ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం ఆధార్‌పైనే ఆధారపడింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఒక వైపు సూచించినా ససేమిరా అంటూ అన్నింటికీ ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, విద్యార్థుల ఉపకార వేతనాలకు సైతం లింకు పెట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయడంలో యంత్రాంగం విఫల పేద విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నెలాఖరుతో దరఖాస్తుల గడువు ముగియనుండడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడనుంది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌తో ఇప్పటివరకు ఉన్నత చదువులు చదువుకుంటున్న మా భవిత ఇక ముందు ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం నివాసి సుతారం పరిపూర్ణాచారి. వృత్తి చెక్కపని. వయస్సు 69 సంవత్సరాలు. వృద్ధాప్యంపైన పడడంతో ప్రస్తుతం కళ్లు కూడా కనబడని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వం మంజూరు చేసే పింఛనే ఆధారం.
ఇతని భార్య సీతారావమ్మ. వయస్సు 60 సంవత్సరాలు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె బ్రహ్మణిదేవి. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజీ(వుమన్) కళాశాలలో ఎంఎస్సీ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు, స్కాలర్‌షిప్‌కు ఆధార్ లింక్ లేకపోవడంతో ఈమె చదువు సాఫీగా సాగిపోయింది. కానీ ఈ ఏడాది ఈమె చదువుకు బ్రేక్‌లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఆధార్ లింక్ పెట్టడమే. ఫీజు రీఇంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలంటే తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ తప్పనిసరి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అవి ఫీడ్ చేయకుండా దరఖాస్తును ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయడం సాధ్యంకాని పరిస్థితి. ఈమె ఏడాది ఫీజు రూ.30వేలు , ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం రూ.22 వేలు . వెరసి ఆమె చదువు పూర్తి కావాలంటే రూ.52 వేలు అవసరం. ఇక ఈమె సోదరుడు శ్రీనివాస్ ఈ ఏడాది విక్రమసింహ యూనివర్శిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ కోసం దరఖాస్తుచేశాడు. యూనివర్శిటీ స్థాయిలో 23వ ర్యాంకు వచ్చింది. కావలిలోని విక్రమసింహ పీజీ సెంటర్‌లో సీటు వచ్చింది. ఇతనిది కూడా ఆధార్ సమస్యే. అయితే వీరిద్దరికీ ఆధార్ కార్డులున్నాయి.
వీరు తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డుతీయించారు. కానీ తండ్రికి కార్డు వచ్చింది కానీ తల్లికి మాత్రం రాలేదు. భవిష్యత్తులో ఆధార్ కార్డు సమస్యలు తప్పవని తెలిసి ఇప్పటికి ఐదుసార్లు తీయించారు. కానీ ఫలితం శూన్యం. మొదటిది తిరస్కరణకు గురైందని, మరలా తీయించుకోమని వెబ్‌సైట్ సూచిస్తోంది. కానీ తరువాత నాలుగుసార్లు తీయించినా ప్రాసెస్‌లో ఉందని, కొద్దిరోజులు వేచి చూడమంటూ సూచిస్తుండడం గమనార్హం.
తండ్రికి ఆధార్ రాకపోవడంతో...
ఇది మరో పేద విద్యార్థి వ్యథ. ఎన్నిసార్లు తీయించుకున్నా తిరస్కరణకు గురవుతుండడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదని పామూరు మండలం గుంటలకర అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ విద్యార్థి జయంపు మాల్యాద్రి ఆందోళన చెందుతున్నాడు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులను కలిసి వేడుకున్నా తామేమీ చేయలేమని చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.మాల్యాద్రి ప్రస్తుతం కావలిలోని విక్రమసింహ పీజీ సెంటర్‌లో ఎంఎస్‌సీ బోటనీ చేస్తున్నాడు.
స్కాలర్‌షిప్ పొందేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. మాల్యాద్రికి ఆధార్ కార్డు ఉంది. అతని తల్లికి వచ్చింది. కానీ అతని తండ్రి మాలకొండయ్యకు మాత్రం రాలేదు. మాలకొండయ్య ఆధార్ తీయడం మొదలుపెట్టిన తొలి దశలోనే తీయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో రిజెక్ట్ అని రావడంతో రెండో దఫా తీయించుకున్నాడు. రెండోసారి అదే పరిస్థితి. పెన్షన్లకు సైతం ఆధార్ తప్పనిసరి అనడంతో 2014 ఆగస్టు 5న మరోమారు తీయించుకున్నాడు.
అది కూడా ఉపయోగం లేకపోవడంతో ఈనెల 2వ తేదీ మరోమారు దరఖాస్తుచేసుకున్నాడు. అయినా రిజెక్ట్ అని వచ్చింది. దీంతో తన తండ్రికి ఆధార్ వచ్చేలా చేయాలని, తన తండ్రి ఆధార్ తీయించుకుంటున్నా రాకపోతుంటే తాము ఏమి చేయలేకపోతున్నామని దయచేసి తమ సమస్యకు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు విజ్ఞపి ్తచేసినా ఫలితం కనిపించడం లేదు.
హైదరాబాదుకు వెళ్ళి వచ్చా: సుతారం శ్రీనివాస్
నా తల్లికి ఆధార్ కార్డు రాకపోతుండడంతో ఈ విషయంపై జిల్లా అధికారులనే కాకుండా హైదరాబాదులోని ‘యుఐడీఏఐ రీజనల్ ఆఫీస్, 5వ అంతస్తు, బ్లాక్ నెంబర్-3, మైహోం హబ్, మాదాపూర్’ చిరునామాకు వెళ్ళా. అక్కడ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశా. పరిశీలిస్తాం. అయితే రోజుకు రెండు వేలమంది వరకు మా వద్దకు వచ్చి సమస్యలను చెబుతున్నారు.
అందువల్ల మీ సమస్య పరిష్కారం కావాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. అప్పటికైనా రిజెక్ట్ చేయాల్సి వస్తుందా లేక కార్డు మంజూరు చేయడం సాధ్యం అవుతుందా అనే విషయాలను మాత్రమే చెప్పగలమని పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్య కారణంగా మా చదువులకు ఆటంకం ఏర్పడుతుండడం బాధ కలిగిస్తుంది.
పేదల చదువులకు ఆధార్ అవరోధం
Published Sat, Dec 27 2014 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement