Term Policy
-
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసా..?
చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఒక్కసారిగా తమకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తోంది. అప్పటివరకు చిల్లర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడినవారు ఉద్యోగం రాగానే విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు ఏరూపంలో వస్తాయో తెలియదు. కాబట్టి యువతతోపాటు అందరూ కొన్ని చిట్కాలు పాటించి డబ్బు ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం. నెలవారీ ఖర్చులకు మించి అప్పు చేసి మరీ క్రెడిట్‌కార్డు ఉందనే దీమాతో వస్తువులు కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి. నెలవారీ బిల్లులో మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందనేలా బ్యాంకు మెసేజ్‌లు కనిపిస్తాయి. అలాచేస్తే కట్టాల్సిన మొత్తం పేమెంట్‌పై తదుపరి నెల అధికవడ్డీ వసూలు చేస్తారు.నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. నెలాఖరులోపు తరచుగా మీకు నగదు కొరత వస్తుందంటే.. ఖర్చులను సమీక్షించాల్సిందే. ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.నెలవారీ మొత్తం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బును ఆదా చేయాలని చూస్తారు. కానీ ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి. ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో సంపదను సృష్టించేందుకు ఇది తోడ్పడుతుంది.ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలి. దీన్ని సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో ఉంచుకోవచ్చు.ఉద్యోగం చేస్తున్న సమయంలో బోనస్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల రూపంలో అదనంగా డబ్బు సమకూరుతుంది. దాన్ని విలాసాలు, ఖరీదైన వస్తువులు కొనేందుకు వినియోగించకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్ ఫండ్లను ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ వయసు, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు వస్తున్న వేతనం లెక్కించి నెలవారీగా కొంత మొత్తంతో పదవీవిరమణ కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు. మారుతున్న ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే టర్మ్ పాలసీ తప్పకుండా ఉండాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ రెండు పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది. -
టర్మ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భద్రత
మన పరోక్షంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమర్థమంతమైన మార్గాల్లో నిస్సందేహంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రొటెక్షన్‌పై మాత్రమే ఫోకస్ చేసే సరళతరమైన బీమా పథకం. పాలసీదారు మరణించినా కుటుంబ పరిస్థితి తల్లకిందులు కాకుండా ఆర్థికంగా భరోసా అందించే టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. → ఆదాయ నష్టం నుంచి రక్షణ: సంపాదించే కుటుంబ పెద్ద కన్నుమూస్తే ఆదాయం నిలి్చపోయి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఏకైక సంపాదనపరుడైన పాలసీదారు ఇటు ఇంటిరుణం చెల్లిస్తూ అటు పిల్లల చదువులకూ కడుతున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఆయన మరణించిన పక్షంలో టర్మ్ ఇన్సూరెన్సు పిల్లల చదువు ఖర్చులు, రుణాల చెల్లింపు, జీవనం సాగించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చగలదు. → చౌకైనది: టర్మ్ ప్లాన్లతో తక్కువ ప్రీమియంలకే అత్యధిక కవరేజీ లభించగలదు. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసుకుంటే రిసు్కలు తక్కువ కాబట్టి కాబట్టి ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటాయి. కనుక 20లలో లేదా 30లలో ఉన్నప్పుడు టర్మ్ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. → రుణాలకు కవరేజీ: పాలసీదారు ఏవైనా రుణాలు తీసుకున్నా వాటిని తీర్చేందుకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభించగలదు. ఎంత కవరేజీ ఉండాలి.. → ఇది మీ ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడిన వారి అవసరాలు, లైఫ్‌స్టయిల్, భవిష్యత్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బండగుర్తు ఏమిటంటే వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధికంగా లైఫ్ కవరేజీ ఉండాలి. అదనంగా ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల్లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత కవరేజీ అవసరమవుతుందనేది ఒక అవగాహనకు రావచ్చు. → చివరగా చెప్పాలంటే.. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం గురించి అర్థం చేసుకునేందుకు, మీకేదైనా అయితే మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగే వారు ఎవరైనా ఒక అయిదుగురు ఉన్నారేమో ఆలోచించి చూడండి. నా మిత్రులను అడిగితే ఏదో ఒకటో రెండో పేర్లు చెప్పారు. కొందరైతే అదీ లేదు. కాబట్టి ఏదైనా జరిగితే మానసికంగా భరోసానిచ్చేవారు చాలా మందే ఉన్నా ఆర్థికంగా వెన్నంటి ఉండేవారు అంతగా ఉండరనేది ఇది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కలి్పంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడగలదు.సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ -
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేని బీమా..
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. పాన్‌కార్డు, ఆధార్ లేదా డ్రైవిండ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందని.. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. (క్లిక్ చేయండి: వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు) -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్‌క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్ జీవన్ బీమా, సరళ్ పెన్షన్, సరళ్ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం. బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్ ప్లాన్, సరళ్ జీవన్ బీమా పేరుతో టర్మ్ ప్లాన్.. సరళ్ పెన్షన్ (యాన్యుటీ/పెన్షన్) ప్లాన్, సరళ్ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్ (కరోనా చికిత్సల ప్లాన్లు), భారత్ గృహ రక్ష (హోమ్ ఇన్సూరెన్స్) ఇవన్నీ స్టాండర్డ్ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. సరళ్ జీవన్ బీమా అచ్చమైన టర్మ్ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్ అష్యూరెన్స్ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్ జీవన్ బీమా ప్లాన్‌తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇతర టర్మ్ పాలసీలతో పోలిస్తే సరళ్ జీవన్ బీమా ప్లాన్‌లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి. వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్ ప్లాన్‌ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్ ప్లాన్ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది. ∙ ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేసే ఐప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్తో పోలిస్తే సాధారణ టర్మ్ ప్లాన్‌లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్ ఐప్రొటెక్ట్ సస్మార్ట్ ప్లాన్‌లో ఉంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్ ప్లాన్‌ను కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్ జీవన్ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సంజీవని అన్ని సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను బేసిక్ పాలసీ కింద ఆఫర్ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్ ట్రీట్మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌లు లేనట్టయితే బోనస్ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్ లిమిట్స్ ముఖ్యమైనది. ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్ తీసుకున్నా సరే సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్‌కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం. సాధారణ హెల్త్ప్లాన్లు నేడు చాలా వరకు సబ్ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్‌రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్ అక్కరకు వస్తుంది. వార్షిక ప్రీమియం, సబ్ లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్ చెకప్‌లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్ చేస్తున్నాయి. సరళ్ సురక్షా బీమా ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి. కనుక ఎవరైనా కానీ తమ టర్మ్ ప్లాన్ లేదా హెల్త్ ప్లాన్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్ ప్లాన్‌ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్/డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ లేనట్టయితే.. అప్పుడు సరళ్ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. -
తక్కువ ప్రీమియం... అధిక కవరేజీ
ఆర్థిక సాధనాలు అనగానే ఫిక్సిడ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ స్కీములు, ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలతో కూడిన జీవిత బీమా పాలసీలు, బంగారం.. ప్రాపర్టీలే టక్కున గుర్తొస్తాయి. అయితే, పూర్తిగా జీవిత బీమా కోసమే ఉద్దేశించిన టర్మ్ ప్లాన్ల గురించి అంతగా ఆలోచన రాదు. నిజం చెప్పాలంటే బీమా పాలసీల్లో అత్యంత సింపుల్ పాలసీ ఇదే. ప్రతి వేతనజీవి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమిది. ఇంటిల్లిపాదీ ఆధారపడే కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే వారికి ఆర్థికంగా భరోసానిచ్చేదే టర్మ్ పాలసీ. టర్మ్ పాలసీలు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చేవే అయినా.. వీటిపై పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఉదాహరణకు.. సిగరెట్ అలవాటు లేని 35 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్లకు అత్యధికంగా రూ.1 కోటి రూపాయల కవరేజీ తీసుకున్న పక్షంలో కట్టాల్సిన ప్రీమియం రూ. 8,300 మాత్రమే. టర్మ్ ప్లాన్ పూర్తయ్యేంత వరకూ ఇంతే ప్రీమియం ఉంటుంది. ఇది చాలు.. టర్మ్ ప్లాన్ ఎంత చౌకైనదో తెలియడానికి. ఇక, సిగరెట్ అలవాటు లేని 45 ఏళ్ల వ్యక్తి గానీ అదే రూ.1 కోటి కవరేజీ కోసం 30 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే రూ.14,600 కట్టాలి. అంటే పదేళ్ల పాటు వాయిదా వేయడం వల్ల మొత్తం మీద రూ.1.38 లక్షలు అధికంగా కట్టాలి. కాబట్టి.. వీలైనంత వరకూ యుక్త వయస్సులోనే పాలసీ తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. కుటుంబానికి ఆర్థిక భరోసా.. పాలసీదారుకు అనుకోనిదేమైనా జరిగితే తనపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా అవస్థలు పడకుండా ఆదుకుంటుంది టర్మ్ ప్లాన్. అవసరాలకు అనుగుణమైన ఆప్షన్స్‌తో కూడా టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. సమ్ అష్యూర్డ్‌ను ఒకేసారి అందుకునే ఆప్షన్ లేదా కొంతభాగాన్ని ఒకేసారి, మరికొంత భాగాన్ని నెలవారీ ఆదాయంగాను పొందే ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి. ఒకవేళ మెచ్యూరిటీ గడువు తీరేదాకా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను తిరిగి చెల్లించే పాలసీలూ ఉన్నాయి. ఇక, నెలవారీగానూ లేదా వార్షికంగాను అందుకునే మొత్తం నిర్దిష్ట శాతం మేర పెరుగుతూ ఉండే ఆప్షన్ కూడా ఇస్తున్నాయి బీమా కంపెనీలు. ఎంత కవరేజీ.. సాధారణంగా ప్యూర్ టర్మ్ పాలసీని ఎంచుకునేటప్పుడు ఎంత కవరేజీ తీసుకోవాలన్న దానికి సంబంధించి కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఆదాయం, కుటుంబం జీవన విధానం, ఆస్తులు, అప్పులు మొదలైనవాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. బండగుర్తుగా చెప్పాలంటే.. స్థూల వార్షికాదాయానికి కనీసం పది రెట్లయినా కవరేజీ ఉండాలి. ఒకవేళ భారీ రుణాలున్నాయంటే.. ఇది మరింత ఎక్కువగా ఉండాలి. ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించి సెక్షన్ 80సీ పరంగా చూసినా.. భారీ రాబడులిచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చూసినా టర్మ్ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. కానీ, పాలసీదారుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడిపోకుండా ఆదుకునే ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. - రిషి శ్రీవాస్తవ ,టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ -
టర్మ్ పాలసీకి.. క్లిక్ చేయండి!
⇔ జీఎస్టీతో మరింత పెరిగిన టర్మ్ పాలసీ రేట్లు ⇔ ఇప్పటిదాకా పన్ను 15 శాతం... ఇపుడు 18% ⇔ కొంతైనా ఉపశమనం కావాలంటే ఆన్లైనే మార్గం ⇔ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే 40–50 శాతం ధరలు చౌక ⇔ డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లోనే అందించొచ్చు ⇔ అన్ని వివరాలూ చెబితే తక్షణం కవరేజీ మొదలు ఉద్యోగులైనా, వ్యాపారులైనా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండి తీరాల్సింది టర్మ్ పాలసీ. కాకపోతే వీటిపై ఇపుడు జీఎస్టీ భారం అధికమైంది. గతంలో టర్మ్ పాలసీల ప్రీమియంపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్ విధించేవారు. జీఎస్టీ అమలుతో ఇది 18 శాతానికి పెరిగింది. దీంతో టర్మ్ పాలసీలు కాస్త ఖరీదయ్యాయి. అయితే, ఇప్పటికే పాలసీలు తీసుకున్నవారిని మినహాయిస్తే... కొత్తగా పాలసీలు తీసుకునే వారు ఈ భారాన్ని తగ్గించుకోవటానికి ఓ మార్గముంది. అది... ఆన్‌లైన్‌ను ఆశ్రయించటం. టర్మ్ పాలసీని ఏజెంట్ దగ్గరో లేక బీమా కార్యాలయానికి వెళ్లో తీసుకునే బదులు నేరుగా బీమా కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకుంటే మరింత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో తీసుకునే టర్మ్ పాలసీల ప్రీమియంతో పోలిస్తే ఆన్లైన్ వేదికగా కస్టమర్ నేరుగా తీసుకునే పాలసీ ప్రీమియం కనీసం 30 నుంచి 40 శాతం మేర తక్కువగా ఉంటుంది. జీఎస్టీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి లేదు. ఆన్లైన్లో టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధిక మంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో కంపెనీలు తక్కువ ప్రీమియం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇక పరిపాలనా వ్యవహారాల వ్యయమూ కలుపుకుంటే కంపెనీలకు ఆ మేరకు భారం తగ్గినట్టే కదా!! అందుకే అవి ఆన్లైన్ పాలసీల ప్రీమియంలను ఆ మేరకు తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు సిగరెట్, పొగాకు అలవాటు లేని 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడు కోటి రూపాయలకు ఆఫ్‌లైన్ టర్మ్ పాలసీ కావాలనుకుంటే ఎల్ఐసీ అమూల్య జీవన్2 పాలసీలో జీఎస్టీ కూడా కలిపి ప్రీమియం రూ.39,648గా ఉంది. ఇంతే మొత్తానికి ఎల్ఐసీ నుంచే ఆన్లైన్ టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కేవలం రూ.23,340 చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదికి రూ.16,308 మేర మిగులుతుంది. ఇది భారీ వ్యత్యాసంగా చెప్పుకోవాలి. జీవిత బీమా విషయంలో సంప్రదాయ పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీలు చాలా చౌక. అందులోనూ ఆన్లైన్ టర్మ్ పాలసీ మరింత చౌక. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి చూసుకున్నా ఆఫ్‌లైన్ పాలసీ అయిన సూపర్ టర్మ్ ప్లాన్‌లో పైన చెప్పుకున్న వ్యక్తికే కోటి రూపాయల బీమాతో పాలసీ కావాలనుకుంటే ప్రీమియం రూ.19,470. మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్‌లో ప్రీమియం రూ.11,564 మాత్రమే. ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే... ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభి స్తాయన్న అపోహ ఉంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపె నీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయిమ్‌లు కూడా ఆన్లైన్ ద్వా రానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్డీఏకి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం బీమా మొదలు ఆన్లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిస్తుంది. రెన్యువల్ మర్చిపోవద్దు... ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభం. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేయటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లెవరూ ఉండరు. రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అపుడు వయసు పెరుగుతుంది కనక ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్లైన్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాల పరిమితిలోగానే రెన్యువల్ చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్య విషయాలు దాచొద్దు.. ధూమపానం, గుట్కా వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25–35% అధికంగా ఉం టాయి. ప్రీమియం పెరుగుతుం దని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యం, ఆహా ర అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్నివ్వండి. తీసుకోవటం ఇలా.. ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్లైన్లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ప్రీమియం రేట్లను పోల్చి చూడటానికి పాలసీ బజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి పలు వెబ్‌సైట్లున్నాయి. చెక్ చేసుకున్నాక నేరుగా సదరు బీమా కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. -
టర్మ్ పాలసీ ఉండి తీరాల్సిందే!
♦ తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ ♦ఆర్థిక ప్రణాళికలో బీమా కూడా కీలకం ఒకవేళ తమకేదైనా జరగరానిది జరిగినా ఆయా ఆర్థిక లక్ష్యాల సాధనకు ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇందుకు దోహదపడేదే టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఈ పాలసీలపైనా సందేహాలు చాలానే ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నమే ఇది. పొదుపు ద్వారా అవసరమైన నిధిని సమకూర్చుకోవాలన్నది నా ప్రణాళిక. బీమా ఉండాలా? పొదుపు లేదా భద్రత.. ఈ రెండింటిలో ఏదో ఒకటే ముఖ్యమైనదనే మాట ఉండదు. రెండూ అవసరమే. ఆర్థికంగా తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో భాగం కావాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే ఆదుకునేది ఇదే. నిధిని కూడబెట్టడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. అనుకోనిది ఏదైనా జరిగినా ఆ లక్ష్యానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా తోడ్పాటునిచ్చేది బీమా. పాలసీ వ్యవధి ముగిశాక రాబడులెలా ఉంటాయి? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా ఆర్థికపరమైన భద్రత కల్పించేదే. దురదృష్టవశాత్తూ పాలసీదారుకేదైనా జరగరానిది జరిగితే.. వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కాస్త పెద్ద మొత్తం అందేలా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఖరీదెంత? దాదాపు రూ. 1 కోటి లైఫ్ కవరేజి ఇచ్చే టర్మ్ పాలసీ రూ. 8,000– 10,000 ప్రీమియం ఉంటుంది. అంటే రోజుకి అత్యంత తక్కువగా సుమారు రూ. 22 మాత్రమే కట్టినట్లవుతుంది. ఇక ప్యూర్ టర్మ్ పాలసీలు కాకుండా మిగతా పాలసీల విషయానికొస్తే.. ఇవి కొంత పొదుపు చేసేందుకు, కొంత పెద్ద మొత్తం కూడబెట్టేందుకు ఉపయోగపడతాయి. ఒకవైపు రూ. 1 కోటి మేర లైఫ్ కవరేజీ ఇస్తూ.. మరోవైపు పొదుపు ప్రయోజనాలు కూడా కల్పించే పాలసీకి ప్రీమియం సుమారు రూ. 10,00,000 మేర ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కదా టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత చౌకైనదో. ఎంత కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది? బీమా కవరేజీ లెక్కించేటప్పుడు మీ ప్రస్తుత ఆదాయం, వ్యయాలు, రిటైర్మెంట్కి ఇంకా ఎన్నేళ్ల వ్యవధి ఉంది, రుణాలెంత ఉన్నాయి.. (ఉదా.. గృహ రుణం, పిల్లల విద్యా రుణం మొదలైనవి) తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుత ఆదాయం రూ. 65,000 మేర ఉందనుకుందాం. పాలసీదారుకు ఏదైనా జరిగినా తదనంతరం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఇంతే మొత్తం అందుకోవాలంటే రూ. 1 కోటికి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యలో కవరేజీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? సాధారణంగా ఆదాయాలు, వ్యయాలు, బాధ్యతలు పెరిగే కొద్దీ కవరేజీ అవసరాలను మధ్యమధ్యలో సమీక్షించుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తగిన భద్రత ఏర్పడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుందా? టర్మ్ పాలసీని ఒక్కసారి కొనుగోలు చేశాక.. ప్రీమియంలు మారడమనేది ఉండదు. ఒకవేళ ఆ తర్వాతెప్పుడైనా కొత్తగా మరో పాలసీ తీసుకోవాలనుకున్న పక్షంలో అప్పటికి మీ వయస్సు, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ముప్ఫై ఏళ్ల వయస్సున్న వ్యక్తి రూ. 1 కోటి లైఫ్ కవరేజీ తీసుకోవాలంటే సుమారు రూ. 8,000– రూ. 10,000 ప్రీమియం ఉంటుంది. అదే 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అంతే కవరేజీకి పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం ఏకంగా రూ. 18,000 – రూ. 20,000 దాకా ఉంటుంది. కాబట్టి టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. క్లెయిమ్స్ తిరస్కరణకు గురికాకుండా ఏమి చేయాలి..? సాధారణంగా సిసలైన క్లెయిమ్స్ రిజెక్ట్ కాకుండా చూసేలా పటిష్టమైన నిబంధనలున్నాయి. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు మన వంతుగా వాస్తవమైన వివరాలివ్వాలి. కీలకమైన వివరాలు తెలియజేయకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సరైన కాంటాక్ట్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేలా చూసుకుంటే.. క్లెయిమ్ సెటిల్మెంట్ సులభతరమవుతుంది. ఇక, జీవిత బీమా పాలసీ గురించిన వివరాలు మీ కుటుంబానికి.. లబ్ధిదారులకు తెలియజేసి ఉంచాలి. -
రైడర్లతో టర్మ్ పాలసీ తీసుకోవాలా?
నేను ఎల్ఐసీ జీవన్ సురక్ష–వన్ పాలసీని 1997లో తీసుకున్నాను. ఈ పాలసీ కోసం ఏడాదికి రూ.10,182 ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఈ పాలసీ 2022లో మెచ్యూర్ అవుతుంది. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత నాకు వచ్చే ప్రయోజనాలేమిటి ? ఇప్పుడు ఈ పాలసీ నుంచి వైదొలిగితే నాకు ఏమైనా నష్టం వస్తుందా ? పాలసీని కొనసాగిస్తే మంచిదా? లేకుండా సరెండర్ చేస్తే మంచిదా ? తగిన సూచనలివ్వండి. – అనంత్, విజయవాడ ఎల్ఐసీ జీవన్ సురక్ష– వన్ అనేది డిఫర్డ్ యాన్యూటీ పాలసీ. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత, ఆ వచ్చిన సొమ్ములతో(బోనస్ కూడా కలుపుకొని) మీరు యాన్యూటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే మొత్తంలో 25 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక యాన్యుటీ అంటే.. మీ మిగిలిన జీవితానికి క్రమం తప్పకుండా ఆదాయం రావడం కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన ఒక తరహా మదుపు సాధనం. ఇక మీ విషయానికొస్తే, మీరు ఈ స్కీమ్ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఈ తరహా డిఫర్డ్ యాన్యుటీ స్కీమ్‌లు మంచి రాబడులను ఇవ్వలేవు. ఎల్ఐసీ జీవన్ సురక్షను పరిశీలిస్తే, ఇటీవల కాలంలో ఈ ప్లాన్ ఇచ్చిన బోనస్‌లు 3.5 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ రాబడి ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రాబడి కంటే కూడా తక్కువ, అంతే కాకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడి కూడా రాదు. మీరు ప్రీమియమ్గా చెల్లించే మొత్తాన్ని దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేస్తే, ఇంతకంటే మంచి రాబడులే రావాలి. ఇన్వెస్ట్మెంట్, బీమా కలగలసి ఉన్న చాలా స్కీమ్‌లు ఎప్పుడూ ఇన్వెస్టర్లకు సరైన రాబడులను ఇవ్వలేవు. మీరు ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 90 శాతం(తొలి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించుకొని) గ్యారంటీడ్ సరెండర్ విలువగా చెల్లిస్తారు. మీ విషయంలో ఈ ప్లాన్‌ను సరెండర్ చేస్తే, మీకు రూ.1.65 లక్షలు రావచ్చు. లేదా స్పెషల్ సరెండర్ వేల్యూను ఎల్ఐసీ ఇవ్వవచ్చు. ఇది గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ కంటే అదనంగా ఉండొచ్చు. ప్రీమియమ్‌లు ఎన్నేళ్లపాటు చెల్లించారు. సరెండర్ చేసేటప్పుడు పాలసీ మెచ్యురిటీ కావడానికి ఇంకా ఎంత సమయముంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పెషల్ సరెండర్ వేల్యూని నిర్ణయిస్తారు. బీమా అవసరాల కోసం టర్మ్ బీమాను తీసుకోవాలి. దీంట్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. నేను టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవాలా ? లేకుండా రైడర్స్‌తో కూడిన టర్మ్ పాలసీ తీసుకోవాలా ? వివరంగా తెలియజేయండి. – మాధుర్, హైదరాబాద్ దీనికి సమాధానం అందరికీ ఒకేలా వర్తించదు. వ్యక్తుల బీమా అవసరాలు, వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వ్యక్తులు, బీమా తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి చేసే వృత్తి లేదా వ్యాపారం తదితర అంశాలను బట్టి దీనికి సమాధానం ఉంటుంది. ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవాలా ? లేక క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఇంకా ఇతర రైడర్లతో కూడిన టర్మ్ పాలసీ తీసుకోవాలా అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. ఏ వ్యక్తిపై అయినా ఆర్థికంగా ఆధారపడే వాళ్లుంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా బేసిక్ టర్మ్ పాలసీ తీసుకోవాలి. దీనికి ఏదైనా రైడర్స్ తీసుకోవాలా ? వద్దా ? అనే విషయం ఆ వ్యక్తి ప్రత్యేక అవసరాలపై ఆధారపడి ఉండి ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్, పార్షియల్, పెర్మనెంట్ డిజ్ఎబిలిటీ, తదితర రైడర్లతో పలు బీమా కంపెనీలు టర్మ్ బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటికి కొంత మొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్యూర్ టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి వీటన్నింటినీ తీసుకోవాలని ఏమీ లేదు. ఏది తనకు ఉపయోగపడుతుందో దానిని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రయాణాలు అధికంగా చేసే వృత్తిని లేదా ఉద్యోగాన్ని చేస్తున్న వ్యక్తులకు యాక్సిడెంట్ల రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకని అలాంటి వాళ్లు యాక్సిడెంటల్ డెత్ రైడర్‌ను ఎంచుకోవాలి. ఇక వివిధ బీమా సంస్థలు ఇలాంటి రైడర్ల విషయంలో విభిన్న రకాలైన విధానాలను, షరతులను విధిస్తున్నాయి. అందుకని మీరు తీసుకోవాలనుకుంటున్న రైడర్లకు సంబంధించిన వ్యయాలు, ప్రయోజనాలు, షరతులు.. అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. నా కుమారుడికి బ్రిటిష్ పౌరసత్వం ఉంది. భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అతడికి పాన్(పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఉండాలా? కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించాల్సి ఉంటుందా? – పూర్ణచందర్రావు, విశాఖపట్టణం భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే పాన్ తప్పకుండా ఉండాల్సిందే. అలాగే నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక పాన్ కోసం విదేశీ జాతీయులు ఫార్మ్ 49ఏఏ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. -
ప్రీమియం చెల్లించకపోయినా, చార్జీలు తప్పవా?
నేను 2008, మార్చిలో బజాజ్ అలయంజ్ న్యూ ఫ్యామిలీ గెయిన్ పాలసీని తీసుకున్నాను. 2011 మార్చి వరకూ రూ.36,000 ప్రీమియమ్ చెల్లించాను. ఆ తర్వాత ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేశాను. ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.27,443గా ఉంది. ఈ పాలసీ 2018 మార్చిలో మెచ్యూర్ అవుతుంది. గత ఏడాది వివిధ చార్జీల కింద రూ.5,013ను ఈ ఫండ్ నుంచి కోత కోశారు. ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, చార్జీల కోత తప్పదా? ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా ? సలహా ఇవ్వండి. - సర్వేశ్, విశాఖపట్టణం బజాజ్ అలయంజ్-న్యూ ఫ్యామిలీ గెయిన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(యూలిప్) పాలసీ. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించిన ప్రీమియమ్ నుంచి మెర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు,... తదితర చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ బాగా ఉన్నప్పటికీ, ఈ చార్జీల కారణంగా ఈ తరహా యులిప్‌లపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మీరు ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, పూర్తి కాలానికి వర్తించే ఫిక్స్డ్ చార్జీలను మీ ఫండ్ నుంచి మినహాయించుకుంటారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్ వాల్యూ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లను ఎంచుకోవద్దు. బీమా కోసం టర్మ్ పాలసీ తీసుకోవాలి. టర్మ్ పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 50 సంవత్సరాలు. ప్రవాస భారతీయుడిని. రూ.3 కోట్లకు టర్మ్ పాలసీని (రూ.3 కోట్ల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ కూడా ఉండాలి) తీసుకోవాలనుకుంటున్నాను. ప్రవాస భారతీయులకు పాలసీలను ఆఫర్ చేస్తున్న భారత కంపెనీల వివరాలను తెలియజేయండి. అలాగే నా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్, క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియా, తదితర అంశాల ఆధారంగా నాకు తగిన టర్మ్ పాలసీని సూచించండి. - ప్రదీప్ జైన్, ఈ మెయిల్ ద్వారా పలు భారత బీమా కంపెనీలు ప్రవాస భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పాలసీలను తీసుకునే ముందు మీరు రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది వ్యయం. మీరు ఎంచుకున్న పాలసీ విదేశాల్లో చౌకగా లభించే అవకాశాలున్నాయా? రెండోది. పన్ను వ్యవహారాలు. మీరు నివసిస్తున్న దేశంలో పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి. .. ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక మీరు తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియమ్.. అదనపు రైడర్స్‌కు కూడా కవరవుతుందో, లేదో చెక్ చేసుకోవాలి. లేకుంటే అదనపు రైడర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయం కూడా చెక్ చేసుకోవాలి. మీరు భారత్‌కు వచ్చినప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే బావుంటుంది. దీని వల్ల విదేశాల్లో వైద్య పరీక్షలు జరిపించుకొని, సంబంధిత రిపోర్టులను బీమా కంపెనీకి పంపించడం కొంచెం వ్యయభరితమైనది. మీరు భారత్‌లోనే ఉన్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే, ఈ వ్యయం మీకు తప్పుతుంది. 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి 3 కోట్ల బీమా కవరేజ్‌కు కొన్ని కంపెనీలు వసూలు చేస్తున్న వార్షిక ప్రీమియమ్‌లు, వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి(గత ఆర్థిక సంవత్సరం) వివరాలు ఇస్తున్నాం. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,960గా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.03గా ఉంది. బిర్లా సన్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.48,262 కాగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.3గా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,025గా ఉండగా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 90.5గా ఉంది. నేను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ఖాతాను ప్రారంభించాను. ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కదా! ఇప్పుడు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవచ్చా? అలాంటి వెసులుబాటు లభిస్తుందా? వివరించగలరు. - మాధురి, హైదరాబాద్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చుకునే అవకాశం ఎన్‌పీఎస్‌లో ఉంది. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను(యాక్టివ్ నుంచి ఆటో చాయిస్‌కు లేదా ఆటో చాయిస్ నుంచి యాక్టివ్‌కు) కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు మీ ఎన్పీఎస్ ఖాతాకు సంబంధించి ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ఏమంటే-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, ఎల్ఐసీ పెన్షన్ ఫండ్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్.. ఈ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. గతంలో ఎంచుకున్నదానిని మార్చుకోవచ్చు. ఈ మార్పును సూచిస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్కాగానే సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) సిస్టమ్ నుంచి మీ నమోదిత ఈమెయిల్ ఐడీకి ఒక ఈ మెయిల్ వస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రామ్మూర్త్తీ.. ఈక్విటీనే మార్గం
నాది పైవేటుద్యోగం. వయస్సు 35 సంవత్సరాలు. నెల జీతం రూ. 45,000. నెలవారీ ఇంటి ఖర్చు 20,000 అవుతుంది. భార్య, రెండేళ్ల అబ్బాయి ఉన్నారు. ఇంతవరకు నేను ఎలాంటి పొదుపూ చేయలేదు. ఇప్పటి నుంచి నా రిటైర్మెంట్, పిల్లవాడి ఉన్నత చదువు కోసం డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ పథకాలు బాగున్నాయో సూచించగలరా!!? - రామ్మూర్తి, విశాఖపట్నం ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు నెలకు రూ. 36,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నెలకు రూ. 25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఏటా మీ జీతం పెరుగుదల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ విలువను కూడా పెంచుకుంటూ ఉండండి. ఇంతవరకు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదంటున్నారు. అంటే ఇప్పటికే ఆలస్యమయిందనుకోవాలి. అందుకని ఇక ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా పొదుపు మొదలుపెట్టాల్సిందే. ఆలస్యం చేసే కొద్దీ మీ లక్ష్యాలను చేరుకోవడానికి కేటాయించే మొత్తం పెరిగిపోతుంటుంది. మీరిచ్చిన సమాచారం ప్రకారం 55 ఏళ్లకు అంటే 2035కి రిటైరవ్వాలని మీరు భావిస్తున్నారు. అలాగే 2029 నాటికి మీ పిల్లవాడి ఉన్నత చదువులకు నగదు అవసరం అవుతుంది. ఇప్పుడున్న మీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే 2035 తర్వాత మీకు ప్రతి నెలా కనీసం రూ. 25,000 పెన్షన్ అవసరమవుతుంది. అలాగే 2029 నాటికి పిల్లవాడి కోసం కనీసం రూ.10 లక్షలు నగదు కావాల్సి ఉంటుంది. వీటిని ద్రవ్యోల్బణాన్ని (ధరలు పెరుగుదల) పరిగణించకుండా లెక్కించటం జరిగింది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సమకూర్చుకోవాల్సిన నిధి కోసం సాధారణ సగటు ద్రవ్యోల్బణాన్ని 6 శాతం, విద్యా ద్రవ్యోల్బణాన్ని 7 శాతంగా లెక్కించాం. ఆ విధంగా చూస్తే ఎంత నిధి అవసరమవుతుంది? ఇందుకోసం ఇప్పుడు ఎంత మొత్తం కేటాయించాలనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా చేయండి.. స్వభావ రీత్యా మీ రెండు ఆర్థిక లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవే. కాబట్టి అధిక రాబడి పొందడానికి అవకాశమున్న ఈక్విటీ పథకాలు మీకు నప్పుతాయి. పోర్ట్‌ఫోలియోలో సమతుల్యం పాటించడం కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా... అధిక భాగం ఈక్విటీలకు కేటాయించండి. ఇందుకు మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిశీలించండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సిప్ విధానం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ప్రారంభ ఇన్వెస్టర్లలకు సిప్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ముఖ్యంగా ప్రతీ నెలా జీతంలో మిగిలే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సిప్ బాగుంటుంది. మార్కెట్లో ఉండే హెచ్చు తగ్గులను తట్టుకుంటూ దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందడానికి సిప్ దోహదం చేస్తుంది. దీంతోపాటు బీమా రక్షణ తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా ఉంటుంది. ఇందుకోసం కేవలం బీమా రక్షణను మాత్రమే అందించే టర్మ్ పాలసీలను తీసుకోండి. కంపెనీ నుంచి ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా... సొంతంగా కూడా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. కంపెనీలు అందించే బీమా కేవలం అందులో పనిచేస్తున్నంత కాలమే ఉంటుంది. మీరు ఒక్కసారి కంపెనీని వదిలేస్తే బీమా రక్షణ ఆగిపోతుంది. అందుకని కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీని తీసుకోండి. ప్రస్తుతానికి ఆఫీసుది ఉంది కదా? తర్వాత తీసుకుందాములే అనుకుంటే.. అధిక ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే పాలసీని తీసుకొని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందొచ్చు. ముఖ్యాంశాలు.. * ఇక ఆలస్యం చెయ్యకుండా పొదుపు మొదలుపెట్టండి * దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీని ‘సిప్’ చేయటమే బెటర్ * బీమా రక్షణ కోసం కేవలం టర్మ్ పాలసీ ఉంటే చాలు * హెల్త్ పాలసీ కూడా కంపెనీది కాకుండా సొంతది ఉండాలి * కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
టర్మ్ పాలసీ..‘క్లిక్’ చేస్తేనే బెటర్
ప్రీమియం ఎందుకు తక్కువ? ఆరోగ్యంగా ఉండి 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కోటి రూపాయలకు ఆన్లైన్లో టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రూ.7,000 నుంచి 8,000. అంతే...! అదే సాధారణ టర్మ్ పాలసీ తీసుకుంటే... 30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే మొత్తానికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ టర్మ్‌లో ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధికమంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో తక్కువ ప్రీమియం రేట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే.. చాలామందికి ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభిస్తాయన్న అపోహ ఉంటుంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపెనీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయింలు కూడా ఆన్లైన్ ద్వారానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్డీఏకి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం బీమా మొదలు ఆన్లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకు అయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన ప్రీమియాన్ని వెనక్కి చెల్లిస్తుంది. రెన్యువల్ మర్చిపోవద్దు... ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభమే. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేసుకోవటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఒకవేళ పాలసీ కాలపరిమితిలోగా రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్లైన్ టర్మ్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ ఇలా గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాలపరిమితిలోగానే రెన్యువల్ అయ్యేలా ఈసీఎస్ విధానాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. విషయాలు దాచొద్దు.. ధూమపానం, గుట్కా నమలడం వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25 నుంచి 35 శాతం అధికంగా ఉంటాయి. అయితే ప్రీమియం పెరుగుతుందని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్ని అందించండి. తీసుకోవటం ఇలా... ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్లైన్లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ఏ కంపెనీ అయితే ప్రీమియం తక్కువ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే పాలసీ రేట్లను పోల్చి చూడటానికి పాలసీబజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి వెబ్‌సైట్లున్నాయి. వాటిలో చూసిన అనంతరం ప్రీమియం ఏ కంపెనీ తక్కువ వసూలు చేస్తోందో తెలుసుకున్నాక... నేరుగా సదరు కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. అయితే ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
అవసరానికి తగ్గ బీమా ఉంటే మీరే మిస్టర్ ధీమా!
టర్మ్, ఎండోమెంట్, మనీ బ్యాక్, యులిప్, రిటైర్మెంట్, హెల్త్... ఇలా రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ పాలసీని తీసుకోవాలన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే ఒక్కో పాలసీ ఒక్కో అవసరానికి పనికొస్తుంది. కొన్ని పాలసీలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి కూడా. మరి ఎవరెలాంటి పాలసీ తీసుకోవాలి? ఏ వయసు వారికి ఏది ముఖ్యం? ఈ అయోమయం చాలామందికి ఉంది. అలాంటి వారికోసమే... మార్కెట్లో ఉన్న వివిధ రకాల పాలసీలు, వాటి ప్రయోజనాలపై సాక్షి ‘ప్రాఫిట్’ అందిస్తున్న ఈ కథనం... బీమా పాలసీలు ప్రధానంగా వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలు, ప్రీమియం చెల్లించే స్తోమతను బట్టి తీసుకుంటుంటారు. పాలసీదారు వయసు కూడా దీన్లో ప్రధానమే. ఎందుకంటే వయసును బట్టే ప్రీమియం. తక్కువ వయసున్న వారికైతే తక్కువ ప్రీమియం. అదే వయసు పెరిగితే ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాలి. దాదాపు అన్ని కంపెనీలూ ఆఫర్ చేస్తున్న వివిధ పాలసీలను ఒకసారి చూస్తే... టర్మ్ పాలసీ కేవలం బీమా రక్షణే ఉంటుంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవు. అంటే... పాలసీదారు మరణించినపుడు మాత్రమే తన కుటుంబీకులకు బీమా చేసిన మొత్తం చేతికందుతుంది. ఈ పాలసీలో ఎటువంటి మెచ్యూరిటీ కూడా ఉండదు. అంటే పాలసీ గడువు ముగిశాక కూడా పాలసీదారుకు ఎలాంటి సొమ్మూ చేతికి రాదు. కాకపోతే మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటి ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు ఓ 35 ఏళ్ల వ్యక్తి ఏడాదికి 10 వేలు కడితే దాదాపు 50 లక్షల వరకూ బీమా కవరేజీ ఉంటుంది. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన పాలసీ ఇది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజీ అందిస్తుండటంతో ఇపుడు టర్మ్ పాలసీలకు బాగా ప్రాచుర్యం పెరుగుతోంది. దీర్ఘకాలానికి ఈ పాలసీని తీసుకుంటే వయసు పెరుగుతున్నా తక్కువ ప్రీమియంతోనే బీమా ప్రయోజనాన్ని కొనసాగించే అవకాశముంది. కొన్ని బీమా కంపెనీలు ఆన్లైన్లో చాలా తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి. ఎవరికి అనుకూలం: ప్రతి ఒక్కరికీ తప్పనిసరే. వార్షిక జీతానికి కనీసం 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి. వయసుతో పాటు బాధ్యతలు, హౌసింగ్ లోన్ వంటి ఇతర రుణాలుంటే ఆ మేరకు బీమా రక్షణ కూడా పెంచుకోవాలి. ఉదా: ఎల్ఐసీ అన్మోల్ జీవన్1, అమూల్య జీవన్1, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్, ప్యూర్ ప్రొటెక్ట్లు ఎండోమెంట్ ప్లాన్... ఎలాంటి రిస్కూ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు బెటర్. నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిశాక మెచ్యూరిటీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇవి సాధారణంగా 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి. ఎవరికి అనుకూలం: సొంతిల్లు, కారు, పిల్లల చదువు వంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి అనుకూలం. మీ లక్ష్యం, కాలపరిమితి ప్రకారం పాలసీని ఎంచుకోవచ్చు. ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత అధిక ప్రయోజనం ఉంటుంది. 40 ఏళ్లు దాటితే ప్రీమియం పెరుగుతుంది. ఉదా: ఎల్ఐసీ జీవన్ ఆనంద్, జీవన్‌మిత్ర, జీవన్ అమృత్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్ష, సేవింగ్ అండ్ ప్రొటెక్ట్, క్యాష్ అడ్వాంటేజ్ మనీ బ్యాక్ ప్లాన్ వయసుతో పాటు ఖర్చులూ పెరుగుతుంటాయి. ఇలా ఖర్చులు పెరుగుతున్నపుడు మధ్య మధ్యలో అవసరాలకు నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. వీటి పనితీరు అచ్చం ఎండోమెంట్ పథకాల్లానే ఉన్నా మధ్య మధ్యలో నిర్ధిష్ట కాలపరిమితుల్లో నగదును వెనక్కి ఇస్తుంటాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి చొప్పున ఇవి నగదును వెనక్కి ఇస్తుంటాయి. ఈ మేరకు మెచ్యూరిటీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతేకాక ఇలా మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తాయి కాబట్టి ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. ఎవరికి అనుకూలం: వేన్నీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్లు మధ్య మధ్యలో నగదు కావాలనుకునే వారు మనీ బ్యాక్ పాలసీలకేసి చూడొచ్చు. కాని వీటి ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇతర పాలసీల కంటే తక్కువ రాబడిని అందిస్తాయి. ఉదా: ఎల్ఐసీ జీవన్ బచత్, జీవన్ సురభి, ఐసీఐసీఐ ప్రు క్యాస్‌బ్యాక్ యులిప్స్ రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడి పొందాలనుకునే వారికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) అనువుగా ఉంటాయి. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉన్నా... వీటిల్లో బీమా రక్షణ అనేది అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి బీమా కవరేజీకి హామీ ఉంటుంది తప్ప రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. ఎవరికి అనుకూలం: దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కనక పిల్లల చదువులు, పెళ్ళిళ్ల వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయడానికి యులిప్‌లు అనువైనవి. ఎండోమెంట్ పాలసీలతో పోలిస్తే వీటి బీమా రక్షణ ప్రీమియం తక్కువే. కానీ 40 ఏళ్ళు దాటితే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రిస్క్ తగ్గించుకోవాలి. కాబట్టి 40 ఏళ్ల లోపు యులిప్స్‌లో ఈక్విటీలకు ఎక్కువ కేటాయించినా, ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గించుకుంటూ డెట్ పథకాల్లోకి మరల్చుకోవడం సురక్షితం. ఉదా: ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్, ఫ్లెక్సీ ప్లస్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ స్టేజ్ వెల్త్2, లైఫ్‌టైమ్ ప్రీమియర్, ఎలైట్ వెల్త్. హోల్‌లైఫ్ పాలసీలు ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది. ఎవరికి అనుకూలం: జీవిత కాలం బీమా రక్షణ కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంతో జీవిత కాలం అంత ఎక్కువ బీమా రక్షణ పొందచ్చు. ఉదా: ఎల్ఐసీ జీవన్ తరంగ్, జీవన్ ఆనంద్, హోల్‌లైఫ్ పాలసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హోల్‌లైఫ్ రిటైర్మెంట్ ప్లాన్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారికోసం రూపొందించినవే రిటైర్మెంట్ ప్లాన్స్. సాధారణంగా అన్ని బీమా కంపెనీలు 55- 60 ఏళ్ళు వచ్చాక పెన్షన్ వచ్చేలా రూపొందిం చాయి. అవసరాన్ని బట్టి ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. ఎవరికి అనుకూలం: సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్కు కేటాయించడం మొదలెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న సంస్థలో పెన్షన్ సౌకర్యం ఉన్నా ఇంకా అదనపు మొత్తం కావాలనుకునే వారికి ఇవి బెటర్. సాధారణంగా బీమా కంపెనీలు 45 ఏళ్ల లోపు వారినే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. ఉదా: ఎల్ఐసీ జీవన్ నిధి, ఐసీఐసీఐ ఈజీ రిటైర్మెంట్, శుభ్ రిటైర్మెంట్(యులిప్). హెల్త్పాలసీలు ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం కనక అందరూ వైద్య బీమా తీసుకోక తప్పని పరిస్థితులున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌లోనూ టర్మ్ పాలసీ మాదిరి క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకుంటే జేబులో డబ్బు లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. ఎవరికి అనుకూలం: కుటుంబంలోని సభ్యులందరికీ వైద్య బీమా తప్పనిసరిగా ఉండాలి. క్రమం తప్పకుండా చెల్లిస్తూ, క్లెయిమ్‌లు లేకుంటే ప్రీమియం తగ్గటం లేక బీమా రక్షణ మొత్తం పెరగడం జరుగుతుంది. ఉదా: అపలో మ్యూనిచ్, స్టార్ హెల్త్ వంటి ఆరోగ్య బీమాకంపెనీలతో పాటు జీవిత బీమా కంపెనీలు ఇస్తున్నాయి.