ముద్ర పడాల్సిందే
Published Fri, Dec 27 2013 4:24 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
భీమవరం, న్యూస్‌లైన్ : ఆధార్ కార్డు అనుసంధానంతో స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విషయంలో విద్యార్థులు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. తాజాగా వేలిముద్రలను సైతం తప్పనిసరి చేశారు. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కావస్తోంది. ఈ దశలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులు, కళాశాలల యూజమాన్యాల్లో గుబులు రేపుతోంది. ప్రతి విద్యార్థి బయోమెట్రిక్ మెషిన్‌పై బొటన వేలిముద్ర వేస్తే తప్ప ఫీజు రీయిం బర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇచ్చేది లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయూన్ని తాము తప్పు పట్టడం లేదని, విద్యాసంవత్సరం చివరిలో ఇలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని కళాశాలల యూజమాన్యాలు పేర్కొంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాయి.
ఆధార్ కార్డులూ అందలేదు
స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత పొందిన విద్యార్థుల్లో చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు అందలేదు. ఆధార్ కేంద్రాల్లో నమోదు చేయించుకున్నప్పటికీ కొన్నిచోట్ల స్థానిక ఏజెన్సీలు ఆ వివరాలను సర్వర్‌కు బదలాయించలేదు. దీనివల్ల చాలామందికి ఆధార్ కార్డులు అందలేదు. దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న వారిలో కొందరు ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకోలేదు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కూడా ఆధార్ ప్రక్రియ కుంటుపడింది. బయోమెట్రిక్ విధానంలో స్కాలర్ షిప్‌లు ఇవ్వాలన్నా వారి ఆధార్ నంబర్లు వాటితో అనుసంధానించి ఉండాలి. దీంతో ఆధార్ కార్డులు పొందని వారంతా స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకాక అవస్థలు పడుతున్నారు.
కళాశాలల్లో
బయోమెట్రిక్ మెషిన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో సుమారు 550 కళాశాలల్లో ఆగమేఘాల మీద బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల కోసం రెన్యువల్ చేయించుకున్న విద్యార్థుల వేలి ముద్రలను సేకరించే పనిలో కళాశాల యూజమాన్యాలు నిమగ్నమయ్యూయి. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 64,916 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రెన్యువల్ చేయించుకున్నారు. వీరంతా బయోమెట్రిక్ మెషిన్‌పై వేలిముద్రలు వేయాల్సిందే.
Advertisement