కూల్‌కు వెళుతున్నారు. నది మధ్యలో పడవ అదుపుతప్పడంతో వీరంతా ఒక్కసారిగా హహాకారాలు చేయడం ప్రారంభించారు. పడవలోని మిగిలిన ప్రయాణికులు వీరిని తొందరపడనీయకుండా ధైర్యం చెప్పడంతో ఓపిగ్గా పడవలో కదలకుండా కూర్చున్నారు. దీంతో పడవ బోల్తాపడకుండా నెమ్మదించింది. చివరకు వంతెన ఫిల్లరు వద్ద అడ్డంగా ఉండిపోవడంతో ప్రమాదం తప్పింది. బతుకుజీవుడా అంటూ ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే సంతకవిటి ఎస్ఐ తాతారావు. తహసీల్దార్ జి.సత్యనారాయణ తదితరులు సంఘటనా స్థలం వద్దకుచేరుకుని వివరాలు సేకరించారు. పడవను నడిపే వ్యక్తి గన్నియ్య నుంచి సమాచారం సేకరించారు. నదిలో పడవ నడప వద్దని హెచ్చరించారు. గుర్రపుడెక్కలు కారణంగానే పడవ అదుపుతప్పినట్టు నావికుడు అధికారులకు తెలిపాడు. కాపాడిన వంతెన ఫిల్లరు నారాయణపురం ఆనకట్టకు 300 మీటర్లు దూరంలో పోతులుజగ్గుపేట–నారాయణపురం గ్రామాల మధ్య నాగావళి నదిలో రూ. 37 కోట్లతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెనకు సంబంధించి ఫిల్లర్లు నిర్మాణం పూరై్తంది. ఈ వంతెన ఫిల్లర్లు కారణంగానే పడవ ప్రమాదం తప్పింది. లేకుంటే పడవ కొద్దిదూరం ప్రయాణించి ఉంటే బోల్తాపడి ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. -
నాగావళి పరవళ్లు
► పెరిగిన తోటపల్లి నీటిప్రవాహం గరుగుబిల్లి: అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లిప్రాజెక్టువద్ద నీటిప్రవాహం పెరిగింది. కొద్ది రోజులక్రితం ఒడిశాలో కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 104.2 మీటర్లకు చేరింది. ప్రస్తుతం పై భాగం నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 8,450 క్యూసెక్కులు వస్తోంది. ఈమేరకు అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి 9,056 క్యూసెక్కుల నీటిని నదిలో నుంచి విడిచిపెడుతున్నారు. అలాగే కుడి,ఎడమకాలువలద్వారా 900 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ప్రాజెక్టు డీఈ పాండు,ఏఈ శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీంసీలకుగాను 1.72 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలో వర్షం కురిస్తే నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నీటిప్రవాహం నిలకడగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
'నాగావళి, వంశధారనూ అనుసంధానం చేస్తాం'
ఏలూరు : కృష్ణా, పెన్నానదులు అనుసంధానానికి ఆలోచన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ఎడమకాల్వను ఏడాదిలోకాగా పూర్తి చేసి... సోమశిలకు నీటిని తరలిస్తామన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి చంద్రబాబు నీటిని విడుదల చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... 24 పంపులు, 12 పైప్లైన్ల ద్వారా పట్టిసీమ నుంచి నీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. మరో ఐదారు రోజుల్లో గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలుస్తాయని తెలిపారు. నాగావళి, వంశధార నదులనూ కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. -
కరకట్టలపై కట్టుకథలా?
ఇంజినీర్ల తీరుపై మంత్రి, ఎమ్మెల్యేలు అసంతృప్తి కాంట్రాక్టర్‌కు ఇంజినీర్లు వత్తాసు పలుకుతున్నారని మండిపాటు వాడీవేడిగా నీటి అభివృద్ధి మండలి సమావేశం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా వరద ముంపు లేకుండా చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా కరకట్టలు నిర్మాణం చేపట్టలేకపోయారు. దీనికితోడు ఇంజినీర్లు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ పనుల్లో జాప్యం చేస్తున్నారు. ధరల పెంపు ఆశతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం సాగుతోంది. సిగ్గులేకుండా తప్పుడు వివరాలు చెబుతూ నాలుగుసార్లు పొడిగింపు ఇచ్చామని ఇంజినీర్లు చెప్పడం దురదృష్టకరమని మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు శాసనసభ్యులు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటి అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం జరిగింది. వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు. \శ్రీకాకుళం : నీటి అభివృద్ధి మండలి సమావేశంలో సభ్యులంతా ఇంజినీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2007లో వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో.. మూడు పెద్ద కంపెనీలకు పనులను కేటాయించింది. పనుల జాప్యానికి ఏదోఒక కథను ఇంజినీరింగ్ అధికారులు సృష్టిస్తూ ముందుకు సాగనీయడం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సమావేశంలో చర్చ ఆరంభం కాగానే పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ మంత్రిగారూ మీ ప్రభుత్వం వచ్చిన తరువాత వరదలు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం, వచ్చి ఉంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో తెలిసేవన్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కలుగజేసుకొని 2007లో శంకుస్థాపన జరిగితే ఇంతవరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరకట్టలు ఎక్కడ కడుతున్నారో, ఎంతవరకు వాటినిన పూర్తి చేశారో వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 263 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండంగా కేవలం 70 ఎకరాల భూసేకరణ మాత్రమే పూర్తయిందని చెప్పడంతో అక్కడే ఉన్న భూసేకరణ అధికారిని మంత్రి వివరాలు అడిగారు. ఎక్కడ భూములు కావాలో చెప్పకుండా భూ యజమానులు సహకరించడం లేదని చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్.శర్మ అధికారులను నిలదీశారు. కరకట్ట నిర్మించే స్థలం, నదీ ప్రవాహం ఉన్న స్థలం మధ్య జిరాయితీ భూములు ఉన్నాయని, వాటికి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకునే ప్రయత్నం మంచిది కాదని విప్ కూన రవికుమార్ అభిప్రాయపడ్డారు. వంశధార పరిధిలో రామ్కీ గ్రూప్ కేవలం 5 శాతం పనులు చేస్తే కాంట్రాక్టర్‌ను ఎందుకు రదు ్దచేయలేదని ఎమ్మెల్యే కలమట ప్రశ్నించారు. ఈ సీజన్లోనైనా గండ్లు పడిన ప్రాంతాల్లో తక్షణమే పనులు చేపట్టాలని అభ్యర్థించారు. భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు: కలమట మీరు పట్టించుకోకపోతే నిర్వాసిత గ్రామాలైన పాడలి, దుగ్గుపురం ప్రాంతాలకు భిక్షమెత్తయినా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కలమట మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. తాత్కాలికంగా రోడ్లపై మరమ్మతులైనా చేపట్టాలని కోరారు. వేసవిలో కుడి,ఎడమ కాల్వలకు మరమ్మతులు వంశధార ప్రాజెక్టు పరిధిలో రానున్న ఖరీఫ్‌కు సాగునీరు అందాలంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు వేసవిలోనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిధులు విడుదల చేస్తున్నామని, పనులు చేయడంలో జాప్యం వల్ల గత ఏడాది శివారు భూములకు నీరందించలేకపోయామని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎడమ కాలువ ఆదునీకరణకు రూ. 460 కోట్లు ప్రతిపాదనలు పంపించామని ఎస్ఈ అప్పలనాయుడు వివరించారు. నీరు-చెట్టు కింద 1600 పనులు కాల్వ మరమ్మతులకు ప్రతిపాదించామన్నారు. పురుషోత్తపురం-యరగాం భైరిదేశిగెడ్డ ఓపెన్ హెడ్ చానల్స్ మరమ్మతులకు రూ. 6.6 కోట్లు మంజూరైందని, నెలరోజుల్లో పనులు మొదలవుతాయని చెప్పుకొచ్చారు. వంశధార ఫేజ్-1, స్టేజ్-2 పరిధిలో రూ. 209 కోట్లు మంజూరైతే రూ. 146 కోట్లు ఖర్చుచేసి మిగిలిన నిధులతో పనులు చేపట్టకుండా వదిలేశారని విప్ రవికుమార్ ప్రస్తావించారు. ఇసుక దుమారం: మంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టిన విప్ జిల్లాలో కొంతకాలంగా ఇసుక నిర్వహణ లోపాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని, ఈ-వేలంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని విప్ రవికుమార్ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిల్లా అధికారులు ఇంజినీరింగ్ పనులకు ఇసుకను కేటాయించడాన్ని తప్పుపట్టారు. దీంతో ఆ నిర్ణయం తనదేనని మంత్రి అచ్చెన్నాయుడు సభలో చెప్పలేక విప్ రవికుమార్ విమర్శలపై మౌనం వహించారు. ఇటీవల ఇసుక ర్యాంపులను నేరుగా ఇంజినీర్లు పర్యవేక్షించి ఇసుకను తరలించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మౌకిక ఆదేశాలిచ్చారు. పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివి అన్న మీమాంస టీడీపీ వర్గాల్లో నెలకొంది. అయితే కేవలం ఇది అధికారులు తీసుకున్న నిర్ణయంగా ఖలవించిన విప్ ఇదేమి ఇసుక విధానం అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న కలెక్టర్ పి.ల క్ష్మీనృసింహం సమాధానం చెప్పలేక కాగితంపై ఈ నిర్ణయం ఎలా జరిగింది అన్న అంశాన్ని విప్‌కు అందించారు. మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితుల్లో కేవలం 12 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారని, మిగిలిన వారికి ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి కోరారు. ఆ రహస్యమేమిటి? నీటి పారుదల శాఖ పరిధిలో అసలేం జరుగుతోంది. వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి విచ్చలవిడిగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ శాఖ పరిధిలో వచ్చిన నిధులు కేవలం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అసలు పాలకొండ డివిజన్ ఈ జిల్లాలో ఉందా అని ప్రశ్నించారు. కడగండి రిజర్వాయర్‌కు, పనసనందివాడ, అన్నవరం, గోపాలపురం ముంపు గ్రామాలకు రక్షణ గోడల నిర్మాణం, ఓనిగెడ్డ, కొండలోయగెడ్డ, కడగండి రిజర్వాయర్, జంఝావతి, దామోదరసాగర్, జంపరకోట, కుంబిడివాగు మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరారు. సుంగిడి సాగరాన్ని మినీ రిజర్వాయర్‌గా మార్చాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ విజ్ఞప్తి చేశారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ వీరఘట్టం పరిధిలో ఓటరు కాని రైతులకు టీసీలుగా ఎలా అవకాశం కల్పించారని ఈఈ రవీంద్రను ప్రశ్నించారు. ఎస్ఎంఐ డివిజన్లో అవినీతి పరాకాష్ట చిన్న తరహా నీటి పారుదల శాఖ పరిధిలో 2006 నుంచి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, గిరిజనుల సొమ్ము పనులు చేయకుండా ఇంజినీరింగ్ అధికారులు కొందరు గిరిజనేతరులు దోచుకున్నారని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. 2011 నుంచి 313 పనుల్లో అక్రమాలను గుర్తించడానికి విచారణ బృందాలు ఏర్పాటు చేశారని, విచారణ నివేదిక వచ్చిన తరువాత అవినీతి రుజువైతే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనల క్ష్మి, వంశధార ఎస్ఈ అప్పలనాయుడు, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్వీ రమణ, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు జి.లక్ష్మీదేవి, బి.రమణమూర్తి పాల్గొన్నారు. మీరు తప్పు చేసి నిర్వాసితులపై ఆరోపణలా? వంశధార ప్రాజెక్టు పరిధిలో అధికారులు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని, తిరిగి నిర్వాసితులు పనులు ఆపుతున్నారని, పనుల జాప్యానికి వారే కారణమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మలు అధికారులపై మండిపడ్డారు. పదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా పనులు మధ్యలోనే నిలిపివేయడమే కాకుండా నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి అచ్చెన్న జోక్యం చేసుకొని గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని, అవసరం లేకపోయినా వారి అనుచరులకు రూ. కోట్లు ఇచ్చి ఇప్పుడు రికార్డులు లేకుండా చేశారని ఆరోపించారు. అందుకే వారం రోజుల్లో నిర్వాసితులందరినీ ఒకచోటుకు పిలిచి వారితో నేరుగా సంప్రదింపులు జరపడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కలమట, ఎమ్మెల్సీ శర్మలు హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ పోలవరం, గుంటూరు తరహాలో నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో ఉంటున్న నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎమ్మెల్యే కలమట అన్నారు. గ్రోయిన్లకు భూసేకరణ అవసరమా: విప్ నది బయట కట్టే కరకట్టలకు కథలు చెబుతున్నారు. మరి నదిలో నిర్మించాల్సిన గ్రోయిన్ల సంగతేంటని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. 43 గ్రోయిన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం రెండు మాత్రమే పూర్తి చేశారని, అటువంటి కాంట్రాక్టర్లను ఎందుకు క్షమిస్తున్నారన్నారు. ధరల పెరుగుదలను ఎస్ఈ ప్రస్తావించడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. తోటపల్లి పనులు వేగవంతం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 115 కిలోమీటర్ల కాలువ నిర్మాణం పూర్తయిందని, నాలుగు బ్రాంచి కెనాల్, 125 డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం సాగుతోందని ఎస్ఈ డోల తిరుమలరావు చెప్పారు. నిధులు పుష్కలంగా ఉన్నాయని, భూసేకరణకు అడ్డంకులు ఉండడంతో కొన్నిచోట్ల పనులకు ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. రాజాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ 2008లో భూసేకరణ జరిగితే రెండు మండలాల్లోని రైతులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని, తక్షణవే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
జంఝావతికి జలకళ
రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జంఝావతి, నాగావళి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బంగాళా ఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలోభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. తోటపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరుచేరుతోంది. -
పునరావాసం అయోమయం !
నానా అవస్థలూ పడుతున్న నాగావళి ముంపు గ్రామాల ప్రజలు స్థలాలివ్వరు...ఇచ్చిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించరు... ఇళ్లు కట్టుకునేందుకు ఇసుకకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన... పదేళ్లగా పాడుబడిన ఇళ్లలో కాపురాలు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తోటపల్లి నిర్వాసితులు పార్వతీపురం:తోటపల్లి ప్రాజెక్టులో తొలి సమిథులైన నిర్వాసితుల పునరావాసం కల్పన ఎప్పటిపూర్తవుతుందో తెలియక ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క తోటపల్లి నుంచి ఈ ఏడాదికే పూర్తి స్థాయిలో నీరందిస్తామని పాలకులు, అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారని, అయితే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. గుణానుపురం, దుగ్గి, బాసంగి, గదబవలస, కళ్లికోట, నిమ్మలపాడు, బట్లభద్ర, తదితర గ్రామాల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో అర్థంకావడం లేదని వారు తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన దాదాపు 20 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటికి 10 గ్రామాల వారికే పునరావాసం కల్పించారు. ఏడు గ్రామాల వారికి కేటాయించిన స్థలంలో చేపట్టిన ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి, మరో మూడు గ్రామాల వారికి స్థలం కేటాయింపు విషయంలో విభేదాలున్నాయి. దీంతో 10 గ్రామాల వారు పాత గ్రామాల్లోనే ఉన్న ఇళ్లను బాగుచేసుకోలేక, కొత్తవాటిని నిర్మించుకోలేక అవస్థలు పడుతూ దాదాపు పదేళ్లగా జీవనం సాగిస్తున్నారు. గట్టిగా వర్షం పడితే నాగావళి నీరు పొంగి గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. దీంతో నిత్యం భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ నాటికే ప్రాజెక్టునిర్మాణం పూర్తి చేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఒక వేళ ప్రాజెక్టు పూర్తయితే తమ పరిస్థితి ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు నిల్వ పెడితే ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డునపడాల్సిందే. కనీస సౌకర్యాలు లేక అవస్థలు గుణానుపురం, దుగ్గి, కళ్లికోట, బిత్తరపాడు, చిన్నపుదొరవలస, బంటువానివలస, నిమ్మలపాడు, బట్లభద్ర, బాసంగి గదబవలస, సుంకి తదితర నిర్వాసిత గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం పూర్తి కాలేదు. ఇళ్లు నిర్మించుకోడానికి కేటాయించిన స్థలంలో కనీససౌకర్యాలు లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు చాలా మంది వెనుకడుగువేస్తున్నారు. అయితే కొంతమంది నిర్వాసితులు సాహసించి తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి కనీస అవసరమైన నీరు, విద్యుత్ లేకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీరు నిల్వ చేస్తుండడంతో నాగావళి నీరు ఏ సమయంలో గ్రామాలపైకి వస్తుందోనని భయపడుతున్నారు. వర్షాకాలం వచ్చేలోపే ఇళ్లు నిర్మించుకుందామని ఆశ పడుతున్న వారికి ఏటా నిరాశే ఎదురవుతోంది. దీంతో పాత గ్రామాల్లోని కూలిన ఇళ్లలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. చిక్కుముడులు వీడని గుణానుపురం... నిర్వాసిత గ్రామం గుణానుపురం వ్యవహారం ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడంతో ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన చిక్కుముడులు వీడడం లేదు. అందులో 605 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 544 మందికి ప్యాకేజీ అందజేశారు. ఇంకా 61 మందికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికి 380 మందికి పునరావాసానికి సంబంధించి 31.80 ఎకరాలలో పట్టాలిచ్చారు. ఇంకా సుమారు 143 మందికి 16 ఎకరాల మేరకు స్థల సేకరణ చేయాల్సి ఉంది. అయితే ఈ స్థల సేకరణే అధికారులకు తలనొప్పిగా మారింది. జిరాయితీ భూమిలో ఇళ్లు ఉన్న 29 మందికి పరిహారం ఇవ్వాలి. డీ-పట్టాలకు సంబంధించి కూడా పరిహారం అందజేయవలసి ఉంది. అలాగే 64 మందికి రాయితీలు రావాల్సి ఉంది. 18 ఏళ్లు దాటిన సుమారు 42 మంది వారికి ప్యాకేజీ రావలసి ఉంది. దుగ్గిని వేధిస్తున్న మరో సమస్య... ఇక దుగ్గిని మరో సమస్య వేధిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల్లో ఎస్సీలు ఇళ్ల నిర్మాణం చేపట్టడడంతో బీసీలు ఇళ్లనిర్మాణానికి వెనుకడుగువేస్తున్నారు. తమకు ఇచ్చిన స్థలంలో గోతులున్నాయని, అందుకే కట్టడం లేదని వారు చెబుతున్నారు. కదలని కళ్లికోట... ఇళ్ల స్థలాన్ని చదును చేసి ఇస్తేనే తాము కదులుతామని కళ్లికోట గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామంలో 159 మందికి పట్టాలిచ్చారన్నారు. 39 మంది 18 ఏళ్ల వయస్సు వారికి పరిహారం అందించారన్నారు. అయితే పునరావాస స్థలంలో నిర్మించిన వాటర్ ట్యాంకు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఇప్పుడే కొద్దిపాటి వర్షాలకే కారిపోతున్నాయన్నారు. వాటి నిర్మాణంలో నాణ్యత లోపించిందని వారు ఆరోపించారు. ఇక నిమ్మలపాడు, బట్లభద్ర తదితర గ్రామాల ప్రజలు సీమనాయుడు వలస వద్ద ఇళ్లనిర్మాణాలు చేపట్టినా మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వెళ్లలేకపోతున్నామంటున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. -
ఉత్తర కోస్తాకు వరద ముప్పు
* పొంగుతున్న వంశధార, నాగావళి... గోదావరి ఉగ్రరూపం నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలను వరద ముంపు వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువనున్న ఒడిశా, ఏజెన్సీ ప్రాంతాల్ల కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార, నాగావళి భారీగా వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఆయా నదుల తీర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వంశధార నదిలో నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకోవడం, నాగావళి నదిలో కూడా నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండవాగులు, గెడ్డల ఉధృతికి ఏజెన్సీలో పలు గ్రామాలతో రాకపోకలు తెగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి, విశాఖ జిల్లాలో మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారు. 30 గేదెలు కొట్టుకుపోయాయి. ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, శబరితో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ అన్ని గేట్లనూ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి గంటకు అడుగు చొప్పున పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి 50 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలదిగ్బంధంలో సిక్కోలు గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు వరద ఉద్ధృతి పెరగడంతో 11 మండలాల పరిధిలోని 124 గ్రామాలు ప్రమాదం అంచున ఉన్నాయి. ఇప్పటికే ఈ మండలాల్లోని వేలాది ఎకరాల వేసిన అరటి, మొక్కజొన్న, వరి, చెరుకు తదితర పంటలు నీట మునిగాయి. వరదలపై అప్రమత్తం: సీఎం ఆదేశం వరదలు పోటెత్తుతున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశాతో పాటు పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని పరిస్థితిపై సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.