insurance premiums
-
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే పదేళ్లలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్ రీ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించేందుకు భారత్.. వచ్చే పదేళ్ల కాలం పాటు ఏటా 14 శాతం మేర బీమా ప్రీమియంలో వృద్ధి నమోదు కావాలని సూచించింది. ప్రస్తుతం బీమా ప్రీమియం పరంగా భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత జీవిత బీమా రంగం 2022లో 6.6 శాతం మేర, 2023 నుంచి 7.1 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని స్విస్‌రీ అంచనా వేసింది. మొత్తం జీవిత బీమా ప్రీమియం 2022లో మొదటిసారి 100 బిలియన్ డాలర్లు దాటుతుందని తెలిపింది. జీవితేతర బీమా మారెŠక్ట్ గురించి చర్చిస్తూ.. 2021లో 5.8 శాతం మేర ప్రీమియంలో వృద్ధి నమోదైనట్టు, 2022లో 4.5 శాతం వృద్ధికి పరిమితం కావచ్చని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. 2023–2032 మధ్య ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. ముఖ్యంగా కరోనా మమమ్మారి ప్రవేశం తర్వాత వ్యవస్థీకృత మార్పు జీవితేతర బీమా (ఆరోగ్య బీమా)లో చోటు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా వల్ల రిస్క్‌పై అవగాహన ఏర్పడి, హెల్త్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు వివరించింది. 2022లో భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని స్విస్ రీ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. -
బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. 2022–23 బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌వో తరుణ్ రస్తోగి తెలిపారు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సుబ్రజిత్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం ‘‘సెక్షన్ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్ హెడ్ చిన్మయ్ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది. ఇది కూడా నిత్యావసరమే.. కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపమ్ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్ ప్లాన్లపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘెల్ స్పందిస్తూ.. బీమా ప్లాన్ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈవో స్నానయ్ ఘోష్ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ సూచించారు. -
కౌంట్ డౌన్ స్టార్ట్: కస్టమర్లకు బ్యాంకులు అలర్ట్
న్యూఢిల్లీ : దేశ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీని జూన్ 30 అర్థరాత్రి గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ జీఎస్టీ అమలుతో మోతకెక్కనున్న బిల్లుల విషయంలో బ్యాంకులు, క్రెడిట్ కార్డుల ప్రొవైడర్లు, ఇన్సూరర్స్ కస్టమర్లకు అలర్ట్ లు పంపుతున్నాయి. జూలై 1 నుంచి అమలుకాబోతున్న జీఎస్టీతో ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుందని కస్టమర్లకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసులు 15 శాతం సర్వీస్ పన్నును ప్రభుత్వానికి చెల్లించేవి. కానీ 2017 జూలై 1 నుంచి వ్యాట్, సర్వీసు ట్యాక్స్ లాంటి అన్ని పరోక్ష పన్నులు వెళ్లిపోయి, వాటిస్థానంలో జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. జీఎస్టీ కింద ఫైనాన్సియల్, టెలికాం సర్వీసులను 18 శాతం శ్లాబుల రేట్లలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగా ఈ సర్వీసులకు పన్నులు కట్టాల్సి ఉందని, ఈ మేరకు క్రెడిట్ కార్డు బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయని తెలిసింది. ఎస్బీఐ కార్డు ఈ అత్యధిక పన్ను శ్లాబులపై కస్టమర్లకు అవగాహన కల్పించడానికి ఎస్ఎంఎస్ లు పంపుతోంది. ''ముఖ్యమైన ప్రకటన: 2017 జూలై 1 నుంచి ప్రభుత్వం జీఎస్టీ అమలుచేయబోతుంది. దీంతో ప్రస్తుతమున్న 15 శాతం పన్ను రేట్లు, జీఎస్టీ శ్లాబు నిర్ణయించిన 18 శాతం పన్నుపరిధిలోకి వస్తున్నాయి'' అని ఈ ఎస్ఎంఎస్ లో తెలిపింది. ఇదే విధంగా ఇతర బ్యాంకులు స్టాండర్డ్ ఛార్టెడ్, హెచ్డీఎఫ్సీ కూడా మెసేజ్ లు పంపుతున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన కస్టమర్లకు ఈమెయిల్స్ పంపింది. కొత్త పన్ను విధానం కింద 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఎండోవ్మెంట్ పాలసీకు ప్రీమియం పేమెంట్ రేటు 2.25 శాతం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాలసీలకు 1.88 శాతం సర్వీసు ట్యాక్స్ మాత్రమే ఉంది. జూన్ 30 అర్థరాత్రిన జీఎస్టీని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రకటించేశారు. ఇక ఎలాంటి వాయిదాలకు అవకాశం లేదని తేలిపోయింది. -
ప్రీమియం చెల్లించినా బీమా సున్నా !
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇది. అసలే కరవు.. అంతకుముందే రుణభారం...ఆపై కరెంట్‌కోత.. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే, అన్నదాతకు అండగా ఉండాల్సిందిపోయి అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం ఉంటుంది. అందులో బ్యాంకు రుణాలు తీసుకోని రైతులు, బ్యాంకు రుణాలు పొందే రైతులకు వేర్వేరుగా, వివిధ పద్ధతుల్లో ప్రీమియం చెల్లింపు ఉంటుంది. రుణాలు తీసుకోని రైతులకు ప్రీమియం చెల్లింపు గడువు గత ఆగస్టు నెలాఖరుతో ముగిసింది. పంటలబీమా కోసం రైతుల నుంచి స్థానిక వ్యవసాయాధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. వాటితోపాటు ప్రీమియం డీడీలనూ తీసేసుకున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది పంటలబీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు వ్యవసాయ బీమా కంపెనీకి పంపారు. వాటిలో 1.60 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని బీమా అధికారులు తిరస్కరించారు. కేవలం 40 వేల దరఖాస్తులే నిబంధనల ప్రకారం ఉన్నాయని, వాటికే బీమా వర్తిస్తుందని చెప్పడంతో ఉన్నతాధికారులు నోరెళ్లబెట్టారు. విచిత్రమేంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మెదక్‌తోపాటు, మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన జిల్లాలకు చెందినవి 60 వేలు తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలించకుండానే పంపేశారు... బీమా చేసుకునేప్పుడు ఇచ్చేఫారాన్ని సరిగా నింపాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ రాయాలి. ప్రీమియం డీడీని దానికి జత చేయాలి. వ్యవసాయాధికారులు జారీచేసే పంటల సాగు ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేస్తున్నారో స్పష్టంగా రాయాలి. అయితే వీటిని సరిగా నింపకపోవడం వల్లే 1.60 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని వ్యవసాయాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. దరఖాస్తులు లేకుండా కేవలం డీడీలు పంపినవారూ ఉన్నారు. మరి దరఖాస్తులు ఎక్కడ పోయాయో వ్యవసాయాధికారులే చెప్పాలి. దరఖాస్తులు సరిగా ఉన్నట్టు నిర్ధారించుకున్నాకే పంపాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. రుణమాఫీ ఆలస్యం కారణంగా బ్యాంకు రుణం పొందిన అనేకమంది రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. దీనికితోడు రుణం తీసుకోనివారు కూడా అన్యాయానికి గురయ్యారు. బీమా సంస్థలను ఒప్పించి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేకుంటే పంట నష్టాన్ని ప్రభుత్వమే అందజేయాలని కోరుతున్నారు.