నాగావళి నదిలో కొట్టుకుపోతున్న పడవను అదుపుచేస్తున్న నావికులు
మృత్యుంజయులు
Published Sat, Aug 6 2016 11:13 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
• నాగావళిలో తప్పిన పడవ ప్రమాదం
• గుర్రపు డెక్క చుట్టుకుని కొట్టుకుపోయిన నాటు పడవ
• విద్యార్థుల హహాకారాలు
• వంతెన ఫిల్లరు అడ్డడంతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
రంగారాయపురం(సంతకవిట ): నారాయణపురం ఆనకట్ట సమీపంలో రంగారాయపురం గ్రామం వద్ద శనివారం పడవ ప్రమాదం తృటిలో తప్పింది. వంతెన ఫిల్లరును తగిలి పడవ నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సంతకవిటì మండలం రంగారాయపురం గ్రామం నుంచి బూర్జ మండలం లాబాం వైపు వెళ్లేందుకు రోజూ ఇక్కడ నాగావళి నదిలో నాటుపడవను వేస్తుంటారు. ఇందులో భాగంగానే శనివారం కూడా పడవను నది దాటేందుకు వేశారు. రంగారాయపురం గ్రామం నుంచి పలువురు విద్యార్థులతో పాటు నదీతీర గ్రామాల ప్రజలు మొత్తం 14 మంది పడవ ఎక్కి నదిని దాటుతున్నారు. ఈ సమయంలో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో పాటు గుర్రపుడెక్కలు గుంపుగా వచ్చి పడవకు చుట్టేశాయి. వెంటనే పడవ అదుపుతప్పి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. పడవను నడిపే గన్నియ్య అప్పటికీ పడవను అదుపుచేసే ప్రయత్నం చేశాడు. మరో ఇద్దరు కర్రలతో ఆయనకు సాయమందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. కొద్దిదూరంలో కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన ఫిల్లరు అడ్డుగా ఉండడంతో అక్కడ వరకూ వెళ్లిన పడవ అక్కడ నిలిచిపోయింది. దీంతో పెద్దప్రమాదమే తప్పింది. ఫిల్లరు వద్ద నుంచి మెల్లగా పడవను నావికుడు గన్నియ్య ఒడ్డుకు చేర్చాడు.
మిన్నంటిన హహాకారాలు
ఈ పడవలో రంగారాయపురం, పోతులజగ్గుపేట, సంతకవిటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరంతా బూర్జ మండలం ఓవీ పేటలో మోడల్‌స్కూల్‌కు వెళుతున్నారు. నది మధ్యలో పడవ అదుపుతప్పడంతో వీరంతా ఒక్కసారిగా హహాకారాలు చేయడం ప్రారంభించారు. పడవలోని మిగిలిన ప్రయాణికులు వీరిని తొందరపడనీయకుండా ధైర్యం చెప్పడంతో ఓపిగ్గా పడవలో కదలకుండా కూర్చున్నారు. దీంతో పడవ బోల్తాపడకుండా నెమ్మదించింది. చివరకు వంతెన ఫిల్లరు వద్ద అడ్డంగా ఉండిపోవడంతో ప్రమాదం తప్పింది. బతుకుజీవుడా అంటూ ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
విషయం తెలుసుకున్న వెంటనే సంతకవిటి ఎస్‌ఐ తాతారావు. తహసీల్దార్ జి.సత్యనారాయణ తదితరులు సంఘటనా స్థలం వద్దకుచేరుకుని వివరాలు సేకరించారు. పడవను నడిపే వ్యక్తి గన్నియ్య నుంచి సమాచారం సేకరించారు. నదిలో పడవ నడప వద్దని హెచ్చరించారు. గుర్రపుడెక్కలు కారణంగానే పడవ అదుపుతప్పినట్టు నావికుడు అధికారులకు తెలిపాడు.
కాపాడిన వంతెన ఫిల్లరు
నారాయణపురం ఆనకట్టకు 300 మీటర్లు దూరంలో పోతులుజగ్గుపేట–నారాయణపురం గ్రామాల మధ్య నాగావళి నదిలో రూ. 37 కోట్లతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెనకు సంబంధించి ఫిల్లర్లు నిర్మాణం పూరై్తంది. ఈ వంతెన ఫిల్లర్లు కారణంగానే పడవ ప్రమాదం తప్పింది. లేకుంటే పడవ కొద్దిదూరం ప్రయాణించి ఉంటే బోల్తాపడి ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
Advertisement
Advertisement