Renewal
-
భారత్‌కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
మరమ్మతులకు తక్షణమే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్లైన్లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వట్టెం పంప్‌హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్‌సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్‌సింగ్‌కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్‌లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్‌లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్‌లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్‌ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్‌లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్‌ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్‌లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్‌లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్‌కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్‌లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్‌తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్‌తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్‌లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్‌లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్‌గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్‌లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్‌కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్‌లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్‌లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్‌లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్‌లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
Passport: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశానికి వచ్చే పర్యాటకులు, వర్క్ వీసా పొందినవారు పాస్‌పోర్టులలో ఇంటిపేరును తప్పనిసరిగా జత చేయించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం నిర్దేశించింది. యూఏఈకి వచ్చేవారి వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూఏఈలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. కొందరి పాస్‌పోర్టులలో ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ కార్డులలో ఇంటి పేరు ఉండకుండా పేరు మాత్రమే ఉంటుంది. పేరు ఒక్కటే ఉండటం వల్ల ఆయా వ్యక్తుల స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోక ముందు పాస్‌పోర్టు తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య(స్పౌస్) పేరు ఉండదు. అలాంటివారు కూడా తమ జీవిత భాగస్వామి పేరును నమోదు చేయించుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కోరారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్‌పోర్టులలో వివరాలు స్పష్టంగా లేవు. కొత్త నిబంధనల వల్ల పాస్‌పోర్టులలో పూర్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. యూఏఈలో రెన్యువల్‌కు ఇక్కడ విచారణ యూఏఈలో ఉపాధి పొందుతున్నవారు తమ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అక్కడి భారత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు విభాగం(స్పెషల్ బ్రాంచ్) అధికారులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు పాస్‌పోర్టు రెన్యువల్‌కు గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయంలో రెన్యువల్ చేసుకునేవారు. పాత పాస్‌పోర్టునే రెన్యువల్ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించకపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేవారి ఇంటి వద్దకు ఎస్బీ అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుండటం గమనార్హం. పాస్‌పోర్టుల జారీ పారదర్శకంగా ఉండాలన్న కారణంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..) -
పాస్ పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చి ..
కాణిపాకం(చిత్తూరు): తమ పాస్‌పోర్టు సమయం అయిపోతుందని రెన్యూవల్ కోసం ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చారు. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్‌కు సమయం ఉండడంతో దైవ దర్శనానికి బయలుదేరి అనుకోని ప్రమాదంలో అత్తకోడళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మండలంలో విషాదం నింపింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన కుమారస్వామి, సుజాత భార్యాభర్తలు. వృతిరీత్యా యూ ఎస్ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వారి కుమారుడు ధను. ముగ్గురి పాస్‌పోర్టులు గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఇండియాకు గత నెలలో వచ్చారు. తండ్రి, తల్లి పాస్‌పోర్టులు రెన్యూవల్ పూర్తికాగా.. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదు. సమయం ఉండడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, స్వర్ణలత, భార్య సుజాతతో కలసి కుమారస్వామి కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మంగళవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. సాయంత్రం కాణిపాకం సమీపంలోని తిరువణంపల్లె సమీపంలో టైరు పేలింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ను ఢీకొంది. ఈ ప్రమాదంతో స్వర్ణలత(65), సుజాత(31)కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ స్వర్ణలత, సుజాత మృతి చెందారు. ఎస్ఐ మనోహర్ కేసు నమోదు చేశారు. కాగా రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆర్డీఓ రేణుక పరామర్శించారు. -
Telangana: ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. వాహన యజమానులకు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు మూడునాలుగేళ్లుగా వారు వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించటం లేదు. దీంతో ఒక్కో వాహనానికి రూ.30 వేల నుంచి రూ. 70 వేల వరకు పెనాల్టీలు పేరుకుపోయాయి. కొన్ని వాహ నాలకు ఏడేళ్లుగా కూడా ఫిట్నెస్ రెన్యువల్ లేకపోవటంతో రూ.లక్షకుపైగా పెనాల్టీలున్నాయి. దీంతో రోడ్డెక్కితే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వేల సంఖ్యలో వాహనాలను వాటి యజమానులు ఇళ్లకే పరిమితం చేశారు. ఫలితంగా వాటి రూపంలో ఆదాయం రాక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఫిట్నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ.650 కోట్ల బకాయిలు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర సరుకు రవాణా వాహనాలు.. ఇలా అన్ని రకాల రవాణా వాహనాల యజమానులు చాలాకాలంగా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. వాటికి నిబంధన ప్రకారం రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తే రవాణా శాఖకు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. ఇప్పుడు ఈ పెనాల్టీ నుంచి మినహాయింపునివ్వడంతో అంతమేర ఆయా వాహనాల యజమానులకు వెసులుబాటు కలగగా, రవాణాశాఖ అంతమేర ఆదాయం కోల్పోయినట్టయింది. ఇక మళ్లీ రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సందడి ఈ పెనాల్టీ బకాయిలకు భయపడి వాటి యజమానులు ఆ వాహనాలను ఇళ్ల వద్దనే ఉంచేశారు. ఫలితంగా కొంతకాలంగా రోడ్లపై ఆటోలు, క్యాబ్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 35 వేల నుంచి 40 వేల ఆటోలు, 50 వేల క్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్ సంక్షోభంతో మరో 30 వేల దాకా మాయమయ్యాయి. వెరసి లక్షకు పైగా ఆటోలు, క్యాబ్‌లు లేకపోయేసరికి నగరంలో క్యాబ్ బుక్ చేస్తే గతంలోలాగా వెంటనే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ వాహనాలు తిరిగి రోడ్డెక్కే అవకాశం ఉంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా.. రవాణా శాఖ నిఘా లేకపోవటాన్ని రవాణా వాహన యజమానులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా పట్టుకునేవారే లేకపోవడంతో కొన్నేళ్లుగా వారు దానిమీద దృష్టిపెట్టడం లేదు. ఏడాదికి రూ.735 ఫీజు చెల్లిస్తే సరిపోయే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను పట్టించుకోవటం లేదు. వాహనాలు ఫిట్నెస్ తప్పి తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్నా రవాణాశాఖ పట్టించుకోవటం లేదు. ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే, వాహన యజమానుల్లో భయం వచ్చేలా రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ భయంతో మిగతా వాహనాల యజమానులు ఠంఛన్‌గా ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రవాణా వాహన యజమానుల్లో మళ్లీ నిర్లక్ష్యం వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీన్ని నివారించాలంటే రవాణాశాఖ కఠినంగా ఉండాలని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. -
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊహించని పరిణామం: 21 ఏళ్ల బంధానికి గుడ్‌బై
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు, మెస్సీ ఫ్యాన్స్‌కు మింగుడుపడని వార్త ఇది. స్టార్ ఆటగాడు, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఊహించని పరిణామం ఎదురైంది. 21 ఏళ్ల సుదీర్ఘ బార్సిలోనా క్లబ్(Catalan club) పయనం ముగిసింది. ఇకపై ఈ స్పెయిన్ క్లబ్ తరపున మెస్సీ ఆడబోవడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆయనతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని క్లబ్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం క్లబ్ తరపు అధికారిక సమాచారం వెలువడింది. దీంతో సాకర్ అభిమానులు నివ్వెరపోతున్నారు. నిజానికి క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగిసి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్లబ్‌లు పోటాపోటీ పడగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు తమతోనే కొనసాగుతాడని క్లబ్ చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కోపా అమెరికా 2021 అర్జెంటీనా విక్టరీ తర్వాత.. మెస్సీ సెలవుల్లో ఉన్నాడు. తిరిగి బుధవారం క్లబ్లో చేరాడు. దీంతో ఈ వారాంతంలో కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. ఇంతలోపే మెస్సీతో బంధం ముగిసిందని బార్సిలోనా ప్రకటించడం ఫుట్‌బాల్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఏం తమాషాగా ఉందా? అయితే వ్యక్తిగత కారణాలతో కిందటి ఏడాదే మెస్సీ.. బార్సిలోనా నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించాడు. అయితే అప్పుడే క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జోవాన్ లపోర్టా.. మెస్సీని బతిమాలి కొనసాగేలా చూశాడు. తిరిగి ఈ ఏడాది జూన్ 30న మెస్సీ -బార్సిలోనా క్లబ్ ఒప్పందం ముగియగా.. 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే లపోర్టా మాత్రం మరో ఐదేళ్లు మెస్సీ తమతోనే కొనసాగుతాడంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటనలు ఇచ్చాడు. ఈ తరుణంలో నిన్న(గురువారం) ఉదయం క్యాంప్‌నౌ స్టేడియం దగ్గర జరిగిన చర్చల అనంతరం.. మెస్సీ కాంట్రాక్ట్ ముగిసినట్లు క్లబ్ ఈ ప్రకటన చేయడం విశేషం. 50 శాతం కోతలు, ఒప్పందంలో క్లబ్ కండిషన్లకు మెస్సీ విముఖత వ్యక్తం చేయగా.. కాంట్రాక్ట్ రద్దుకే క్లబ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ యూత్ వింగ్‌లో చేరిన మెస్సీ.. 16 ఏళ్లకు క్లబ్ జట్టులో చేరాడు. ఈ స్పెయిన్ క్లబ్ తరపున 778 మ్యాచ్‌లు ఆడి.. 672 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా నుంచి తన ఎగ్జిట్‌పై మెస్సీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న మెస్సీ.. ఏ క్లబ్లో చేరేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
హెల్త్ పాలసీల రెన్యువల్‌కు 21 వరకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ నేపథ్యంలో సంబంధిత కాలంలో గడువు ముగిసే హెల్త్ పాలసీల రెన్యువల్‌కు ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని అన్ని బీమా సంస్థలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 1నే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య గడువు ముగిసే పాలసీలకు ప్రీమియం చెల్లించలేని వారికి ఏప్రిల్ 21 వరకు అవకాశం ఇవ్వాలని సంబంధిత నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. అలాగే, వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపునకు కూడా ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించాలని ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. -
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగి సిందా? రెన్యువల్ వీలుపడలేదా? అయినా పర్లేదు. దీనికి సంబంధించి జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించారు. డ్రైవింగ్ లైసెన్సులతోపాటు వాహనాల ఫిట్నెస్ సర్టిఫి కెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు రకాల సర్టిఫికెట్ల గడువు ముగిసినవారు, త్వరలో ముగుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి వెళ్లటంతో ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. రవాణా శాఖతో ముడిపడిన వివిధ పత్రాలకు సంబంధించి.. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తున్న వాటికి సంబంధించిన వాహనదారులపై ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఎలాం టి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసినవాటిని జూన్ 30 తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అద్దె బస్సుల రెన్యువల్‌కూ ఉందో రేటు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ‘అద్దె బస్సుల ఒప్పందం’ వివాదాస్పదంగా మారింది. కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయడానికి వీల్లేదని అధికారులు అంటున్నా. తాజాగా టెండర్లు పిలవాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించినా.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకనేత వినిపించుకోవడంలేదు. ఎందుకంటే అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఉత్తరాంధ్రకే చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా ఆయన డీల్ కుదుర్చుకున్నారు మరి. దాదాపు 140 అద్దె బస్సుల ఒప్పందం 2008, 2009లో ఆర్టీసీ దాదాపు 140 అద్దె బస్సుల్ని తీసుకుంది. వాటిలో పల్లెవెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. వాటి ఒప్పంద కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దాంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా 6 నెలలకు పొడిగించారు. ఈ సెప్టెంబర్ 30తో ఆ గడువు ముగియనుంది. గతేడాది కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాలను ఆర్టీసీ రెన్యువల్ చేసింది. అయితే అప్పట్లో ఆర్టీసీ పాలకమండలి లేదు. దాంతో అధికారులు ఒప్పందాన్ని రెన్యూవల్ చేసి ఇటీవల పాలకమండలి నియామకం తర్వాత ర్యాటిఫికేషన్ చేశారు. అదే రీతిలో ఈ ఏడాది మార్చితో కాలపరిమితి ముగిసిన 140 బస్సుల ఒప్పందాలను కూడా రెన్యువల్ చేయాలని అద్దె బస్సుల యజమానులు కోరారు. ఆర్టీసీ పాలకమండలికి చెందిన ‘పెద్ద’ అందుకు సమ్మతించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఎంఎస్టీసీ నిబంధనల ప్రకారం అద్దె బస్సుల కోసం ఆన్లైన్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ పాలకమండలిలో మెజార్టీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమేరకు తీర్మానం ఆమోదించారు. దీంతో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. కీలక నేతతో డీల్.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతను ఆశ్రయించారు. ఆయన సామాజికవర్గానికే చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంతా తానై ఈ కథ నడిపించారు. ఆ ఎమ్మెల్సీ సూచన మేరకు అద్దెబస్సుల యజమానులు ఈ నెల 10 విజయవాడలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 9 ఏళ్ల పాటు ఒప్పందాన్ని రెన్యువల్ చేసేందుకు ఎమ్మెల్సీ ప్రతిపాదించిన డీల్‌మీద చర్చించారు. ఒక్కో బస్సుకు రూ.50 వేల చొప్పున వసూలు చేసి ఉత్తరాంధ్ర కీలకనేతకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు రూ.70 లక్షలు ఉత్తరాంధ్ర కీలక నేతకు ముట్టజెప్పనున్నారన్నమాట. ఇక ఎమ్మెల్సీకి, ఆర్టీసీ పెద్దకు, జోనల్‌స్థాయి ప్రతినిధులకు ముడుపులు దీనికి అదనం. టెండర్ల ప్రక్రియకు బ్రేక్..? డీల్ కుదిరిన విషయాన్ని ఎమ్మెల్సీ కీలక నేతకు తెలిపారు. దాంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అద్దె బస్సుల కోసం తాజాగా టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని మౌఖికంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల ఒప్పందాలను నిబంధనలకు విరుద్ధంగా రెన్యూవల్ చేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి కీలక నేత ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ అయితే తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఆ కీలక నేత పట్టుబడుతుండటంతో అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయకతప్పదని తేల్చిచెబుతున్నారు. -
అమ్మకానికి బీసీసీఐ వెబ్సైట్!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ వెబ్‌సైట్‌ను అమ్మకానికి పెట్టారు. బీసీసీఐ.టీవీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లైసెన్స్‌ను పునరుద్ధరించుకోక పోవడంతో వెబ్‌సైట్స్ రిజిస్ట్రార్స్ సంస్థ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది. దీనికోసం బిడ్డింగ్‌ను ఆహ్వానించగా ఏడు బిడ్లు వచ్చాయి. బోర్డు డొమైన్ కాలవ్యవధి 2–2–2006 నుంచి 2–2–2019 వరకైతే... ఏడాది ముందే అంటే తేదీ 3–2–2018లోపు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోవాలి. కానీ క్రికెట్ బోర్డు ఆ పని చేయకపోవడంతో వెబ్‌సైట్స్ రిజిస్ట్రార్స్ రిజిస్టర్.కామ్ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది. -
పెద్దాయన బతికుంటే..
పెద్దాయన బతికుంటే మా బతుకులు ఇంకోలా ఉండేవని నిత్యం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుని పంచాయతీలో కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 897 పంచాయతీల్లో సుమారు 1,200 మంది పార్టుటైం జేఏబీసీలు, పంపు ఆపరేటర్లు, కాంట్రాక్టు ఆపరేటర్లు, స్వీపర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పాలకొల్లు అర్బన్: జిల్లాలోని పంచాయతీల్లో కాంట్రాక్టు, టెండర్, అవుట్ సోర్సింగ్ విధానంలో బిల్లు కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, గుమస్తా, ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్, ప్లంబర్‌గా వందలాది మంది పార్టుటైమ్ ఉద్యోగులుగా చేరినా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్ణీత సమయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్లు అయితే అర్ధరాత్రి.. అపరాత్రి లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. ఆ సమయంలో వీరికి ఏమైనా అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పాలకొల్లు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 మంది కాంట్రాక్టు కార్మికులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రెన్యువల్‌కు ఏటా తప్పని తిప్పలు ఆయా గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టులను కాంట్రాక్టు జిల్లా అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏటా అధికారులకు లంచం ఇస్తేగాని రెన్యువల్ చేయడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాది ఉద్యోగం కాంట్రాక్టు పొడిగించడానికి కనీసం రూ.1500 ఒక్కొక్కరి నుంచి డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు ముగుస్తుంది. తిరిగి ఏప్రిల్‌లో వీరి కాంట్రాక్టు ఉద్యోగం పొడిగించాలి. అయితే లంచం సొమ్ముల కోసం అధికారులు ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకూ తీవ్ర జాప్యం చేసి.. అప్పుడు ఉద్యోగ కాల పరిమితిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. వీరిలో 30 ఏళ్ల నుంచి అరకొర జీతం పొందుతూ కాలం వెళ్లదీస్తున్న కార్మికులు ఎందరో ఉన్నారు. పంచాయతీ ఆదాయంలో 30 శాతం మించకుండా సిబ్బంది జీతాలు ఖర్చు చేసే వెసులు బాటు లేకపోవడంతో ఒక్కొక్క కార్మికుడు సీనియార్టిని బట్టి రూ.6 వేల నుంచి రూ.9 వేల జీతం పొందుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణించినవారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని వీరంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్సార్ జీవించి ఉంటే .. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ను రాష్ట్రంలోని పంచాయతీ కాంట్రాక్టు కార్మికులంతా కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అర్హత, సీనియారిటీ ప్రకారం తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీనియారిటీ జాబితా రూపొందించాలని వైఎస్సార్ పంచాయతీ రాజ్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారని, ఆ వెంటనే రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆ పెద్దాయన మృత్యువాత పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మహానుభావుడే జీవించి ఉంటే మా ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యేవని చెబుతున్నారు. ఏ టేబుల్ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా.. 1983లో గోరింటాడ పంచాయతీలో రూ.3 జీతానికి చేరా. ఆ తరువాత సగం చెరువులో 1985లో రూ.6 జీతానికి కుదిరా. 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేశా. ఏటా ఉద్యోగ కాల పరిమితి పొడిగించుకోవడానికి తిప్పలు పడుతున్నా. రూ.1500 ఖర్చు చేస్తే గాని ఏడాది కాలానికి ఉద్యోగ కాల పరిమితి పొడిగించరు. నా ఉద్యోగ సేవా కాలంలో ఏ టేబుల్ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా. బెజవాడ వెంకటేశ్వరరావు, పార్టుటైమ్ జేఏబీసీ చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా.. పదేళ్ల నుంచి పార్టుటైమ్ బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తున్నా. పేరుకి పార్టుటైమ్ ఉద్యోగమే కానీ, పూర్తి సమయం దీనికే కేటాయిస్తున్నా. జీతం రూ.6 వేలు ఇస్తున్నారు. ఇరువురు సంతానం. కుటుంబ పోషణ భారంగా మారింది. వేరే ఏ పని చేసుకోలేక ఉద్యోగం రెగ్యులర్ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నా. టి.రాజేంద్రప్రసాద్, పార్టుటైమ్ బిల్లు కలెక్టర్ 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా.. ఐటీఐ చదివాను. 1998లో పైపులైన్ ఫిట్టర్‌గా విధుల్లో చేరా. 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా. రూ.650 జీతానికి చేరా. ప్రస్తుతం రూ.8 వేలు ఇస్తున్నారు. మూడు పంచాయతీలకు సంబంధించి రికార్డు వర్కు చేస్తున్నా. పనిభారమైంది. జీతం పెరగలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఆర్థిక ఇబ్బందులతో బతుకు బండి లాగుతున్నా. –శిల్పం దేవరాయులు, ఫైపులైన్ ఫిట్టర్ -
అమెరికాలో రెన్యువల్ భయం !
⇔ హెచ్1బీ వీసా పొడిగింపు దరఖాస్తులకు అధికారుల కొర్రీలు ⇔ దాదాపు ప్రతి దరఖాస్తుకూ ఎవిడెన్స్ కావాలంటూ లేఖలు ⇔ కొన్ని ఆఫీసులకు నేరుగా వెళ్తున్న యూఎస్సీఐఎస్ సిబ్బంది ⇔ బ్యాచిలర్ డిగ్రీ లేకున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటున్న అమెరికన్ సంస్థలు ⇔ భారత ఐటీ కంపెనీల స్థానిక రిక్రూట్మెంట్లు కూడా షురూ ⇔ దీంతో అమెరికాలోని తెలుగు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ⇔ మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరమేనంటున్న నిపుణులు ⇔ కొత్త టెక్నాలజీలకు అప్‌గ్రేడ్ కావడమే మార్గమని సూచన హైదరాబాద్– బిజినెస్ బ్యూరో : శ్రీధర్ చాన్నాళ్ల కిందట హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లాడు. గ్రీన్‌కార్డుకు అప్లయ్ చేశాడు కానీ... ఇంకా రాలేదు. అది క్యూలో ఉంది కనక డిపెండెంట్ వీసాపై అమెరికా వెళ్లిన శ్రీధర్ భార్య భార్గవి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) సాయంతో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ రెండేళ్ల కిందటే అక్కడ ఇల్లు కూడా కొన్నారు. ఈఎంఐ కాస్త ఎక్కువే. అయితేనేం!! ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనక ఇబ్బంది లేదు. కాకపోతే శ్రీధర్ హెచ్1బీ గడువు ముగుస్తోంది. దీంతో మూడేళ్ల పొడిగింపు కోసం దరఖాస్తు చేశాడు. దానికి వీసా కార్యాలయం నుంచి ఎవిడెన్స్‌లు కావాలనే అభ్యర్థన (ఆర్ఎఫ్ఏ) వచ్చింది. దీంతో తన వీసా తిరస్కరణకు గురవుతుందా? ఇబ్బందులేమైనా వస్తాయా? అనే గుబులు శ్రీధర్‌లో మొదలైంది. రాఘవ కూడా దాదాపు రెండున్నరేళ్ల కిందట హెచ్1బీపై అమెరికాకు వెళ్లాడు. తన వీసా గడువు మూడేళ్లు. మరో ఆరు నెలలే ఉండటంతో గతనెల్లో రెన్యువల్ కోసం దరఖాస్తు చేశాడు. తనక్కూడా యూఎస్సీఐఎస్ కార్యాలయం నుంచి ఆర్ఎఫ్ఏ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌లో వారు పేర్కొన్న అన్ని పత్రాలనూ రాఘవ సమర్పించాడు. అయితే యూఎస్సీఐఎస్ సిబ్బంది రాఘవ పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు. ఇదంతా చూశాక... రాఘవకు తన వీసా రెన్యువల్ అవుతుందా? అనే అనుమానం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతోంది కూడా!! ‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’ అనే నినాదంతో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అక్కడి ఉద్యోగ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాపై ఎక్కువగానే పడుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్... అక్కడే మూడు కేంద్రాలు ఆరంభిస్తామని, స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పటమే కాక... దానికి తగ్గట్టు అక్కడ రిక్రూట్మెంట్లు కూడా మొదలుపెట్టింది. కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాలు కూడా అదే పనిలో పడ్డాయి. ఫలితంగా ఆయా సంస్థలు ఇండియాలో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. కోతలు పెంచుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే... కొన్నాళ్ల కిందటే అమెరికాకు హెచ్1బీపై వెళ్లి... అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి వీసా రెన్యువల్ రూపంలో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘‘ఇదివరకు వీసా రెన్యువల్‌కు చేసిన దరఖాస్తుల్లో తక్కువ వాటికే ఆర్ఎఫ్ఏ వచ్చేది. కానీ ఇపుడు దాదాపు అన్ని దరఖాస్తులకూ ఆర్ఎఫ్ఏ వస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వీసా నిబంధనలను మరింత కఠినం చెస్తున్నట్లు అర్థమవుతోంది. పరి స్థితి ఇలాగే కొనసాగితే పలువురు తెలుగువారు తిరిగి స్వదేశానికి వెళ్లక తప్పదు’’ అని 20 ఏళ్ల కిందట యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డ అనంతపురం వాసి ఒకరు చెప్పారు. పోటీ మరో రూపంలోనూ వస్తోంది! అమెరికాలో ఇండియన్లు పలు రంగాల్లో ఉన్నా... ఐటీ రంగంలో మాత్రం తెలుగువారిదే పైచేయి. దాదాపు 25 లక్షల మంది తెలుగువారు ఐటీ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు స్థానిక అసోసియేషన్లు చెబుతున్నాయి. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు... ఇపుడు రిక్రూట్మెంట్లలో అమెరికన్ కంపెనీల దృక్పథం కూడా మారుతోంది. ట్రంప్ పాలసీలకు అనుగుణంగా మరింత మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించటానికి వారు కొన్ని నిబంధనల్ని కూడా సడలించుకుంటున్నారు. అక్కడ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఇప్పటిదాకా బీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) ఉత్తీరణ తప్పనిసరి అనేవారు. ‘‘నిజానికి అక్కడ హైస్కూల్ చదువుతో ఆపేసిన పలువురు యువతకు వివిధ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లపై పట్టు ఉంది. కోడ్ రాయటం వారికి పెద్ద పనేమీ కాదు. కానీ బీఎస్ లేదన్న కారణంతో ఇన్నాళ్లూ వారు ఐటీ ఉద్యోగాలకు నోచుకోలేదు. కానీ ఇపుడు కంపెనీలు తమ ధోరణి మార్చుకుంటున్నాయి. బీఎస్ అనే నిబంధనను సడలించి ఉద్యోగంలోకి తీసుకుందామని, తరవాత తామే బీఎస్ చదువుకునేలా స్పాన్సర్ చేయొచ్చని అవి యోచిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలయితే దీని ప్రభావం ఎక్కువగా పడేది తెలుగువాళ్లపైనే’’ అని స్థానికంగా సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతున్న మరో తెలుగు వ్యక్తి అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీలదీ అదే బాట!! టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటిదాకా తమ సిబ్బందిని క్లయింట్ సంస్థలుండే అమెరికాకు పంపటం ఎక్కువగానే జరిగేది. ఈ సంవత్సరం అది బాగా తగ్గిపోయింది. అక్కడి వారినే తీసుకుందామని కంపెనీలు భావించటం దీనికి ప్రధాన కారణం. అదేకాదు. కొన్నాళ్ల కిందటి దాకా క్లయింట్లతో సమావేశాలకు తమ సిబ్బందిని ఈ కంపెనీలు తాత్కాలికంగా యూఎస్, యూకేలకు పంపించేవి. ఇపుడు వాటికి కూడా పూర్తిగా కోతపెట్టాయి. ఇక్కడి నుంచే ‘టెలీ ప్రజెన్స్’లో సమావేశం కావాలని తమ సిబ్బందికి చెబుతున్నారు. అంటే ఒకరకమైన వీడియో కాల్స్ వంటివన్న మాట. మనం సర్వీసెస్‌లో ఉండిపోవటం వల్లేనేనా? భారత ఐటీ రంగం చిరకాలంగా సర్వీసులపైనే ఆధారపడి నెట్టుకొస్తోందని, మన నుంచి బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి ఒక్కటీ లేదని ఐటీ కన్సల్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు పలు ఉత్పత్తుల్ని తెస్తున్నాయి. భారతీయులే వాటిని నడిపించే స్థానాల్లో ఉన్నా... భారత దేశం నుంచి ఒక్క ఉత్పత్తీ లేకపోవటం విషాదకరమే. ప్రస్తుతం ఉత్పత్తులు పెరుగుతున్నాయి కానీ సర్వీసులు పెరగటం లేదు. అదే తాజా పరిస్థితులకు కారణం’’ అని ఆయన తెలియజేశారు. అసలు కారణాలివీ... నిజానికి ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవటానికి అంతా ట్రంప్‌నే కారణంగా చూపిస్తున్నా... నిపుణులు మాత్రం అదొక్కటే కారణం కాదని చెబుతున్నారు. ‘‘కొన్నాళ్లుగా ఐటీ రంగం నెమ్మదించింది. ఎందుకంటే వివిధ సంస్థలు ఐటీపై పెడుతున్న ఖర్చును తగ్గించేశాయి. దీంతో గత నాలుగేళ్లుగా ఐటీ కంపెనీల బిల్లింగ్ పెరగటం లేదు. పైపెచ్చు ఐటీ సంస్థల మధ్య పోటీ పెరగటంతో ఇపుడు బిల్లింగ్ తగ్గిస్తామని బేరాలు కూడా ఆడుతున్నారు. మరోవంక ఐటీ కంపెనీలు మాత్రం ప్రతి ఏటా తమ సిబ్బందికి కనీసం 10 శాతం జీతం పెంచాల్సి వస్తోంది. దీంతో ఖర్చులు పెరిగి, చివరకు ఉద్యోగాల్లో కోత పెట్టాల్సి వస్తోంది’’ అని టీసీఎస్ సీనియర్ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల పలు భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడి వారినే నియమించడానికి దిగుతున్నాయి. ఈ ప్రభావం ఇక్కడి ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఆటోమేషన్ వల్ల పలువురి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మూడు కారణాలూ కలిసి ఐటీని భయపెడుతున్నాయి’’ అని కాగ్నిజెంట్ సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, డిజిటల్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని, ఆ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిన వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అమెరికాలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థను నిర్వహిస్తూ... విజయవాడలో ‘ఫ్రిస్కా’ పేరిట హోమ్‌హెల్త్‌కేర్ సంస్థను ఏర్పాటు చేసిన అసిఫ్ మొహమ్మద్ చెప్పారు. ‘‘మనమిపుడు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచంలో ఉన్నాం. క్లౌడ్ ఆటోమేషన్ ఇంకా పెరుగుతుంది. ఉద్యోగులు అత్యాధునిక సర్వర్‌లెస్ కంప్యూటింగ్ (లాంబ్డా), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) డేటా సైన్స్ వంటి టెక్నాలజీల్లో తమ నైపుణ్యాల్ని అప్‌గ్రేడ్ చేసుకోవటం తప్పనిసరి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగమని, ప్రతిదీ ఇంటర్నెట్తో కనెక్ట్ కావాల్సిందేనని చెబుతూ... అందుకే తాము టెక్నాలజీ ఆధారంగా విజయవాడలో తొలి హోమ్హెల్త్కేర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. -
హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం ► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు ► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు ► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. -
డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్‌కు ఉత్తర్వులు
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని ఐదు, ఆరో జోన్ల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యూవల్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈమేరకు హన్మకొండలోని ఉన్నతవిద్య ఆర్జేడీ డాక్టర్ బి.దర్జన్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయా జోన్లలో మెుత్తం 860 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో గత విద్యా సంవత్సరంలో బోధన చేసి ఈ విద్యాసంవత్సరంలో కొనసాగుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభు త్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, జేసీ, కళాశాల ప్రిన్సిపాల్లతో కూడిన కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించి రెన్యూవల్ చేస్తుందని అందులో ప్రస్తావించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసి ఇప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యాపకులకు సంబంధించిన దరఖాస్తులను ప్రిన్సిపాల్స్ ఉన్నత విద్య ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులలో వివిధ సబ్జెక్టులలో ఎక్కడైనా జిల్లాల్లో ఖాళీగా ఉంటే అక్కడికి వారిని నియమించే అవకాశాలు ఉంటాయి. -
సెల్..రెవెన్యూ నిల్
అనుమతి లేకుండానే టవర్ల ఏర్పాటు పట్టించుకోని అధికార యంత్రాంగం పంచాయతీల ఆదాయానికి గండి నిధుల కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీల పరిధిలోని వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే సెల్టవర్ల క్రమబద్దీకరణ, పన్నుల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా పట్టించుకోకపోతుండడంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. కోట: జిల్లాలోని 46 మండలాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించి 972 వరకు సెల్‌టవర్లు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోట, పొదలకూరు వంటి పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క చోట 5 నుంచి 20 వరకు టవర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరాల మేరకు ఆయా కంపెనీలు టవర్లు ఏర్పాటు చేశాయి. సెల్‌టవర్ ఏర్పాటుకు పంచాయతీల నుంచి రెండువిడతలుగా అనుమతి పొందాలి. ఇందుకు గానూ నిర్ణీత ప్రదేశంలో నేలపై ఏర్పాటు చేస్తే రూ.15వేలు, భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12వేలు వంతున పంచాయతీలకు చెల్లించాలి. ఏటా ఇదే మొత్తాన్ని చెల్లించి అనుమతులను రెన్యువల్ చేయించుకోవాలి. కానీ ఎక్కడా ఇది జరగడం లేదు. పట్టించుకుంటే ఆదాయమే పట్టణాల్లో సెల్‌టవర్లకు అనుమతులు పొందుతున్న సెల్‌కంపెనీలు పంచాయతీల్లో తీసుకోవడం లేదు. కోట మేజర్ పంచాయతీ పరిధిలో ఏడు టవర్లు ఉండగా, ఐదేళ్లలో ఒక్క టవర్ నిర్వాహకులు మాత్రమే రెన్యువల్ చేయించుకున్నట్లు సర్పంచ్ రాఘవయ్య తెలిపారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొని ఉంది. కొన్ని చోట్ల స్థానిక నాయకుల అండదండలతో గ్రామకార్యదర్శులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం పరిధిలో ఏళ్లకు తరబడి అనుమతులు పొందని టవర్ల సంఖ్య అధికంగానే ఉంది. వీటిపై అధికారులు దృష్టి సారిస్తే పంచాయతీలకు లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేస్తాం: రమేష్, డీఎల్పీఓ,గూడూరు గ్రామాల్లో అనుమతులు పొందని సెల్‌టవర్లకు నోటీసులు జారీ చేస్తాం. పంచాయతీల వారీగా పూర్తి సమాచారం సేకరించాలని ఈఓపీఆర్డీ, కార్యదర్శులను ఆదేశించాం. నెల రోజుల్లోగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. -
రైతులందరికీ ఖరీఫ్ రుణాలు
♦ మూడో విడత రుణమాఫీ కోసం చూడొద్దు ♦ బ్యాంకర్లకు ఏజేసీ వెంకటేశ్వర్లు ఆదేశం సాక్షి, సంగారెడ్డి: రైతులందరికీ పంట రుణాలు రెన్యువల్ చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూడకుండా ఖరీఫ్ పంట రుణాలు అందజేయాలన్నారు. పంట నష్టాల కింద బ్యాంకర్లు అందించిన సబ్సిడీని రైతులకు అందించాలని, లేనిపక్షంలో తిరిగి పంపించాలన్నారు. కేంద్రం స్టాండప్ ఇండియా పథకం కింద ప్రతి బ్యాంకు తప్పనిసరిగా ఇద్దరు ఎస్సీ, ఎస్టీ మహిళలను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఐదువేల జనాభా దాటిన గ్రామాల్లో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదలను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకుల ప్రా రంభోత్సవాలు, రుణమేళాలకు తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ మాట్లాడుతూ... ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీ విడుదలైన యూనిట్లను వెం టనే గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లను కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి మాట్లాడుతూ... 2015-16 సంవత్సరానికి సంబంధించి 95 శాతం లబ్ధిదారుల ఖాతాలు ప్రారంభించినట్టు తెలిపారు. సబ్సిడీని 15 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారి జగ్మాల్సింగ్ మాట్లాడుతూ... 2016-17 సం వత్సరానికి 421 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగిందన్నారు. వీటి గ్రౌండింగ్‌కు సహకరించాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరానికి జిల్లాలో రూ.695 కోట్ల బ్యాంకు రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. లక్ష్యం మేరకు బ్యాంకర్లు రుణా లు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని బ్యాంకులు మహిళా గ్రూపుల పొదుపు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయనివ్వటంలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరా రు. ఆర్బీఐ డీడీఎం గణేశన్ మాట్లాడుతూ.. సొలార్ ఎనర్జీ, లాంగ్ టైమ్ ఏరియా బేస్డ్ పథకాల కింద డెయిరీ, వెజిటబుల్, గొర్రెల పెంపకం యూనిట్ల కోసం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం జరి గిందన్నారు. ఈ పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అర్హులకు రుణాలు అందించాలన్నారు. పంటల బీమా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో నూనెగిం జలు, పప్పు ధాన్యాలపై బీమా ప్రీమియం రెండు శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. కూరగాయలు, వాణిజ్య పంటలపై ఐదు శాతం, రబీలో అన్ని పంటలకు 1.5 శాతం బీమా ప్రీమియం నిర్ణయించినట్లు వివరించారు. సమావేశంలో ఎల్డీఎం రఘురాం, నాబార్డు డీడీఎం జి.రమేశ్, బ్యాంకు కోఆర్డినేటర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. -
వసూల్ రాజా!
విద్యా శాఖలో అంతా ఆయనే.... ► అనుమతి కావాలంటే చేయి తడపాల్సిందే ► పాఠశాలల రెన్యూవల్‌కూ తప్పని కాసుల బెడద ► ఏళ్ల తరబడిగా కార్యాలయంలోనే తిష్ట ► మధ్యవర్తిత్వం నెరుపుతున్న ఓ పాఠశాల యాజమాని ► ఫిర్యాదుకు యాజమాన్యాల వెనుకంజ ► లొసుగుల నేపథ్యంలో సాఫీగా వ్యవహారం మీరు కొత్తగా స్కూల్ పెట్టాలనుకుంటున్నారా? అయితే, విద్యాశాఖలో ఆ అధికారిని కలవాల్సిందే! మీ పాఠశాలను మళ్లీ వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవాలా? ఆ అధికారిని కలిసి చేయి తడపండి. ఇట్టే పనైపోతుంది!! సాక్షి ప్రతినిధి, కర్నూలు: విద్యా శాఖలో ఏ పని కావాలన్నా కాసులతో పని. జేబు బరువుంటేనే అక్కడ పని అవుతుందనే ఆరోపణ వినిపిస్తోంది. ప్రతి పనికీ రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సదరు అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు టీచర్లు కలిసి పెట్టుకున్న చిన్న పాఠశాలను కూడా ఈయన వదలని పరిస్థితి. కొండారెడ్డి బురుజుకు దగ్గరలోని ఓ పాఠశాల యజమాని ఈ దందాకు మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. పాఠశాలకు సంబంధించిన ఏ అనుమతి కావాలన్నా ముందుగా సదరు అధికారిని కలవాల్సి వస్తోంది. ఆ వెంటనే ఆయన పనిని బట్టి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఈ మొత్తం అందజేతకు నమ్మకస్తుడైన ఓ వ్యక్తికి అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కొండారెడ్డి బురుజు సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమానే ఆ నమ్మకస్తుడు. అక్కడ పైసలు ముట్టిన వెంటనే ఇక్కడ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మూడో కంటికి తెలియకుండా ఆయన వ్యవహారం సాగిపోతోంది. అడిగిన మొత్తం సదరు మధ్యవర్తికి అందలేదంటే.. సంబంధిత ఫైలు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కనీస సౌకర్యాలు కరువు వాస్తవానికి జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. ఏ పాఠశాలలోనూ విద్యార్థులకు సరిపడా టాయ్లెట్లు, ఆట స్థలం కానీ లేవు. అంతేకాకుండా సరైన టీచర్లు కూడా లేరు. మరోవైపు ఒక్కో క్లాసు రూంలో అనుమతికి మించి విద్యార్థులు ఉంటున్నారు. అదేవిధంగా ఒక్కో సెక్షన్‌కు కూడా పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. అన్నింటికీ మించి వసూలు చేసే ఫీజుల విషయంలో విద్యాశాఖ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తమ లోపాలను ఏ మాత్రం చూసీచూడనట్టు వదిలేసేందుకు ప్రతి పనికో రేటును నిర్ణయించి ఆ అధికారి తన పబ్బం గడుపుకుంటున్నాడు. అన్నీ తానై నడిపిస్తున్న వైనం విద్యాశాఖలో ఈ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తిష్టవేసిన సదరు అధికారికి విద్యాశాఖలోని మొత్తం వ్యవహారాలు కొట్టిన పండి కావడంతో ఎవ్వరికీ చిక్కకుండా పనులు చక్కపెట్టుకుంటున్నారు. ఈ అధికారిని విద్యాశాఖ నుంచి కదిలించేందుకు అనేక మంది చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తమ లోటుపాట్లు బయటపడకుండా ఉండేందుకే.. లంచాలు ఇస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఈయనపై ఫిర్యాదు వెనుకంజ వేస్తుండటానికి కారణంగా తెలుస్తోంది. -
రెన్యువల్‌కూ రేటు!
ఎయిడెడ్ స్కూళ్లకు ముడుపుల బెడద రెన్యువల్ కాకపోతే జీతాలు బంద్ ఉసూరుమంటున్న ఉపాధ్యాయులు విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూళ్లకు అవినీతి బెడద పట్టుకుంది. మామూళ్లు ఇస్తేనే తప్ప రెన్యువల్ జరగని పరిస్థితి నెలకొంది. అలా రెన్యువల్ పూర్తికాని పాఠశాలల ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయే ప్రమాదంలో పడుతున్నాయి. దీంతో ఆయా ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు జీతాలందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు రెన్యువల్ ర్దిష్టంగా ఉండడం లేదు. ఏటా కొన్ని, రెండేళ్లకు కొన్ని రెన్యువల్ చేసుకోవలసినవి మరికొన్ని ఉన్నాయి. పలుకుబడి ఉన్నవారు, ప్రయివేటు స్కూళ్ల వారు రెన్యువల్ విషయంలో ‘అడిగినవి’ సమర్పించుకోవడంతో ఏమంత అవస్థలు పడడం లేదు. కానీ ఏడాదికో, రెండేళ్లకో రెన్యువల్ చేయించుకోవలసి వస్తున్న చోటా, మోటా స్కూళ్ల వారు చిక్కుల్లో పడుతున్నారు. రెన్యువల్ చేయించుకోవాలంటే సంబంధిత స్కూలు స్థల పత్రాలు, ప్లాన్, లీజు ఆధారాలు, ఫైర్ సర్టిఫికెట్లు, పారిశుధ్య పరిస్థితి, ఆట స్థలం వంటివి సమర్పించాలి. వీటన్నిటినీ రీజనల్ జాయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ)కు పంపుతారు. ఆర్జేడీ సంతృప్తి చెందాక రెన్యూవల్ చేస్తారు. కానీ జీవీఎంసీ, ఫైర్, డీఈవో కార్యాలయాల్లో సంబంధిత సిబ్బంది చేతులు తడిపితేనే తప్ప రెన్యూవల్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రెన్యువల్ నోచుకోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. సకల హంగులూ ఉన్న పెద్ద ఎయిడెడ్ స్కూళ్లు, ప్రయివేటు పాఠశాలల నిబంధనలనే రేకుల షెడ్లు, సాదాసీదా భవనాల్లో నడుస్తున్న వాటికీ వర్తింప చేస్తూ పితలాటకం పెడుతున్నారని ఈ టీచర్లు వాపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో స్కూలు రెన్యూవల్‌కు స్థాయిని బట్టి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముడుపులు సమర్పించుకోవలసి వస్తోందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని భరించే వారికి నిరభ్యంతరంగా రెన్యువల్ అయిపోతోందంటున్నారు. ఆ స్తోమతు లేని స్కూలు యాజమాన్యాలు ముడుపులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా రెన్యువల్ నిలిచిపోయి గుర్తింపు (రికగ్నైజేషన్)కు ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆరేడు నెలలుగా కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడు జీతాల గ్రాంటును మంజూరు చేసినా స్కూళ్లు రెన్యువల్ కాకపోవడం వల్ల వారు వాటిని పొందే అవకాశం లేదు. ఫలితంగా ఈ టీచర్లంతా అటు జీతాల్లేక, త్వరలో అందుకునే వీలు లేక, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. -
మాఫీ.. మాయ!
రెన్యువల్ చేసుకున్న రైతులకే రెండో విడత రుణమాఫీ జిల్లాలో మొత్తం రుణమాఫీ అర్హులు 2,08,425 మంది రెన్యువల్ చేసుకున్న వారు 26,399 మంది రంగారెడ్డి జిల్లా : రుణమాఫీపై ప్రభుత్వం పెడుతున్న సవాలక్ష నిబంధనలు రైతులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవల రెండో విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యం.. యంత్రాంగం జిల్లాలో 2,08,425 మంది రైతులకు రూ.125.6 కోట్లు బ్యాంకులకు బదిలీ చేసింది. ఈక్రమం లో ఈనెల 31లోగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అయితే రెన్యువల్ చేసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. రైతుల పంటరుణాలను రెన్యువల్ చేయడంలో బ్యాంకర్లు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో పంట రుణ మాఫీకి 2,08,425 మంది అర్హులున్నారు. వీరంతా రుణాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 26,399 మంది రైతులు మాత్రమే రుణాలను రెన్యువల్ చేసుకున్నారు. దీంతో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటివరకు రూ.22.22 కోట్లు జమచేసింది. నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 12శాతం మాత్రమే పురోగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ నిధులు జమచే యడం కష్టమే. కదలనున్న అక్రమాల డొంక.. రుణమాఫీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు తాజాగా రెన్యువల్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి విడతల వారీగా రుణాన్ని మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిసారి రైతులు రుణాన్ని రీషెడ్యుల్ చేసుకోవాలి. ఈ క్రమంలో బోగస్ ఖాతాల తంతు బయటపడనుంది. మొదటివిడతలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో మూడున్నరవేల మంది నకిలీ రైతులు బయటపడ్డారు. దీంతో వారికివ్వాల్సిన నిధులను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయితే అక్రమాల సంగతి తేలనుంది. అదేవిధంగా ఆడిట్ నివేదికలు సైతం రావాల్పి ఉంది. మొత్తంగా జాప్యం జరుగుతున్న కొద్దీ అక్రమాల తంతు వెలుగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
రద్దయిన ఎంప్లాయ్మెంట్ కార్డుల రెన్యువల్
హైదరాబాద్: గడువు ముగిసి రద్దయిన ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్య రద్దయిన కార్డుదారులందరూ సెప్టెంబర్ 30లోగా తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ గడువు దాటినందుకు కారణాలను వివరిస్తూ.. సంబంధిత ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేం జ్లు, సబ్ ఎక్స్ఛేంజ్లకు వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించాలి. కార్డులు రద్దయిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డెరైక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరగరాశారు!
ఈ గణాంకాలు చూస్తుంటే బ్యాంకర్లు రైతుల పాలిట స్పందించిన తీరు అమోఘమనిపిస్తోంది కదూ. కానీ ఇదంతా బ్యాంకర్లు చూపిస్తున్న లెక్కల మాయ. అసలు సంగతి ఏమిటంటే.. రబీ సీజన్లో రైతుల చేతికి వచ్చిన రుణం కేవలం రూ.29.01 కోట్లు మాత్రమే. ఈ రుణ మొత్తం అందింది 20,023 మంది రైతులకే. మిగతా రుణాలన్నీ రెన్యూవల్, రీషెడ్యూల్ చేసినవే. బుధవారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్డీఎం) జిల్లా యంత్రాంగానికి సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. - పంటరుణాల పంపిణీలో బ్యాంకర్ల గిమ్మిక్కులు - రెన్యూవల్, రీషెడ్యూల్ ప్రక్రియతో సరిపెట్టిన వైనం - ఎండమావిగా ఆర్థికసాయం రబీ సీజన్లో పంటరుణాల లక్ష్యం : రూ.272.44 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు : రూ.256.42 కోట్లు లబ్ధిపొందిన రైతులు : 58,362 రబీలో రుణ పంపిణీ సాధన : 94.1శాతం సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ స్థాయిలో పంట రుణ ప్రణాళిక రూపొందించడం.. చివరకు కాకి లెక్కలతో పురోగతిని వివరించడం జిల్లా యంత్రాంగానికి పరిపాటిగా మారింది. రైతులకు కోట్ల రూపాయల రుణాలిస్తున్నామంటూ ప్రగల్బాలు పలికే బ్యాంకర్లు.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లెక్కల మాయ చేసి లక్ష్యాల్ని సాధించినట్లు చూపిస్తున్నారు. ఇందులో కొత్తగా రుణాలందించడం అతితక్కువగా ఉండడం, పాత బకాయిలనే రెన్యూవల్ లేదా రీషెడ్యూల్ చేయడం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లోనూ ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. రూ. 272.44 కోట్లు ఇస్తామని కార్యచరణ విడుదల చేసిన అధికారులు.. ఇప్పటివరకు రూ.29.01 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా రూ.227.41 కోట్లు రీషెడ్యూల్, రెన్యూవల్ చేసి 94.1శాతం లక్ష్యం సాధించినట్లు చెప్పుకోవడం గమనార్హం. రికార్డుల్లోనే అంకెలు.. వరుస నష్టాలతో కుదేలవుతున్న రైతులకు పంటల సాగుకు పెట్టుబడి రూపంలో బ్యాంకులు రుణాలందిస్తాయి. ప్రభుత్వమే ఇందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తుంది. భూముల పాసు పుస్తకాల్ని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలివ్వడం సాధారణమే. కానీ ప్రస్తుతం బ్యాంకులు రూటు మార్చాయి. రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాను కరువు ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా ఆర్థిక చేయూత అందించాలి. ఈ క్రమంలో రుణాలు రీషెడ్యూల్ చేసిన బ్యాంకులు.. చివరగా రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా చేతులె త్తేశాయి. జిల్లావ్యాప్తంగా 62వేల మంది రైతులకు రూ.211.25 కోట్లు రెన్యూవల్ చేయగా 5,807 మంది రైతులకు రూ.16.16 కోట్లు రీషెడ్యూల్ చేశారు. చెయ్యిచ్చిన ప్రధాన బ్యాంకుల - జిల్లాలో లీడ్ బ్యాంకుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) వ్యవహరిస్తోంది. - ఈ క్రమంలో ప్రస్తుత రబీ సీజన్లో రూ.65.5కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. - కానీ ఈ బ్యాంకు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా కొత్తగా రుణం ఇవ్వలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కు సైతం రూ.2.44 కోట్ల లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఒక్కపైసా రైతులకు రుణరూపంలో ఇవ్వలేదు. ప్రధాన బ్యాంకులే మొండికేయడంతో జిల్లాలో ఆర్థిక సాయం కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన సభావట్ లింగా 2012లో తనకున్న 4.20 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి మాల్ ఆంధ్రాబ్యాంకులో రూ. 80 వేల రుణం తీసుకున్నాడు. వడ్డీతో సహా రూ.లక్ష ఏడు వేలు అయింది. ప్రభుత్వం రుణమాపీ చేయడంతో రూ. 25 వేలు మాఫీ అయింది. కొద్ది రోజుల కింద లింగా బ్యాంకులో రెన్యూవల్ చేసుకున్నాడు. రూ.లక్ష రుణం కింద జమ చేసుకొని కేవలం రూ.7 వేలను మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు మీద మళ్లీ రూ.లక్ష అప్పు అలానే మిగిలింది. -
పత్రం ఉంటేనే మాఫీ !
రుణమాఫీ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో పరీక్ష పెట్టింది. అర్హులను వెతికేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళాలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణపత్రాలు జారీచేసేందుకు రుణమేళాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్నికల సంఘం అనుమతే అనివార్యమైంది. మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఎన్నికల హామీమేరకు రైతురుణాలు మాఫీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా..రుణమాఫీ చేస్తామని చెప్పింది. తీరా కుటుంబంలో ఒక్కరికే రూ.లక్ష వరకు రుణమాఫీచేస్తూ గత సెప్టెం బర్లో జీఓ విడుదల చేసింది. జనవరి చివరి వరకు రుణాలను రెన్యూవల్ చేసుకుంటేనే మాఫీ వర్తిస్తుందని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో చాలామంది రైతులు రెన్యూవల్ చేసుకోకపోవడంతో మళ్లీ ఈనెల 15వ తేదీనాటికి గడువు విధించింది. రెన్యూవల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ అని స్పష్టంచేసిన ప్రభుత్వం పట్టాదా రు పాసుపుస్తకాలు బ్యాంకర్లకు చూపిం చాలన్న మెలికపెట్టింది. బ్యాంకర్లు డిక్లరేషన్ చేసిన రైతుల జాబితా ప్రామాణికంగా అధికారులు అర్హులను గుర్తిం చారు. అయితే కొన్ని కారణాల వల్ల రెన్యూవల్ చేసుకోని అన్నదాతలకు ప్రభుత్వం మొండిచేయి చూపనుంది. అంతేకాకుండా బంగారంపై రుణాల రెన్యూవల్‌పై కచ్చితమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడంతో బ్యాం కర్లు రుణమాఫీపై వెనకడుగు వేశారు. దీంతో బంగారురుణాల మాఫీ జిల్లాలో ప్రశ్నర్థాకంగా మారింది. రైతుల గుండెల్లో గుబులు జిల్లాలోని 6.07లక్షల మంది రైతులు రూ.2725కోట్ల రుణాలను నాలుగు విడతలుగా మాఫీ పొందేందుకు అర్హత సాధించారు. మొదటివిడతలో జిల్లాకు 25శాతం అనగా రూ.681.45కోట్లు విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు దాదాపు 4.80లక్షల మంది మాత్రమే దాదాపు రూ.2170కోట్లను రెన్యూవల్ చేసుకుని రుణం పొందారు. ఇదిలాఉండగా, ఈనెల 15 తేదీతో గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రటించిన మాదిరిగా జిల్లాలో 16 నుంచి 23వ తేదీ వరకు రుణామేళాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోఎన్నికలసంఘంఅనుమతి కోసం వేచిచూస్తున్నారు. అధికారులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో గుర్తించిన రైతులందరికీ రుణ మాఫీ కింద మొదటి విడత సొమ్ము బ్యాంకులో జమైంది. ఇప్పటివరకు రె న్యూవల్ చేసుకోని రైతుల ఖాతాల నుం చి వాటిని వెనక్కి తీసుకోనున్నారు. అ లాగే బ్యాంకర్ల డిక్లేరేషన్ ప్రామాణికం కావడంతో అవగాహనలేమి, వలసవెళ్లిన,మృతిచెందిన,అప్పులబాధతో భూ ములు అమ్ముకున్న రైతులకు రెన్యూవల్లో ఎలాంటి మినయింపు ఇవ్వలేదు. దీంతో రెన్యూవల్ చేసుకోని రైతుల కుటుంబసభ్యుల్లోగుబులు మొదలైంది. ఎనిమిది రోజుల పాటు నిర్వహించే రుణమాఫీ మేళాలో అన్ని గ్రామాల్లో తహశీల్దార్ సంతకంతో కూడిన రుణ ధ్రువీకరణపత్రాలను రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందజేస్తారు. ఈ పత్రాలు పొందిన రైతులు మాత్రమే వచ్చే మూడేళ్లలో మూడు విడతలుగా రుణమాఫీకి అర్హత సాధిస్తారు. అనుమతి కోసం వేచిచూస్తున్నాం.. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళా లు నిర్వహించేం దుకు ఏర్పాటుచేశాం. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. సోమవారంలోగా అనుమతిపై సమాచారమందే అవకాశం ఉంది. అనుమతులు రాగా నే రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేస్తాం. - భగవత్‌స్వరూప్, జేడీ, వ్యవసాయశాఖ -
11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!
34 లక్షల మంది రైతుల్లో... 23 లక్షల మంది రుణాలే రె న్యువల్ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 14 వేల కోట్లు... ఇచ్చింది రూ. 11 వేల కోట్లు రబీ సీజన్‌కు సంబంధించి కూడా లక్ష్యానికి దూరంగా రుణాల మంజూరు నెలాఖరులోగా ‘రెన్యువల్’ పూర్తి చేసి రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వఆదేశం రైతులే ముందుకు రావడం లేదంటున్న బ్యాంకర్లు లక్ష్యాల మేరకు ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా దాదాపు 11 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రెన్యువల్ కాలేదు. ఖరీఫ్ సీజన్లో మొత్తంగా రూ. 14 వేల కోట్ల మేరకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో పెట్టుకున్న రుణ మంజూరు లక్ష్యం రూ. 6,300 కోట్లు కాగా... ఇప్పటికీ ఈ రుణ పంపిణీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లను విడుదల చేయడంతో... మొత్తం 34 లక్షల రైతుల రుణాలను రెన్యువల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఖరీఫ్‌లో రైతులకు మొత్తం రూ. 11 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మిగతా 11 లక్షల మంది రైతుల రుణాలు రెన్యువల్ చేసి, వెంటనే వారికి కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. అయితే వర్షాల్లేక, క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక రైతులు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికే 33 శాతం మేరకు ఇచ్చినట్లు వివరించారు. కాగా.. రబీ సీజన్లో రూ. 6,300 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినా... క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో బ్యాంకులు వివరిస్తే దానిని సరిచేయడానికి వీలవుతుందని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలు ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని బ్యాంకులను కోరారు. ఇదివరకే మంజూరైన వారికి ఈ మూడు నెలల కాలంలో రుణాలన్నీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. పంట రుణాల రెన్యువల్లో కొద్దిరోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా దానిని పూర్తి చేయాలని కోరారు. సంతృప్తస్థాయిలో బ్యాంకు ఖాతాలు.. తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చామని, ఈ నెల 20వ తేదీ నాటికి అందరికీ ఖాతాలు కల్పించినట్లు ప్రకటించనున్నామని బ్యాంకర్లు సమావేశంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద 36 లక్షల ఖాతాలు తెరిపించినట్లు చెప్పారు. వారందరికీ ‘రూపే’ కార్డులను పంపిణీ చేశామని... వారికి రూ. 30 వేల జీవిత బీమా, రూ. లక్ష ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దాదాపు కోటి బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను అభినందించారు. రాష్ట్రంలో బ్యాంకు శాఖల సంఖ్య 4,682కు చేరిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 10,531 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, దీనితో మొత్తం డిపాజిట్లు రూ. 2,97,422 కోట్లకు చేరాయని తెలిపారు. దేశంలో రుణ నిష్పత్తి అత్యధికంగా 113 శాతం ఉన్నట్లు తెలిపారు. -
బీమా గడువు దాటితే బాదుడే..!
3 లక్షల వాహనాలకు రూ.1000 చొప్పున చలానా.... విధించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో హైదరాబాద్‌లో శ్రీకారానికి కసరత్తు దేశంలోనే తొలిసారిగా అమలు మియాపూర్‌కు చెందిన రవీందర్ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. కారు రోడ్డెక్కితే చలానా పడుతుందని, నేడో..రేపో ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేశాక కారును బయటకు తీద్దామని ఇంట్లోనే ఉంచాడు. ఈలోగా సైబరాబాద్ పోలీసుల నుంచి రూ.1000 చలానా కట్టాలని రవీందర్ ఇంటికి రసీదు చేరింది. తాను కారును రోడ్డుపైకి తీసుకెళ్లకున్నా... ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వంటనే చలానా విధించడాన్ని చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. ఇలా ఒక్క రవీందరేకాదు... నెల రోజుల వ ్యవధిలో సుమారు మూడు లక్షల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు రోడ్డుమీద తిరగకున్నా...ఇంట్లో ఉన్నా గడువులోగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుంటే ఆటోమెటిక్‌గా చలానా బారిన పడడం ఖాయమని...ఇలా చలానా విధించే అధికారం తమకు మోటారు వాహనాల చట్టం (196) కల్పించిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు కూడా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే..ఇన్సూరెన్స్ గడువు ముగిసి..రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాహనానికి చలానా విధించే అధికారం లేదని, కేవలం రోడ్డుపై తిరిగే వాహనాలకు మాత్రమే చలానా విధించాలని మోటారు వాహనాల చట్టం చెబుతోంద ని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ పేర్కొన్నారు. ఒకపక్క ట్రాఫిక్ పోలీసులు చట్టం ప్రకారమే చలానా వేస్తున్నామంటుండగా.. మరోపక్క ఆ ఆధికారం పోలీసులకు లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. బాధితులకు ఇన్సూరెన్సే ఆసరా... రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఊరట కలిగించేది ప్రమాదానికి కారణమైన వాహన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే. వాహనానికి ఇది లేకపోతే మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సిందే. సైబరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 33 శాతం వాహనాలు ‘థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్’ రెన్యూవల్ చేసుకోలేదని దర్యాప్తులో తేలింది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి చెక్‌పెట్టేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతిలు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోని వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని రకాల వాహనాలకు సంబంధించిన (బైక్, ఆటో, కారు, జీపు, లారీ, డీసీఎం, భారీ వాహనాలు) ఇన్సూరెన్స్ డేటాను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీఐ) నేతృత్వంలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ (ఐఆర్ఏ) నుంచి తెప్పించుకున్నారు. ఈ డేటా ఆధారంగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని వాహనదారులకు రూ.1000 చొప్పున చలానా విధిస్తున్నారు. హెచ్చరిక చేసి ఉంటే బాగుండేది... పోలీసులు, రవాణా అధికారుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. దీంతో చలానా భారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో తెలియక వాహనదారులు సతమతమవుతున్నారు. కనీసం ఇలాంటి విధానం అమలుచేసే ముందు హెచ్చరికలు పంపితే కొంతమేరైనా తమకు వెసులుబాటు ఉండేదంటున్నారు. బాధితులకు ఊరట కల్పించేందుకే... థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల రోడ్డు ప్రమాద బాధితులు నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని ప్రతి వాహనానికి చలానా వేస్తున్నాం. ఇన్యూరెన్స్ లేని వాహనం రోడ్డు ఎక్కాలి.. తనిఖీల్లో మేం పట్టుకోవాలనేది లేదు. డేటా బేస్ ఆధారంగా చలానాలు విధించే అధికారం మోటారు వాహన చట్టం మాకు కల్పించింది. ఇలా చేయడం వల్ల వాహనదారులు బీమా గడువు ముగియకముందే అప్రమత్తమై రెన్యూవల్ చేసుకుంటారు. తద్వారా బాధితులకు కనీస న్యాయం జరుగుతుంది. - మహంతి,ట్రాఫిక్ డీసీపీ చలానా విధించే అధికారం లేదు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేయడం వాహనదారుడి బాధ్యత. ఆ ఇన్సూరెన్స్లేని వాహనాలు రోడ్డుపై తిరిగినప్పుడు మాత్రమే చలానా వేసే అధికారం అధికారులకు ఉంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లోనే ఉన్న వాహనాలకు చలానా విధించే అధికారం మోటారు వాహన చట్టంలో లేదు. - రఘునాథ్, ఆర్టీఏ జాయింట్ కమిషనర్ -
విద్యార్థులను ముంచిన నిర్లక్ష్యం
- తహశీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ ల్యాప్స్ - రెన్యూవల్ చేయించే విషయాన్ని పట్టించుకోని తహశీల్దార్ - నిలిచిపోయిన ఆన్లైన్ ధ్రువపత్రాల జారీ - వేల సంఖ్యలో ఎదురు చూస్తున్న విద్యార్థులు - 2 రోజుల్లో ముగియనున్న స్కాలర్షిప్, ఫీజు రాయితీ దరఖాస్తు గడువు - 4 రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఒక అధికారి నిర్లక్ష్యం వేలాది విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసింది. ప్రభుత్వం అందించే ఆర్థిక ఆసరా కోల్పోయే పరిస్థితిలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మీ సేవ ఆన్‌లైన డిజిటల్ కీని సకాలంలో రెన్యూవల్ చేయకపోవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి అది ల్యాప్స్ అయిపోయింది. ఫలితంగా శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం పరిధిలో ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. మీ సేవ డిజిటల్ కీ ఉంటే ధ్రువపత్రాలు జారీ చేయడానికి వీలవుతుంది. దాన్ని సకాలంలో రెన్యూవల్ చేయించాలన్న విషయాన్ని తహశీల్దార్ పట్టించుకోకపోవడంతో దాని కాలపరిమితి ముగిసిపోయింది. దాన్ని పునరుద్ధరించడం జిల్లా అధికారుల చేతుల్లో లేదు. రాజధానిలోని ఈ సేవ సాంకేతిక విభాగం మాత్రమే ఈ పని చేయాలి. దాని కోసం తహశీల్దార్ గానీ, కార్యాలయంలో ఆ బాధ్యతలు చూసే ఉద్యోగి గానీ స్వయంగా హైదరాబాద్ వెళ్లి చేయించాలి. ఇవన్నీ జరగడానికి కనీసం నాలుగు రోజులైనా పడుతుంది. కాగా డిజిటల్ కీ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఆ విషయం హెచ్చరిక రూపంలో తెలియజేస్తుంది. రెన్యూవల్ చేయించుకోవాలన్న విషయాన్ని సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్ ముందుగానే తహశీల్దార్‌కు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. 30తో గడువు పూర్తి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రియింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30తో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేయాలంటే ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే దరఖాస్తులను అన్లైన్లో మాత్రమే పంపాలి. ఈ పాస్ వెబ్సైట్ మీ సేవ నుంచి ఆన్‌లన్‌లో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువపత్రాలనే తీసుకుంటుంది. మెన్యూవల్గా జారీ చేసే ధ్రువపత్రాలను తీసుకోదు. ఈ పరిస్థితుల్లో మీ సేవ డిజిటల్ కీ ల్యాప్స్ కావడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీకాకుళం పట్టణం, రూరల్ మండలం కలిపి శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం నుంచే ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుమారు 2500 మంది వీటి కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. వారంతా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిజిటల్ కీ ల్యాప్స్ అయిందని, మూడు నాలుగు రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదని, ఆక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈలోగా గడువు ముగిసిపోతుందని, ఈ ఏడాది ఉపకార వేతనం, ఫీజ్ రీయింబర్స్మెంట్ నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గడువు పెంచితే తప్ప విద్యార్థులకు నష్టం జరగడం అనివార్యంగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాలకు ఏం చేస్తాం విషయాన్ని తహశీల్దార్ ఎస్.దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించడగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఏం చేస్తామని సమాధానం చెప్పారు. ఆర్డీవో బి దయానిధి వద్ద ప్రస్తావించగా వీలైనంత వేగంగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో సంబంధిత సాంకేతిక విభాగం అధికారులతో మాట్లాడి డిజిటల్ కీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
వైద్యులకు ‘క్రెడిట్’ గంటలు!
* ఐదేళ్లలో కనీసం 30 గంటలు ఉండాలి * లేదంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్ కుదరదు * భారతీయ వైద్య మండలి సరికొత్త నిబంధన * డాక్టర్ల వృత్తి నైపుణ్యం పెరగాలనే: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త రోగాలు పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్యులు వృత్తి కౌశలాన్ని పెంపొందించుకునేలా భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) చర్యలు చేపట్టింది. మారుతున్న పరిస్థితులతోపాటు వైద్యులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఇకనుంచి ప్రతి వైద్యుడూతన ప్రతిభను గుర్తించే పని గంటలను(క్రెడిట్ అవర్స్) నిర్దేశిస్తూ ఎంసీఐ నిబంధన విధించింది. వైద్య వృత్తిలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులు, పరిశోధనలపై వైద్యులు నైపుణ్యం పెంచుకోవడానికి క్రెడిట్ అవర్స్ తప్పనిసరి చేసింది.ఈ విధానం వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమలు కానుంది. అమెరికా, ఐరోపాలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 80 వేల మంది డాక్టర్లు ఉన్నట్టు అంచనా. వీరంతా క్రెడిట్ అవర్స్ సొంతం చేసుకుంటేనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. సరైన క్రెడిట్ అవర్స్ లేకుంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు అవకాశం ఉండదు. అందరు డాక్టర్లకూ ఇది వర్తిస్తుంది. ఇక ఐదేళ్లకోసారి రెన్యువల్ తప్పనిసరి వైద్యులు ఇప్పటివరకు ఒక్కసారి ఎంసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అదనపు డిగ్రీ పొందినప్పుడు మాత్రం ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇకపై అలా కుదరదు. ప్రతి ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాల్సిందే. 30 గంటల క్రెడిట్ అవర్స్ చూపకుంటే రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు అనుమతించరు. ఎంసీఐ రెన్యువల్ చేయకుంటే వైద్యుడు ప్రాక్టీస్ చేయటం, కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయటానికి అనుమతించరు. సదస్సులు, సెమినార్లకు హాజరు కావడం, రీసెర్చ్ పేపర్లు, థీసిస్‌లు రూపొందించటం ద్వారా వైద్యులకు వైద్య విధానాలపై సరైన అవగాహన ఉంటుందని ఎంసీఐ చెబుతోంది. క్రెడిట్ అవర్స్ అంటే? ఎంసీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ అవర్స్ అంటే వైద్య పట్టా పుచ్చుకున్న ప్రతి డాక్టర్ తన వృత్తిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిణితి సాధించడం. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొనటం ద్వారా వీటిని సాధించవచ్చు. థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్ సమర్పించటం ద్వారా కూడా లభిస్తారుు. ప్రతి వైద్యుడూ రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి , రెన్యువల్ చేసుకునే నాటికి నిర్దేశిత క్రెడిట్ అవర్స్ పొంది ఉండాలి. లేదంటే ఆ రిజిస్ట్రేషన్‌ను ఆమోదించరు. సాధించటం ఎలా? * డాక్టర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొని తమ వంతు పాత్ర పోషిస్తే క్రెడిట్ అవర్స్ లభిస్తాయి. * సెమినార్ లేదా సదస్సు కచ్చితంగా 8 గంటల పాటు నిర్వహించాలి. ఎనిమిది గంటలు డాక్టరు పాల్గొంటే 4 క్రెడిట్ అవర్స్ ఇస్తారు. * ఎంసీఐ అనుమతి ఇస్తుంది. సదస్సు తీరుపై పరిశీలన చేసి క్రెడిట్ అవర్స్ నిర్ణయిస్తుంది. * అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లకు ఒక్కో సదస్సుకు రెండు క్రెడిట్ అవర్స్ ఇస్తారు * థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్‌లో పబ్లికేషన్లకూ ఈ గంటలు వర్తిస్తాయి. వీటి స్థాయిని బట్టి క్రెడిట్ అవర్స్ నిర్ణరుుస్తారు. * పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య పూర్తిచేసిన ప్రతి వైద్యుడికీ ఏడాదికి 4 గంటల క్రెడిట్ అవర్స్‌ను ఉచితంగా ఇస్తారు. వీరు నిరంతర పాఠ్యాంశాలు, కొత్త వైద్యవిధాన పద్ధతులు అనుసరిస్తున్నందున ఈ సౌకర్యం కల్పించారు. * కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరికైనా క్రెడిట్ అవర్స్ నిబంధన వర్తిస్తుంది. * ప్రతి వైద్యుడు ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్‌ను కచ్చితంగా సొంతం చేసుకోవాలి. -
కారు రెన్యూవల్ మరవద్దు...
కరెంటు బిల్లో, క్రెడిట్ కార్డు కనీస బకాయిలో చెల్లించడం మర్చిపోతే జరిగే పరిణామాలు మనకు తెలుసు. పెనాల్టీలు పడతాయి. సేవలు ఆగిపోతాయి. మోటారు వాహన బీమా రెన్యూవల్ కూడా ఇలాంటిదే. వెహికల్ ఇన్సూరెన్సును ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిందే. పాలసీ తీసుకున్న రోజు అర్ధరాత్రి నుంచే వాహన బీమా అమల్లోకి వస్తుంది. రెన్యూవల్ చేయించకపోతే ఆగిపోతుంది. ఆ తర్వాత మీ వాహనానికి బీమా కావాలంటే అందుకు సుముఖంగా ఉండే కంపెనీ వద్ద కొత్త పాలసీని కొనాల్సిందే. ఏవో పనుల ఒత్తిడిలో కొందరు మోటారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను మర్చిపోతారు. కానీ, చాలామంది వాహన యజమానులు కొన్ని వందల రూపాయలు ఆదా అవుతాయనే ఉద్దేశంతో రెన్యూవల్‌ను నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత ఊహించనిదేదైనా జరిగి వాహనానికి మరమ్మతులు చేయించాలంటే సొంత సొమ్ము వదిలించుకోవాల్సిందే. అంతేకాదు, నో క్లెయిమ్ బోనస్‌నూ కోల్పోతారు. వాహన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా వాహన యజమానిపై పడుతుంది. వాహన బీమా రెన్యూవల్ ఒక్కరోజు ఆలస్యమైనా పాలసీ మురిగిపోతుంది. తర్వాత అదే పాలసీని పొందాలంటే, కొత్త పాలసీ తీసుకున్నంత పనవుతుంది. వాహనాలకు సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ తీసుకోవడం మేలు. ఇలాంటి పాలసీకి ప్రీమియం చెల్లించాల్సిన గడువు ముగిసిపోయాక రెన్యూవల్ చేయించాలనుకుంటే సంబంధిత బీమా కంపెనీ మీ వాహనాన్ని తనిఖీ చేస్తుంది. వాహనం ఎక్కడైనా దెబ్బతిందా, ఏ భాగమైనా ధ్వంసమైందా అనే అంశాలను పరిశీలిస్తుంది. వాహనానికి డామేజీలుంటే, వాటికి బీమా కవరేజీ ఉండదు. మురిగిపోయిన పాలసీల రెన్యూవల్‌కు బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేయవచ్చు. లేదంటే బీమా ప్రతిపాదననే తిరస్కరించవచ్చు. వాహన పాలసీని ఏటా రెన్యూవల్ చేయిస్తూ, ఎలాంటి క్లెయిమ్‌లూ దాఖలు చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) వస్తుంది. తర్వాతి ఏడాది మీరు చెల్లించాల్సిన ప్రీమియంను కంపెనీ తగ్గిస్తుంది. క్లెయిమ్‌లు చేయని సంవత్సరాలు ఎక్కువగా ఉంటే ప్రీమియంలో డిస్కౌంటు 50 శాతం వరకూ ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినపుడు ఎన్సీబీ ప్రయోజనాలను బదిలీ చేసుకోవచ్చు. వాహనం ఎలాంటి బీమా లేకుండా 90 రోజులకు పైగా ఉంటే ఎన్సీబీ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. పాత వాహనాలతో పోలిస్తే కొత్త వాటిపై బీమా ప్రీమియం చాలా హెచ్చుగా ఉంటుంది. ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే వాహనాల పాలసీలను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయించాలి. -
నేటినుంచి బార్ షాపుల రెన్యూవల్
కొత్త వాటికి లభించని అనుమతి వరంగల్ క్రైం : ఈ సారి కొత్త బార్ షాపులకు అనుమతి లభించలేదు. దీంతో ఇప్పటివరకు నడుస్తున్న దుకాణాలకే రెన్యూవల్ చేయనున్నారు. సోమవారం ఆ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 90 బార్ షాపులు ఉండగా, రెన్యూవల్ ద్వారా రూ.34కోట్ల 16లక్షల ఆదాయం సమకూరునుంది. ఇప్పటికే వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ముగియగా, బార్ షాపులతో కలుపుకుని జిల్లాలో మొత్తంగా మద్యం విక్రయ కేంద్రాలు 322కు చేరుకున్నాయి. వాస్తవానికి 234 వైన్ షాపులకు దరఖాస్తులు కోరగా, 227 కే టెండర్లు వచ్చాయి. వీటిలో 25 షాపులకు ఒక్కో దరఖాస్తే వచ్చింది. 202 షాపులకు పోటీ ఉండగా, వాటిని లాటరీ ద్వారా కేటాయించారు. టెండర్లు పడని ఏడు దుకాణాల్లో రెండింటిని మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించగా, ఐదు షాపులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, 2014-15 సంవత్సరానికిగాను బార్ షాపుల రెన్యూవల్స్ సోమవారం నుంచి చేపట్టనున్నారు. వాస్తవానికి దీనికి తుది గడువు లేనప్పటికీ జూలై ఒకటో తేదీలోపే బార్ షాపుల యజమానులు రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. రెన్యూవల్ సమయంలో లెసైన్స్ ఫీజులో 1/3 వంతుగానీ, సగం గానీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని 90 బార్లలో కార్పొరేషన్ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) పరిధిలోనే 88 షాపులు ఉన్నాయి. మిగతా రెండు జనగామలో ఉండడం గమనార్హం. అక్కడి జనాభా ప్రాతిపదికన ఒక్కో బార్‌కు రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజుగా నిర్ధారించారు. మహబూబాబాద్ పరిధిలో బార్లు లేవు. అయితే ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త వాటికి అనుమతి లేనట్లు సమాచారం. అయితే, ఈదఫా కొత్త పాలసీలో ఆరు రెట్ల ప్రివిలేజిని ఐదు రెట్లకు కుదించారు. దీంతో వ్యాపారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల 28 లక్షల విలువ చేసే సరుకు అమ్మితే 18శాతం నుంచి 20 శాతం మేర లాభం ఉండేది. తాజా నిర్ణయంతో రూ.1కోటి 90 లక్షల మద్యం మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. అంతకు మించితే 14.5 శాతం మేర ఫీజును అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొరవడిన నిఘా.. ధరల్లో దగా.. లెసైన్స్.. దాని ఫీజు ఎలా ఉన్నా.. బార్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న కొంత వెసులుబాటును ఆసరాగా చేసుకుని ధరలను ఇష్టారీతిగా పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, బార్లలో ధరలపై తాము చేసేదేమీ ఉండదని ఎక్సైజ్అధికారులు చెబుతున్నారు. తమకు ధరలను నియంత్రించే అధికారం లేదని ఎక్సైజ్ శాఖ తేల్చివేయడంతో బార్ షాపుల యజమానులు విచ్చలవిడిగా ధరలు వసూలు చేస్తున్నారు. ఇక నకలీ మద్యం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
వైద్య సీట్లు పోయినట్లే!
సతులు లేకుండా సీట్లివ్వలేమన్న ఎంసీఐ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో సీట్ల కోతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)ని కలిసినా ఫలితం దక్కలేదు. మంత్రితో పాటు కొందరు ఉన్నతాధికారులు తాజాగా ఎంసీఐ అధికారులను కలిసి రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కోత విధించిన సీట్లను పునరుద్ధరించాలని, వసతుల కల్పనలో లోపాలుంటే సవరిస్తామని కోరినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏడాది క్రితం ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చే సమయంలోనే రెన్యువల్ నాటికి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని స్పష్టం చేసినట్లు ఎంసీఐ అధికారులు గుర్తు చేశారు. కానీ ఏ కళాశాలలోనూ వసతులు గురించి పట్టించుకోలేదన్నారు. ‘ల్యాబరేటరీలు లేవు.. రక్త పరీక్షలు చేసే విధానం సరిగా లేదు.. లెక్చర్ హాళ్లు బాగా లేవు.. జూనియర్ వైద్యులకు నివాస గృహాలు కూడా లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు ఎలా ఇస్తాం?’ అని ఎంసీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎంసీఐ అధికారులు స్పందించిన తీరును బట్టి చూస్తే రాష్ట్రం కోల్పోయిన ఎంబీబీఎస్ సీట్లను ఈ ఏడాది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
బ్యాంకులు వెలవెల
సాక్షి, కడప : జూన్ మాసం వచ్చిందంటే రైతులతో బ్యాంకులు కళకళలాడుతాయి. ఖరీఫ్ రుణాలకు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబరు లోపు రైతులు రుణాలను రెన్యూవల్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది బిజీబిజీగా ఉంటారు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలోని 66 ప్రాథమిక పరపతి సంఘాల పరిధిలో 70 శాతం మంది రైతులు రుణాలు రెన్యూవల్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ హామీతో బ్యాంకులు వెలవెల బోతున్నాయి. వాటివైపు అన్నదాతలు కన్నెత్తి చూడటం లేదు. బ్యాంకు సిబ్బంది పంట రుణాలు చెల్లించాలని అడిగినా ఆగండి, 8వ తేదీన చంద్రబాబు రుణమాఫీపై సంతకం చేస్తారని రైతులు ధీమాగా చెబుతూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామంతో బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. మొత్తం మీద డీసీసీబీ పరిధిలోని 66 ప్రాథమిక పరపతి సంఘాలు డీలాపడ్డాయి. ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టి రుణమాఫీ చేస్తుంది? ఎంతమేరకు రుణ మాఫీ అవుతుంది అన్న అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు రుణమాఫీ చేస్తే పెద్దగా డీసీసీ బ్యాంకుతోపాటు రైతులకు లాభం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు శాఖలు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి 2014 వరకు బ్యాంకులో ఉన్న పంట, దీర్ఘకాలిక రుణాలు, బంగారు రుణాలు మొత్తం, రైతుల జాబితాను సిద్ధం చేశారు. పంట రుణాలు ఇవే జిల్లా వ్యాప్తంగా 66 సహకార సొసైటీల పరిధిలో 89,389మంది రైతులు రూ. 250.41 కోట్ల రుణాన్ని పొందారు. ఇందులో సక్రమంగా చెల్లించని వారు 44,670 మంది రైతులు ఉన్నారు. వీరు రూ. 119.81 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ మార్చి 2014 వరకు బ్యాంకు అధికారులు లెక్కకట్టారు. సహకార బ్యాంకు కడపశాఖతోపాటు ఇతర బ్రాంచ్‌లలో 4,569మంది రైతులు రూ. 2.48 కోట్ల బంగారు రుణాలను పొందారు. ఇందులో ఎక్కువగా పంట రుణాలు రూ. లక్షలోపు ఉండడం గమనార్హం. 649 మంది రైతులకు సంబంధించి రూ. 57.56 లక్షల మొత్తాన్ని రీషెడ్యూల్ చేశారు. దీర్ఘకాలిక రుణాలు జిల్లాలో 9938 మంది రైతులు రూ. 54.51 కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా పొందారు. ఇందులో సకాలంలో సక్రమంగా రుణాలు చెల్లించని వారు 7,839 మంది రైతులు రూ. 23.97 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు బ్యాంకు అధికారులు రైతులు చెల్లించాల్సిన రుణ బకాయిలను లెక్కకట్టి సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ ప్రకటిస్తుందా? లేదా నిబంధనలు ఏవైనా విధిస్తుందా? అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులు చెల్లించాల్సిన బకాయిలు ఎంతమేరకు ఉన్నాయో లెక్కకట్టి సిద్ధంగా ఉంచినట్లు డీసీసీబీ జీఎం రాఘవేంద్రరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రెన్యువల్ జరిగేనా?
- డబ్బులు పోయినట్టేనా! - మిర్చియార్డు షాపుల యజమానుల్లో ఆందోళన - అధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం పాతగుంటూరు, న్యూస్‌లైన్, మిర్చియార్డులో కమిషన్ షాపుల రెన్వువల్ విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలక వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రెన్యువల్ చేస్తారని ఎదురుచూస్తుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాలకవర్గం మారిపోతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. షాపుల రెన్యువల్ కోసం ఇప్పటికే వ్యాపారులు అధికారికంగా, అనధికారికంగా అధికారులకు నగదు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా నగదు సమర్పించుకున్నా రెన్యువల్లో జాప్యంపై షాపుల యజమానులు ఎం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజులు క్రితమే నగరంలోని ఒక ప్రధాన ఫంక్షన్ హాలులో యూనియన్ సభ్యులు, షాపుల యజమానులు రహస్యంగా సమావేశం నిర్వహించి, శుక్రవారం కూడా మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. అధికారులపై ఒత్తిడి పెంచి అయినా రెన్యువల్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. యార్డులోని 293 షాపులు రద్దు చేస్తూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ప్రతి షాపునకు రెన్యువల్ కోసం రూ.35వేలు యూనియన్‌లోని ఒక నాయకుడికి ఇచ్చినట్లు వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి అదనంగా అధికారులు రూ.20 వేలు అడిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతన లెసైన్సు కోసం రూ.55 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారని వినికిడి. జీవో నంబర్ 17 ప్రకారం కొత్త షాపులకు రూ.10 లక్షల డిపాజిట్, రూ.25 వేలు ష్యూరిటీ కింద చూపించాలి. అయితే ఈ జీవోనే పాత, కొత్త అన్నింటికీచూపించి అధిక మొత్తంలో రెన్యువల్ కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు డబ్బులివ్వకుండా కోర్టుకెళ్లి రెన్యువల్ చేయించుకోవచ్చని సమావేశంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరికొంతమంది డబ్బులు తీసుకున్న అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పని చేయించుకోవడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పాలకవర్గం మారకముందే షాపుల రెన్యువల్ పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలని అత్యధిక మంది షాపుల యజమానులు, అసోసియేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యవసాయమెలా?!
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : చంద్రబాబు రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల పంపిణీకి బ్రేక్ పడింది. మరోవైపు విత్తన పంపిణీపై స్పష్టమైన వైఖరి తేలకపోవడంతో ‘అనంత’ రైతన్నలు అడకత్తెరలో చిక్కుకున్నారు. ముఖ్యంగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే పడింది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ, బంగారు నగల తాకట్టుపై రుణాలను ఎంతవరకు మాఫీ చేస్తారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తారా? లేక చిన్న, సన్నకారు రైతుల రుణాలేనా?.. రూ.లక్ష లోపున్న రుణాలు రద్దు చేస్తారా? లేదా గతేడాది రెన్యువల్ చేసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తారా?... ఈ తరహా ప్రశ్నలు ప్రతి రైతులోనూ తలెత్తుతున్నాయి. ఖరీఫ్ పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాలు తీసుకునే సమయం ఆసన్నం కావడంతో రైతుల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకులు ఉన్నాయి. వాటి పరిధిలోని 404 బ్యాంకు శాఖల్లో రైతుల ఖాతాలు ఉన్నాయి. కేవలం పంట రుణాల కింద 8,37,780 మంది రైతుల ఖాతాలు ఉండగా.. రూ.5,277 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో మొండిబకాయిలు (ఓవర్‌డ్యూ) 76,341 ఖాతాల కింద రూ.598.32 కోట్లు ఉన్నాయి. అలాగే 2,12,057 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.1,851 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 12,461 మంది రైతులు ఓవర్‌డ్యూ ఉన్నారు. వారు చెల్లించాల్సిన మొత్తం రూ.275 కోట్లు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ), స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సిండికేట్, కెనరా, ఆంధ్రా, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) తదితర బ్యాంకుల్లో ఎక్కువగా రైతుల రుణాలు ఉన్నాయి. మొత్తమ్మీద వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 10,24,577 మంది రైతులు రూ.6,817 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1,19,182 మంది రూ.951.15 కోట్ల ఓవర్‌డ్యూ ఉన్నారు. పూర్తి ధరతో వేరుశనగపై రైతుల అనాసక్తి ఏటా ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీతో పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం తొలుత పూర్తి ధరతో కొనుగోలు చేస్తే తరువాత రాయితీ జమ చేస్తామని మెలికపెట్టారు. వరుస పంట నష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన తాము పూర్తి ధర పెట్టి విత్తనకాయలు కొనలేమంటూ రైతుల ఆనాసక్తి ప్రదర్శిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటా వేరుశనగ ధర కాస్త అటూ ఇటుగా రూ.3,500 ఉంది. ప్రభుత్వం మాత్రం రూ.4,600 నిర్ణయించింది. క్వింటాపై రూ.1,500 రాయితీ ప్రకటించినా... తొలుత పూర్తి ధరతో కొనాలని చెప్పడంతో రైతులు మండిపడుతున్నారు. విత్తన పంపిణీకి మంగళం పాడేందుకే ఇలాంటి నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాకు 3.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. సేకరణ సంస్థలు మాత్రం నామమాత్రంగా సరఫరా చేసే పరిస్థితి ఉంది. ఇక ఎరువుల ధరలు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల రైతుల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. మూడు బస్తాలు వాడేచోట ఒక బస్తా ఎరువుతో సరిపెడుతున్నారు. -
డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్
- లేకుంటే రెన్యువల్స్ ఆగిపోతాయి - మిర్చి యార్డులో బ్రోకర్ల హల్చల్ - తమకు సంబంధం లేదంటున్న అధికారులు - ఆందోళనలో షాపుల యజమానులు పాతగుంటూరు, న్యూస్‌లైన్, డబ్బులిచ్చుకుంటేనే కమీషన్ షాపులు రెన్యువల్ అవుతాయి... లేకపోతే రెన్యువల్స్ ఆగిపోతాయ్.. అంటూ మిర్చియార్డులో కొంతమంది బ్రోకర్లు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై కమీషన్ షాపుల యజమానులు బిత్తరపోతున్నారు. కొన్ని రోజుల కిందట 293 షాపుల రెన్యువల్స్ రద్దయినట్లు షాపుల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి విధితమే. ఈ షాపులు రెన్యువల్ కావాలంటే ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టచెప్పాలంటూ బ్రోకర్లు బుధవారానికి డెడ్‌లైన్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో రెన్యువల్ కోసం ఒక్కొషాపునకు రూ.35 వేల చొప్పున 193 షాపులకు వసూలు చేశార ని ఆరోపణలున్నాయి. ఆ 193 షాపులకు మళ్లీ ఒక్కో షాపునకు రూ.20 వేలు ఇవ్వాలని, మిగిలిన వంద షాపుల రెన్యువల్ కోసం ఒక్కో షాపునకు రూ.55 వేలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే నూతనంగా 36 షాపుల ఏర్పాటుకు ఒక్కో షాపునకు రూ.55 వేల చొప్పున ఇవ్వాలని కూడా దళారులు హల్చల్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, అప్పుడు ఈ రెన్యువల్ విషయం ఎలా మారుతుందో చెప్పలేము గనుక ప్రస్తుత పాలనలోనే ముడుపులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బు వసూళ్లలో అసోసియేషన్ సభ్యుడు ఒకరు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గతంలో షాపుల కేటాయింపునకు తక్కువ డి పాజిట్ ఉండేది. నూతనగా షాపు లెసైన్సు కావాలంటే చట్టప్రకారం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి. కొందరు అధికారుల సూచనల మేరకు ఎంతోకొంత డబ్బులిచ్చి పాతవాటినే రెన్యువల్ చేసుకోవాలని కొందరు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని యార్డు కార్యాలయ సిబ్బంది అంటున్నారు. నా దృష్టికి రాలేదు... ఈ విషయంపై యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని న్యూస్‌లైన్ వివరణ కోరగా వసూళ్ల విషయం తన దృష్టికి రాలేదన్నారు. షాపుల లెసైన్సుల రెన్యువల్స్ చట్ట ప్రకారమే జరుగుతాయని చెప్పారు. -
టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్
ప్రీమియం ఎందుకు తక్కువ? ఆరోగ్యంగా ఉండి 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కోటి రూపాయలకు ఆన్లైన్లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రూ.7,000 నుంచి 8,000. అంతే...! అదే సాధారణ టర్మ్ పాలసీ తీసుకుంటే... 30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే మొత్తానికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ టర్మ్‌లో ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధికమంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో తక్కువ ప్రీమియం రేట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే.. చాలామందికి ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభిస్తాయన్న అపోహ ఉంటుంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపెనీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయింలు కూడా ఆన్లైన్ ద్వారానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్డీఏకి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం బీమా మొదలు ఆన్లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకు అయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన ప్రీమియాన్ని వెనక్కి చెల్లిస్తుంది. రెన్యువల్ మర్చిపోవద్దు... ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభమే. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేసుకోవటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఒకవేళ పాలసీ కాలపరిమితిలోగా రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్లైన్ టర్మ్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ ఇలా గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాలపరిమితిలోగానే రెన్యువల్ అయ్యేలా ఈసీఎస్ విధానాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. విషయాలు దాచొద్దు.. ధూమపానం, గుట్కా నమలడం వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25 నుంచి 35 శాతం అధికంగా ఉంటాయి. అయితే ప్రీమియం పెరుగుతుందని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందించండి. తీసుకోవటం ఇలా... ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్లైన్లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ఏ కంపెనీ అయితే ప్రీమియం తక్కువ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే పాలసీ రేట్లను పోల్చి చూడటానికి పాలసీబజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి వెబ్‌సైట్లున్నాయి. వాటిలో చూసిన అనంతరం ప్రీమియం ఏ కంపెనీ తక్కువ వసూలు చేస్తోందో తెలుసుకున్నాక... నేరుగా సదరు కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. అయితే ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
నమ్మకంగా నొక్కేశారు..!
రైతుల నమ్మకాన్ని ఆ బ్యాంకు నీరుగార్చింది. పంట రుణాల వసూళ్లలో తిరకాసు ప్రదర్శిస్తోంది. నోరున్నోళ్లకు మాత్రమే న్యాయం చేస్తోంది. పంటల బీమా ప్రీమియం పేరుతో చేతివాటం చూపింది. అడిగినోళ్లకు మాత్రమే చెల్లింపులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్న సిండికేట్ బ్యాంకు వైనమిది... సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో దాదాపు 3వేల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చారు. ఇంతకాలం బ్యాంకర్లు సూచించిన మొత్తం చెల్లిస్తూ రుణాలను ఖాతాదారులు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చారు. అయితే వడ్డీలేని పంట రుణాలతో రైతులకు నమ్మలేని నిజం బహిర్గతమైంది. ప్రీమియం పేరుతో అధిక మొత్తం వసూళ్లు చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే కిమ్మనకుండా వారి నుంచి తీసుకున్న అధిక మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇలాంటి బాగోతం నడుస్తోంది? ఎంత మొత్తాన్ని బ్యాంకు యంత్రాంగం రైతుల నుంచి దండుకుంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం రైతుల మదిలో తొలుస్తున్నాయి. కాగా ఇదే బ్యాంకులో నిక్కచ్చిగా నిలదీసిన ఖాతాదారుల నుంచి మాత్రం ఎంత మొత్తం చెల్లించాలో అంతే తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు నల్లబల్లెకు చెందిన జి.పవన్ కుమార్‌రెడ్డి పేరును ఉదహరిస్తున్నారు.రూ.1లక్ష సిండికేట్ బ్యాంకులో పంట రుణం తీసుకుంటే రెన్యువల్లో రూ.1,03,500 మాత్రమే చెల్లించినట్లు సమాచారం. వడ్డీ లేని రుణాలు కావడంతోనే.. వడ్డీ లేని పంట రుణాలు ప్రవేశపెట్టడంతో బ్యాంకు అసలు స్వరూపం బహిర్గతమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి సిండికేట్ బ్యాంకుతో ఆర్థిక పరమైన ప్రత్యక్ష లావాదేవీలను ఆ ప్రాంతం వారు నిర్వహిస్తున్నారు. లక్ష చెల్లిస్తే వడ్డీలేని రుణం కారణంగా రెన్యువల్లో పంటల బీమా ప్రీమియం, సర్వీసు ట్యాక్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆమేరకే వసూళ్లు చేస్తున్నామంటూ ముద్దనూరు సిండికేట్ బ్యాంకు ఖాతాదారులను నమ్మబలికింది. బ్యాంకర్లు చెప్పిన మేరకు మాత్రమే చెల్లింపులు చేస్తూ వచ్చారు. అయితే ప్రీమియం చెల్లింపుల్లో తేడాను గుర్తించడంతో అసలు విషయం బహిర్గతమైంది. 3.5శాతం మాత్రమే ప్రీమియం వసూలు చేయాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో వసూలు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రశ్నించిన వారికి మాత్రం ఎవరెవరి దగ్గర అధిక మొత్తం తీసుకున్నామో వారందరికీ వెనక్కి ఇచ్చేస్తామని ఆ బ్యాంకు యంత్రాంగం చెప్పుకొస్తోంది. అయితే రైతులు మాత్రం ప్రస్తుతం గుర్తించినందున వెనక్కు ఇస్తామంటున్నారు. గతంలో కూడా ఇలాగే వసూలు చేశారు కదా.. వాటి మాటేమిటి అంటుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆర్బీఐ నిబంధనలు సైతం... ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.25 వేలు లోపు పంట రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ చార్జీలు( సర్వీసు చార్జీ ) వసూలు చేయకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకర్లు వాటిని అమలు పర్చి మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంది. అయితే ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో రూ.25వేల లోపు రుణాలకు కూడా సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో అతి కొద్దిమందికి మినహా అధిక శాతం మంది నుంచి ప్రీమియం చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన లక్షలాది రూపాయలు స్వాహాకు గురైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ తతంగాన్ని ఛేదించాల్సిన లీడ్ బ్యాంకు కూడా మెతక ైవె ఖరి అవలంబిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ నాగసుబ్బారెడ్డి దృష్టికి సాక్షి ప్రతినిధి తీసుకెళ్లగా రైతుల నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. అలా ఎందుకు వసూలు చేశారన్నదానిపై విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. -
ఉపకారం..ఖాతం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు చదువుకోలేక...అటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక అల్లాడుతున్నారు. ఉపకార వేతనం పొందాలంటే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులకు వెళ్తే తమ బ్రాంచ్‌లో ఆ సదుపాయం లేదని అక్కడి సిబ్బంది బదులివ్వడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కొన్ని బ్యాంకుల సిబ్బంది విద్యార్థులను ఈసడించుకుంటూ తమకు ఖాళీలేదని చెబుతున్నారు. దీంతో వారు నిరాశతో వెనుదిరగవలసి వస్తోంది. అకౌంట్ల కోసం తిరిగే సరికే తమ సమయం అంతా అయిపోతోందని వారు వాపోతున్నారు. ఖాతాలు తెరవకపోవడం వల్ల ఉపకారవేతనాలు నిలిచిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. కేవలం బ్యాంకర్లు సహకరించకపోవడంతో జిల్లాలో ఇంకా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఖాతాలు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. మూడు బ్రాంచ్‌లకు వెళ్లినా... విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న సుధీర్ అనే విద్యార్థి ఉపకార వేతనం పొందేందుకు బ్యాంకు అకౌంట్ తెరవడానికి గజపతినగరంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌కు తండ్రితో కలిసి వెళ్లాడు. అయితే అక్కడి అధికారులు బొండపల్లిలో ఎస్బీఐ ఉందిగా అక్కడికే వెళ్లండి.. ఇక్కడ ఖాతా ఇవ్వబోమని చెప్పడంతో నిరాశతో ఇంటికి వచ్చారు. సోమవారం బొండపల్లిలోని ఎస్బీఐకి వెళ్లారు. అక్కడ సిబ్బంది ఇక్కడ ఉపకార వేతనాలకు సంబంధించి ఖాతాలు తెరవడం లేదు అని చెప్పడంతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఎస్బీఐకి మంగళవారం వెళ్లారు. ‘‘సార్ అకౌంట్ కావాలని కౌంటర్లో ఉన్న ఓ ఉద్యోగిని అడిగాడు. వెంటనే ఆ ఉద్యోగి మీది ఏ ఊరు అని ప్రశ్నించడంతో బొండపల్లి అని చెప్పాడు. మరి అక్కడ ఎస్బీఐ బ్రాంచ్ ఉందిగా ఇక్కడి వరకూ ఎందుకు వచ్చావు.. అక్కడ స్కాలర్షిప్కు సంబంధించిన అకౌంట్లు అవటంలేదు.. అందుకనే ఇక్కడికి వచ్చాం సార్ అని బదులిచ్చాడు సుధీర్. ఒక్క నిమిషం ఆలోచించిన ఉద్యోగి ఇక్కడ కూడా ఆ వెసులు బాటు లేదు.. పట్టణంలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, పోర్టుబ్రాంచ్కు వెళ్లండి’’ అని ఓ ఉచిత సలహా ఇచ్చారు. అయితే మంగళవారం బొండపల్లి ఎస్బీఐకి సుధీర్ మళ్లీ వెళ్లాడు. లేఖరాస్తే ఖాతా తెరుస్తాం.. విద్యార్థి సమస్యను విన్న అక్కడి మేనేజర్ తమ బ్రాంచ్‌లో ప్రస్తుతం ఆ వెసులు బాటు లేదని చెప్పారు. ఇక్కడ బ్యాంకు ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. అయితే ఇంత వరకూ(ఈపాస్) ఆన్లైన్లో లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరవటానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని అయితే ఇపాస్లో బ్యాంకు ఓపెన్ కావలంటే ఏమి చేయాలో తనకు ఆదేశాలు రావాలని ..అలా కాని పక్షంలో అధికారుల నుంచి లేఖ వస్తే విద్యార్థులకు ఖాతాలు తెరవటానికి తమకు ఇబ్బంది లేదని మేనేజరు స్పష్టం చేశారు. ఇది ఒక్క బొండపల్లి బ్యాంకులో మాత్రమే ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో ఉంది. అయితే ఆ పని ఎవరు చేయాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మేనేజర్లు సమాచారమిస్తే చాలు.... ఇదిలా ఉండగా సంక్షేమ శాఖ అధికారుల వాదన ఇంకోలా ఉంది. మేనేజర్లు సమాచారం ఇస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. బ్యాంకు మేనేజరే సోషల్ వెల్ఫేర్ డీడీ, మర్రిచెన్నారెడ్డి భవన్, విజయనగరం పేరు మీద నూతన బ్రాంచ్‌కు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను తెలియజేస్తూ లేఖ రాసినా, ఈ-మెయిల్ పెట్టినా సరిపోతుందని సంక్షేమశాఖ అధికారులు అంటున్నారు. మేనేజర్లు మాత్రం అధికారులు లేఖ ఇస్తే ఖాతాలు తెరుస్తామని చెబుతున్నారు. మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇటు మేనేజర్లు, అటు సంక్షేమ శాఖ అధికారులు తమతో ఆడుకుంటున్నారని, ఇప్పటికైనా వీరు చర్చించుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. సగం మంది కూడా దరఖాస్తు చేయలేదు... ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవటానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మూడు నెలలు కావస్తున్నా పలు నిబంధనల కారణంగా ఇంత వరకూ సగం మంది విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉపకార వేతనం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే ఎస్సీ విద్యార్థులు 5 వేల మంది వరకూ ఉంటారని అధికారులు అంచనా వేస్తుండగా ఇప్పటి వరకూ కేవలం 1,276 మంది, ఎస్టీలు 4 వేల మందికి గాను 563, బీసీలు 28వేల మందికి గాను 10,191, ఈబీసీలు 3200 మందికి గాను 741 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రెన్యువల్స్‌కు సంబంధించి ఎస్సీ విద్యార్థులు 4,249 మందికి గాను 2,821, బీసీలు 34,735కి గాను 23,741,ఎస్టీలు 2,904కి గాను 1,675మంది, ఈబీసీలు 3,039 మందికి గాను 2,591మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఎక్కువ మంది రెన్యువల్ విద్యార్థులు ఆధార్ నంబరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేక పోయారు.