పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన.. ఎన్నో సందేహాలు! | AP P4 Survey 2025 raises many questions in people | Sakshi
Sakshi News home page

AP P4 Survey 2025: పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన

Published Fri, Feb 28 2025 2:38 PM | Last Updated on Fri, Feb 28 2025 5:07 PM

AP P4 Survey 2025 raises many questions in people

పీ4 సర్వే పేరిట వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది 

మార్చి 3 నాటికి సర్వే పరిపూర్తి

సంక్షేమ పథకాల ఎత్తివేతకేనని  బలపడుతున్న అనుమానాలు

కడప సెవెన్‌రోడ్స్‌: పీ4 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు పరచకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా పైలెట్‌ ప్రాజెక్టు (pilot project) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 20వ తేది నుంచి వైఎస్ఆర్‌ జిల్లాలో పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ పార్టిసిపేషన్‌ (పీపీపీ) పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది నాటికి పీ4 సర్వే (P4 Survey) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,70,365 కుటుంబాలు ఉండగా, ఇప్పటికి 1,88,893 కుటుంబాలను అంటే 40.16 శాతం సర్వే పూర్తి చేశారు. ఇందులో 157213 కుటుంబాల (83.23 శాతం) ఆమోదం తీసుకున్నారు. ఇక 2,81,472 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 645 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలు గుర్తించి గ్రామ సభల ద్వారా నిర్దారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.

ఎన్నో సందేహాలు! 
సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్‌ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్‌కం ట్యాక్స్‌ (Income Tax) ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్‌ వినియోగం ఎంతమంది అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది.  

నాడు సంక్షేమ జాత‌ర‌.. నేడు పాత‌ర‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమం అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే నేతలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.

చ‌ద‌వండి: బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..

పెన్షన్‌ రూ. 1000లు పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా పీ4 సర్వే చేపట్టడం ఇందులోభాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారి పేర్లు సైతం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, అలాంటి వివరాలు నమోదు చేసినపుడు బయో మెట్రిక్‌ ద్వారా ధృవీకరించాలని కూడా చెప్పడం అనుమానాలు బలపడేందుకు కారణాలుగా ఉన్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేగుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement