'ఉపకార’ దరఖాస్తు గడువు పొడిగింపు!
► నెల రోజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం
► 13.5 లక్షల మందిలో దరఖాస్తు చేసింది 3.45 లక్షలే
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు గడువు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా.. సగం మంది విద్యార్థులు కూడా దరఖాస్తులు సమర్పించలేదు. ఒకవైపు పలు కోర్సు ల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో గడువు ను తప్పనిసరిగా పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిం ది.
2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13.5 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు 3.45 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. మెజారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవ డంతో గడువు తేదీని నెల రోజుల పాటు పొడిగిం చాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించింది.
‘ముందస్తు’ కష్టమే..
ఉపకార వేతనాల పంపిణీలో జాప్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తు దర ఖాస్తు స్వీకరణకు ఉపక్రమించింది. ఆగస్టులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే నవంబర్‌కి వాటిని పరిశీలించి అర్హులను నిర్ధారించి.. డిసెంబర్ నుంచి ఉపకార వేతనాలు పంపిణీ చేయాలని భావించింది. జూన్ మూడో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందస్తు ఆలోచన గాడితప్పినట్లయింది. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
డిగ్రీ ప్రవేశాలకు సంబందించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీంతో ఈ రెండు కేటగిరీ లకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియకు మరికొంత సమయం తీసుకోనుంది. దరఖాస్తుల గడువు నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వానికి ఎస్సీ అభివృద్ధి శాఖ నివేదించిన నేపథ్యంలో.. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనుంది. దీంతో డిసెంబర్ వరకు దరఖాస్తుల పరిశీలనకే సమయం గడిచిపోతుంది. ఇక ముందస్తుగా చేయాలనుకున్న ఉపకార వేతనాల పంపిణీ ఆలస్యం కానుందని అధికారులు చెబుతున్నారు.