టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్ | Term Policy better for 30 years old | Sakshi
Sakshi News home page

టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్

Published Sun, Feb 9 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్

టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్

 ప్రీమియం ఎందుకు తక్కువ?
 ఆరోగ్యంగా ఉండి 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కోటి రూపాయలకు ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రూ.7,000 నుంచి 8,000. అంతే...!  అదే సాధారణ టర్మ్ పాలసీ తీసుకుంటే... 30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే మొత్తానికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టర్మ్‌లో ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు.

 ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్‌లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధికమంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో తక్కువ ప్రీమియం రేట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

 ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే..
 చాలామందికి ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభిస్తాయన్న అపోహ ఉంటుంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపెనీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్‌లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయింలు కూడా ఆన్‌లైన్ ద్వారానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్‌డీఏకి ఫిర్యాదు చేయొచ్చు.

 తక్షణం బీమా మొదలు
 ఆన్‌లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకు అయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన ప్రీమియాన్ని వెనక్కి చెల్లిస్తుంది.

 రెన్యువల్ మర్చిపోవద్దు...
 ఆన్‌లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభమే. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేసుకోవటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఒకవేళ పాలసీ కాలపరిమితిలోగా రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ ఇలా గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాలపరిమితిలోగానే రెన్యువల్ అయ్యేలా ఈసీఎస్ విధానాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.

 విషయాలు దాచొద్దు..
 ధూమపానం, గుట్కా నమలడం వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25 నుంచి 35 శాతం అధికంగా ఉంటాయి. అయితే ప్రీమియం పెరుగుతుందని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందించండి.

 తీసుకోవటం ఇలా...
 ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ఏ కంపెనీ అయితే ప్రీమియం తక్కువ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే పాలసీ రేట్లను పోల్చి చూడటానికి పాలసీబజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి వెబ్‌సైట్లున్నాయి. వాటిలో చూసిన అనంతరం ప్రీమియం ఏ కంపెనీ తక్కువ వసూలు చేస్తోందో తెలుసుకున్నాక... నేరుగా సదరు కంపెనీ వెబ్‌సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. అయితే ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement