బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.
ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు
నవంబర్‌లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment