సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్ట్ దరఖాస్తులకు అధికంగా స్లాట్లు పెంచుతామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జె.స్నేహజ వెల్లడించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పాస్‌పోర్ట్‌ల జారీలో దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7.85 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌లను జారీ చేసి గత రికార్డులను బద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా శనివారం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించామని చెప్పారు.
వరంగల్‌లో అధిక డిమాండ్
తెలంగాణలో ఉన్న 5 పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రతి రోజూ సగటున 4 వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను తీసుకున్నామని స్నేహజ వివరించారు. పాస్‌పోర్టులకు వరంగల్‌లో అధిక డిమాండ్ ఉందన్నారు. సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సమయం పడుతుందంటూ కొందరు అత్యవసరం లేకపోయినా తత్కాల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారని, దీనివల్ల అవసరమైనవారికి దొరకని పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. ప్రస్తుతం సాధారణ స్లాట్లు సరాసరి 22 రోజులకు దొరుకుతుండగా, తత్కాల్‌కు ఐదు రోజులకు దొరుకుతుందన్నారు.
బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దు
బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దని స్నేహజ సూచించారు. పాస్‌పోర్ట్‌కు అవసరమైన పుట్టిన రోజు ధ్రువీకరణకు ఆధార్‌కార్డును గుర్తించబోమని ఆమె స్పష్టం చేశారు. పాన్, పదో తరగతి, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలన్నారు. అదనపు డాక్యుమెంటేషన్ అవసరమయ్యే దరఖాస్తుదారులకు మెరుగైన సేవలందించేందుకు విచారణ అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ను సవరించామన్నారు. అది ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ప్రతి సోమ, మంగళ, శుక్రవారాల్లో 250 ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.
ప్రతి గురువారం ఆ మూడుగంటల్లోఅపాయింట్‌మెంట్ లేకుండా రావొచ్చు
దరఖాస్తుదారులు ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య అపాయింట్‌మెంట్ లేకుండా వాక్–ఇన్ పద్ధతిలో రావొచ్చని స్నేహజ సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో నియామకాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామ ఈ ఏడాది జూన్‌లో సికింద్రాబాద్‌లోని ఆర్‌పీఓ ప్రాంగణంలో ప్రారంభించిన క్యాంపు మోడ్ సర్వీస్ శుక్రవారంతో ముగిసిందనీ, మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో హజ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. గత పది రోజుల్లో 400కుపైగా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టామని స్నేహజ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment