Section 80C
-
Tax saving: ..ఇలా చేస్తే అదనంగా పన్ను ఆదా!
పన్ను ఆదా కోసం సెక్షన్ 80సీ కింద ఇప్పటికే రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. దీనికి అదనంగా పన్ను ఆదా కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – రాకేశ్ వర్మ ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి రూ.1.5 లక్షల మేరకు ఇప్పటికే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు అదనపు పన్ను ఆదా కోసం మీ ముందున్న మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్–1. రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా రూ.50,000 పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీకి అదనంగా కల్పించిన ప్రయోజనం ఇది. విశ్రాంత జీవనం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వీలుగా 2004లో కేంద్ర సర్కారు ఎన్పీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18–70 ఏళ్ల వయసు పరిధిలోని ఎవరైనా ఇందులో చేరేందుకు అర్హులే. ఒక ఏడాదిలో ఇందులో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఇందులో చేసిన పెట్టుబడి ఏదైనా కానీ 60 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అంటే అప్పటి వరకు లాకిన్ అయి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనే దీన్నుంచి ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఇటీవలి తీసుకొచ్చిన సవరణ నేపథ్యంలో 60 ఏళ్లు నిండిన తర్వాత.. నెల లేదా త్రైమాసికం లేదా ఏడాదికోసారి క్రమంగా కావాల్సినంత ఉపసంహరించుకోవడానికి వీలు ఏర్పడింది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వారు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఆటో లేదా యాక్టివ్. ఆటో ఆప్షన్ ఎంపిక చేసుకోవడం కొంత బెటర్. ఈ ఆప్షన్లో ఈక్విటీలకు కేటాయింపులు ఇన్వెస్టర్ వయసు ఆధారంగా మారుతుంటాయి. ఉదాహరణకు ఇన్వెస్టర్ వయసు 35 ఏళ్లు అనుకుందాం. 100 నుంచి 35 ఏళ్లు తీసివేయగా, మిగిలిన మేర (65%) ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఇన్వెస్టర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. యాక్టివ్ ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% వరకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఈక్విటీ కేటాయింపులు పోను, మిగిలినదాన్ని డెట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించొచ్చు. - సమాధానం: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇన్ కమ్ ట్యాక్స్ : ఈ సెక్షన్‌తో పిల్లల స్కూల్ ఫీజులు క్లెయిమ్ చేసుకోవచ్చు!
సెక్షన్ 80సి ప్రకారం ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంటుకు సంబంధించినవి.. కొన్ని ముందు జాగ్రత్త కోసం దాచుకునేవి .. కొన్ని చేసిన అప్పులు తీర్చేవి.. కొన్ని విధిగా ఖర్చులు పెట్టేవి.. ఉద్యోగస్తులకు పీఎఫ్ తప్పనిసరి. ఒక్కొక్కప్పుడు పీఎఫ్ మొత్తం గరిష్ట పరిమితి రూ. 1,50,000 దాటిపోతుంటుంది. పిల్లల స్కూలు ఫీజు విషయంలో ఇద్దరికి మినహాయింపు.. మూడో పిల్లలకు ఫీజు కడితే మినహాయింపు ఇవ్వరు. ఇలాగే అన్ని విషయాల్లో ఆంక్షలు. అయితే, కొన్ని కేసులు చదవండి. ♦వామనరావు పెద్ద జీతగాడు. కంపల్సరీ పీఎఫ్‌తో సెక్షన్ 80సి పరిమితి దాటిపోతుంది. అందుకని ఇతర సేవింగ్స్ తన పేరు మీద చేయడు. జీవిత బీమా తన తల్లిదండ్రుల అకౌంటులో చేశాడు. ఇల్లు మీద లోన్ తన భార్య సత్యవతి పేరిట తీసుకుని వాయిదా లు చెల్లిస్తాడు. తన భార్య ఇంట్లో తాను అద్దెకు ఉంటున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. ఇంట్లో అందరూ 80సి కింద గరిష్ట పరిమితులు క్లెయిమ్ చేస్తున్నారు. సత్యవతి జీతం, ఇంట ద్దె అన్నీ కలిపినా 20 శాతం శ్లాబు దాటలే దు. వామనరావుగారు హమేషా 30 శాతం శ్లాబు తగ్గలేదు. కొంచం ఆలోచిస్తే 10 శాతం పన్ను సేవ్ చేసింది ఈ కుటుంబం. ♦ఇల్లరికం అని అనుకోకుండా.. ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోయాడు అల్లుగారు అరవిందరావు. మామగారికి అద్దె ఇచ్చినట్లు రాస్తాడు. ఇస్తాడో .. ఇవ్వడో ఎవరికీ తెలీదు. మావగారు పెన్షనర్.. పన్ను పరిధిలోకి రారు. ఇటువంటి అల్లుళ్లు, కొడుకులు ఎంత మందో! కోడళ్లు .. కూతుర్లు ఎంత మందో! అరవిందరావు గారు చేసే ఇతర వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చదువుకోని భార్య సరస్వతి పేరు మీద చేస్తారు. 80సి కింద అర్హత ఉన్న సేవింగ్స్ ఆవిడ పేరు మీదే. ♦కుటుంబరావుగారికి, సంతానలక్ష్మి గారికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కాబోలు రెండుసార్లు కవలలు. మొత్తం నలుగురు పిల్లలు. నలుగురినీ చదివించారు. ఇద్దరూ కలిసి వ్యాపారంలో బాగా రాణించారు. నలుగురి పిల్లల విషయంలో చెల్లించిన స్కూలు ఫీజులు ఒక్కొక్కరు .. ఇద్దరి ఇద్దరి ఫీజులను క్లెయిమ్ చేసేవారు. ♦ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం మూడో కాన్పుకి వెళ్లింది కాంతమ్మ. బాబు పుట్టాడు. ముగ్గుర్నీ చదివించింది ఆ జంట. ఎక్కువ ఆదాయం ఉన్న తండ్రి.. ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేయగా.. మూడో సంతానం స్కూలు ఫీజుని కాంతమ్మగారు క్లెయిమ్ చేశారు. ♦ఇలా అవకాశం ఉన్నతవరకూ చట్టపరిధి దాటకుండా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!
ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పన్ను మినహాయింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్, జాతీయ ఫించను స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై స్కీమ్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. ఆధార్-పాన్ లింక్ మీరు ఇంకా మీ పాన్ నెంబర్‌ను మీ ఆధార్ నెంబర్‌తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేవైసీ అప్డేట్ మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్, ఆధార్, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి. (చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!) -
బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. 2022–23 బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌వో తరుణ్ రస్తోగి తెలిపారు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సుబ్రజిత్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం ‘‘సెక్షన్ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్ హెడ్ చిన్మయ్ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది. ఇది కూడా నిత్యావసరమే.. కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపమ్ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్ ప్లాన్లపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘెల్ స్పందిస్తూ.. బీమా ప్లాన్ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈవో స్నానయ్ ఘోష్ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ సూచించారు. -
పన్ను ఆదా.. మంచి రాబడులు
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై ఆదాయపన్ను లేకుండా చూసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈక్విటీ పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకునేందుకు ఇదొక చక్కని ఆప్షన్ కూడా అవుతుంది. కాకపోతే వీటిల్లో పెట్టుబడులను మూడేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు (లాకిన్ పీరియడ్) అవకాశం ఉండదు. పన్ను ఆదా ప్రయోజనం లభిస్తుంది కనుక లాకిన్ పీరియడ్ పెద్ద సమస్య కాబోదు. పైగా పన్ను ఆదా ప్రయోజనాలు కలిగిన సాధనాల్లో తక్కువ లాకిన్ ఉండే సాధనం కూడా ఇదే. ఈ విభాగంలో మెరుగైన, నిలకడైన రాబడులను ఇస్తున్న పథకాలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం (పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇల్లు, రిటైర్మెట్) ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో మంచి నిధి సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. పనితీరు కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ పథకం ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరును 2018 నుంచి నమోదు చేస్తూ వస్తోంది. భారీ అస్థిరతలు కనిపించిన 2020లో ఈ పథకం ఇచ్చిన రాబడులు 27.3 శాతంగా ఉన్నాయి. కానీ ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులు 16 శాతంగానే ఉండడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 56 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 15.54 శాతం, పదేళ్లలో 15.59 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. 1993లో ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 15.42 శాతంగా ఉండడాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని కాలాల్లోనూ ఈ పథకంలో రాబడులు 15 శాతంపైనే ఉండడాన్ని చక్కని, మెరుగైన రాబడులని నిపుణుల అభిప్రాయం. ప్రతీ నెలా ఈ పథకంలో రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈక్విటీ అస్థిరతలను తగ్గించుకునేందుకు సిప్ ప్లాన్ అనుకూలమైనది. పెట్టుబడుల విధానం వైవిధ్యమైన పెట్టుబడుల నిర్మాణాన్ని ఈ పథకం అనుసరిస్తుంటుంది. ఆర్థికంగా బలమైన మూలాలు కలిగి, ఎప్పటికప్పుడు వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీలకు పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తోంది. ఆరు నెలల క్రితం లార్జ్‌క్యాప్‌లో 70 శాతం మేర ఉన్న పెట్టుబడులను తాజాగా 76.5 శాతానికి పెంచుకుంది. మార్కెట్లు గణనీయంగా పెరిగి ఉన్న నేపథ్యంలో దిద్దుబాటు చోటు చేసుకుంటే.. లార్జ్‌క్యాప్ రూపంలో రిస్క్ తగ్గించుకునే వ్యూహం ఇందులో కనిపిస్తోంది. అదే సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ భారీ ర్యాలీ నేపథ్యంలో వీటిల్లో ఎక్స్పోజర్ కొంత తగ్గించుకుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలకు కచ్చితంగా ఫలానా విభాగంలో ఇంత మేర ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధనలు వర్తించవు. కనుక పెట్టుబడుల విషయంలో ఇవి సౌకర్యవంతంగా (ప్లెక్సిబుల్) వ్యవహరించగలవు. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను పరిశీలించినట్టయితే 55 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులున్నాయి. మొత్తం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో (రూ.2,343 కోట్లు) 97.3 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా.. మిగిలిన పెట్టుబడులను డెట్ రూపంలో కలిగి ఉంది. -
పన్ను ఆదా : వీటిని గమనించారా?
మరో 30 రోజుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. పన్ను ఆదా కోసం ఇప్పటి వరకు ఏమీ చేయకపోతే.. ఇప్పటికి అయినా మించిపోయింది ఏమీ లేదు. సాధారణంగా సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉంది. కానీ, పన్నును ఆదా చేసే మరెన్నో సెక్షన్లు కూడా ఐటీ చట్టంలో ఉన్నాయి. వీటి కింద మరింత మొత్తాన్ని పన్ను లేకుండా ఆదా చేసుకునే మార్గాలున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలను గరిష్టంగా సెక్షన్ 80సీ కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నా.. పన్ను రాయితీకి కేంద్రం అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ రాయితీలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితే రూ.6.5లక్షల ఆదాయంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే నేటి ప్రాఫిట్ ప్లస్ కథనం. హెల్త్ కవరేజీ (సెక్షన్ 80డీ) ఆరోగ్య రక్షణ అవసరాన్ని గతంతో పోలిస్తే కరోనా ఆగమనం తర్వాత చాలా మంది తెలుసుకున్నారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు, ఆర్థికంగానూ కలిసొస్తుంది. ఏటేటా వైద్య చికిత్సల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఆస్పత్రి పాలైతే ఊహించని ఆర్థిక భారం పడకుండా చూసుకోవడంతోపాటు.. ఏటా హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియం రూ.25,000 వరకు పన్ను లేదు. దీన్ని మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ కింద రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. ► కరుణాకర్ (60 ఏళ్లలోపు), తన జీవిత భాగస్వామి, తన పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపేణా చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25వేల మొత్తంపై పన్ను మినహాయింపు కోరొచ్చు. ఒకవేళ ఇదే వ్యక్తి వయసు 60 ఏళ్లు దాటి ఉంటే, తనకు తన కుటుం బం కోసం చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.50,000 మొత్తంపైనా పన్ను మిన హాయింపునకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ► ఒకవేళ కరుణాకర్ వయసు 60 ఏళ్లలోపు అయి ఉండి తన కుటుంబానికి, అలాగే, తన తల్లిదండ్రుల కోసం (60 ఏళ్లలోపు వయసు) మరో హెల్త్ ప్లాన్‌కు ప్రీమియం చెల్లిస్తున్నాడని అనుకుంటే.. అప్పుడు కరుణాకర్ రూ.25,000, ఆయన తల్లిదండ్రుల పేరిట మరో రూ.25,000 కలిపి మొత్తం రూ.50,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. ► మరో కేసులో కరుణాకర్ 60 ఏళ్లు దాటి ఉంటే, సహజంగానే ఆయన తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్లు అయి ఉంటారు కనుక ఇద్దరికీ రూ.50,000 చొప్పున గరిష్టంగా రూ.లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► నగదు కాకుండా డిజిటల్ రూపేణా చెల్లింపులపైనే పన్ను మినహాయింపు పొందగలరు. ప్రీమియం నుంచి జీఎస్టీ, ఇతర సెస్సులను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తానికే పన్ను ఆదా పొందాల్సి ఉంటుంది. ► ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన తల్లిదండ్రుల హెల్త్ కవరేజీ మినహా మరే ఇతర బంధుత్వాలకు సంబంధించి పన్ను మినహాయింపు కోరడానికి లేదు. ► తల్లిదండ్రుల కవరేజీకి ప్రీమియంను తల్లిదండ్రులు కొంత.. వారి కుమారుడు లేదా కుమార్తె కొంత చెల్లించినట్టయితే అప్పుడు ఇరువురూ చెల్లించిన మేరకు నిబంధనలకులోబడి పన్ను ప్రయోజనానికి అర్హులు. ► హిందూ అవిభాజ్య కుటుంబానికి, ఎన్ఆర్ఐలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద గరిష్ట పరిమితి రూ.25వేలు అని గుర్తుంచుకోవాలి. హెల్త్ చెకప్ ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం గరిష్ట పరిమితి కంటే తక్కువే ఉందనుకుంటే.. ఉదాహరణకు కరుణాకర్ ఏటా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి రూ.20,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాడనుకుంటే.. మరో రూ.5 వేలకు హెల్త్ చెకప్‌లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5వేల మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంది. ► సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, న్యూరో సంబంధిత డిమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్సన్స్ వ్యాధులకు, ఎయిడ్స్ తదితర తీవ్ర వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చుపై అదనంగా పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.40,000 లేదా వాస్తవంగా అయిన ఖర్చు ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై దీన్ని పొం దొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయినా లేదా పన్ను చెల్లింపుదారుపై ఆధారపడిన వ్యక్తి సీనియర్ సిటిజన్ అయినా వారికి సంబంధించి ఈ వ్యాధుల కోసం చేసే ఖర్చు రూ.1,00,000 వరకు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంతిల్లు.. (24బీ/80ఈఈ/80ఈఈఏ) సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా ఇంటి నవీకరణ కోసం తీసుకున్న రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. రుణంతో సమకూర్చుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి, ఉద్యోగం లేదా వ్యాపారం, వృత్థి కారణాల రీత్యా మరో చోట నివాసం ఉంటున్నట్టు అయితే అప్పుడు కూడా ఇదే పరిమితి అమలవుతుంది. ఒకవేళ సొంతానికి కాకుండా.. అద్దెకు ఇచ్చేందుకు రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంటికి.. వడ్డీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఎంత ఉంటే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఈ ఉదాహరణలో రూ.2లక్షల పరిమితి ఉండదు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునే కాలంలోనూ చేసిన వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. కొనుగోలు లేదా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి ఐదు సమాన వాయిదాల్లో దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నవీకరణ లేదా పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుంటే మాత్రం.. అది పూర్తయ్యే వరకు పన్ను మినహాయింపులు లభించవు. గరిష్ట పరిమితి మేరకు మినహాయింపు పొందాలంటే.. తీసుకున్న రుణంతో మూడేళ్లలోపు ఇంటిని పూర్తి చేసుకోవాల్సి/ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అప్పుడు వడ్డీ చెల్లింపులపై గరిష్ట మినహాయింపు రూ.30,000కు తగ్గిపోతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటి కోసం తీసుకున్న రుణంపై పన్ను మినహాయింపులు నూతన పన్ను విధానంలోనూ ఉన్నాయి. కాకపోతే కొన్ని పరిమితులను విధించారు. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50 లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.50,000ను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. 80జీజీ: అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తూ హెచ్ఆర్ఏ సదుపాయం లేని వారు లేదా స్వయం ఉపాధిలోని వారు ఇంటి అద్దె కోసం చేసే చెల్లింపులపై సెక్షన్ 80జీజీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.60,000 మేరకు పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. సొంతిల్లు ఉండి కూడా అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. అదే విధంగా మరో ప్రాంతంలో ఇంటి కొనుగోలుకు తీసుకున్న రుణంపై సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న వారికీ 80జీజీ కింద ప్రయోజనానికి అర్హత ఉండదు. వార్షిక వేతనంలో 25 శాతం.. లేదా వాస్తవంగా చెల్లించే వార్షిక అద్దె నుంచి 10 శాతం వార్షిక వేతనాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం.. లేదా రూ.60,000.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికే మినహాయింపు పొందగలరు. ఎన్పీఎస్ (సెక్షన్ 80సీసీడీ) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అన్నది పింఛను స్కీమ్. రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, దీనికి పన్ను ప్రయోజనాలు అదనం. పైగా ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా ఇతర పథకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్‌పీఎస్‌లో రూ.2లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద.. మరో రూ.50వేలను సెక్షన్ 80సీసీడీ కింద చూపించుకునేందుకు అవకాశం ఉంది. 5 శాతం పన్ను పరిధిలోని వారికి రూ.50వేలపై రూ.2,600 వరకు పన్ను ఆదా అవుతుంది. అదే 30 శాతం పన్ను పరిధిలోని వారు రూ.15,600 ఆదా చేసుకోవచ్చు. ఏటా ఈ స్థాయి పన్ను ఆదాకు అదనంగా, పథకం నిర్వహణ చార్జీలు తక్కువగా ఉండడం ఆకర్షణీయతలు. విద్యా రుణాలు (80ఈ) విద్యారుణాల చెల్లింపులపైనా సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన చదువుకు లేదా తన జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టపరంగా ఎవరికైనా సంరక్షకుడిగా ఉంటూ తీసుకునే విద్యా రుణాలపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే ప్రభుత్వం గుర్తించిన కోర్సుల కోసం తీసుకుంటేనే ఈ ప్రయోజనానికి అర్హులు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ) లేదా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రుణాన్ని తీసుకోవాలన్నది నిబంధన. ఇలా విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపుల మొత్తానికి పన్ను ప్రయోజనాన్ని ఎనిమిదేళ్లపాటు పొందే అవకాశం ఉంది. విద్యా రుణం ఏ సంవత్సరంలో తీసుకున్నారనే దానితో సంబంధం లేకుండా.. రుణ చెల్లింపులు ప్రారంభించిన ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పాటు ఈ మినహాయింపు అమల్లోకి వస్తుంది. ఏ రుణానికి అయినా ఈఎంఐ వాయిదా అసలు, వడ్డీ భాగాలతో ఉంటుంది. వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈ కింద చూపించుకోవచ్చు. అలాగే, అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద అనుమతించిన మేరకు గరిష్టంగా పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సేవింగ్స్ వడ్డీ (80టీటీఏ/బీ) బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ, అదే విధంగా పోస్టాఫీసు లేదా కో–ఆపరేటివ్ సొసైటీల ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపన్ను వార్షిక రిటర్నుల్లో ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపై సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయానికి ఈ విధమైన మినహాయింపు లేదు. కనుక ఎఫ్‌డీల ఆదాయాన్ని ఇందులో కలపకూడదు. 60 ఏళ్లు నిండిన వారికి ప్రయోజనాలు మరొక రకంగా ఉన్నాయి. వృద్ధులకు సేవింగ్స్ డిపాజిట్లతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనూ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపై సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. 80టీటీబీ కింద క్లెయిమ్ చేసుకున్న వారికి, 80టీటీఏ కింద క్లెయిమ్‌కు అర్హత ఉండదు. విరాళాలు (80జీ) సంస్థలకు, ప్రభుత్వం ఆమోదించిన నిధులకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. నగదు రూపంలో ఇస్తే రూ.2,000కే పరిమితి. ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే చెక్కు లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తదితర నగదేతర రూపాల్లో ఇవ్వాలి. ప్రభుత్వ నిర్వహణలోని చాలా సంస్థలకు ఇచ్చే విరాళాలకీ ఈ సెక్షన్ కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇచ్చిన విరాళంలో 50 శాతానికే పన్ను మినహాయింపు పొందగలరు. ఇతర ప్రయోజనాలు.. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం అమల్లో ఉంది. సెక్షన్ 80డీడీ లేదా 80యూ కింద పన్ను చెల్లింపుదారు లేదా వారిపై ఆధారపడిన వారు 40 శాతం వైకల్యంతో ఉంటే లేదా ఆటిజమ్, సెరబ్రల్ పాల్సీ తదితర తీవ్ర వైకల్య సమస్యలతో ఉంటే, వాటి కోసం చేసే చికిత్సల వ్యయాన్ని గరిష్టంగా రూ.1.25 లక్షలను స్థూల ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. ఇంకా వార్షిక ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000తోపాటు.. ఎల్టీసీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (ఉద్యోగానికి వీడ్కోలు పలికే సమయంలో)పైనా పన్ను మినహాయింపులున్నాయి. -
ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎఫ్డీ: వీటిల్లో మీ చాయిస్?
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి కావడంతో దీర్ఘకాలంలో సంపద వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈక్విటీలు కావడం వల్ల మార్కెట్ ఆధారిత అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, స్థిరాదాయ సాధనమైన ఎఫ్డీ తదితర వాటితో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ప్రయోజనాలు... ఇతర పన్ను ఆదా సాధనాల్లో కాకుండా ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా మూడేళ్లు మాత్రమే. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక పెట్టుబడులు అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీలు వార్షికంగా 12-14 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు 6.5 శాతమే. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు, పీపీఎఫ్‌లో లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. ఇందులో రాబడులు సుమారు 8 శాతం. పీపీఎఫ్ రేటు ఎప్పటికప్పుడు సవరణకు గురవుతుంది. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో రిస్క్ యావరేజ్ అవుతుంది. దాంతో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక పన్ను ఆదా కోసం ఒకే సారి ఇన్వెస్ట్ చేసే ఇబ్బంది కూడా లేకుండా, సిప్ రూపంలో కొన్ని నెలల పాటు లేదా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో వీలుంటుంది. పెట్టుబడులను ఏప్రిల్‌లో ప్రారంభించడం మంచిది. కనీసం డిసెంబర్లో ఆరంభించినా నాలుగు నెలల సమయం ఉంటుంది. నాలుగు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్లో రూ.4.8 లక్షల పెట్టుబడి ఐదేళ్లలో 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.8.28 లక్షలు అవుతుంది. అదే ఐదేళ్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.4.8 లక్షల పెట్టుబడి 7 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.7.12 లక్షలు అవుతుంది. రాబడుల వ్యత్యాసం రూ.లక్షకుపైనే ఉంది. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్లో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. పాపులర్ ''సెక్షన్ 80సీ'' స్కీమ్ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ.2,00,000లకు పెంచాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు. ఇప్పటి వరకున్న నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ప్రాఫిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల ట్యూషన్ ఫీజు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, స్పెషిఫిక్ మ్యూచవల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టే మొత్తంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ ఇది కనుక అమలైతే, ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లలో ప్రజలు పొదుపు చేయడం పెరుగుతుందని తెలిసింది. ఈ పన్ను మినహాయింపును పెంచిన అనంతరం ఒకవేళ మీ స్థూల వార్షికాదాయం రూ.10 లక్షలుంటే, దానిలో సెక్షన్ 80సీ కింద ఇన్స్ట్రుమెంట్లలో పెట్టే పెట్టుబడులు రూ.2 లక్షలుంటే, కేవలం రూ.8 లక్షలకు మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల పరిమితి 2014-15 నుంచి కొనసాగుతూ వస్తోంది. జైట్లీ తన తొలి బడ్జెట్ 204-15లోనే ఈ పరిమితిని రూ.50వేల నుంచి లక్షన్నరకు పెంచారు. ప్రస్తుతం మరోసారి ఈ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారు. ఇటీవల బ్యాంకుల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లతో అరుణ్‌జైట్లీ నిర్వహించిన మీటింగ్‌లో దీనిపై చర్చించినట్టు తెలిసింది. -
రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ‘వెల్త్ క్రియేషన్’ పేరుతో రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రవేశపెట్టిం ది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కలిగిన రిటైర్మెంట్ ఫండ్ ఇది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన మొత్తంలో అత్యధిక శాతం డెట్ పథకాలతో పాటు మరికొంత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జూన్ 22న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 5,000. 60 ఏళ్ల లోపు ఈ పథకం నుంచి వైదొలిగితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.