
దేశంలోని లక్షలాది మంది బీమా పాలసీదారులకు ఉపశమనం కలగనుంది. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ GST) త్వరలో తగ్గే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తన సిఫారసులను సమర్పించడంతో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయానికి మార్గం సుగమమైంది.
ప్రస్తుతం హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. ఇన్సూరెన్స్ అన్నది అత్యవసర సేవగా మారిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులకు జీఎస్టీ భారంగా మారింది. ప్రతిపాదిత తగ్గింపు బీమాను మరింత చౌకగా మార్చి తద్వారా ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే బీమా కవరేజీ తక్కువగా ఉన్న భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరలోనే నిర్ణయం
బీమాపై మంత్రుల బృందం (జీవోఎం) ఏప్రిల్ లో సమావేశమై తమ సిఫార్సులను ఖరారు చేయనుంది. తరువాత వాటిని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించనుంది. బహుశా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో జరగనున్న తన తదుపరి సమావేశంలో కౌన్సిల్ ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రాల నుండి విస్తృత మద్దతు లభించింది. బీమా రంగంలో జీఎస్టీ ఉపశమనం ఆవశ్యకతపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
జీఎస్టీ తగ్గింపు వల్ల బీమా ప్రీమియంల మొత్తం తగ్గి తద్వారా నేరుగా పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ చర్య మరింత మందిని ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. వారికి ఆర్థిక భద్రతను, నిశ్చింతను అందిస్తుంది.
సవాళ్లూ ఉన్నాయి..
ఈ ప్రతిపాదనకు సవాళ్లు లేకపోలేదు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునే సామర్థ్యంపై జీఎస్టీ మినహాయింపుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీమా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చులు అంతిమంగా వినియోగదారుల మీదే పడతాయి. దీంతో పన్ను తగ్గింపు ఉద్దేశిత ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, సగటు భారతీయుడికి బీమాను మరింత అందుబాటులో, చౌకగా చేసే దిశగా ఈ చొరవ ఒక సానుకూల అడుగును సూచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment