టర్మ్‌ పాలసీ ఉండి తీరాల్సిందే! | Must be Term Policy | Sakshi
Sakshi News home page

టర్మ్‌ పాలసీ ఉండి తీరాల్సిందే!

Published Mon, Apr 10 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

టర్మ్‌ పాలసీ ఉండి తీరాల్సిందే!

టర్మ్‌ పాలసీ ఉండి తీరాల్సిందే!

తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ
ఆర్థిక ప్రణాళికలో బీమా కూడా కీలకం


ఒకవేళ తమకేదైనా జరగరానిది జరిగినా ఆయా ఆర్థిక లక్ష్యాల సాధనకు ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం. ఇందుకు దోహదపడేదే టర్మ్‌ ఇన్సూరెన్స్‌. అయితే ఈ పాలసీలపైనా సందేహాలు చాలానే ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నమే ఇది.

పొదుపు ద్వారా అవసరమైన నిధిని సమకూర్చుకోవాలన్నది నా ప్రణాళిక.  బీమా ఉండాలా?
పొదుపు లేదా భద్రత.. ఈ రెండింటిలో ఏదో ఒకటే ముఖ్యమైనదనే మాట ఉండదు. రెండూ అవసరమే. ఆర్థికంగా తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో భాగం కావాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే ఆదుకునేది ఇదే. నిధిని కూడబెట్టడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. అనుకోనిది ఏదైనా జరిగినా ఆ లక్ష్యానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా తోడ్పాటునిచ్చేది బీమా.

పాలసీ వ్యవధి ముగిశాక రాబడులెలా ఉంటాయి?
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది పూర్తిగా ఆర్థికపరమైన భద్రత కల్పించేదే. దురదృష్టవశాత్తూ పాలసీదారుకేదైనా జరగరానిది జరిగితే.. వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కాస్త పెద్ద మొత్తం అందేలా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఖరీదెంత?
దాదాపు రూ. 1 కోటి లైఫ్‌ కవరేజి ఇచ్చే టర్మ్‌ పాలసీ రూ. 8,000– 10,000 ప్రీమియం ఉంటుంది. అంటే రోజుకి అత్యంత తక్కువగా సుమారు రూ. 22 మాత్రమే కట్టినట్లవుతుంది. ఇక ప్యూర్‌ టర్మ్‌ పాలసీలు కాకుండా మిగతా పాలసీల విషయానికొస్తే.. ఇవి కొంత పొదుపు చేసేందుకు, కొంత పెద్ద మొత్తం కూడబెట్టేందుకు ఉపయోగపడతాయి. ఒకవైపు రూ. 1 కోటి మేర లైఫ్‌ కవరేజీ ఇస్తూ.. మరోవైపు పొదుపు ప్రయోజనాలు కూడా కల్పించే పాలసీకి ప్రీమియం సుమారు రూ. 10,00,000 మేర ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కదా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంత చౌకైనదో.

ఎంత కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది?
బీమా కవరేజీ లెక్కించేటప్పుడు మీ ప్రస్తుత ఆదాయం, వ్యయాలు, రిటైర్మెంట్‌కి ఇంకా ఎన్నేళ్ల వ్యవధి ఉంది, రుణాలెంత ఉన్నాయి.. (ఉదా.. గృహ రుణం, పిల్లల విద్యా రుణం మొదలైనవి) తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుత ఆదాయం రూ. 65,000 మేర ఉందనుకుందాం. పాలసీదారుకు ఏదైనా జరిగినా తదనంతరం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఇంతే మొత్తం అందుకోవాలంటే రూ. 1 కోటికి ఇన్సూరెన్స్‌ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

మధ్యలో కవరేజీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా?
సాధారణంగా ఆదాయాలు, వ్యయాలు, బాధ్యతలు పెరిగే కొద్దీ కవరేజీ అవసరాలను మధ్యమధ్యలో సమీక్షించుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తగిన భద్రత ఏర్పడుతుంది.

వయస్సు పెరిగే కొద్దీ పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుందా?
టర్మ్‌ పాలసీని ఒక్కసారి కొనుగోలు చేశాక.. ప్రీమియంలు మారడమనేది ఉండదు. ఒకవేళ ఆ తర్వాతెప్పుడైనా కొత్తగా మరో పాలసీ తీసుకోవాలనుకున్న పక్షంలో అప్పటికి మీ వయస్సు, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ముప్ఫై ఏళ్ల వయస్సున్న వ్యక్తి రూ. 1 కోటి లైఫ్‌ కవరేజీ తీసుకోవాలంటే సుమారు రూ. 8,000– రూ. 10,000 ప్రీమియం ఉంటుంది. అదే 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అంతే కవరేజీకి పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం ఏకంగా రూ. 18,000 – రూ. 20,000 దాకా ఉంటుంది. కాబట్టి టర్మ్‌ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది.

క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురికాకుండా ఏమి చేయాలి..?
సాధారణంగా సిసలైన క్లెయిమ్స్‌ రిజెక్ట్‌ కాకుండా చూసేలా పటిష్టమైన నిబంధనలున్నాయి. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు మన వంతుగా వాస్తవమైన వివరాలివ్వాలి. కీలకమైన వివరాలు తెలియజేయకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సరైన కాంటాక్ట్‌ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకుంటే.. క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ సులభతరమవుతుంది. ఇక, జీవిత బీమా పాలసీ గురించిన వివరాలు మీ కుటుంబానికి.. లబ్ధిదారులకు తెలియజేసి ఉంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement