
పేదల ఉన్నత విద్యకు సర్కారు మోకాలడ్డు
ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,800 కోట్లు అవసరం
తాజా బడ్జెట్‌లో రూ.1,960 కోట్లు మాత్రమే కేటాయింపు
హాస్టల్ మెయింటెనెన్స్‌కు ఏటా రూ.1,100 కోట్లు అవసరమైతే.. రూ.684 కోట్లు మాత్రమే ప్రతిపాదన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మరోసారి రుజువైంది. నూతన విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్‌లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు.
ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ (ఆర్టీఎఫ్–ఎంటీఎఫ్)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఆర్టీఎఫ్) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ.1,960 కోట్లు మాత్రమే కనిపిస్తోంది.
ఇక హాస్టల్ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్– ఎంటీఎఫ్)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివిధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కేటాయింపులను చూపిస్తుండటం గమనార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్‌లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.
పెండింగ్ బకాయిలఊసే లేదు
గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి.
కూటమి ప్రభుత్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్నారు.
ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
ఏటా విద్యార్థులకుఇవ్వాల్సింది రూ.2,800 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది రూ.1,960 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment