
మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాంగో నార్త్‌వెస్ట్ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్ స్టౌవ్ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి.
At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ
— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025
పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు.