ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం షురూ.. ‘ఆధార్‌’ తప్పనిసరి కాదు | Aadhaar Voter ID Linking Begin In Telangana | Sakshi
Sakshi News home page

ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం షురూ.. ‘ఆధార్‌’ తప్పనిసరి కాదు

Published Mon, Aug 1 2022 3:16 AM | Last Updated on Mon, Aug 1 2022 2:41 PM

Aadhaar Voter ID Linking Begin In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే కసరత్తు కూడా సోమవారం నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు తమ ఆధార్‌ నంబర్‌ను తెలపడం మాత్రం తప్పనిసరికాదు.

కాగా కొత్త విధానంలో భాగంగా ఇకపై 17 ఏళ్ల వయస్సు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలగనుంది. ఓటర్ల నమోదు దరఖాస్తుల ప్రక్రియను సరళీకృతం చేయడానికి వీలుగా ఆగస్టు 1 నుంచి ఈ కింది మార్పులను అందుబాటులోకి తెచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.  

ఆధార్‌ స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలి 
ఓటర్ల జాబితాను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించడంలో భాగంగా.. ఆధార్‌ నంబర్‌ సేకరణకు వీలుగా ఓటరు నమోదు దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించింది. అదే విధంగా ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి నుంచి ఆధార్‌ నంబర్లు సేకరించడానికి కొత్త దరఖాస్తును (ఫారం–6బీ) అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌ నంబర్‌ ఇవ్వలేదన్న కారణంతో ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేర్లను తొలగించరాదని, జాబితాలో కొత్తగా పేరును చేర్చడానికి నిరాకరించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ప్రజలు స్వచ్ఛందంగా ఆధార్‌ నంబర్‌ ఇస్తేనే తీసుకోవాలని, బలవంతం చేయరాదని సూచించింది. ఓటర్ల జాబితాలను ప్రకటించినప్పుడు ఓటర్ల ఆధార్‌ నంబర్లు బహిర్గతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేస్తే పౌరుల గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా, ఎన్నికల సంఘం ఈ దిశగా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది.  

నవంబర్‌లో ముసాయిదా జాబితా 
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2023 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్‌ 11న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, డిసెంబర్‌ 8 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 26లోగా అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి, 2023 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.  

మరో మూడు అర్హత తేదీలు 
ఇప్పటివరకు జనవరి 1 అర్హత తేదీగా వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇకపై జనవరి 1తో పాటుగా ఏప్రిల్‌ 1 , జూలై 1, అక్టోబర్‌ 1లను అర్హత తేదీలు గా పరిగణించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్‌ 1 మధ్యకాలంలో 18 ఏళ్లు నిండి ఓటేసేందుకు అర్హత సాధించనున్న యువత నుంచి ముందస్తుగానే ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించడానికి కొత్తగా ఈ సదుపాయాన్ని కల్పించింది.

అయితే వచ్చే ఏడాదికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 అర్హత తేదీగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లకు.. వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ మేరకు ఏటా జనవరిలో ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తారు.ఆ తర్వాతి 3 అర్హత తేదీలతో దరఖాస్తుదారుల పేర్లను ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా సంబంధిత త్రైమాసికంలో ప్రచురించే ఓటర్ల జాబితాలో చేర్చుతారు.  

ఫారం–001 ఇకపై ఉండదు 
ఎపిక్‌ కార్డు మార్పిడి దరఖాస్తు ఫారం–001 ఇకపై మనుగడలో ఉండదు. ఫారం–8లోనే ఈ సదుపాయం కొత్తగా అందుబాటులోకి రానుంది.  

ఓటర్ల జాబితాలో పేరు చేర్చడంపై అభ్యంతరం/ పేరు తొలగింపునకు చేసే దరఖాస్తు (ఫారం–7)లో స్వల్పంగా మార్పులు చేసి మరణ ధ్రువీకరణ పత్రం జత చేయడానికి అవకాశం కల్పించారు.

ఒకే శాసనసభ నియోజకవర్గం పరిధిలో చిరునామా మారితే చేయాల్సిన ఫారం–8ఏ దరఖాస్తు ఇకపై మనుగడలో ఉండదు. ఫారం–8 దరఖాస్తులోనే కొత్తగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫారం–8లో కొత్తగా చిరునామా మార్పు, ఓటర్ల జాబితాలో వివరాల దిద్దుబాటు, ఎపిక్‌ కార్డు మార్పిడి, దివ్యాంగుడిగా నమోదు చేసుకోవడానికి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement