టర్మ్ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం.
పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.
చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.
సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.
ఒకేసారి బీమా మొత్తం
పాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.
దఫాల వారీగా కావాలంటే...
ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.
నెలవారీ చెల్లింపులు
పాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.
ఏడాదికోసారి చెల్లించేలా..
నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.
మరో పద్ధతి
ఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.
అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానం
ఈ ఆప్షన్‌లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్‌సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.
- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment