సాక్షి, సంగారెడ్డి: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు ‘ఆన్‌లైన్’లో అదృశ్యమయ్యాయి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌పుస్తకం స్కానింగ్(నకలు) ప్రతులను ఆన్‌లైన్ దరఖాస్తులో పొందుపర్చకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు గల్లంతయ్యాయి. ఈ సంవత్సరం నుంచి ఫీజుల పథకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు. అవగాహన లేక వేల మంది విద్యార్థులు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకాలకు బదులు ఇతర కాగితాలను స్కాన్ చేసి ఆన్‌లైన్ అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అదృశ్యం(ఇన్‌విజిబుల్) అయ్యాయి.
బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు లేని విద్యార్థులు వాటి స్థానంలో ఎవేవో పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. కొందరు విద్యార్థులు ఇతరుల బ్యాంకు ఖాతా పుస్తకాలను అప్‌లోడ్ చేశారు. స్కానింగ్‌లో లోపం వల్ల మరికొందరి దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా నంబర్లు కనిపించకుండా పోయాయి. ఒక్క బీసీ వర్గం నుంచే 5,021 మంది విద్యార్థులు ఇలా తప్పుల తడకగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనను గతేడాది వరకు ప్రభుత్వ శాఖల జిల్లాధికారులచే జరిపించే వారు. ఈ ఏడాది నుంచి ఈ బాధ్యతలను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కే అప్పగించారు. ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు సంబంధిత విద్యార్థివేనని నిర్ధారించిన తర్వాతే ఆ దరఖాస్తులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్‌లో ప్రత్యక్షమవుతాయి. అప్పుడే పరిశీల నకు అవకాశముంటుంది.
ప్రిన్సిపాల్స్ తమకు కేటాయించిన పాస్‌వర్డ్ సహాయంతో దరఖాస్తులను లాగిన్ చేసి బయోమెట్రిక్ విధానంలో విద్యార్థి వేలి ముద్రలను సేకరించి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆధార్, ఖాతా పుస్తకాలు సరిగ్గా అప్‌లోడ్‌చేయని విద్యార్థుల దరఖాస్తులు ప్రిన్సిపాల్ లాగిన్‌లో కనిపించడం లేదు. మళ్లీ సరైన విధానంలో అప్‌లోడ్ చేస్తేనే ఈ విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నోచుకోనున్నారు.
ప్రిన్సిపాల్స్‌కు గురుతర బాధ్యతలు
ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు యూఐడీ(యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఇప్పించే బాధ్యతలు కళాశాలల ప్రిన్సిపాల్స్‌కే ప్రభుత్వం అప్పగించింది. ఆధార్ నమోదు చేసుకున్న విద్యార్థి ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధారంగా ఆ విద్యార్థికి కేటాయించిన యూఐడీ నంబర్‌ను తెలుసుకునే సౌలభ్యాన్ని ప్రిన్సిపాల్స్‌కు కేటాయించింది. ఇదిలా ఉండగా..ఆధార్‌తో అనుసంధానం చేసినందున ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోడానికి చివరి గడువు విధించలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు పోస్టుమెట్రిక్ విభాగంలో అన్ని కేటగిరీ కింద 60,239 మంది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 53,103 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా 52,831 మంది ఫ్రెష్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 30,529 మంది చేసుకున్నారు.
దరఖాస్తులు గల్లంతు!
Published Fri, Jan 10 2014 11:47 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement