వానరానికి తీరని కష్టం | Telangana govt to set up Rs 2.21 cr monkey rescue, rehab centre | Sakshi
Sakshi News home page

వానరానికి తీరని కష్టం

Published Sat, Aug 13 2016 2:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

వానరానికి తీరని కష్టం

వానరానికి తీరని కష్టం

 రాష్ట్రంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక
 చించోలి(బి) వద్ద ఏర్పాటుకు ఆదేశాలు
 రూ.2 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు
 నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు
 
నిర్మల్‌రూరల్ : కనిపించిన చెట్టునల్లా నరుడు నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టం వచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనావాసాల బాట పట్టాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు ఫలాలు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇన్ని మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ ఒక్క మెతుకు దొరికినా ఏరుకు తింటున్నాయి. సరిపడా ఆహారం దొరకక తమలో ఘర్షణ పడుతున్నాయి. ఆకలికి తాళలేకనే ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఈ వానర కష్టం.. వాటితో మనిషికి కలుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వానరజాతిని మళ్లీ  వనాలబాట పట్టించాలని నిర్ణయించింది. ఇందుకు పెద్దఎత్తున హరితహారం చేపడుతోంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వానర జాతిని అరికట్టేందుకు, వాటి సమస్యలను తీర్చేందుకు మన జిల్లాకు పునరావాస కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే.. ఉత్తర్వులు జారీ అయి దాదాపు మూడునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేంద్రం ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  
 
 చించోలి(బి) వద్ద ఏర్పాటుకు..
అడవుల జిల్లాగా.. కోతుల ఖిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాను పునరావాస కేంద్రానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సారంగాపూర్ మండలం చించోలి(బి) సమీపంలో కోతులకు పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 కోట్ల వరకు కేటాయించింది. ప్రభుత్వం చించోలి(బి)ని ఎంచుకోవడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల ఈ గ్రామానికి సమీపం నుంచే మహబూబ్ ఘాట్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంతో పాటు నీటి లభ్యత కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కోతులు అధికంగా ఉన్నాయి. వానరాల సంఖ్య అధికంగా ఉన్న నిర్మల్ నుంచి ఇక్కడికి వాటిని సులువుగా తరలించవచ్చు. 
 
నిర్మల్‌లోనే ఎక్కువ..
తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక వనవాసం వదిలిన కోతులు కొన్నేళ్ల కిందటే జనావాసాల్లోకి వచ్చి చేరాయి. జిల్లాలో వీటి సంఖ్య నిర్మల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ కోతులు జీవనం సాగించడానికి అనువైన గుట్టలు, సమీపంలోనే అడవులు ఉండటంతో పట్టణంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. మొదట్లో ఇళ్లలో తినగా మిగిలిన పదార్థాలను చెత్తకుండీల్లో పడేస్తే ఏరుకుని తింటూ జీవనం సాగించాయి. కాలక్రమంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. రానురాను ఆహారం దొరకడం కష్టంగా మారడంతో వాటి తీరు కూడా మారింది. ఆహార పదార్థాల కోసం ఇళ్లల్లో దూరడం, మనుషులపై దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఇక గ్రామాల్లో పంటపొలాలను నాశనం చేయడం, ఇళ్లపై పెంకులు తొలగించడం చేస్తున్నాయి. దీంతో నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ కోతులు సమస్యగా మారాయి. కొంతకాలంగా వాటిని అడవుల్లోకి తరలించాలంటూ అధికారులకు వినతిపత్రాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం దాదాపు 2500 కోతులను పట్టుకుని జన్నారం అటవీ ప్రాంతానికి తరలించింది. అప్పట్లో అటవీశాఖ మంత్రి జోగురామన్న దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు.
 
 కేంద్రం ఏర్పాటయితే..
రక్షణతోపాటు పునరావాస కేంద్రం ఏర్పాటయితే వానరాలతో మనుషులకు సమస్య తీరడంతో పాటు.. వాటి సమస్యలూ తీరనున్నాయి. ఈ కేంద్రంలో వెటర్నరి వైద్యశాలను ఏర్పాటు చేస్తారు. కోతులకు వచ్చే వ్యాధులను నయం చేసే వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందుకో సిబ్బందికి అక్కడే క్వార్టర్స్‌ను నిర్మిస్తారు. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు ఇక్కడ ప్రత్యుత్పత్తి చికిత్సలూ చేస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచుతారు.
 
పునరావాసం ఇంకెప్పుడు..
వానరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనడంతో జంతుప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు బాధ తప్పడంతోపాటు వాటిని సరైన ఆవాసం దొరకనుందని భావించారు. అయితే.. ఇది గడిచి ఇప్పటికే దాదాపు మూడునెలలు కావస్తోంది. కానీ.. ఇంకా పునరావాస కేంద్రానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులు వచ్చి చించోలి(బి)లో స్థలాన్ని మాత్రం పరిశీలించి వెళ్లారు. మరోవైపు నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల వానరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని వేలాది కోతులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతులను ఇంకెప్పుడు వనాలకు తరలిస్తారని, పునరావాస కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హరితహారం సీజన్ పూర్తికాగానే పునరావాస కేంద్రంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement