insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ | Term Insurance is a life insurance best policy | Sakshi
Sakshi News home page

insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ

Published Mon, Apr 25 2022 4:13 AM | Last Updated on Mon, Apr 25 2022 4:13 AM

Term Insurance is a life insurance best policy  - Sakshi

రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్‌ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్‌ ప్లాన్‌ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..!

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్‌. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్‌ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది.

ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్‌ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్‌ ప్లాన్‌ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది.

అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్‌ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్‌ ప్లాన్‌. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి.

ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ...
టర్మ్‌ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్‌ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్‌ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్‌ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి.

పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్‌ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది.  
   
జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్‌ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది.  
   
బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్‌ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ.

100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్‌ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్‌ ప్లాన్‌ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్‌ ప్లాన్‌ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్‌ ప్లాన్‌ ఉపయోగం లేని ఆప్షనే.

పాలసీకి అనుబంధాలు..
యాడ్‌ ఆన్స్‌ పేరుతో పలు రైడర్లు టర్మ్‌ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్‌ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్‌ ప్లాన్‌ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది.
 
యాక్సిడెంటల్‌ డెత్‌ లేదా డిస్‌మెంబర్‌మెంట్‌ రైడర్‌ కూడా టర్మ్‌ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్‌లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్‌. పాలసీ డాక్యుమెంట్‌లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్‌ ఆన్‌ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్‌ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్‌ఆన్స్‌ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్‌ ప్లాన్‌ రాదు. అలాంటప్పుడు జాయింట్‌ టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది. బజాజ్‌ అలియాంజ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్, ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ తదితర సంస్థలు జాయింట్‌ టర్మ్‌ ప్లాన్‌ అందిస్తున్నాయి. క్రిటికల్‌ ఇల్‌నెస్, యాక్సిడెంటల్‌ డెత్‌ లేదా డిస్‌మెంబర్‌మెంట్‌ రైడర్లు హెల్త్‌ ప్లాన్‌ అనుబంధంగా కూడా లభిస్తాయి.

బీమా సంస్థ
పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్‌ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్‌ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు.

ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్‌బీఐ లైఫ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్‌ (బీవోబీ, యూనియన్‌ బ్యాంకు),కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్‌ అనుభవంతో అవి అండర్‌రైటింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, కోటక్‌ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్‌ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి.

క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో
పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్‌ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్‌ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్‌ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది.

క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్‌ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్‌ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్‌లైన్‌లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి.

జీవితానికి విలువ కట్టగలమా..?
బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్‌ అష్యూర్డ్‌) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్‌లైన్‌ పోర్టళ్లలో కొటేషన్‌ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement