
పోటెత్తారు!
వివిధ సర్టిఫికెట్ల కోసం వందలాదిగా ప్రజలు తరలి వస్తుండడంతో కడప తహశీల్దార్ కార్యాలయం పోటెత్తుతోంది. వీరిని అదుపు చేయలేక కార్యాలయ సిబ్బంది నానా పాట్లు పడాల్సి వస్తోంది.
కడప సెవెన్‌రోడ్స్/కార్పొరేషన్ : వివిధ సర్టిఫికెట్ల కోసం వందలాదిగా ప్రజలు తరలి వస్తుండడంతో కడప తహశీల్దార్ కార్యాలయం పోటెత్తుతోంది. వీరిని అదుపు చేయలేక కార్యాలయ సిబ్బంది నానా పాట్లు పడాల్సి వస్తోంది. సినిమా రిలీజ్ రోజున టిక్కెట్ల కోసం ఎగబడ్డట్లు సర్టిఫికెట్ల కోసం క్యూ కడుతున్నారు. విద్యార్థులు స్కాలర్‌షిప్పులు, రీఎంబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 17 ఆఖరు గడువుగగా విధించింది.
ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు లింకేజీ, సబ్సిడీ రుణాల పొందడానికి, దరఖాస్తు చేసుకోవడానికి గడువు తన్నుకు వస్తోంది. వీటికోసం ఆయా వర్గాల వారు కుల, ఆదాయ, నేటివిటీ, జనన ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మీ-సేవా కేంద్రాల్లో ఆయా సర్టిఫికెట్ల కోసం డబ్బులు చెల్లించి రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండగా, వాటిని విచారణ చేసి జారీ చేయాల్సిన సిబ్బంది సంఖ్య నామమాత్రంగా ఉంది.
కేవలం ఐదుగురు వీఆర్‌ఓలతో ఈ పనులు చేయిస్తున్నారు. మల్టీ స్కానర్లు ఉపయోగిస్తున్నా, రోజుకు ఐదారు వందల సర్టిఫికెట్లు జారీ చేయలేక పోతున్నామని సిబ్బంది తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన చేసిన తరువాతే జారీ చేయాలి. ప్రాక్టికల్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని వీఆర్‌ఓలు వచ్చిన దరఖాస్తులపై ఎడాపెడా సంతకాలు చేస్తున్నా వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
ఓవైపు గడువు మీరుతుండడంతో ముఖ్యంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా సర్టిఫికెట్లు పొందలేక పోతున్నామని పలువురు వాపోతున్నారు.
రెవెన్యూ సిబ్బంది చేతివాటం
జనం అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొందరు సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇతర ప్రాంతాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకువచ్చి జనం ఇబ్బందిని తీర్చాలని పలువురు అధికారులకు విన్నవిస్తున్నారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఆర్డీఓ స్పందించి అదనపు సిబ్బందిని, కౌంటర్లను ఏర్పాటు చేస్తే సకాలంలో సర్టిఫికెట్ల జారీ సాధ్యపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా సర్టిఫికెట్ మంజూరు చేయడం లేదని శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థి ఖలీల్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ కోసం మూడు నెలలుగా తనను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాబ్జాన్ అనే మరో విద్యార్థి ఆరోపించారు.
కుల ధ్రువీకరణ పత్రం కోసం ఏడాదిగా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదని మాసాపేటకు చెందిన బి.నరసింహులు వాపోయారు. విచారణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందికి రూ.100 ఇచ్చినా ఇంత వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రాఘవేంద్రమౌళి అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.