న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాధనలో ఎల్‌ఐసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్థార్థ మహంతి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను గ్రామీణ ప్రాంతాల వారి కోసం రూపొందించిన ప్లాన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఎలా కలి్పంచాలన్న దానిపై మా దృష్టి ఉంటుంది.
రానున్న రోజుల్లో మా మొత్తం వ్యాపారంలో గ్రామీణ ప్రాంతాల వాటా పెరగనుంది’’అని మహంతి పేర్కొన్నారు. జీవిత, ఆరోగ్య, ఆస్తుల బీమాతో కూడిన బీమా విస్తార్ ఉత్పత్తిని ప్రతిపాదించినందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ సగటుతో చూస్తే మన దేశంలో బీమా కవరేజీ చాలా తక్కువగా ఉండడం గమనార్హం.
మరోవైపు డిజిటల్‌గా మారే ‘డైవ్’ ప్రాజెక్ట్‌ను ఎల్‌ఐసీ చేపట్టింది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కన్సల్టెంట్‌ను కూడా నియమించుకుంది. మా భాగస్వాములు, కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ చేసే వారికి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలన్నదే డైవ్ ప్రాజెక్ట్ ధ్యేయమని మహంతి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత కస్టమర్లను డిజిటల్ మార్గాల ద్వారా సొంతం చేసుకోవడంపై ఎల్‌ఐసీ దృష్టి సారించనుంది. అనంతరం ఇతర విభాగాల్లో డిజిటల్ పరివర్తనం ఉంటుందని మహంతి చెప్పారు. ‘‘కస్టమర్లు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే మొబైల్ ద్వారా కావాల్సిన సేవలను పొందొచ్చు’’అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment