విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు చదువుకోలేక...అటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక అల్లాడుతున్నారు. ఉపకార వేతనం పొందాలంటే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులకు వెళ్తే తమ బ్రాంచ్‌లో ఆ సదుపాయం లేదని అక్కడి సిబ్బంది బదులివ్వడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కొన్ని బ్యాంకుల సిబ్బంది విద్యార్థులను ఈసడించుకుంటూ తమకు ఖాళీలేదని చెబుతున్నారు. దీంతో వారు నిరాశతో వెనుదిరగవలసి వస్తోంది. అకౌంట్ల కోసం తిరిగే సరికే తమ సమయం అంతా అయిపోతోందని వారు వాపోతున్నారు. ఖాతాలు తెరవకపోవడం వల్ల ఉపకారవేతనాలు నిలిచిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. కేవలం బ్యాంకర్లు సహకరించకపోవడంతో జిల్లాలో ఇంకా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఖాతాలు తెరవలేని పరిస్థితి ఏర్పడింది.
మూడు బ్రాంచ్‌లకు వెళ్లినా...
విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న సుధీర్ అనే విద్యార్థి ఉపకార వేతనం పొందేందుకు బ్యాంకు అకౌంట్ తెరవడానికి గజపతినగరంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తండ్రితో కలిసి వెళ్లాడు. అయితే అక్కడి అధికారులు బొండపల్లిలో ఎస్‌బీఐ ఉందిగా అక్కడికే వెళ్లండి.. ఇక్కడ ఖాతా ఇవ్వబోమని చెప్పడంతో నిరాశతో ఇంటికి వచ్చారు. సోమవారం బొండపల్లిలోని ఎస్‌బీఐకి వెళ్లారు. అక్కడ సిబ్బంది ఇక్కడ ఉపకార వేతనాలకు సంబంధించి ఖాతాలు తెరవడం లేదు అని చెప్పడంతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఎస్‌బీఐకి మంగళవారం వెళ్లారు. ‘‘సార్ అకౌంట్ కావాలని కౌంటర్‌లో ఉన్న ఓ ఉద్యోగిని అడిగాడు. వెంటనే ఆ ఉద్యోగి మీది ఏ ఊరు అని ప్రశ్నించడంతో బొండపల్లి అని చెప్పాడు. మరి అక్కడ ఎస్‌బీఐ బ్రాంచ్ ఉందిగా ఇక్కడి వరకూ ఎందుకు వచ్చావు.. అక్కడ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన అకౌంట్లు అవటంలేదు.. అందుకనే ఇక్కడికి వచ్చాం సార్ అని బదులిచ్చాడు సుధీర్. ఒక్క నిమిషం ఆలోచించిన ఉద్యోగి ఇక్కడ కూడా ఆ వెసులు బాటు లేదు.. పట్టణంలో ఉన్న ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్, పోర్టుబ్రాంచ్‌కు వెళ్లండి’’ అని ఓ ఉచిత సలహా ఇచ్చారు. అయితే మంగళవారం బొండపల్లి ఎస్‌బీఐకి సుధీర్ మళ్లీ వెళ్లాడు.
లేఖరాస్తే ఖాతా తెరుస్తాం..
విద్యార్థి సమస్యను విన్న అక్కడి మేనేజర్ తమ బ్రాంచ్‌లో ప్రస్తుతం ఆ వెసులు బాటు లేదని చెప్పారు. ఇక్కడ బ్యాంకు ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. అయితే ఇంత వరకూ(ఈపాస్) ఆన్‌లైన్‌లో లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరవటానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని అయితే ఇపాస్‌లో బ్యాంకు ఓపెన్ కావలంటే ఏమి చేయాలో తనకు ఆదేశాలు రావాలని ..అలా కాని పక్షంలో అధికారుల నుంచి లేఖ వస్తే విద్యార్థులకు ఖాతాలు తెరవటానికి తమకు ఇబ్బంది లేదని మేనేజరు స్పష్టం చేశారు. ఇది ఒక్క బొండపల్లి బ్యాంకులో మాత్రమే ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో ఉంది. అయితే ఆ పని ఎవరు చేయాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
మేనేజర్లు సమాచారమిస్తే చాలు....
ఇదిలా ఉండగా సంక్షేమ శాఖ అధికారుల వాదన ఇంకోలా ఉంది. మేనేజర్లు సమాచారం ఇస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. బ్యాంకు మేనేజరే సోషల్ వెల్ఫేర్ డీడీ, మర్రిచెన్నారెడ్డి భవన్, విజయనగరం పేరు మీద నూతన బ్రాంచ్‌కు సంబంధించిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను తెలియజేస్తూ లేఖ రాసినా, ఈ-మెయిల్ పెట్టినా సరిపోతుందని సంక్షేమశాఖ అధికారులు అంటున్నారు. మేనేజర్లు మాత్రం అధికారులు లేఖ ఇస్తే ఖాతాలు తెరుస్తామని చెబుతున్నారు. మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇటు మేనేజర్లు, అటు సంక్షేమ శాఖ అధికారులు తమతో ఆడుకుంటున్నారని, ఇప్పటికైనా వీరు చర్చించుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
సగం మంది కూడా దరఖాస్తు
చేయలేదు...
ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవటానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మూడు నెలలు కావస్తున్నా పలు నిబంధనల కారణంగా ఇంత వరకూ సగం మంది విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉపకార వేతనం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే ఎస్సీ విద్యార్థులు 5 వేల మంది వరకూ ఉంటారని అధికారులు అంచనా వేస్తుండగా ఇప్పటి వరకూ కేవలం 1,276 మంది, ఎస్టీలు 4 వేల మందికి గాను 563, బీసీలు 28వేల మందికి గాను 10,191, ఈబీసీలు 3200 మందికి గాను 741 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రెన్యువల్స్‌కు సంబంధించి ఎస్సీ విద్యార్థులు 4,249 మందికి గాను 2,821, బీసీలు 34,735కి గాను 23,741,ఎస్టీలు 2,904కి గాను 1,675మంది, ఈబీసీలు 3,039 మందికి గాను 2,591మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఎక్కువ మంది రెన్యువల్ విద్యార్థులు ఆధార్ నంబరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేక పోయారు.
ఉపకారం..ఖాతం
Published Wed, Dec 18 2013 4:10 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement