- తహశీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ ల్యాప్స్
- రెన్యూవల్ చేయించే విషయాన్ని పట్టించుకోని తహశీల్దార్
- నిలిచిపోయిన ఆన్‌లైన్ ధ్రువపత్రాల జారీ
- వేల సంఖ్యలో ఎదురు చూస్తున్న విద్యార్థులు
- 2 రోజుల్లో ముగియనున్న స్కాలర్‌షిప్, ఫీజు రాయితీ దరఖాస్తు గడువు
- 4 రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఒక అధికారి నిర్లక్ష్యం వేలాది విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసింది. ప్రభుత్వం అందించే ఆర్థిక ఆసరా కోల్పోయే పరిస్థితిలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మీ సేవ ఆన్‌లైన డిజిటల్ కీని సకాలంలో రెన్యూవల్ చేయకపోవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి అది ల్యాప్స్ అయిపోయింది. ఫలితంగా శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం పరిధిలో ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. మీ సేవ డిజిటల్ కీ ఉంటే ధ్రువపత్రాలు జారీ చేయడానికి వీలవుతుంది. దాన్ని సకాలంలో రెన్యూవల్ చేయించాలన్న విషయాన్ని తహశీల్దార్ పట్టించుకోకపోవడంతో దాని కాలపరిమితి ముగిసిపోయింది.
దాన్ని పునరుద్ధరించడం జిల్లా అధికారుల చేతుల్లో లేదు. రాజధానిలోని ఈ సేవ సాంకేతిక విభాగం మాత్రమే ఈ పని చేయాలి. దాని కోసం తహశీల్దార్ గానీ, కార్యాలయంలో ఆ బాధ్యతలు చూసే ఉద్యోగి గానీ స్వయంగా హైదరాబాద్ వెళ్లి చేయించాలి. ఇవన్నీ జరగడానికి కనీసం
నాలుగు రోజులైనా పడుతుంది. కాగా డిజిటల్ కీ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఆ విషయం హెచ్చరిక రూపంలో తెలియజేస్తుంది. రెన్యూవల్ చేయించుకోవాలన్న విషయాన్ని సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్ ముందుగానే తహశీల్దార్‌కు చెప్పినా ఆయన పట్టించుకోలేదు.
30తో గడువు పూర్తి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రియింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30తో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేయాలంటే ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే దరఖాస్తులను అన్‌లైన్‌లో మాత్రమే పంపాలి. ఈ పాస్ వెబ్‌సైట్ మీ సేవ నుంచి ఆన్‌లన్‌లో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువపత్రాలనే తీసుకుంటుంది. మెన్యూవల్‌గా జారీ చేసే ధ్రువపత్రాలను తీసుకోదు. ఈ పరిస్థితుల్లో మీ సేవ డిజిటల్ కీ ల్యాప్స్ కావడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీకాకుళం పట్టణం, రూరల్ మండలం కలిపి శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం నుంచే ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం సుమారు 2500 మంది వీటి కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. వారంతా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిజిటల్ కీ ల్యాప్స్ అయిందని, మూడు నాలుగు రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదని, ఆక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈలోగా గడువు ముగిసిపోతుందని, ఈ ఏడాది ఉపకార వేతనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గడువు పెంచితే తప్ప విద్యార్థులకు నష్టం జరగడం అనివార్యంగా కనిపిస్తోంది.
సాంకేతిక లోపాలకు ఏం చేస్తాం
విషయాన్ని తహశీల్దార్ ఎస్.దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించడగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఏం చేస్తామని సమాధానం చెప్పారు. ఆర్డీవో బి దయానిధి వద్ద ప్రస్తావించగా వీలైనంత వేగంగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో సంబంధిత సాంకేతిక విభాగం అధికారులతో మాట్లాడి డిజిటల్ కీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులను ముంచిన నిర్లక్ష్యం
Published Sat, Nov 29 2014 3:31 AM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM
Advertisement
Advertisement