న్యూఢిల్లీ: సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చేసే ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్) అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది. సరిహద్దులు దాటి వెళ్లే అక్రమ సంపదను గుర్తించేందుకు మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భారత్ సహా 54 సభ్య దేశాలు, ప్రాంతాలున్నాయని ఇంటర్ పోల్ శుక్రవారం తెలిపింది.
సీనియర్ మాఫియా ముఠా సభ్యుడికి చెందిన ఆస్తుల వివరాలను కనుగొనాలంటూ ఇటలీ చేసిన వినతి మేరకు ఈ నోటీస్ జారీ చేశామంది. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది సభ్య దేశాలకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ నోటీస్ అమల్లో ఉంటుందని వివరించింది. అక్రమాలు, అవినీతి, డ్రగ్స్ రవాణా, పర్యావరణ సంబంధ నేరాలు, ఇతర తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేస్తామని ఇంటర్ పోల్ తెలిపింది.
ఈ నోటీసులను అవసరమైతే మొత్తం 196 సభ్య దేశాలకు లేదా ఎంపికైన దేశాలకు పంపవచ్చని పేర్కొంది. ఇటువంటి నేరగాళ్లు సంపాదించిన సొత్తును స్వాధీనం చేసుకోవడం ద్వారా సంస్థాగత నేరాలను అరికట్టేందుకు అక్రమార్కుల నెట్‌వర్క్‌ను చేధించవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం భారత్‌కు చెందిన కనీసం 10 మంది నేరగాళ్లు ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరు ఎంత మొత్తం నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారనే దానిపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. తాజా పరిణామంతో, మనం కూడా మెహుల్ చోక్సీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేయాలని కోరేందుకు అవకాశం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు.
ఆ 8 నోటీసులు ఏవంటే..
ఫ్రాన్సులోని లియోన్ నగరం కేంద్రంగా ఇంటర్‌పోల్ కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల నుంచి అవసరమైన సమాచారం కోసం ఇంటర్‌పోల్ ప్రస్తుతం 8 రకాల కోడెడ్ నోటీసులను జారీ చేస్తోంది. ఇందులో రెడ్ నోటీస్‌ను మరో దేశంలో దాక్కున్న పరారైన నేరగాడిని పట్టుకునేందుకు లేదా గుర్తించేందుకు సభ్యదేశం విజ్ఞప్తి మేరకు జారీ చేస్తుంది. యెల్లో నోటీస్‌ను కనిపించకుండా పోయిన వారిని, ముఖ్యంగా చిన్నారులను వెదికి పట్టుకునేందుకు జారీ చేస్తుంది.
ఓ నేర ఘటన దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని లేదా ప్రాంతాన్ని గుర్తించేందుకు బ్లూ నోటీస్‌ను పంపుతుంది. ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారిన వ్యక్తి, అతడి నేర కార్యకలాపాలపై గ్రీన్ నోటీసును, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోసం బ్లాక్ నోటీసును, ఒక ఘటన, వ్యక్తి లేదా వస్తువు, ప్రక్రియ కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదమని భావిస్తే ఆరెంజ్ నోటీసును, నేరగాళ్లు ఆవలంభించే వివిధ ఆయుధాలు, లక్ష్యాలు, రహస్య విధానాలకు సంబంధించిన సమాచారంతో పర్పుల్ నోటీసును సభ్య దేశాలకు పంపుతుంది. అంతేకాదు, ఐరాస సర్వప్రతినిధి సభ వివిధ వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా విధించే ఆంక్షలకు సంబంధించిన నోటీసులను సైతం ఇంటర్‌పోల్ జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment