
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్‌మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్‌లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.
‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.
ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు
‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.
దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులు
మార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment