సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్) గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి కావడంతో దీర్ఘకాలంలో సంపద వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈక్విటీలు కావడం వల్ల మార్కెట్ ఆధారిత అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, స్థిరాదాయ సాధనమైన ఎఫ్‌డీ తదితర వాటితో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయి.
ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌లో ప్రయోజనాలు...
- ఇతర పన్ను ఆదా సాధనాల్లో కాకుండా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో లాకిన్ పీరియడ్ తక్కువగా మూడేళ్లు మాత్రమే. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక పెట్టుబడులు అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీలు వార్షికంగా 12-14 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రాబడులు 6.5 శాతమే. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు, పీపీఎఫ్‌లో లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. ఇందులో రాబడులు సుమారు 8 శాతం. పీపీఎఫ్ రేటు ఎప్పటికప్పుడు సవరణకు గురవుతుంది.
- దీర్ఘకాలంలో ఈక్విటీల్లో రిస్క్ యావరేజ్ అవుతుంది. దాంతో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది.
- ఇక పన్ను ఆదా కోసం ఒకే సారి ఇన్వెస్ట్ చేసే ఇబ్బంది కూడా లేకుండా, సిప్ రూపంలో కొన్ని నెలల పాటు లేదా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో వీలుంటుంది. పెట్టుబడులను ఏప్రిల్‌లో ప్రారంభించడం మంచిది. కనీసం డిసెంబర్‌లో ఆరంభించినా నాలుగు నెలల సమయం ఉంటుంది. నాలుగు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
- ఈఎల్‌ఎస్‌ఎస్‌లో రూ.4.8 లక్షల పెట్టుబడి ఐదేళ్లలో 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.8.28 లక్షలు అవుతుంది. అదే ఐదేళ్ల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.4.8 లక్షల పెట్టుబడి 7 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.7.12 లక్షలు అవుతుంది. రాబడుల వ్యత్యాసం రూ.లక్షకుపైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment