
ఇన్‌స్పెక్టర్‌కు నగదు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్
పెట్రోల్ డిస్పెన్సర్ స్టాంపింగ్ రెన్యువల్‌లో కొందరు అధికారుల చేతివాటం
డిపార్ట్‌మెంట్ రుసుంపై డబుల్ వసూళ్లు.. లేకుంటే సవాలక్ష సాకులతో జరిమానాలు
రాష్ట్ర కంట్రోలర్ దృష్టికి వెళ్లినా స్పందించని వైనం
తూనికలు, కొలతల శాఖలో ఆగని అవినీతి
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంకుల్లో డిస్పెన్సర్ మెషీన్లకు ఏటా స్టాంపింగ్ రెన్యువల్ తప్పనిసరి. దీని కోసం గడువుకు 30 రోజులు ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 15 రోజుల్లో ఇన్‌స్పెక్టర్ బంకును సందర్శించి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు డీఎల్‌ఎంఓ ఫోర్టల్‌కు చేరిన తర్వాత ఇన్‌స్పెక్టర్ ఆమోదంతో వెరిఫికేషన్ షెడ్యూల్ ఈ– మెసేజ్ ద్వారా యాజమానికి అందుతోంది.
ఇన్‌స్పెక్టర్ ఆయిల్ కంపెనీ టెక్నీషియన్‌తో బంక్‌ను సందర్శించి డిస్పెన్సర్ మెషీన్లను పరిశీలించి ధ్రువీకరణతో వివరాలు నమోదు చేస్తా రు. ఆ తర్వాత స్టాంపింగ్ ఫీజు ఆప్షన్ ఇస్తారు. చెల్లింపు జరగగానే ఇన్‌స్పెక్టర్ డిజిటల్ సంతకంతో కూడిన ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ జారీ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారుల తీరు కారణంగా ఇవేమీ సవ్యంగా జరగడం లేదు.
నాజిల్‌కు రూ.1,750
పెట్రోల్ బంకుల డిస్పెన్సర్ నాజిల్‌కు స్టాంపింగ్ రెన్యువల్ కోసం రూ.1,750 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అందులో రెన్యూవల్ ఫీజు రూ.1,500, సీసీ చార్జీలు రూ.250 ఉంటా యి. గడువు దాటితే మాత్రం మొదటి త్రైమాసికంలోపు 50 శాతం, రెండో త్రైమాసికంలో 100 శాతం, మూడో త్రైమాసికంలో 150 శాతం, నాలుగో త్రైమాసికంలో 200 శాతం జరిమానా చెల్లించాలి. అయితే ఇక్కడే కొందరు ఇన్‌స్పెక్టర్లు అనధికారికంగా వసూళ్లకు పాల్పడటం మామూలైంది.
ఇదో మచ్చు తునక..
‘గద్వాల జిల్లా అలంపూర్‌లోని పుష్పనాయుడు ఫిల్లింగ్‌స్టేషన్ డిస్పెన్సర్ మెషీన్ల స్టాంపింగ్ గడువు (ఫిబ్రవరి 9న) ముగుస్తుందని, బంకు యాజమాని 20 రోజులు ముందుగానే రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే గడువు దాటిన రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 11) ఫిల్లింగ్‌స్టేషన్‌ను సందర్శించి డిస్పెన్సర్ రెండు డ్యూయల్ నాజిల్‌కు రూ.3 వేల చొప్పున ఆరు వేలు, సీసీ ఫీజు కింద రూ.1,000, ఆలస్య రుసుం మొదటి త్రైమాసికం కింద 50 శాతం జరిమానా రూ. 3 వేలు విధించారు.
మొత్తం రుసుం చెల్లించేందుకు ఆన్‌లైన్ ఆప్షన్ ఇవ్వడంతో యజమాని తక్షణమే చెల్లించడంతో స్టాంపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ డీఎస్‌ఎస్‌ఆర్ పుస్తకంపై ఆరా తీసి నిర్వహణ సరిగ్గా లేదన్న సాకుతో రూ. 25,000లు జరిమానా విధించి..కేవలం రూ.5,000 చెల్లించినట్టు రశీదు చేతిలో పెట్టారు. ఇది ఒక్క ఫిల్లింగ్ స్టేషన్‌కు ఎదురైన పరిస్ధితి కాదు.. అన్ని బంకుల స్టాంపింగ్ రెన్యూవల్స్‌లో దాదాపుగా ఇదే జరుగుతోంది.
జరిమానా సొమ్మును జేబులో వేసుకున్నారు
స్టాంపింగ్‌కు అదనంగా డబ్బులు ముట్టజెప్పలేదని డీఎస్‌ఎస్‌ఆర్ మెయింటెనెన్స్ సాకుతో జరిమానా విధించారు. నగదు రూ.25,000 వసూలు చేసి కేవలం రూ.5,000 మాత్రమే రశీదు ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ తీరుపై సీసీ కెమెరా వీడియో ఫుటేజీ, ఆధారాలను జత చేస్తూ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఉన్నతాధికారులకు ఈ–మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశాను. హెడ్‌క్వార్టర్ ఏసీ (అడ్మిన్)కు కూడా వివరించా. ఫిర్యాదు చేసి 55 రోజులు దాటుతోంది. అయినా ఎలాంటి స్పందన లేదు.
– పుష్పనాయుడు, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్, అలంపూర్
కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లా
అలంపూర్‌లోని ఫిల్లింగ్‌స్టేషన్ డిస్పెన్సర్ మెషీన్ల స్టాంపింగ్ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాను. యాజమాని ఆడియో, వీడియో ఆధారాలతో సహా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది వాస్తవమే. నేను కూడా ఆ బంకు యజమానితో మాట్లాడాను. ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. – రాజేశ్వర్, అసిస్టెంట్ కంట్రోలర్ (అడ్మిన్ ) తూనికలు, కొలతల శాఖ, హైదరాబాద్