ఆధార్ అపకారం!
శ్రీకాకుళం పాతబస్టాండ్: బలహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసే స్కాలర్‌షిప్పులు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌తోపాటు కొన్ని కొత్త నిబంధనలు విధించడంతో విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. దీనివల్ల విద్యార్థుల సంక్షేమానికి అపకారం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో అనేకసంక్షేమ పథకాలకు ప్రజలు దూరమవుతున్నారు. ఇప్పుడు విద్యార్థులు కూడా బాధితుల జాబితాలో చేరుతున్నారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు తమ ఆధార్ నెంబరుతోపాటు తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు కూడా తప్పనిసరిగా దరఖాస్తులో పేర్కొనాలని ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. సాధారణంగా దారిద్య్రరేఖకు దిగువనున్న విద్యార్థులే వీటి కోసం దరఖాస్తు చేస్తుంటారు. వీరిలో చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. కొంతమంది ఆధార్ కోసం పేర్లు నమోదు చేయించుకున్నా ఇప్పటికీ నెంబర్లు రాలేదు.
అలాగే తల్లి లేదా తండ్రి మరణించిన.. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన వారి పిల్లలు తల్లిదండ్రులిద్దరి ఆధార్ నెంబర్లు సమర్పించలేని స్థితిలో ఉన్నారు. అయితే తల్లిదండ్రులిద్దరి ఆధార్ నెంబర్లు నమోదు చేస్తే తప్ప ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా జిల్లాలో సుమారు రెండువేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం లేకుండాపోయిందని అంచనా. కాగా తల్లిదండ్రుల్లో ఎవరు మరణించినా వారి మరణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలన్న నిబంధన కూడా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది.
ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మరణించినవారి ధ్రువపత్రాలు ఇప్పుడు ఎలా తేగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని బాధిత విద్యార్థులు సంక్షేమ శాఖల అధికారులు, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది తమ పరిధిలో లేని అంశం కావడంతో అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు.
ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుకు ఈ నెల 31తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు బీసీ విద్యార్థుల నుంచి 71,281, ఈబీసీ విద్యార్థుల నుంచి 3355, ఎస్సీ విద్యార్థుల నుంచి 9వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇవి సుమారు పది శాతం తక్కువని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.