పైలట్ ప్రాజెక్టు విజయవంతం
స్టాంపింగ్ కోసం స్వదేశం వెళ్లకుండానే రెన్యూవల్ చేసేందుకు అమెరికా యోచన
భారీగా లబ్ధిపొందనున్న భారతీయులు
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది.
చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది.
ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి.
2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్‌లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు.
ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment