బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి | Insurance cos seek separate deduction limit of Rs 1 lakh for premium | Sakshi
Sakshi News home page

బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి

Published Thu, Jan 27 2022 5:34 AM | Last Updated on Thu, Jan 27 2022 5:36 AM

Insurance cos seek separate deduction limit of Rs 1 lakh for premium - Sakshi

న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్‌ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులపై జీఎస్‌టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్‌ చేసింది.

2022–23 బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్‌ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఎఫ్‌వో తరుణ్‌ రస్తోగి తెలిపారు.  జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈడీ సుబ్రజిత్‌ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు.

ప్రత్యేక ప్రోత్సాహకం  
‘‘సెక్షన్‌ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌ఎస్‌సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్‌ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్‌ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో విఘ్నేష్‌ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్‌ జనరాలి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్‌ హెడ్‌ చిన్మయ్‌ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది.  
ఇది కూడా నిత్యావసరమే..
కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో రూపమ్‌ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్‌ ప్లాన్లపై జీఎస్‌టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్‌ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో తపన్‌ సింఘెల్‌ స్పందిస్తూ.. బీమా ప్లాన్‌ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్‌టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్‌వీజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈడీ, సీఈవో స్నానయ్‌ ఘోష్‌ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో, ఎండీ కృష్ణన్‌ రామచంద్రన్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement