tax filing
-
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
గతవారం వరకు వరుసగా అన్ని ఐటీఆర్ ఫారాలను గురించి తెలుసుకున్నాం. ఎన్ని ఫారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఫారం వేయాలి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇక గడువుల విషయం చూస్తే వేతన జీవులు, ట్యాక్స్ ఆడిట్ వర్తించని వారికి గడువు తేదీ 31 జూలై 2024. ఇతరులకు గడువు తేదీ 30–09–2024. ఈ కాలమ్‌ను ప్రతివారం చదివి అనుసరించే వారికి వచ్చే నెలాఖరు గడువు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యాలయాల్లో అధికారులు వారి వారి విధులు నిర్వహించడాన్ని పూర్తి చేస్తున్నారు.అంటే డిస్బర్సింగ్ అధికార్లు, డిడక్టింగ్ అధికార్లు, పన్ను రికవరీ చేయడం, ఆ పన్ను మొత్తాల్ని గవర్నమెంట్ ఖాతాకి చెల్లించడం, ఆ తర్వాత ఫారాలు 16 అలాగే 16 అ తయారు చేసి జారీ చేయడం, టీడీఎస్ రిటర్నులు ఆదాయపు పన్ను శాఖ వారికి దాఖలు చేయడం మొదలైనవి జరుగుతున్నాయి. ఈ అధికార్ల జాబితాలో మీ యాజమాన్యం, బ్యాంకులు, పన్ను రికవరీ చేసే ఇతర అధికార్లు ఉన్నారు. ఆలస్యం కావచ్చు. ఏవో ఇబ్బందులు ఏర్పడవచ్చు.వీటిని ఆధారంగా చేసుకుని డిపార్టుమెంటు వారు తమ సైటులో మీ వివరాలను పొందుపరుస్తారు. వీటినే ఫారం 26 అ, అఐ అంటారు. వీటిలో పద్దులు పడకపోతే, మీరు రిటర్నులు వేయలేరు. అంటే సమాచారం పూర్తిగా లభ్యమవదు. సాధారణంగా ఈ ఫారాల్లోని సమాచారం సంపూర్ణమైనది, సమగ్రమైనది, సరైనది, కచ్చితమైనది, నమ్మతగ్గది. అయితే, తప్పులు సహజం. మీరు, ముందు ఈ రెండింటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చెక్ చేయండి.మీకు సంబంధించినది కాకపోతే విభేదించండి. అభ్యంతరాలను తెలియజేయండి. అలా జరిగిన వెంటనే డిపార్టుమెంటు వారు సంబంధిత అధికార్లతో సంప్రదింపులు జరిపి, సరిదిద్దుతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు రెస్పాన్స్ రాకపోతే, గడువు తేదీలోపల రిటర్ను వేయటం మాత్రం మానేయకండి. ఆ తర్వాతైనా సర్దుబాట్లు జరగవచ్చు. మిస్‌మ్యాచ్‌కు మరొక కారణం.. డబుల్ ఎంట్రీ. అంటే ఒక వ్యవహారం రెండు సార్లు నమోదు కావడం. మీరు ఒకదాన్నే పరిగణనలోకి తీసుకోండి.మరీ చిత్రమైన విషయం ఒకటుంది. ఈ మధ్య ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు వారి ఉమ్మడి ఆస్తిని అమ్మగా ఆ విక్రయాల గురించి ముగ్గురి అఐ లలోనూ ఎంట్రీలు కనబడ్డాయి. ఆస్తి అమ్మకం విలువ రు. 4 కోట్లు. ముగ్గురి ‘సమాచారం’లోనూ రూ. 4 కోట్లు అని పడింది. కానీ, జరిగింది ఒకే లావాదేవీ. దాని విలువ రూ. 4 కోట్లు. ఏ స్థాయిలో ఈ తప్పు జరిగిందో కాని రికార్డుల్లో ఎంట్రీలు మూడింతలు పడ్డాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.అలాగే జాయింటుగా ఉన్న బ్యాంకు అకౌంట్లోకి వచ్చే బ్యాంకు వడ్డీ, దాని మీద వడ్డీ, ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త వహించండి. ఎంట్రీల్లోని తప్పులను మీకు అనుకూలంగా మల్చుకోకండి. ఒక సమాచారం ఏదేని అఐ లో పడకపోయినా, దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఆదాయం లేదా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఫైలింగ్ మొదలెట్టవచ్చు. రెడీ అవ్వండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...!
పన్ను చెల్లింపుదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఐటీఆర్ ఫైలింగ్ చేసే వారి కోసం ఎస్బీఐ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎస్బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను దాఖలు చేసే సౌకర్యాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. టాక్స్ పేయర్లకు ఇకపై ఎస్బీఐ ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ మరింత ఈజీ కానుంది. ఈ సదుపాయంతో టాక్స్ పేయర్స్ ఉచితంగానే ఆదాయపు పన్ను దాఖలు చేయవచ్చును. యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు ఇవే...! 1. పాన్ కార్డ్ 2. ఆధార్ కార్డ్ 3. ఫారం-16 4. పన్ను మినహాయింపు వివరాలు 5. ఇంట్రస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు 6. ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ ఫర్ టాక్స్ సేవింగ్ ఐటీఆర్ ఫైలింగ్ యోనో యాప్‌లో ఇలా చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వాలి. తరువాత ‘షాప్స్ అండ్ ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్’ సెలక్ట్ చేయాలి. అక్కడ మీకు కనిపించే ‘ట్యాక్స్2విన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆయా స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయొచ్చు. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ -
ఆదాయానికి మించిన ఖర్చులా?.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!
చాలా మంది తమకొచ్చిన ఆదాయాన్ని పూర్తిగా డిక్లేర్ చేసి, పన్ను పూర్తిగా చెల్లించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కొంత మంది ఆదాయం తక్కువగా చూపిస్తుంటారు లేదా అస్సలు చూపకపోనూ వచ్చు. దీనివల్ల రిటర్నుల్లో ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి పొంతన ఉండదు. సంబంధం ఉండదు. ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు అడిగినప్పుడు తడబడతారు. సమగ్రంగా.. సంతృప్తికరంగా.. మనం రిటర్నులు వేసిన తర్వాత ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వాటిని పరిశీలించి అన్ని వివరాలను క్షుణ్నంగా చెక్ చేస్తారు. కృత్రిమ మేధస్సు ద్వారా కొన్ని ప్రాతిపదికలను ముందుగానే ప్రోగ్రాం ద్వారా ఫీడ్ చేసి.. స్క్రూటినీకి ఎంపిక చేస్తారు. 97 శాతం రిటర్నులను సరళంగానే చెక్ చేస్తారని చెప్పవచ్చు. స్టేట్మెంట్లోని తప్పులు, ఆదాయంలో హెచ్చుతగ్గులు, కూడిక తప్పులు, తీసివేత తప్పులు, చెల్లించిన పన్నులకు సరైన వివరాలు ఇవ్వకపోవడం, వివరాలు సరిపోకపోవడం లాంటివి ఉంటే నోటీసు ద్వారా వివరాలు అడుగుతారు. వివరాలు సరిగ్గా, సమగ్రంగా, సంతృప్తికరంగా ఇస్తే అసెస్మెంట్ పూర్తయిపోతుంది. అంతా ఫేస్‌లెస్ అవసరమైనప్పుడు సంబంధిత పత్రాలు/కాగితాలు అడుగుతారు. వ్యాపారం, వృత్తికి సంబంధించిన సందర్భంలో ఎన్నో వివరాలు అడుగుతారు. అకౌంటు పుస్తకాలు, వోచర్లు, క్రయవిక్రయాలకు సంబంధించిన బిల్లులు, బ్యాంకు అకౌంటు కాపీలు.. ఇవన్నీ ఇప్పుడు అంతా ఆన్లైనే. అధికారులు నోటి మాట వినడం, అలా చెప్పడం ద్వారా మీరు వారిని ఒప్పించడం .. నచ్చజెప్పడం వంటివి ఇప్పుడు లేవు. ఏదైనా సరే, రాసి ఇవ్వడమే. అంటే అంతా ఫేస్‌లెస్. సోర్స్ ఉండాలి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఉద్యోగి (50 ఏళ్లు), స్థూల జీతం సంవత్సరానికి రూ. 8,00,000 కాగా ఇంటద్దె రూ. 1,20,000, పొదుపు రూ. 1,50,000 అనుకుందాం. స్థూల ఆదాయం రూ. 8,00,000లో ఈ రెండూ పోగా నికర ఆదాయం రూ. 5,30,000గాను, పన్ను భారాన్ని రూ. 19,240గాను డిక్లేర్ చేశారనుకోండి.. ఇందులో ఏ తప్పూ లేదు. ఒకవేళ స్క్రూటినీకి వచ్చిందనుకోండి. అన్ని వివరాలు అడుగుతారు. ఖర్చుల వివరాలు అడుగుతారు. రిటర్న్ ప్రకారం ఆ వ్యక్తి స్థూల ఆదాయం రూ. 8,00,000 నుంచి సేవింగ్స్, ఇంటద్దె, ట్యాక్స్ తీసివేయగా రూ. 5,10,760.. (సుమారుగా రూ, 5,11,000 ... అంటే నెలకు రూ. 42,500) మిగిలి ఉంటుంది. ఖర్చు వివరాలు అడిగినప్పుడూ అన్నీ టకాటకా చెప్తాం. కరెంటు బిల్లు, నెలసరి వెచ్చాలు, సెల్ ఫోన్లు, స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, సినిమాలు, హాస్పిటల్ ఖర్చులు, పాలు, నీరు, మెడిసిన్స్, ఇంట్లో షుగర్ పేషంట్ల చికిత్స వ్యయాలు, ఆపరేషన్, తిరుపతి యాత్రలు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవి కాకుండా ఉండే రికరింగ్ డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, చిట్ఫండ్ల వాయిదాలు.. ఇవన్నీ మీ దగ్గర మిగిలే మొత్తానికి లోబడి ఉంటే ఫర్వాలేదు. కానీ, దాటిందే అనుకోండి. కాస్త ఇబ్బంది. కాబట్టి, ఇలాంటి వాటి అసెస్మెంట్ సందర్భాలలో వివరాలు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి. అంతే కాకుండా డిపార్ట్మెంట్ దగ్గర మీకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మీ ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు, చీటీలు, పిల్లల చదువుల ఖర్చులు మొదలైన వివరాలన్నీ ఉంటాయి. ఆదాయానికి మించి ఎలా ఖర్చు పెడతారు.. ఒకవేళ ఖర్చు నిజమైనదే అయితే.. ఆదాయం ఉందన్న మాట. వివరణ ఇవ్వలేకపోతే ఈ వ్యత్యాసాన్ని ఆదాయంగా భావిస్తారు. కనుక ఎప్పుడైనా సరే ఆదాయంతో పాటు మిగతా వాటన్నింటికి సంబంధించి వాటికి ‘సోర్స్‘ ఉండాలి. అప్పు చేశామంటే వివరణ ఇవ్వాలి. వివరణ అంటే నోటి మాటలు కాదు. రాతపూర్వకంగా ఉండాలి. సాధారణంగా, మన ఖర్చులు/ఇన్వెస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఈ తేడాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎఫ్డీ: వీటిల్లో మీ చాయిస్?
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి కావడంతో దీర్ఘకాలంలో సంపద వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈక్విటీలు కావడం వల్ల మార్కెట్ ఆధారిత అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, స్థిరాదాయ సాధనమైన ఎఫ్డీ తదితర వాటితో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ప్రయోజనాలు... ఇతర పన్ను ఆదా సాధనాల్లో కాకుండా ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా మూడేళ్లు మాత్రమే. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక పెట్టుబడులు అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీలు వార్షికంగా 12-14 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు 6.5 శాతమే. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు, పీపీఎఫ్‌లో లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. ఇందులో రాబడులు సుమారు 8 శాతం. పీపీఎఫ్ రేటు ఎప్పటికప్పుడు సవరణకు గురవుతుంది. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో రిస్క్ యావరేజ్ అవుతుంది. దాంతో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక పన్ను ఆదా కోసం ఒకే సారి ఇన్వెస్ట్ చేసే ఇబ్బంది కూడా లేకుండా, సిప్ రూపంలో కొన్ని నెలల పాటు లేదా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో వీలుంటుంది. పెట్టుబడులను ఏప్రిల్‌లో ప్రారంభించడం మంచిది. కనీసం డిసెంబర్లో ఆరంభించినా నాలుగు నెలల సమయం ఉంటుంది. నాలుగు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్లో రూ.4.8 లక్షల పెట్టుబడి ఐదేళ్లలో 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.8.28 లక్షలు అవుతుంది. అదే ఐదేళ్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.4.8 లక్షల పెట్టుబడి 7 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.7.12 లక్షలు అవుతుంది. రాబడుల వ్యత్యాసం రూ.లక్షకుపైనే ఉంది. -
ఒక పేజీలో టాక్స్ ఫైలింగ్ ఎలా?
ఒకపుడు ఆదాయ పన్ను దాఖలు చేసే పద్ధతి చాలాకష్టంగా ఉండేది. సామాన్య మానవుడికి మరీ కష్టంతో కూడుకున్న పని. పన్ను రిటర్న్స్ దాఖలులో ఈ-ఫైలింగ్ ఈ ప్రక్రియ కొంత సులభమైందనే చెప్పాలి. తాజాగా ప్రవేశపెట్టిన ఒక పేజీలో వ్యక్తిగతంగా ఆదాయం పన్ను దాఖలు చేసే పద్ధతి మరింత సులభం. మొదట14 పేజీలుగా ఈ ఫైలింగ్ విధానాన్ని మార్చి గతంలో మూడు పేజీలకు తగ్గించారు. ఇక ఇప్పటినుంచి ఆన్లైన్లో టాక్స్ ఫైలింగ్ చేసేవారు కేవలం ఒక పేజీలో వివరాలు పూర్తి చేస్తే చాలు. వారి పాన్‌కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు, పన్నుల చెల్లింపు వివరాలు తెలిపితే సరిపోతుంది. మిగితా సమాచారం తనంతట తానే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ సమకూర్చుకుంటుంది. ఏప్రిల్ 1,2017, ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ముఖ్యంగా సాలరీడ్ వ్యక్తులకు గణనీయంగా సులభతరమైంది. ఐటిఆర్ ఫాం నింపేందుకు సింపుల్ స్టెప్స్ ఇపుడు చూద్దాం. 1) ఐటి శాఖ పన్ను దాఖలు వెబ్ సైట్ లో ముందుగా రిజిస్టర్ కావాలి. 2) మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్‌ను పూరించాలి. తాజా నిబంధనల ప్రకారం ఆధార్ నెంబరు దాఖలు తప్పనిసరి. 3) మీ వ్యక్తిగత వివరాలు మరియు పన్నులు చెల్లించిన సమాచారాన్ని పూరిస్తే..టీడీఎస్(టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాలు ఆటోమేటిగ్గా పూర్తవుతాయి. 4) దీంట్లో రెండు మార్గాలు ఉన్నాయి. వివరాలు పూరించి ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు లేదా సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు. 5) ఒకవేళ ఆఫ్‌లైన్ లో అయితే సంబంధిత ఐటి రిటర్న్స్‌కు కావాల్సిన పత్రాల ఎక్స్ఎంఎల్ వెర్షన్ కాపీలను అప్లోడ్ చేయాలి. 6) ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, ఐటి ఫైలింగ్ ను నిర్ధారిస్తూ ఒక మెసేజ్ వస్తుంది.